యిర్మీయా 42:1-22

యిర్మీయా 42:1-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు కారేహ కుమారుడైన యోహానాను, హోషయా కుమారుడైన యెజన్యాతో సహా సైన్య అధికారులందరూ, సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రజలందరూ, యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చి, “దయచేసి మా విన్నపం విని, ఈ మిగిలిన వారందరి కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు. ఎందుకంటే నీవిప్పుడు చూస్తున్నట్లుగా, మేము ఒకప్పుడు చాలా మందిమే అయినప్పటికీ, ఇప్పుడు కొద్ది మందిమి మాత్రమే మిగిలి ఉన్నాము. మేము ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో మాకు తెలియజేయమని నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు” అని అన్నారు. “నేను నీ మాట విన్నాను, మీరు కోరినట్లే నేను మీ దేవుడైన యెహోవాకు తప్పక ప్రార్థిస్తాను; యెహోవా చెప్పినదంతా నేను మీకు చెప్తాను మీ నుండి ఏమీ దాచను” అని యిర్మీయా ప్రవక్త జవాబిచ్చాడు. అప్పుడు వారు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీ దేవుడైన యెహోవా నీ ద్వారా మాకు తెలియజేసిన మాటల ప్రకారం మేము చేయకపోతే, యెహోవాయే మాకు వ్యతిరేకంగా నిజమైన, నమ్మకమైన సాక్షిగా ఉండును గాక. అది మాకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మేము నిన్ను పంపుతున్న మా దేవుడైన యెహోవాకు లోబడతాము. మా దేవుడైన యెహోవాకు లోబడితే మాకు మంచే జరుగుతుంది.” పది రోజుల తర్వాత యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చింది. కాబట్టి అతడు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్య అధికారులందరినీ, సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రజలందరినీ పిలిచాడు. అతడు వారితో, “మీ విన్నపాన్ని తెలియజేయడానికి మీరు ఎవరి దగ్గరకు నన్ను పంపించారో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘మీరు ఈ దేశంలోనే ఉంటే, నేను మిమ్మల్ని కడతాను, కూల్చివేయను; నేను మిమ్మల్ని నాటుతాను, పెరికివేయను, ఎందుకంటే నేను మీకు కలిగించిన విపత్తు గురించి బాధపడ్డాను. ఇప్పుడు మీరు ఎవరికైతే భయపడుతున్నారో ఆ బబులోను రాజుకు మీరు భయపడవద్దు. అతనికి భయపడవద్దు, అని యెహోవా ప్రకటిస్తున్నారు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని రక్షిస్తాను అతని చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. నేను మీమీద కనికరం చూపిస్తాను, అప్పుడు అతడు మీమీద కనికరం చూపి, మిమ్మల్ని మీ దేశానికి తిరిగి పంపుతాడు.’ “అయితే, ‘మేము ఈ దేశంలో ఉండము’ అని చెప్పి, మీ దేవుడైన యెహోవాకు అవిధేయత చూపితే, ఒకవేళ మీరు, ‘వద్దు, మేము ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసిస్తాము. మేము యుద్ధం చూడం, బూరధ్వని వినం, రొట్టెల కోసం ఆకలితో ఉండం’ అని అంటే, యూదాలో మిగిలి ఉన్నవారలారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఒకవేళ మీరు ఈజిప్టుకు వెళ్లి, అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొని ఉంటే, మీరు ఏ ఖడ్గానికి భయపడతారో అది అక్కడ మిమ్మల్ని పట్టుకుంటుంది, మీరు భయపడే కరువు ఈజిప్టులోకి కూడా మిమ్మల్ని వెంటపడుతుంది, అక్కడే మీరు చనిపోతారు. నిజానికి, ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొనిన వారందరూ ఖడ్గం, కరువు, తెగులు వల్ల చస్తారు; నేను వారి మీదికి తెచ్చే విపత్తు నుండి వారిలో ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు, ప్రాణాలతో బయటపడలేరు.’ ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘యెరూషలేములో నివసించేవారి మీద నా కోపం, ఉగ్రత ఎలా కుమ్మరించానో, మీరు ఈజిప్టుకు వెళ్లినప్పుడు కూడా నా కోపం మీమీద అలాగే కుమ్మరిస్తాను. మీరు శాపగ్రస్తులుగా, భయానకంగా, శాపంగా, నిందగా అవుతారు; మీరు ఈ స్థలాన్ని మళ్ళీ చూడలేరు.’ “యూదాలో మిగిలి ఉన్నవారలారా, ‘ఈజిప్టుకు వెళ్లవద్దు’ అని యెహోవా మీతో చెప్పారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి: మీరు నన్ను మీ దేవుడైన యెహావా దగ్గరకు పంపి, ‘మాకోసం మా దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయి, ఆయన చెప్పే ప్రతిదీ మాతో చెప్పు, మేము అలాగే చేస్తాము’ అని చెప్పి మీరు ఘోరమైన తప్పు చేశారని గుర్తుంచుకోండి. ఈ రోజు నేను మీతో చెప్పాను, కానీ మీకు చెప్పమని నన్ను పంపిన వాటన్నిటిలో దేనికి మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడలేదు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం తప్పక గుర్తుంచుకోండి: మీరు ఎక్కడికి వెళ్లి స్థిరపడాలనుకున్నా మీరు ఖడ్గం, కరువు, తెగులు వల్ల చనిపోతారు.”

యిర్మీయా 42:1-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు కారేహ కుమారుడు యోహానానూ, హోషేయా కుమారుడు యెజన్యా, సైన్యాధిపతులందరూ ఇంకా గొప్పవారూ, సామాన్యులూ ప్రజలందరూ కలసి ప్రవక్త అయిన యిర్మీయా దగ్గరికి వచ్చారు. వాళ్ళు అతనితో ఇలా అన్నారు. “నువ్వు చూస్తున్నట్టు మేం చాలా తక్కువ మందిమి. మా మనవిని చెవినబెట్టి మిగిలిన ఈ ప్రజల కోసం నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. మేం ఏ మార్గాన వెళ్ళాలో, ఏం చేయాలో నీ దేవుడైన యెహోవాను అడిగి మాకు తెలియజేయి.” కాబట్టి ప్రవక్త అయిన యిర్మీయా వాళ్లకిలా చెప్పాడు. “మీరు చెప్పింది విన్నాను. చూడండి, మీరు అభ్యర్ధించినట్టే నేను మీ దేవుడైన యెహోవాను ప్రార్ధిస్తాను. యెహోవా ఏం జవాబిచ్చాడో అది ఏదీ దాచకుండా మీకు చెప్తాను.” వాళ్ళు యిర్మీయాతో ఇలా అన్నారు. “నీ దేవుడైన యెహోవా మాకు చెప్పినదంతా మేం చేయకపోతే అప్పుడు యెహోవా మాకు వ్యతిరేకంగా నమ్మకమైన సత్యసాక్షిగా ఉంటాడు గాక. అది మాకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మేము మాత్రం నిన్ను పంపుతున్న మన దేవుడైన యెహోవా స్వరానికి లోబడతాం. మన దేవుడైన యెహోవా చెప్పిన మాటకు లోబడటం మాకు మేలు చేస్తుంది.” పది రోజుల తర్వాత యెహోవా వాక్కు యిర్మీయా దగ్గరికి వచ్చింది. కాబట్టి అతడు కారేహ కొడుకు యోహానానునూ, అతనితో ఉన్న సైన్యాధిపతులందర్నీ, ఇంకా గొప్పవారూ, సామాన్యులూ అయిన ప్రజలందర్నీ తన దగ్గరికి పిలిచాడు. వారికిలా చెప్పాడు. “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దగ్గర మీ కోసం ప్రార్ధించడానికి మీరు నన్ను పంపారు. ఆయన ఇలా చెప్పాడు. ‘మీరు వెనక్కి వెళ్లి ఈ దేశంలోనే నివసించినట్లయితే నేను మిమ్మల్ని నిర్మిస్తాను. మిమ్మల్ని చీల్చివేయను. మిమ్మల్ని నాటుతాను గానీ పెకలించి వేయను. మీ పైకి నేను తెచ్చిన విపత్తును తప్పిస్తాను. మీరు బబులోను రాజుకు భయపడుతూ ఉన్నారు. అతనికి భయపడకండి.’ ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ‘మిమ్మల్ని రక్షించడానికీ, అతని చేతిలో నుండి తప్పించడానికీ నేను మీతో ఉన్నాను కాబట్టి అతనికి భయపడకండి. నేను మిమ్మల్ని కరుణిస్తాను. మీ పైన కనికరపడతాను. మీ దేశానికి తిరిగి మిమ్మల్ని తీసుకువస్తాను.’ అయితే ఒకవేళ మీరు కత్తి మూలంగానో, కరువు మూలంగానో, వ్యాధి మూలంగానో మీ దేవుడైన యెహోవానైన నా మాట వినకుండా ‘మేం ఈ దేశంలో నివసించం,’ అన్నారనుకోండి, లేదా మీరు ‘ఇక్కడ కాదు. మనం ఐగుప్తు దేశానికి వెళ్దాం. అక్కడ ఎలాంటి యుద్ధమూ చూడం, అక్కడ యుద్ధ భేరీనాదం వినం, ఆహారం కోసం ఆకలితో ఉండం. మనం అక్కడే నివసిద్దాం’ అనుకోవచ్చు కూడా. యూదా ప్రజల్లో మిగిలి ఉన్న వారు యెహోవా చెప్పే ఈ మాట వినండి. సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు ఒకవేళ ఐగుప్తులో నివసించడానికి వెళ్లాలని నిర్ణయం చేసుకుంటే, మీరు భయపడుతున్న కత్తి ఐగుప్తులో మిమ్మల్ని కలుసుకుంటుంది. మీరు చింతించే కరువు మీ వెనుకే ఐగుప్తు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటుంది. మీరు అక్కడే చనిపోతారు. కాబట్టి ఐగుప్తులో నివసించాలని నిర్ణయం తీసుకుని అక్కడకు వెళ్ళే వాళ్ళు కత్తి మూలంగానో, కరువు మూలంగానో, వ్యాధి మూలంగానో చనిపోతారు. నేను వాళ్ళ పైకి పంపించే ఆపద నుండి ఎవరూ తప్పించుకోరు. ఎవరూ మిగిలి ఉండరు.” ఎందుకంటే సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “యెరూషలేము నివాసుల పైకి నా తీవ్ర కోపమూ, నా ఉగ్రతా వచ్చినట్టే, మీరు ఐగుప్తుకు వెళ్ళినట్టయితే మీ మీద కూడా నా క్రోధాన్ని కుమ్మరిస్తాను. మీరు శాపానికి గురౌతారు. మీరు భయాన్ని పుట్టించే వాళ్ళుగా ఉంటారు. దూషణ పాలవుతారు. ఈ స్థలాన్ని మీరు ఇక మీదట చూడరు. యూదా ప్రజల్లో మిగిలి ఉన్న మీ కోసం యెహోవా చెప్తున్నాడు. ఐగుప్తుకు వెళ్ళకండి! ఈ రోజు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం నేనే అని మీకు తెలుసు. ‘మా కోసం మన దేవుడైన యెహోవాకు ప్రార్థించు. మన దేవుడైన యెహోవా చెప్పినదంతా మాకు తెలియజెయ్యి. మేం దాన్ని జరిగిస్తాం’ అంటూ మీరే యిర్మీయా అనే నన్ను మీ దేవుడైన యెహోవా దగ్గరికి పంపించారు. కాబట్టి మీరు మీ ప్రాణాలనే చెల్లించాల్సి ఉంటుంది. ఈ రోజు నేను మీకు తెలియజేశాను. కానీ మీరు మీ దేవుడైన యెహోవా మాట వినలేదు. ఆయన నా ద్వారా మీకు తెలియజేసిన వాటిలో దేనినీ వినలేదు. కాబట్టి ఎక్కడ నివాసముండాలని మీరు కోరుకుంటున్నారో అక్కడే మీరు కత్తి మూలంగానో, కరువు మూలంగానో, వ్యాధి మూలంగానో చనిపోతారు. అది మీకు తప్పకుండా తెలుసుకోవాలి.”

యిర్మీయా 42:1-22 పవిత్ర బైబిల్ (TERV)

వారు గెరూతు కింహాము వద్ద ఉండగానే యోహానాను, హోషేయా కుమారుడైన యెజన్యా అనే మరో వ్యక్తి కలిసి ప్రవక్తయైన యిర్మీయా వద్దకు వెళ్లారు. సైన్యాధికారులంతా యోహానాను, యెజన్యానులతో కలిసి వెళ్లారు. అల్పులు మొదలు ఉన్నతుల వరకు అంతా యిర్మీయా వద్దకు వెళ్లారు. వారంతా ఇలా అన్నారు: “యిర్మీయా, దయచేసి మా అభ్యర్థన ఆలకించు. యూదా సంతతిలో బతికి బయటపడిన ఈ ప్రజలందరిని గురించి నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. యిర్మీయా, మాలో ఎక్కువ మంది మిగలలేదు. ఒకప్పుడు మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాము. యిర్మీయా, మేము ఎక్కడికి వెళ్లవలెనో, ఏమి చేయవలెనో నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి తెలుసుకో.” అప్పుడు ప్రవక్తయైన యిర్మీయా ఇలా అన్నాడు: “మీరు నన్ను చేయమని అడిగిన విషయాలను నేను అర్థం చేసికొన్నాను. మీ దేవుడైన యెహోవాకు మీరడిగిన విధంగా నేను ప్రార్థన చేస్తాను. యెహోవా చెప్పినదంతా నేను మీకు తెలియజేస్తాను. మీకు నేనేదీ దాచి పెట్టను.” తరువాత ప్రజలు యిర్మీయాతో ఇలా అన్నారు, “నీ దేవుడైన యెహోవా చెప్పినదంతా మేము చేయకపోతే దేవుడే మాకు వ్యతిరేకంగా నిజమైన సాక్షి అవుతాడు. నీ దేవుడైన యెహోవా మేము ఏది చేయాలో నీకు తెలియజేస్తాడని మాకు తెలుసు. యెహోవా వర్తమానం మాకు సమ్మతమవుతుందా, సమ్మతం కాదా అనేది సమస్య కాదు. మా యెహోవా దేవుని పట్ల మేము విధేయులమై ఉంటాము. మేము నిన్ను ఒక సందేశం తెచ్చుట కొరకు పంపుచున్నాము. దానికి మేము కట్టుబడి ఉంటాము. మా దేవుడైన యెహోవాకు మేము విధేయులమైనప్పుడు మాకు మంచి విషయాలు జరుగుతాయని మాకు ఖచ్చితముగా తెలుసు.” పది రోజులు జరిగిన పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినిపించింది. అప్పుడు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్యాధికారులను యిర్మీయా ఒక చోటికి పిలిచాడు. అతి సామాన్యుడి మొదలు అతి ముఖ్యమైన వ్యక్తి వరకు ప్రజలందరినీ కూడ యిర్మీయా ఒక చోటికి పిలిచాడు. అప్పుడు యిర్మీయా వారితో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వద్దకు మీరు నన్ను పంపారు. మీరు నన్ను అడగమన్నదంతా నేను యెహోవాను అడిగాను. యెహోవా ఇలా చెపుతున్నాడు: ‘ప్రజలారా మీరు యూదాలో ఉంటే నేను మిమ్మల్ని బలపర్చుతాను — మిమ్మల్ని నాశనం చేయను. మీరు స్థిరపడేలా చేస్తాను. నేను మిమ్మల్ని పెకలించి వేయను. నేనిది ఎందుకు చేయదలచుకున్నానంటే, నేను మీకు కలుగజేసిన భయంకర విషయాల పట్ల నేను విచారిస్తున్నాను. బబులోను రాజు విషయంలో ఇప్పుడు మీరు భయపడుతున్నారు. కాని అతనిని చూచి మీరు భయపడవద్దు. బబులోను రాజంటే మీరు భయపడవద్దు.’ ఇదే యెహోవా సందేశం. ‘ఎందువల్ల నంటే, నేను మీతో ఉన్నాను. నేను మిమ్మల్ని కాపాడతాను. నేను మిమ్మల్ని రక్షిస్తాను. అతడు మీ మీద చెయ్యి వేయలేడు. నేను మీ పట్ల దయగలిగి వుంటాను. బబులోను రాజు కూడ మీ పట్ల కనికరం చూపుతాడు. అతడు మిమ్మల్ని మీ దేశానికి తిరిగి తీసుకొని వస్తాడు.’ ‘మేము యూదాలో వుండమని’ మీరు అనవచ్చు. అలా అంటే మీరు మీ యెహోవా దేవుని అనుసరించనట్లే. ‘అది కాదు. మేము వెళ్లి ఈజిప్టులో నివసిస్తాము. ఆ దేశంలో మాకు యుద్ధ భయం ఉండదు. మేమక్కడ యుద్ధ భేరీలు వినము. మేము అక్కడ ఆకలితో బాధపడము అని మీరు అనవచ్చు.’ యూదాలో మిగిలిన ప్రజలారా, మీరలా అంటే యెహోవా వర్తమానం ఏమిటో వినండి. ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు: ‘మీరు ఈజిప్టునందు నివసింప నిశ్చయిస్తే మీకు ఇలా జరుగుతుంది: మీరు యుద్ధమనే కత్తికి భయపడ్డారు. కాని అది మిమ్మల్ని అక్కడ ఓడిస్తుంది. మీరు ఆకలి విషయంలో భయపడ్డారు. కాని మీరు ఈజిప్టులో క్షామానికి గురియగుతారు. మీరక్కడ చనిపోతారు. ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించాలనుకునే ప్రతివాడు కత్తివాతబడి గాని, ఆకలిచేగాని, భయంకర వ్యాధులచేగాని చనిపోతాడు. ఈజిప్టుకు వెళ్లే ఏ ఒక్కడు బతకడు. నేను వారికి కలుగజేసే భయంకర పరిస్థితుల నుండి ఏ ఒక్కడూ తప్పించుకోలేడు.’ “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘యెరూషలేము పట్ల నా కోపాన్ని చూపాను. యెరూషలేములో నివసించే ప్రజలను నేను శక్షించాను. అదేరీతిగా ఈజిప్టుకు వెళ్లే ప్రతివాని పట్లా నా కోపం చూపిస్తాను. ప్రజలు తమ శత్రువులకు కీడు జరగాలని కోరుకున్నప్పుడు మీకు జరిగినట్లు జరగాలని మిమ్మల్ని ఒక ఉదాహరణగా తీసుకుంటారు. మీరు శాపగ్రస్తులౌతారు. మిమ్మల్ని చూచి ప్రజలు సిగ్గు చెందుతారు. ప్రజలు మిమ్మల్ని అవమాన పర్చుతారు. మీరు మళ్లీ యూదా రాజ్యాన్ని చూడరు.’ “యూదాలో మిగిలివున్న ప్రజలారా, ‘మీరు ఈజిప్టుకు పోవద్దు’ అని యెహోవా మీకు చెప్పియున్నాడు. ఇప్పుడే మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. మీకు చావు తీసికొనివచ్చే తప్పు మీరు చేస్తున్నారు. ‘మీరే నన్ను మీ ప్రభువైన దేవుని వద్దకు పంపారు. మన ప్రభువైన దేవుణ్ణి మా కొరకు ప్రార్థించు. యెహోవా ఏమి చేయమని చెప్పుచున్నాడో అదంతా మాకు తెలియజేయుము. మేము యెహోవా చెప్పినట్లు నడచుకొంటాము’ అని మీరే నాతో అన్నారు. కావున ఈ రోజు యెహోవా సందేశాన్ని మీకు వినిపించాను. కాని మీరు ప్రభువైన మీ దేవునికి విధేయులు కాలేదు. ఆయన మిమ్మల్ని ఏమి చేయమని చెప్పటానికి నన్ను పంపియున్నాడో అదంతా మీరు చేయలేదు! కావున ఇప్పుడిది బాగా అర్థం చేసికొనండి: మీరు ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించాలని అనుకుంటున్నారు. కాని ఈజిప్టులో మీరు కత్తివేటుకు గురియైగాని, ఆకలిచేగాని, భయంకర రోగాలతో గాని చనిపోతారు.”

యిర్మీయా 42:1-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అంతలో సేనాధిపతులందరును కారేహ కుమారుడైన యోహానానును హోషేయా కుమారుడైన యెజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరును ప్రవక్తయైన యిర్మీయా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవి చేసిరి –మేము ఎంత కొంచెము మందిమి మిగిలియున్నామో నీవు చూచుచున్నావు గదా? చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి, శేషించియున్న మా యందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థనచేయుము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్తయైన యిర్మీయా వారికి ఉత్తరమిచ్చినదేమనగా–మీరు చేసిన మనవి నేనంగీకరించుచున్నాను, మీ మాటలనుబట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును, ఏమియు మీకు మరుగుచేయక యెహోవా మిమ్మునుగూర్చి సెలవిచ్చునదంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు యిర్మీయాతో ఇట్లనిరి–నిన్ను మా యొద్దకు పంపి, నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలనుబట్టి మరుమాటలేకుండ మేము జరిగించని యెడల యెహోవా మామీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట విను వారమై, అది మేలేగాని కీడేగాని మేము ఆయనయొద్దకు నిన్ను పంపువిషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము. పది దినములైన తరువాత యెహోవా వాక్కు యిర్మీ యాకు ప్రత్యక్షమాయెను గనుక అతడు కారేహ కుమారుడైన యోహానానును అతనితోకూడనున్న సేనలయధపతులనందరిని, అల్పులనేమి ఘనులనేమి ప్రజలనందరిని పిలిపించి వారితో ఇట్లనెను –ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గదా? ఆయన సెలవిచ్చునదేమనగా –నేను మీకు చేసిన కీడునుగూర్చి సంతాపమొందియున్నాను, మీరు తొందరపడక యీ దేశములో కాపురమున్నయెడల, పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెల్లగింపక నాటెదను. మీరు బబులోనురాజునకు భయపడుచున్నారే; అతనికి భయపడకుడి, అతనిచేతిలోనుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై యున్నాను, అతనికి భయపడకుడి, మరియు అతడు మీయెడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీయెడల నేనతనికి జాలి పుట్టించెదను. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట విననివారై యీ దేశమందు కాపురముండక–మనము ఐగుప్తు దేశమునకు వెళ్లుదము, అక్కడ యుద్ధము చూడకయు బూరధ్వని వినకయు ఆహారపు లేమిచేత ఆకలిగొనకయు నుందుము గనుక అక్కడనే కాపురముందమని మీరనుకొనినయెడల యూదావారిలో శేషించినవారలారా, యెహోవా మాట ఆలకించుడి; ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఐగుప్తునకు వెళ్లవలెనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండు టకు మీరు వెళ్లినయెడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టుకొనును; మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలిసికొనును, అక్కడనే మీరు చత్తురు, నేను వారిమీదికి రప్పించు కీడునుండి వారిలో శేషించువాడైనను తప్పించుకొనువాడైనను ఉండడు, ఐగుప్తులో నివసింపవలెనని అక్కడికి వెళ్ల నిశ్చయించుకొను మనుష్యులందరు ఖడ్గముచేతను క్షామముచేతను తెగులు చేతను నిశ్శేషముగా చత్తురు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నాకోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసులమీదికి వచ్చినట్లు, మీరు ఐగుప్తునకు వెళ్లినయెడల నా ఉగ్రత మీమీదికిని వచ్చును, మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు, ఈ స్థలమును మరి యెప్పుడును చూడరు. యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్లకూడదని యెహోవా మీకాజ్ఞనిచ్చినట్టు నేడు నేను మీకు సాక్ష్య మిచ్చితినని మీరే నిశ్చయముగా తెలిసికొనుచున్నారు. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థనచేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియ జెప్పినయెడల మేమాలాగు చేయుదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు. నేడు నేను మీకు దాని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీయొద్దకు నాచేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి. కాబట్టి కాపురముండవలెనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను చత్తురని నిశ్చయముగా తెలిసికొనుడి.