యిర్మీయా 36:20-26

యిర్మీయా 36:20-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

తర్వాత వారు ఆ గ్రంథపుచుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో పెట్టి, తన భవన ప్రాంగణంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్లి, జరిగినదంతా ఆయనతో చెప్పారు. అప్పుడు రాజు ఆ గ్రంథపుచుట్టను తెమ్మని యెహూదిని పంపినప్పుడు, అతడు వెళ్లి లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తెచ్చి రాజుకు, ఆయన ప్రక్కన నిలబడి ఉండిన అధికారులందరికి చదివి వినిపించాడు. అది తొమ్మిదవ నెల కాబట్టి రాజు శీతాకాలపు భవనంలో మంటలు మండుతున్న కుంపటి ముందు కూర్చుని ఉన్నాడు. యెహూది గ్రంథపుచుట్టలోని మూడు నాలుగు వరుసలను చదివినప్పుడల్లా, రాజు వాటిని లేఖికుని కత్తితో కోసి మండుతున్న కుంపటిలో విసురుతూ ఉన్నాడు, ఆ గ్రంథపుచుట్టను పూర్తిగా కాల్చివేసే వరకు రాజు అలాగే చేశాడు. ఈ మాటలన్నీ విన్న రాజు గాని అతని సహాయకులెవ్వరు గాని భయపడలేదు, తమ బట్టలు చింపుకోలేదు. ఆ గ్రంథపుచుట్టను కాల్చవద్దు అంటూ ఎల్నాతాను, దెలాయ్యా, గెమర్యా రాజును అభ్యర్థించారు, కాని రాజు వారి అభ్యర్థనను వినిపించుకోలేదు. పైగా రాజు, లేఖికుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను బంధించమని రాజకుమారుల్లో ఒకడైన యెరహ్మెయేలు, అజ్రీయేలు కుమారుడైన శెరాయా, అబ్దీయేలు కుమారుడైన షెలెమ్యాలను ఆజ్ఞాపించాడు. అయితే యెహోవా వారిని దాచిపెట్టారు.

యిర్మీయా 36:20-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు వాళ్ళు ఆ పుస్తకాన్ని లేఖికుడైన ఎలీషామా గదిలో ఉంచి, రాజమందిరానికి తామే వెళ్లి, ఆ మాటలన్నీ రాజుకు చెప్పారు. అప్పుడు రాజు ఆ పుస్తకపు చుట్టను తీసుకురావడానికి యెహూదిని పంపించినప్పుడు అతడు లేఖికుడైన ఎలీషామా గదిలోనుంచి దాన్ని తీసుకొచ్చి రాజుకు, రాజు పక్కన నిల్చుని ఉన్న అధికారులకూ వినిపించేలా బిగ్గరగా చదివాడు. తొమ్మిదో నెలలో, రాజు శీతాకాలం రాజమందిరంలో కూర్చుని ఉన్నప్పుడు, అతని ఎదుట కుంపటిలో అగ్ని రగులుతూ ఉంది. యెహూది మూడు నాలుగు వరుసలు చదివిన తరువాత, రాజు చాకుతో దాన్ని కోసి, ఆ కుంపటిలో వేశాడు. అప్పుడు అది పూర్తిగా కాలిపోయింది. అయితే, రాజుగాని, ఈ మాటలన్నీ విన్న అతని సేవకుల్లో ఒక్కడైనా భయపడ లేదు, తమ బట్టలు చింపుకోలేదు. పుస్తకపు చుట్టను కాల్చవద్దని ఎల్నాతాను, దెలాయ్యా, గెమర్యా రాజును కోరినా, అతడు వాళ్ళ మాట వినలేదు. లేఖికుడైన బారూకును, ప్రవక్త అయిన యిర్మీయాను పట్టుకోవాలని రాజవంశస్థుడైన యెరహ్మెయేలుకు, అజ్రీయేలు కొడుకు శెరాయాకు, అబ్దెయేలు కొడుకు షెలెమ్యాకు రాజు ఆజ్ఞాపించాడు, కాని యెహోవా యిర్మియా బారూకులను వారికి కనబడకుండా చేశాడు.

యిర్మీయా 36:20-26 పవిత్ర బైబిల్ (TERV)

పిమ్మట రాజ్యాధికారులు ఆ పత్రాన్ని (పుస్తకం) లేఖికుడైన ఎలీషామా గదిలో ఉంచారు. వారు రాజైన యెహోయాకీము వద్దకు వెళ్లి ఆ పుస్తకం గురించి అంతా చెప్పారు. అప్పుడు రాజైన యెహోయాకీము ఆ పత్రాన్ని తేవటానికి యెహూదిని పంపించాడు. లేఖకుడైన ఎలీషామా గదినుండి యెహూది ఆ పుస్తకాన్ని తెచ్చాడు. రాజుకు, ఆయన వద్ద నిలబడి ఉన్న సిబ్బందికి యెహూది ఆ పుస్తకాన్ని చదివి వినిపించాడు. ఇది జరిగే నాటికి సంవత్సరంలో తొమ్మిదవ నెల కావటంతో, రాజైన యెహోయాకీము శీతకాలపు గదిలో (వెచ్చని గది) కూర్చుని ఉన్నాడు. రాజుముందు ఒక చిన్న నిప్పుగూటిలో మంట రగులుతూ వుంది. చుట్టబడిన పత్ర రూపంలో ఉన్న ఆ గ్రంథాన్ని యెహూది చదవటం మొదలు పెట్టాడు. అతడు రెండు మూడు పుటల విషయాలు చదవగానే రాజైన యెహోయాకీము ఆ పత్రాన్ని గుంజుకుని, ఒక చిన్న కత్తితో చదివిన భాగాన్ని కోసి మండే నిప్పులో వేయసాగాడు. ఆ విధంగా మొత్తం పుస్తకమంతా తగులబెట్టాడు. పైగా రాజైన యెహోయాకీము, అతని సిబ్బంది ఆ వర్తమానాన్ని విని భయపడలేదు. వారి పాపాలకు చింతిస్తున్న సూచనగా వారు తమ బట్టలను చించుకొనలేదు. ఎల్నాతాను, దెలాయ్యా మరియు గెమర్యా అనేవారు రాజుతో మాట్లాడి గ్రంథాన్ని తగులబెట్టకుండా చేయాలని ప్రయత్నించారు గాని రాజు వినలేదు. రాజైన యెహోయాకీము లేఖకుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను నిర్బంధించు మని కొందరు మనుష్యులను ఆదేశించాడు. అలా ఆదేశించబడిన మనుష్యులు రాజకుమారుడు యెరహ్మెయేలు, అజీ్రయేలు కుమారుడైన శెరాయా, మరియు అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యా అనువారు. అయితే యెహోవా బారూకును, యిర్మీయాను దాచివేసిన కారణంగా ఆ మనుష్యులు వారిని కనుక్కోలేకపోయారు.

యిర్మీయా 36:20-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

శాలలోనున్న రాజునొద్దకు తామే వెళ్లి ఆ మాటలన్నిటిని రాజు చెవులలో వినిపించిరి గాని ఆ పుస్తకపుచుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖకుడైన ఎలీ షామా గదిలోనుండి దాని తీసికొని వచ్చి రాజు వినికిడిలోను రాజనొద్ద నిలిచియున్న అధిపతులందరి వినికిడిలోను దాని చదివెను. తొమ్మిదవ మాసమున రాజు శీత కాలపు నగరులో కూర్చుండియుండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది మూడు నాలుగు పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో నున్న అగ్నిచేత అది బొత్తిగా కాలిపోయెను గాని రాజైనను ఈ మాట లన్నిటిని వినిన యతని సేవకులలో ఎవరైనను భయపడ లేదు, తమ బట్టలు చింపుకొనలేదు. –గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయ్యాయును గెమర్యాయును రాజుతో మనవిచేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయెను. లేఖకుడైన బారూకును ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడగు యెరహ్మెయేలునకును అజ్రీయేలు కుమారుడైన శెరాయాకును అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని యెహోవావారిని దాచెను.