యిర్మీయా 33:1-26
యిర్మీయా 33:1-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యిర్మీయా ఇంకా కావలివారి ప్రాంగణంలో బంధించబడి ఉండగా, యెహోవా వాక్కు అతనికి రెండవసారి వచ్చింది: “యెహోవా ఇలా అంటున్నారు, ఆయన భూమిని సృష్టించారు, యెహోవా దానిని రూపించి, స్థాపించారు; యెహోవా అని పేరు కలిగినవారే ఇలా చెప్తున్నారు, ‘నాకు మొరపెట్టు, నేను నీకు జవాబు ఇస్తాను, నీకు తెలియని, నీవు పరిశోధించలేని గొప్ప విషయాలను నీకు చెప్తాను.’ బబులోనీయులతో జరిగిన యుద్ధంలో ముట్టడి దిబ్బల వల్ల ఖడ్గం వల్ల నాశనమైన ఈ పట్టణంలోని ఇళ్ళ గురించి, యూదా రాజభవనాల గురించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘అవి నా కోపం ఉగ్రత వల్ల నేను చంపిన మనుష్యుల శవాలతో నిండిపోతాయి. ఈ పట్టణపు దుష్టత్వాన్ని బట్టి దానికి నేను నా ముఖాన్ని దాచుకుంటాను. “ ‘అయినప్పటికీ, నేను దానికి ఆరోగ్యాన్ని స్వస్థతను తెస్తాను; నేను నా ప్రజలను స్వస్థపరచి వారు సమృద్ధిగా సమాధానాన్ని సత్యాన్ని ఆస్వాదించేలా చేస్తాను. నేను యూదాను, ఇశ్రాయేలీయులను చెర నుండి తిరిగి రప్పించి వారు ఎలా పూర్వం ఉన్నారో వారిని తిరిగి అలాగే నిర్మిస్తాను. వారు నాకు వ్యతిరేకంగా చేసిన పాపాలన్నిటి నుండి నేను వారిని శుద్ధి చేస్తాను, నాపై తిరుగుబాటు చేసిన వారి పాపాలన్నిటిని క్షమిస్తాను. అప్పుడు నేను వారి కోసం చేయబోతున్న మంచి పనులన్నిటి గురించి విన్న భూప్రజలందరి ముందు ఈ పట్టణం నాకు కీర్తిని ఆనందాన్ని గౌరవాన్ని తెస్తుంది. నేను వారికి ఇచ్చే విస్తారమైన వృద్ధిని సమాధానాన్ని చూసి వారు భయంతో వణికిపోతారు.’ “యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ స్థలం గురించి మీరు ఇలా అంటున్నారు, “ఇది మనుష్యులు జంతువులు లేక పాడైపోయింది” అని మీరు చెప్పే ఈ స్థలంలోనే, మనుష్యులుగానీ, జంతువులుగానీ నివసించకుండా పాడైపోయిన యూదా పట్టణాల్లో యెరూషలేము వీధుల్లో సంతోషకరమైన శబ్దాలు, ఆనంద ధ్వనులు, వధూవరుల స్వరాలు మరోసారి వినిపిస్తాయి. వారు యెహోవా ఆలయానికి కృతజ్ఞతార్పణలు తీసుకువస్తూ, “సైన్యాల యెహోవాకు స్తుతులు చెల్లించండి, యెహోవా మంచివాడు; ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది” అంటారు. ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను’ అని యెహోవా అంటున్నారు. “సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘మనుష్యులు, జంతువులు లేక నిర్జనమైన ఈ స్థలంలో, దాని పట్టణాలన్నింటిలో గొర్రెల కాపరులు తమ మందలకు విశ్రాంతి ఇచ్చేందుకు మళ్ళీ పచ్చికబయళ్లు ఉంటాయి. కొండ ప్రాంత పట్టణాల్లో, పడమటి పర్వత ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతంలో, బెన్యామీను ప్రాంతంలో, యెరూషలేము చుట్టూ ఉన్న గ్రామాల్లో, యూదా పట్టణాల్లో మందలు లెక్కించే వారిచేత లెక్కించబడతాయి’ అని యెహోవా చెప్తున్నారు. “యెహోవా అంటూ ఇలా ప్రకటిస్తున్నారు, ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలకు నేను చేసిన మంచి వాగ్దానాన్ని నేను నెరవేర్చే రోజులు వస్తున్నాయి.’ “ ‘ఆ రోజుల్లో, ఆ సమయంలో నేను దావీదు వంశం నుండి నీతి కొమ్మను మొలకెత్తిస్తాను. అతడు దేశంలో నీతి న్యాయాలు జరిగిస్తాడు. ఆ రోజుల్లో యూదాకు కాపుదల ఉంటుంది యెరూషలేము క్షేమంగా జీవిస్తుంది. యెహోవాయే మన నీతిమంతుడైన రక్షకుడు అనే పేరుతో యెరూషలేము పిలువబడుతుంది.’ యెహోవా ఇలా అంటున్నారు: ‘ఇశ్రాయేలు సింహాసనంపై కూర్చోడానికి దావీదుకు ఒకడు లేకుండా ఉండడు. నా ఎదుట నిలబడి దహనబలులు అర్పించడానికి, భోజనార్పణలు అర్పించడానికి, బలులు అర్పించడానికి లేవీయులైన యాజకులకు ఒకడు లేకుండా పోడు.’ ” యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చి: “యెహోవా ఇలా అంటున్నారు: ‘పగలు రాత్రులు వాటి నిర్ణీత సమయంలో రాకుండా నేను పగటికి, రాత్రికి చేసిన నా ఒడంబడికను మీరు భంగం చేస్తే, అప్పుడు నా సేవకుడైన దావీదుతో తన సింహాసనంపై రాజ్యం చేయడానికి అతనికి ఒకడు లేకుండా పోడని నేను చేసిన నిబంధన, నా ఎదుట పరిచర్య చేస్తున్న యాజకులుగా ఉన్న లేవీయులతో నేను చేసిన నిబంధన వ్యర్ధం అవుతుంది. నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నా ఎదుట పరిచర్య చేసే లేవీయులను ఆకాశంలోని నక్షత్రాలవలె లెక్కపెట్టలేనంతగా, సముద్రతీరంలోని ఇసుకలా కొలువలేనంతగా చేస్తాను.’ ” యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చి: “ఈ ప్రజలు, ‘యెహోవా తాను ఎంచుకున్న రెండు రాజ్యాలను ఆయన తృణీకరించారు’ అని అనడం నీవు గమనించలేదా? కాబట్టి వారు నా ప్రజలను తృణీకరిస్తారు ఇకపై వారిని ఒక జనంగా పరిగణించరు. యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను పగలు రాత్రితో నా ఒడంబడిక చేసి, భూమ్యాకాశాల నియమాలను స్థాపించి ఉండకపోతే, అప్పుడు నేను యాకోబు నా సేవకుడైన దావీదుల సంతతిని తిరస్కరించి ఉండేవాన్ని, అబ్రాహాము, ఇస్సాకు యాకోబుల సంతతివారిని పరిపాలించడానికి అతని కుమారులలో ఒక్కరిని కూడా ఎన్నుకోను. ఎందుకంటే నేను చెర నుండి వారిని తిరిగి రప్పించి, వారిపై కనికరం చూపుతాను.’ ”
యిర్మీయా 33:1-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యిర్మీయా ఇంకా చెరసాలలో ఉన్నప్పుడు యెహోవా వాక్కు రెండోసారి అతనికి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. “సృష్టికర్త అయిన యెహోవా, రూపించిన దాన్ని స్థిరపరిచే యెహోవా, యెహోవా అనే పేరు గలవాడు ఇలా అంటున్నాడు, నాకు మొర పెట్టు, అప్పుడు నేను నీకు జవాబిస్తాను. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు, నీకు అర్థం కాని మర్మాలు నీకు వివరిస్తాను. ముట్టడి దిబ్బల వలనా, ఖడ్గం వలనా నాశనమైన పట్టణంలోని యూదా రాజుల గృహాల విషయంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు. ‘యుద్ధం చెయ్యడానికి కల్దీయులు వస్తున్నారు. నా ఉగ్రతను బట్టి, నా ఆగ్రహాన్ని బట్టి, తమ దుష్టత్వం కారణంగా నేను ఈ పట్టణం నుండి ముఖం తిప్పేసుకున్నందు వల్ల హతమయ్యే ప్రజల శవాలతో ఆ ఇళ్ళను నింపడానికి వారు వస్తున్నారు. కాని, చూడు, నేను ఆరోగ్యం, స్వస్థత తీసుకొస్తాను. నేను వాళ్ళను స్వస్థపరిచి వాళ్ళను సమృద్ధిలోకి, శాంతిలోకి, నమ్మకత్వంలోకి తీసుకొస్తాను. యూదా, ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళ భాగ్యం మళ్ళీ తీసుకొస్తాను. ఆరంభంలో ఉన్నట్టు వాళ్ళను నిర్మాణం చేస్తాను. అప్పుడు వాళ్ళు నాకు విరోధంగా చేసిన దోషాల నుంచి వాళ్ళను పవిత్రం చేస్తాను. నాకు విరోధంగా చేసిన వాళ్ళ దోషాలనూ తిరుగుబాటునూ క్షమిస్తాను. నేను వాళ్ళ కోసం చెయ్యబోతున్న మంచి సంగతులు విన్న భూజనులందరి ఎదుట, వాళ్ళు నా ఆనందానికి, స్తోత్ర గీతానికి, ఘనతకు కారణంగా ఉంటారు. నేను వారికి ఇచ్చే మంచి విషయాలు, శాంతి కారణంగా వాళ్ళు భయపడతారు.’” యెహోవా ఇలా అంటున్నాడు. “‘ఇది నివాసయోగ్యం కాదు, యూదా పట్టణాల్లో మనుషులు లేరు, జంతువులు లేవు, యెరూషలేము వీధుల్లో జనంగానీ, జంతువులుగానీ లేవు’ అని మీరు చెప్పే ఈ స్థలాల్లోనే, సంతోష స్వరం, ఆనంద శబ్దం, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు స్వరాలు ఇలా అంటాయి, ‘సైన్యాలకు అధిపతి అయిన యెహోవాకు స్తుతి చెల్లించండి, యెహోవా మంచివాడు, ఆయన నిబంధనా నమ్మకత్వం నిరంతరం ఉంటుంది.’ స్తుతి అర్పణ నా మందిరంలోకి తీసుకు రండి, ఎందుకంటే ముందు ఉన్నట్టుగానే ఈ దేశపు భాగ్యం మళ్ళీ దానికి కలుగజేస్తాను,” అని యెహోవా అంటున్నాడు. సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు “మనుషులు, జంతువులు లేక పాడైపోయిన ఈ పట్టణాలు, కాపరులు తమ గొర్రెలను మేపే ప్రాంతాలుగా, వాటిని విశ్రమింపజేసే ప్రదేశాలుగా ఉంటాయి. మన్య పట్టణాల్లో, మైదానపు పట్టణాల్లో, దక్షిణ దేశపు పట్టణాల్లో, బెన్యామీను దేశంలో, యెరూషలేము ప్రాంతంలో, యూదా పట్టణాల్లో మందలు లెక్కించుకుంటూ తిరుగుతారు.” యెహోవా వాక్కు ఇదే. “చూడు! ఇశ్రాయేలు, యూదా ప్రజలకు నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చే రోజులు వస్తున్నాయి. ఆ రోజుల్లో, ఆ సమయంలో నేను దావీదు కోసం నీతి చిగురు మొలిపిస్తాను. అతడు దేశంలో నీతి న్యాయాలను జరిగిస్తాడు. ఆ రోజుల్లో యూదా వాళ్ళు రక్షణ పొందుతారు. యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉంటారు. ‘యెహోవాయే మనకు నీతి’ అని యెరూషలేముకు పేరు ఉంటుంది.” ఎందుకంటే, యెహోవా ఇలా అంటున్నాడు “ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోడానికి దావీదు సంతతివాడు ఒకడు లేకుండా పోడు, నా సన్నిధిలో నిత్యం దహన బలులు అర్పించడానికీ, నైవేద్యాలు అర్పించడానికీ, ధాన్య అర్పణలు అర్పించడానికీ యాజకులైన లేవీయుల్లో ఒకడు ఎప్పుడూ లేకుండా ఉండడు.” యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, యెహోవా ఇలా అంటున్నాడు. “దివారాత్రులు, వాటి సమయాల్లో అవి ఉండకుండా నేను పగటికి చేసిన నిబంధన, రాత్రికి చేసిన నిబంధన మీరు వ్యర్ధం చెయ్యగలిగితే, అప్పుడు, నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుని పాలించే వారసుడు అతనికి ఉండకుండా మానడని అతనితో, నా సేవకులైన లేవీయులతో, యాజకులతో నేను చేసిన నా నిబంధన వ్యర్ధం అవుతుంది. ఆకాశ నక్షత్రాలు, సముద్రపు ఇసుక రేణువులు లెక్కపెట్టడం సాధ్యం కానట్టే, నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నాకు సేవ చేసే లేవీయులను లెక్క పెట్టలేనంతగా నేను అధికం చేస్తాను.” యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, తాను ఏర్పరచుకున్న రెండు వంశాలను యెహోవా తిరస్కరించాడు, నా ప్రజలు ఇకమీదట తమ దృష్టిలో ఒక జనాంగంగా ఉండరు, అని, ఈ రకంగా నా ప్రజలను తృణీకరిస్తూ ఈ ప్రజలు చెప్పుకునే మాట గురించి నువ్వు ఆలోచించలేదా? యెహోవానైన నేను ఇలా అంటున్నాను, “పగలు గురించి, రాత్రి గురించి, నేను చేసిన నిబంధన నిలకడగా ఉండకపోతే, భూమ్యాకాశాలను గురించిన నిబంధన నిలిచి ఉండకపోతే, అప్పుడు మాత్రమే అబ్రాహాము ఇస్సాకు, యాకోబుల సంతానాన్ని పరిపాలించడానికి అతని సంతాన సంబంధి అయిన వ్యక్తిని ఏర్పరచుకోకుండా, నేను యాకోబు సంతానంలోని నా సేవకుడైన దావీదు సంతానాన్ని తృణీకరిస్తాను. కచ్చితంగా నేను వాళ్ళ పట్ల కనికరం చూపించి వాళ్ళ భాగ్యం వాళ్లకు మళ్ళీ తీసుకొస్తాను.”
యిర్మీయా 33:1-26 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా నుండి సందేశం రెండవసారి యిర్మీయాకు వచ్చింది. యిర్మీయా ఇంకను రక్షక భటుని ఆవరణలో బందీయైయున్నాడు. యెహోవా భూమిని సృష్టించాడు. ఆయన దానిని సురక్షితంగా ఉంచుతాడు. ఆ సృష్టికర్త పేరే యెహోవా! యెహోవా ఇలా అంటున్నాడు: “ఓ యూదా, నన్ను ప్రార్థించు. నేను నీకు జవాబిస్తాను. నేను నీకు అతి ముఖ్యమైన రహస్యాలను తెలియజేస్తాను. అవి నీవు ముందెన్నడు విని ఎరుగవు. యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. యెరూషలేములోని ఇండ్ల విషయం, యూదా రాజుల భవనాల గురించి యెహోవా ఈ విషయాలు తెలియజేస్తున్నాడు శత్రువు ఆ ఇండ్లను నేల మట్టం చేస్తాడు. శత్రువు నగర గోడల చుట్టూ పై వరకు దిమ్మలు నిర్మిస్తాడు. శత్రువు కత్తి పట్టి ఈ నగరాల ప్రజలతో యుద్ధం చేస్తాడు. “యెరూషలేము నగరంలో ప్రజలు చాలా చెడు కార్యాలు చేశారు. వారి పట్ల నేను చాలా కోపంగా ఉన్నాను. నేను ఈ పట్టణానికి విముఖుడనైనాను. కావున వారిలో చాలా మందిని చంపివేస్తాను. కల్దీయుల సైన్యం యెరూషలేముతో యుద్ధానికి వస్తుంది. యెరూషలేము నగరంలోని ఇండ్లలో అనేక మంది శవాలు పడి ఉంటాయి. “కాని ఆ నగరంలోని ప్రజలను నేను స్వస్థపరచి వారికి ఉపశమనం కలుగజేస్తాను. వారు శాంతి, రక్షణ కలిగి ఉండేలా చేస్తాను. యూదాను, ఇశ్రాయేలును గతంలో మాదిరిగా మిక్కిలి బలపడేలా చేస్తాను. వారు నాకు విరోధంగా పాపం చేశారు కాని నేను ఆ పాపాన్ని కడిగి వేస్తాను. నాకు విరోధంగా వారు పోరాడారు కాని వారిని క్షమిస్తాను. అప్పుడు యెరూషలేము ఒక అద్భుతమైన స్థలంగా మారి పోతుంది. ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇతర దేశాల ప్రజలు దిగ్భ్రాంతులవుతారు. మరియు నేను ఇశ్రాయేలీయులకు కలుగజేసే క్షేమాన్ని విశ్రాంతిని చూచి వణకుతారు. అనేక మంచి పనులు జరగడం గురించి వారు విన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇతర రాష్ట్రాల వారు నేను ఇశ్రాయేలుకు అనుగ్రహించిన మంచి వాటిని గురించి వింటారు. “ప్రజలారా మీరిలా అంటున్నారు, ‘మా దేశం వట్టి ఎడారి అయిపోయింది. మనుష్యులు గాని, జంతుజాలం గాని ఏదీ ఇక్కడ నివసించటం లేదు.’ యెరూషలేము వీధులలోను, యూదా పట్టణాలలోను ఇప్పుడు ప్రశాంతత నెలకొన్నది. కాని త్వరలో అక్కడ సందడి ఏర్పడుతుంది. అక్కడ తిరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వధూవరుల వేడుకలు నెలకొంటాయి. దేవాలయానికి కానుకలు తెచ్చే జన సందోహాల సందడి వినిపిస్తుంది. ‘సర్వశక్తిమంతుడయిన యెహోవాకు జయగీతం పాడండి! యెహోవా దయామయుడు. ఆయన కరుణ శాశ్వతంగా మనకు లభిస్తుంది!’ అని ప్రజలు అంటారు. యూదాకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. గనుక ప్రజలా మాటలు చెపుతారు. అప్పుడు యూదా తన పూర్వ వైభవం తిరిగి నెలకొంటుంది.” ఇదే యెహోవా వాక్కు. సర్వశక్తిమంతుడయిన యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ ప్రదేశం ఇప్పుడు ఖాళీగా వుంది. ఇది నిర్మానుష్యంగా, జంతు సంచారం కూడ లేకుండా ఉంది. కాని యూదా పట్టణాలన్నీ ప్రజలతో నిండిపోతాయి. గొర్రెల కాపరులుంటారు. పచ్చిక బయళ్లు మళ్లీ చిగురిస్తాయి. మందలు పచ్చిక మేసి హాయిగా వాటిలో విశ్రమిస్తాయి. గొర్రెలు తమ ముందు నడుస్తూ ఉండగా, కాపరులు వారి గొర్రెలను లెక్కిస్తారు. మన్యం ప్రాంతంలో, పచ్చిమ కొండవాలు ప్రాంతంలో, నెగేవు ఎడారి ప్రాంతంలో, ఇంకా యూదా పట్టణాలన్నిటిలో ప్రజలు తమ తమ గొర్రెలను లెక్కపెట్టుకుంటూ ఉంటారు.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేసియున్నాను. నేనిచ్చిన మాట నెరవేర్చుకునే సమయం ఆసన్నమవుతూ వుంది. ఆ సమయంలో దావీదు వంశం నుండి ఒక మంచి ‘కొమ్మ’ చిగురించి పెరిగేలా చేస్తాను. ఆ మంచి ‘కొమ్మ’ (రాజు) దేశానికి ఏది మంచిదో, ఏది నీతి దాయకమో అది చేస్తుంది. ఈ ‘కొమ్మ’ చిగిర్చిన కాలంలో యూదా ప్రజలు రక్షింపబడతారు. యెరూషలేములో ప్రజలు సురక్షితంగా జీవిస్తారు. ఈ కొమ్మ పేరు ‘యెహోవాయే మా నీతి.’” యెహోవా ఇలా చెపుతున్నాడు, “దావీదు వంశంలోని ఒక వ్యక్తి సదా సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీయులను పరిపాలిస్తాడు. లేవీయుల వంశంలోనివారే ఎల్లప్పుడూ యాజకులుగా ఉంటారు. ఆ యాజకులు సదా నా ఎదుట నిలచి నాకు దహన బలులు, ధాన్యార్పణలు, బలులు అర్పిస్తారు.” యిర్మీయాకు యెహోవా నుండి ఈ వర్తమానం వచ్చింది. యెహోవా ఇలా అన్నాడు: “నాకు రాత్రింబవళ్లతో ఒక ఒడంబడిక ఉంది. అవి అలా ఎల్లప్పుడూ సరైన సమయంలో వస్తాయి. ఆ ఒడంబడికను మీరు మార్చలేరు! దివారాత్రులు క్రమం తప్పక అలా వస్తూనే ఉంటాయి. మీరా నిబంధన మార్చగల్గిననాడు, నా సేవకుడైన దావీదు, నా సేవకులైన లేవీయులతో యాజకులతో నా ఒడంబడికను కూడా మార్చగల్గుతారు. అప్పుడు దావీదు వంశంలోని వారు రాజులు కాలేరు. లేవీ వంశం వారు యాజకులు కాలేరు. కాని నేను నా సేవకుడైన దావీదు వంశం, లేవీ వంశం అభివృద్ధి పొందేలా చేస్తాను. ఆకాశంలో నక్షత్రాల్లా వారి సంతతి వృద్ధి పొందుతుంది. ఆ నక్షత్రాలను ఎవ్వరూ లెక్కపెట్టలేరు. మరియు వారి సంతానం సముద్ర తీరాన గల ఇసుక రేణువుల్లా వృద్ధి పొందుతుంది. ఆ ఇసుక రేణువులను ఎవ్వరూ లెక్క పెట్టలేరు.” యిర్మీయా ఈ వర్తమానాన్ని యెహోవా నుండి విన్నాడు: “యిర్మీయా, ప్రజలేమనుకుంటున్నారో నీవు విన్నావా? ‘యెహోవా ఇశ్రాయేలు, యూదా రెండు వంశాల వారికి విముఖుడయ్యాడు. యెహోవా వారిని ముందు ఎన్నుకున్నాడు. కాని ఇప్పుడాయన వారిని తిరస్కరించాడు.’ వారు మా ప్రజలను ఎంతగా ద్వేషస్తున్నారంటే, మా ప్రజలు ఒక రాజ్యంగా కూడా అంగీకరించటం లేదు.” అయితే యెహోవా ఇలా అంటున్నాడు: “దివారాత్రులతో నా ఒడంబడిక కొనసాగకపోతే, భూమ్యాకాశాలకు సంబంధించిన న్యాయసూత్రాలను నేను చేయకపోతే, బహుశః నేనా ప్రజలను వదిలి వేస్తాను. బహుశః అప్పుడు యాకోబు సంతతి నుండి నేను దూరంగా ఉంటాను. బహుశః అప్పుడే నేను దావీదు వంశం వారు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు సంతతి వారిని ఏలకుండా చేస్తాను. కానీ నిర్బంధంలో నుండి వారిని మరలా వారి స్వదేశానికి తెస్తాను. ఆ ప్రజల పట్ల దయగలిగి ఉంటాను.”
యిర్మీయా 33:1-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంక ఉంచబడియుండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించినవాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ముట్టడిదిబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణములోని యిండ్లన్నియు యూదారాజుల నగరులును శిథిలమై పోయెనుగదా. వాటినిగూర్చి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా కల్దీయులతో యుద్ధము చేసి, వారి చెడుతనమునుబట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపముచేత హతులై, తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తికలిగించుటకై వారు వచ్చుచుండగా –నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చెరలోనుండిన యూదావారిని ఇశ్రాయేలువారిని నేను రప్పించుచున్నాను, మొదటనుండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలువకుండ వారిని పవిత్రపరతును, వారు నాకు విరోధముగాచేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నిటిని క్షమించెదను. భూజనులందరియెదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్రకారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు, నేను వారికిచేయు సకల ఉపకారములనుగూర్చిన వర్తమానమును జనులువిని నేను వారికి కలుగజేయు సమస్తక్షేమమునుబట్టియు సమస్తమైన మేలునుబట్టియు భయపడుచు దిగులు నొందుదురు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే, మనుష్యులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే, సంతోషస్వరమును ఆనంద శబ్దమును పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును–యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును;మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –మనుష్యులైనను జంతువులైనను లేక పాడైయున్న యీ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొఱ్ఱెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు. మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్కపెట్టువారిచేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా వాక్కు ఇదే–ఇశ్రాయేలు వంశస్థులనుగూర్చియు యూదా వంశస్థులనుగూర్చియు నేను చెప్పిన మంచిమాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇశ్రాయేలువారి సింహాసనముమీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు. ఎడతెగక దహనబలులను అర్పించుటకును నైవేద్యముల నర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు. మరియు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగినయెడల నా సేవకుడైన దావీదు సింహాసనముమీద కూర్చుండి రాజ్యపరిపాలనచేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థ మగును; మరియు నా పరిచారకులైన లేవీయులగు యాజకులతోను నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును. మరియు యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు – పగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల భూమ్యాకాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.