యిర్మీయా 38:1-28
యిర్మీయా 38:1-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మత్తాను కుమారుడైన షెఫట్యా, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యూకాలు, మల్కీయా కుమారుడైన పషూరు యిర్మీయా ప్రజలందరితో చెప్పేది విని, “యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ పట్టణంలో నివసించేవారు ఖడ్గంతో కరువుతో తెగులుతో చనిపోతారు, కానీ బబులోనీయుల దగ్గరకు వెళ్లేవారు బ్రతుకుతారు. వారు తమ ప్రాణాలతో తప్పించుకుని బ్రతుకుతారు; వారు జీవిస్తారు.’ యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ పట్టణం ఖచ్చితంగా బబులోను రాజు సైన్యానికి అప్పగించబడుతుంది, అతడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు’ ” అని చెప్పడం విన్నారు. అప్పుడు ఆ అధికారులు రాజుతో, “ఈ వ్యక్తికి మరణశిక్ష విధించాలి. ఇతడు ఈ పట్టణంలో మిగిలి ఉన్న సైనికులను, అలాగే ప్రజలందరినీ తాను వారితో చెప్పే మాటల ద్వార నిరుత్సాహపరుస్తున్నాడు. ఈ వ్యక్తి ఈ ప్రజల క్షేమం కోరడంలేదు, వారి పతనాన్ని కోరుతున్నాడు.” అందుకు రాజైన సిద్కియా, “అతడు మీ ఆధీనంలో ఉన్నాడు, రాజు మీకు వ్యతిరేకంగా ఏమి చేయడు” అన్నాడు. కాబట్టి వారు యిర్మీయాను తీసుకెళ్లి, చెరసాల ప్రాంగణంలో ఉన్న రాజు కుమారుడైన మల్కీయా నీటి గోతిలోకి దింపినప్పుడు దాంట్లో వారు యిర్మీయాను త్రాళ్లతో నీటి గోతిలోకి దించారు; దాంట్లో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది, యిర్మీయా ఆ బురదలో మునిగిపోయాడు. అయితే రాజభవనంలో అధికారిగా ఉన్న ఎబెద్-మెలెకు అనే ఒక కూషీయుడు యిర్మీయాను నీటి గోతిలో వేశారు అని విన్నాడు. ఆ సమయంలో రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. ఎబెద్-మెలెకు రాజభవనంలో నుండి రాజు దగ్గరకు వెళ్లి రాజుతో, “రాజా! నా ప్రభువా! ఈ మనుష్యులు యిర్మీయా ప్రవక్త విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. వీరు అతన్ని గోతిలో వేశారు, పట్టణంలో ఇక ఆహారం లేకుండా పోతే అక్కడ అతడు ఆకలితో చనిపోతాడు” అని మనవి చేశాడు. అప్పుడు రాజు కూషీయుడైన ఎబెద్-మెలెకుకు, “నీవు ఇక్కడినుండి ముప్పది మందిని తీసుకెళ్లి, యిర్మీయా ప్రవక్తను చావకముందే ఆ గోతిలో నుండి బయటకు తీయించు” అని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఎబెద్-మెలెకు ఆ మనుష్యులను తనతో పాటు తీసుకుని రాజభవనంలోని ఖజానా క్రింద ఉన్న గదిలోకి వెళ్లాడు. అతడు అక్కడినుండి కొన్ని పాత గుడ్డలు చిరిగిన బట్టలు తీసుకుని, నీటి గోతిలో ఉన్న యిర్మీయాకు వాటిని త్రాళ్లతో దించాడు. కూషీయుడైన ఎబెద్-మెలెకు యిర్మీయాతో, “ఈ పాత గుడ్డలు, చిరిగిన బట్టలు త్రాళ్లగా చేయడానికి నీ చేతుల క్రింద పెట్టుకో” అన్నాడు. యిర్మీయా అలాగే చేశాడు, వారు అతన్ని త్రాళ్లతో పైకి లాగి బందీకానా నుండి పైకి లేపారు. యిర్మీయా కావలివారి ప్రాంగణంలో ఉండిపోయాడు. అప్పుడు రాజైన సిద్కియా యిర్మీయా ప్రవక్తను పిలిపించి, యెహోవా మందిరంలోని మూడవ ద్వారం దగ్గరకు అతన్ని రప్పించాడు. రాజు యిర్మీయాతో, “నేను నిన్ను ఒక విషయం అడుగుతున్నాను; నా దగ్గర ఏమీ దాచకుండ జవాబివ్వాలి” అని అన్నాడు. అందుకు యిర్మీయా సిద్కియాతో, “ఒకవేళ నేను మీరు నిజం చెబితే, మీరు నన్ను చంపరా? నేను ఒకవేళ మీకు సలహా ఇచ్చినా మీరు నా మాట వినరు.” అయితే సిద్కియా రాజు యిర్మీయాతో రహస్యంగా ఈ ప్రమాణం చేశాడు: “మనకు ఊపిరినిచ్చే, సజీవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్న, నిన్ను నేను చంపను, నిన్ను చంపాలనుకున్న వారికి అప్పగించను.” అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: ‘నీవు బబులోను రాజు అధికారులకు లొంగిపోతే, నీ ప్రాణం దక్కుతుంది, ఈ పట్టణం కూడా అగ్నితో కాల్చివేయబడదు; నీవు, నీ కుటుంబం బ్రతుకుతారు. అయితే ఒకవేళ నీవు బబులోను రాజు అధికారులకు లొంగిపోకపోతే, ఈ పట్టణం బబులోనీయుల చేతులకు అప్పగించబడుతుంది, వారు దానిని కాల్చివేస్తారు; అప్పుడు కనీసం నీవు కూడా వారి నుండి తప్పించుకోలేవు.’ ” సిద్కియా రాజు యిర్మీయాతో, “బబులోనీయుల దగ్గరకు వెళ్లిపోయిన యూదుల గురించి నేను భయపడుతున్నాను, ఎందుకంటే బబులోనీయులు నన్ను వారి చేతికి అప్పగిస్తే, వారు నన్ను ఘోరంగా అవమానిస్తారు” అని అన్నాడు. “వారు మిమ్మల్ని అప్పగించరు; నేను చెప్పేది చేస్తూ యెహోవాకు లోబడండి. అప్పుడు అది మీకు అంతా మంచే జరుగుతుంది, మీరు ప్రాణాలతో ఉంటారు” అని యిర్మీయా జవాబిచ్చాడు. కానీ మీరు లొంగిపోవడానికి నిరాకరిస్తే, యెహోవా నాకు ఇలా తెలియజేశారు: యూదారాజు యొక్క రాజభవనంలో మిగిలి ఉన్న స్త్రీలందరినీ బబులోను రాజు యొక్క అధికారుల దగ్గరికి తీసుకువస్తారు. అప్పుడు ఆ స్త్రీలు నిన్ను చూసి వెటకారంగా ఇలా అంటారు: “ ‘మీ నమ్మకమైన స్నేహితులు మిమ్మల్ని తప్పుదారి పట్టించారు, వారు మిమ్మల్ని అప్పగించారు. మీ పాదాలు బురదలో దిగబడినప్పుడు; మీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారు.’ “మీ భార్యాపిల్లలందరూ బబులోనీయుల దగ్గరికి రప్పించబడతారు. స్వయంగా మీరే వారి చేతుల నుండి తప్పించుకోలేరు; మీరు బబులోను రాజు చేత బంధించబడతారు; ఈ పట్టణం కాల్చివేయబడుతుంది.” అప్పుడు సిద్కియా యిర్మీయాతో, “ఈ సంభాషణ గురించి ఎవరికీ తెలియకూడదు, తెలిస్తే నీవు చస్తావు. నేను నీతో మాట్లాడానని అధికారులు విని, నీ దగ్గరికి వచ్చి, ‘మీరు రాజుతో ఏం మాట్లాడారో, రాజు మీతో ఏం మాట్లాడారో మాకు చెప్పండి. మా దగ్గర దాచవద్దు, లేకుంటే మేము మిమ్మల్ని చంపుతాము’ అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘నన్ను యోనాతాను ఇంటికి తిరిగి పంపించవద్దని రాజు దగ్గర విన్నవించుకున్నాను.’ ” అధికారులందరూ యిర్మీయా దగ్గరకు వచ్చి అతన్ని ప్రశ్నించగా, అతడు రాజు వారితో చెప్పమని తనకు ఆదేశించినదంతా చెప్పాడు. కాబట్టి వారు అతనితో ఇంకేమి అనలేదు, ఎందుకంటే రాజుతో అతనికి ఏమి సంభాషణ జరిగిందో ఎవరూ వినలేదు. యెరూషలేము స్వాధీనమైపోయిన రోజు వరకు యిర్మీయా, కావలివారి ప్రాంగణంలోనే ఉన్నాడు.
యిర్మీయా 38:1-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“యెహోవా ఇలా అంటున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్న వాళ్ళు ఖడ్గంతో, కరువుతో, తెగులుతో చస్తారు. కాని కల్దీయుల దగ్గరికి బయలుదేరి వెళ్ళేవాళ్ళు బతుకుతారు. అతడు తన జీవాన్ని ఒకడు కొల్లసొమ్ము దక్కించుకున్నట్టు దక్కించుకుంటాడు. ఎందుకంటే, అతడు బతుకుతాడు.” యెహోవా ఇలా అంటున్నాడు. “ఈ పట్టణం కచ్చితంగా బబులోను రాజు సైన్యం చేతికి అప్పగించడం జరుగుతుంది. అతడు దాన్ని చెరపట్టుకుంటాడు,” అని యిర్మీయా ప్రజలందరికీ ప్రకటించినప్పుడు, మత్తాను కొడుకు షెఫట్య, పషూరు కొడుకు గెదల్యా, షెలెమ్యా కొడుకు యూకలు, మల్కీయా కొడుకు పషూరు విన్నారు గనుక ఆ నాయకులు రాజుతో “ఈ మనిషి ఈ ప్రజల నాశనం కోరేవాడేగాని, క్షేమం కోరేవాడు కాదు. ఇతను ఇలాంటి సమాచారం వాళ్లకు ప్రకటన చెయ్యడం వల్ల ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనం చేస్తున్నాడు. ఇతనికి మరణశిక్ష విధించాలి” అన్నారు. అందుకు రాజైన సిద్కియా “అతడు మీ చేతిలో ఉన్నాడు. రాజు మీకు అడ్డం రాగలడా,” అన్నాడు. వాళ్ళు యిర్మీయాను పట్టుకుని చెరసాల ప్రాంగణంలో ఉన్న రాజకుమారుడు మల్కీయా గోతిలోకి దింపారు. అందులోకి యిర్మీయాను తాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు. అప్పుడు, రాజగృహంలో, కూషీయుడైన ఎబెద్మెలెకు నపుంసకుల్లో ఒకడు. యిర్మీయాను గోతిలో పెట్టారని అతడు విన్నాడు. ఆ సమయంలో రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. కాబట్టి ఎబెద్మెలెకు రాజ గృహంలోనుంచి వెళ్లి రాజుతో ఇలా అన్నాడు, “రాజా, నా ప్రభూ, ఆ గోతిలో వేసిన యిర్మీయా అనే ప్రవక్త పట్ల ఈ మనుషులు చేసిందంతా దుర్మార్గమే. అతడు ఆకలితో చావాలని అతన్ని గోతిలో పడేశారు. ఎందుకంటే పట్టణంలో ఆహారం ఇంక లేదు.” అప్పుడు రాజు కూషీయుడైన ఎబెద్మెలెకుకు ఆజ్ఞ ఇచ్చి “నువ్వు ఇక్కడనుంచి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని వెళ్లి, ప్రవక్త అయిన యిర్మీయా చావకముందు ఆ గోతిలోనుంచి అతన్ని తీయించు,” అన్నాడు. కాబట్టి ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజమందిరంలో ఖజానా కింద గదిలోకి వచ్చాడు. అక్కడ నుంచి పాతబడి చీకిపోయి, చినిగిపోయిన బట్టలు తీసుకువెళ్లి, ఆ గోతిలో ఉన్న యిర్మీయా పట్టుకునేలా తాళ్ళతో వాటిని దింపి “పాతవై చిరిగి చీకిపోయిన ఈ బట్టలతో పేనిన తాళ్ళను నీ చంకల కింద పెట్టుకో,” అని అతనితో చెప్పాడు. యిర్మీయా అలాగే చేశాడు. అప్పుడు వాళ్ళు యిర్మీయాను తాళ్ళతో లాగారు. ఈ విధంగా వాళ్ళు అతన్ని ఆ గోతిలోనుంచి పైకి లాగారు. ఆ తరువాత యిర్మీయా ఆ చెరసాల ప్రాంగణంలో ఉంటూ ఉన్నాడు. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరంలో ఉన్న మూడో ద్వారంలోకి ప్రవక్త అయిన యిర్మీయాను పిలిపించి, అతనితో “నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నా నుంచి ఏదీ దాచకుండా చెప్పు,” అన్నాడు. యిర్మీయా సిద్కియాతో “నేను నీకు జవాబు చెప్తే, కచ్చితంగా నువ్వు నాకు మరణ శిక్ష వేస్తావు. నేను నీకు సలహా ఇచ్చినా, నువ్వు నా మాట వినవు,” అన్నాడు. కాని రాజైన సిద్కియా ఏకాంతంగా యిర్మీయాతో ప్రమాణం చేసి “మనలను సృష్టించిన యెహోవా తోడు, నేను నిన్ను చంపను, నిన్ను చంపాలని చూసేవాళ్ల చేతికి నిన్ను అప్పగించను,” అన్నాడు. కాబట్టి యిర్మీయా సిద్కియాతో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాలకు అధిపతి అయిన దేవుడు, యెహోవా ఇలా అంటున్నాడు, నువ్వు బబులోను రాజు అధిపతుల దగ్గరికి వెళ్తే బతుకుతావు. ఈ నగరాన్ని తగలబెట్టరు. నువ్వూ, నీ ఇంటి వాళ్ళు బతుకుతారు. కాని నువ్వు బబులోను అధిపతుల దగ్గరికి వెళ్లకపోతే, ఈ నగరాన్ని కల్దీయుల చేతికి అప్పగించడం జరుగుతుంది. వాళ్ళు అగ్నితో దాన్ని కాల్చేస్తారు. నువ్వు వాళ్ళ చేతిలోనుంచి తప్పించుకోలేవు.” అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో “కల్దీయుల పక్షంగా ఉన్న యూదులకు భయపడుతున్నాను. ఒకవేళ కల్దీయులు నన్ను వాళ్ళ చేతికి అప్పగిస్తే, వాళ్ళు నాపట్ల చెడ్డగా ప్రవర్తిస్తారు,” అన్నాడు. అందుకు యిర్మీయా “నిన్ను వాళ్ళ చేతికి అప్పగించరు. నీకు అన్నీ సవ్యంగా జరిగేలా, నువ్వు బతికేలా నేను నీతో చెప్పిన యెహోవా సందేశానికి లోబడు. కాని, నువ్వు ఒకవేళ బయలుదేరి వెళ్లకపోతే, యెహోవా నాకు చూపించిన సంగతి ఇదే. యూదా రాజమందిరంలో మిగిలి ఉన్న స్త్రీలందరినీ బబులోను అధిపతుల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడు, చూడు! ఆ స్త్రీలు నిన్ను చూసి ఇలా అంటారు, ‘నీ స్నేహితులు నిన్ను మోసం చేసి నిన్ను నాశనం చేశారు. నీ పాదాలు బురదలో కూరుకుపోయి ఉన్నాయి. వాళ్ళు నిన్ను విడిచి పెట్టి పారిపోతారు. నీ భార్యలందరినీ, నీ పిల్లలనూ కల్దీయుల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. నువ్వు కూడా వాళ్ళ చేతిలోనుంచి తప్పించుకోలేవు. బబులోను రాజుకు దొరికిపోతావు గనుక ఈ పట్టణాన్ని అగ్నితో కాల్చడానికి నువ్వే కారణం అవుతావు.’” అప్పుడు సిద్కియా యిర్మీయాతో “నువ్వు చావకుండా ఉండాలంటే ఈ సంగతులు ఎవరికీ చెప్పొద్దు. నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులకు తెలిస్తే, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి, ‘రాజుతో ఏం మాట్లాడావో చెప్పు. మానుంచి దాచకు, లేకపోతే చంపేస్తాం. ఇంకా, రాజు నీతో చెప్పిన సంగతులు మాకు చెప్పు,’ అంటారు. అప్పుడు నువ్వు వాళ్ళతో, ‘యోనాతాను ఇంటికి మళ్ళీ నన్ను పంపొద్దని, పంపితే నేను అక్కడ చనిపోతానని రాజుతో విన్నవించుకున్నాను,’ అని చెప్పాలి,” అన్నాడు. అప్పుడు అధిపతులందరూ యిర్మీయా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అతడు రాజు చెప్పిన మాటల ప్రకారం వాళ్లకు జవాబిచ్చి ఆ విషయం వాళ్లకు తెలియజేయని కారణంగా వాళ్ళు అతనితో మాట్లాడడం ఆపారు. ఎందుకంటే యిర్మీయాతో రాజు చేసిన సంభాషణ వాళ్ళు వినలేదు. యెరూషలేము స్వాధీనం అయ్యే రోజు వరకూ యిర్మీయా ఆ చెరసాల ప్రాంగణంలోనే ఉన్నాడు.
యిర్మీయా 38:1-28 పవిత్ర బైబిల్ (TERV)
కొంతమంది రాజ్యాధికారులు యిర్మీయా బోధిస్తున్నది విన్నారు. వారు మత్తాను కుమారుడైన షెఫట్య, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యూకలును మరియు మల్కీయా కుమారుడైన పషూరు. యిర్మీయా ఈ వర్తమానాన్ని ప్రజలందరికి ఇలా చెప్పుచున్నాడు: “యెహోవా సెలవిస్తున్నదేమనగా, ‘యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కడు కత్తివల్లగాని, ఆకలివలనగాని, రోగంతోగాని చనిపోతాడు. కాని బబులోను సైన్యానికి లొంగిపోయిన ప్రతి ఒక్కడూ బ్రతుకుతాడు. వారు వారి ప్రాణాలతో తప్పించుకో గలుగుతారు.’ యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: ‘ఈ యెరూషలేము నగరం నిశ్చయంగా బబులోను రాజుకు ఇవ్వబడుతుంది. అతడి నగరాన్ని పట్టుకుంటాడు.’” ప్రజలకు ఈ విషయాలను యిర్మీయా తెలియపర్చుతూ ఉండగా విన్న రాజ్యాధికారులు రాజైన సిద్కియా వద్దకు వెళ్లారు. వారు వెళ్లి, “యిర్మీయాను చంపివేయాలి. నగరంలో ఇంకా ఉన్న సైనికులను అధైర్యపరుస్తున్నాడు. తాను చెప్పే విషయాలతో యిర్మీయా ప్రతి ఒక్కడినీ నిరుత్సాహ పరుస్తున్నాడు. యిర్మీయా మనకు శభం కలగాలని కోరుకోవటం లేదు. అతడు యెరూషలేము ప్రజలను నాశనం చేయాలని కోరుకుంటున్నాడు” అని చెప్పారు. “యిర్మీయా మీ స్వాధినంలోనే ఉన్నాడు. మిమ్మల్ని ఆపటానికి నేనేమీ చేయను” అని రాజైన సిద్కియా అన్నాడు. దానితో ఆ అధికారులు యిర్మీయాను మల్కీయా యొక్క నీళ్లగోతిలోనికి దించారు. (మల్కీయా రాజు యొక్క కుమారుడు) రాజభటుడు ఉండే ప్రాంగణంలోనే ఆ నీటి గొయ్యి ఉంది. ఆ అధికారులు తాళ్ల సహాయంతో యిర్మీయాను గోతిలోనికి దించారు. గోతిలో నీరు లేదు గాని, అడుగున బురద పేరుకొని ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు. కాని ఎబెద్మెలెకు అనేవాడు అధికారులు యిర్మీయాను నీటిగోతిలోకి దించినట్లు విన్నాడు. ఎబెద్మెలెకు కూషీయుడు (ఇతియోపియ అనే దేశపువాడు) అతడు నపుంసకుడు (కొజ్జా) రాజ భవనంలో ఉద్యోగి. రాజైన సిద్కియా బెన్యామీను ద్వారం వద్ద కూర్చుని ఉండగా ఎబెద్మెలెకు రాజభవనం నుండి రాజును కలిసి మాట్లాడటానికి ద్వారం వద్దకు వెళ్లాడు. ఎబెద్మెలెకు ఇలా అన్నాడు: “నా ఏలినవాడవగు ఓ రాజా, ఆ అధికారులు చాలా క్రూరంగా ప్రవర్తించారు. ప్రవక్తయైన యిర్మీయా పట్ల వారు బహు క్రూరంగా వ్యవహరించారు. వారతనిని నీళ్లు నిలువజేసే గోతిలో పడవేశారు. అతనక్కడ చని పోయేలా వదిలి వేశారు.” అప్పుడు రాజైన సిద్కియా ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఇలా ఉంది: “ఎబెద్మెలెకూ, రాజభవనం నుంచి నీతో ముగ్గురు మనుష్యులను తీసికొని వెళ్లు. యిర్మీయా చనిపోకముందే వారి సహాయంతో అతనిని గోతిలోనుండి పైకి తియ్యి.” తరువాత ఎబెద్మెలెకు తనతో మనుష్యులను తీసుకొని వెళ్లాడు. ముందుగా అతడు రాజభవనంలో సామాను భద్రపరచే గిడ్డంగి క్రిందవున్న గదిలోనికి వెళ్లాడు. ఆ గదినుండి కొన్ని పాత బట్టలను, చింపిరి గుడ్డలను అతడు తీసికొన్నాడు. కొన్ని తాళ్ల సహాయంతో ఆ బట్టలను గోతిలో ఉన్న యిర్మీయాకు వదిలాడు. ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకు యిర్మీయాను పిలిచి ఇలా అన్నాడు: “ఈ గుడ్డ పేలికలను, పాత బట్టలను నీ చంకలలో పెట్టుకో మేము నిన్ను పైకిలాగినప్పుడు ఈ బట్టలు నీ చంకలలో మెత్తలవలె ఉండి తాళ్ల వలన నీకు బాధ కలుగదు.” ఎబెద్మెలెకు చెప్పినట్లుగా యిర్మీయా చేశాడు. ఆ మనుష్యులు యిర్మీయాను తాళ్ల సహాయంతో పైకిలాగి, నీళ్ల గొయ్యి నుండి బయటికి తీశారు. ఆలయ ఆవరణలోనే యిర్మీయా రక్షకభటుల ఆధీనంలో ఉన్నాడు. పిమ్మట రాజైన సిద్కియా తన సేవకునితో ప్రవక్తయైన యిర్మీయాను పిలిపించాడు. దేవాలయంలో మూడవ ద్వారం వద్దకు అతడు యిర్మీయాను పిలువనంపాడు. అప్పుడు రాజు “యిర్మీయా, నేను నిన్నొక విషయం అడగదలిచాను. ఏమీ దాయకుండా చిత్త శుద్ధితో అంతా చెప్పు” అని అన్నాడు. “నేను నీకు సమాధానం ఇస్తే నీవు నన్ను చంపివేస్తావు. నేను నీకేదైనా సలహా ఇచ్చినా నీవు దానిని వినిపించుకోవు” అని యిర్మీయా సిద్కియాతో అన్నాడు. కాని రాజైన సిద్కియా యిర్మీయాకు ఒక ప్రమాణం చేశాడు. సిద్కియా ఇది రహస్యంగా చేశాడు. సిద్కియా ఇలా ప్రమాణం చేశాడు: “యిర్మీయా, మనందరికీ జీవం పోసిన ప్రాణదాత, నిత్యుడు అయిన యెహోవా సాక్షిగా నిన్ను నేను చంపను. అంతే గాదు. నిన్ను చంపజూచే అధికారులకు నిన్ను అప్పగించనని కూడా నేను నీకు ప్రమాణం చేస్తున్నాను.” అప్పుడు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విధంగా చెప్పాడు, ‘నీవు బబులోను అధికారులకు లొంగిపోతే నీ ప్రాణం కాపాడబడుతుంది. యెరూషలేము నగరం కూడ తగుల బెట్టబడదు. నీవు, నీ కుటుంబం సజీవంగా ఉంటారు. నీవు బబులోను రాజుయొక్క అధికారులకు లొంగి పోవటానికి నిరాకరిస్తే, యెరూషలేము కల్దీయుల సైన్యానికి ఇవ్వబడుతుంది. వారు యెరూషలేమును తగులబెడతారు. నీవు కూడ వారి బారి నుండి తప్పించుకోలేవు.’” “కాని ఇప్పటికే బబులోను సైన్యపు పక్షం వహించిన యూదా ప్రజల విషయంలో నేను భయపడుతున్నాను. పైగా సైనికులు నన్ను యూదా ప్రజలకు ఇస్తే వారు నన్ను అవమానపర్చి, గాయపర్చుతారని కూడా నేను భయపడతున్నాను.” అని యిర్మీయాకు రాజైన సిద్కియా బదులు చెప్పాడు. అందుకు యిర్మీయా ఇలా అన్నాడు: “సైనికులు నిన్ను ఆ యూదా ప్రజలకు అప్పజెప్పరు. నేను చెప్పినట్లు విని యెహోవాకు విధేయుడవై ఉండుము. అప్పుడు పరిస్థితులు నీకు అనుకూలిస్తాయి. నీ ప్రాణం రక్షింపబడుతుంది. కాని నీవు బబులోను సైన్యానికి లొంగిపోవటానికి నిరాకరిస్తే ఏమి జరుగుతుందో యెహోవా నాకు చూపించాడు. యెహోవా ఇలా అన్నాడు: యూదా రాజగృహంలో మిగిలివున్న స్త్రీలంతా బయటకు లాగబడతారు. వారు బబులోను రాజు ముఖ్య అధికారుల వద్దకు తేబడుతారు. నీ స్త్రీలే నిన్ను ఒక పాట పాడి ఎగతాళి చేస్తారు. ఆ స్త్రీలు ఇలా అంటారు. ‘నీ మంచి స్నేహితులే నిన్ను తప్పుదోవ పట్టించారు. నీవారు నీకంటె బలవంతులైనారు. అటువంటి స్నేహితులనే నీవు నమ్మావు. నీ కాళ్లు బురదలో కూరుకున్నాయి. నీ స్నేహితులు నిన్ను వదిలి పెట్టారు.’ “నీ భార్యలు, పిల్లలు అందరూ బయటకు ఈడ్వబడతారు. వారు కల్దీయుల సైన్యానికి అప్పగించబడతారు. నీవు కూడ బబులోను సైన్యం నుండి తప్పించుకోలేవు. నీవు బబులోను రాజుచే పట్టు కొనబడతావు. యెరూషలేము తగులబెట్టబడుతుంది.” అప్పుడు సిద్కియా యిర్మీయాతో ఇలా అన్నాడు: “నేను నీతో మాట్లాడుతున్నానని ఎవ్వరికీ తెలియనీయవద్దు. చెప్పితే నీవు చనిపోతావు. ఆ అధికారులు నేను నీతో మాట్లాడినట్లు తెలిసికోవచ్చు. అప్పుడు వారు నీ వద్దకు వచ్చి, ‘యిర్మీయా, నీవు రాజైన సిద్కియాకు ఏమి చెప్పావో అది మాకు తెలియజేయుము. రాజైన సిద్కియా నీకు ఏమి చెప్పినాడో కూడ మాకు చెప్పు. మాకు నిజాయితీగా అంతాచెప్పు. లేకుంటే మేము నిన్ను చంపివేస్తాం’ అని అంటారు. వారు నీతో అలా అన్నప్పుడు, ‘నన్ను మరల యెనాతాను ఇంటి క్రిందగల చెరసాల గదిలోకి పంపవద్దని రాజును వేడుకుంటున్నాను. మళ్లీ నేనా చెరసాల గదికి పంపబడితే చనిపోతాను’ అని అన్నట్లు చెప్పు.” అనుకున్నదంతా జరిగింది. రాజ్యాధికారులు యిర్మీయాను ప్రశ్నించటానికి వచ్చారు. యిర్మీయా మాత్రం రాజు ఆజ్ఞానుసారం ఆయన చెప్పిన రీతిగా వారికి సమాధానమిచ్చాడు. అప్పుడా అధికారులు యిర్మీయాను ఒంటరిగా వదిలారు. యిర్మీయా మరియు రాజు ఏమి మాట్లాడారో ఏ ఒక్కరూ వినలేదు. యెరూషలేము ముట్టడింపబడేనాటి వరకు యిర్మీయా ఆలయ ప్రాంగణంలో బందీగా ఉన్నాడు.
యిర్మీయా 38:1-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులుచేతనైనను చత్తురు గాని కల్దీయులయొద్దకు బయలు వెళ్లువారు బ్రదుకుదురు, దోపుడుసొమ్ముదక్కించు కొనునట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రదుకుదురు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ పట్టణము నిశ్చయముగా బబులోనురాజు దండుచేతికి అప్పగింపబడును, అతడు దాని పట్టుకొనును అని యిర్మీయా ప్రజలకందరికి ప్రకటింపగా మత్తాను కుమారుడైన షెఫట్యయును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకలును మల్కీయా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసిన దేమనగా–ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరు వాడేగాని క్షేమము కోరువాడుకాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటవలన ఈ పట్టణములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనముచేయుచున్నాడు; చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. అందుకు రాజైన సిద్కియా– అతడు మీవశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా వారు యిర్మీయాను పట్టుకొని కారా గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురదమాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటి లోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండుడు, వారు యిర్మీయాను గోతిలో వేసిరను సంగతి విని, రాజు నగరులోనుండి బయలువెళ్లి రాజుతో ఈలాగు మనవి చేసెను రాజా, నా యేలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము; అతడున్న చోటను అతడు ఆకలిచేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టె లేమియు లేవు. అందుకు రాజు–నీవు ఇక్కడనుండి ముప్పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి, ప్రవక్తయైన యిర్మీయా చావకమునుపు ఆ గోతిలోనుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవియ్యగా ఎబెద్మెలెకు ఆ మనుష్యులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి, అచ్చటనుండి పాతవైన చింకిబట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసికొనిపోయి, ఆ గోతిలోనున్న యిర్మీయా పట్టుకొనునట్లుగా త్రాళ్లచేత వాటినిదింపి–పాతవై చిరిగి చీరాకులైన యీ బట్టలను త్రాళ్లమీద నీ చంకలక్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పెను. యిర్మీయా ఆలాగు చేయగా వారు యిర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలోనుండి వెలుపలికి తీసిరి; అప్పుడు యిర్మీయా బందీగృహశాలలో నివసించెను. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములోనున్న మూడవ ద్వారములోనికి ప్రవక్తయైన యిర్మీయాను పిలువనంపించి అతనితో ఇట్లనెను–నేను ఒకమాట నిన్నడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాని చెప్పుమనగా యిర్మీయా–నేను ఆ సంగతి నీకు తెలియజెప్పినయెడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు, నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. కావున రాజైన సిద్కియా–జీవాత్మను మన కనుగ్రహించు యెహోవాతోడు నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయజూచుచున్న యీ మనుష్యుల చేతికి నిన్ను అప్పగింపను అని యిర్మీయాతో రహ స్యముగా ప్రమాణము చేసెను. అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇట్లనెను–దేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నీవు బబులోనురాజు అధిపతులయొద్దకు వెళ్లినయెడల నీవు బ్రదికెదవు, ఈపట్టణము అగ్నిచేత కాల్చ బడదు, నీవును నీ యింటివారును బ్రదుకుదురు. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్లనియెడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్నిచేత దాని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలవు. అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను–కల్దీయుల పక్షముగాఉండు యూదులకు భయపడుచున్నాను; ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించినయెడల వారు నన్ను అపహ సించెదరు. అందుకు యిర్మీయా–వారు నిన్నప్పగింపరు, నీవు బ్రదికి బాగుగానుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతినిగూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము. నీవు ఒకవేళ బయలు వెళ్లక పోయినయెడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను. –యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరు బబులోను అధిపతులయొద్దకు కొనిపోబడెదరు, ఆలాగు జరుగగా ఆ స్ర్రీలు నిన్ను చూచి–నీ ప్రియస్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైని విజయము పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుకతీసిరనియందురు. నీ భార్యలందరును నీ పిల్లలును కల్దీయులయొద్దకు కొనిపోబడుదురు, నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలక బబులోను రాజుచేత పట్టబడెదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు. అందుకు సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను–నీవు మరణశిక్ష నొందకుండునట్లు ఈ సంగతులను ఎవనికిని తెలియనియ్యకుము. నేను నీతో మాటలాడిన సంగతి అధిపతులు వినినయెడల వారు నీయొద్దకు వచ్చి–మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగుచేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా నీవు–యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండ అక్కడికి నన్ను తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసికొనబోతినని వారితో చెప్పుమని రాజు యిర్మీయాతో అనెను. అంతట అధిపతులందరు యిర్మీయాయొద్దకు వచ్చి యడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయ నందునవారు అతనితో మాటలాడుట మానిరి. యెరూషలేము పట్టబడువరకు యిర్మీయా బందీగృహశాలలో ఉండెను.