యిర్మీయా 10:1-25

యిర్మీయా 10:1-25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఇశ్రాయేలు ప్రజలారా! యెహోవా మీతో మాట్లాడుతున్నారు, వినండి. యెహోవా ఇలా చెప్తున్నారు: “ఇతర దేశాల విధానాలను నేర్చుకోవద్దు ఆకాశంలో సూచనలను చూసి అవి భయపడినా, మీరు భయపడవద్దు. ఎందుకంటే జనాంగాల ఆచారాలు విలువలేనివి; వారు అడవిలో చెట్టు నరికి తెస్తారు, హస్తకళాకారుడు ఉలితో చెక్కుతాడు. వారు వెండి బంగారాలతో వాటిని అలంకరిస్తారు; కదలకుండా ఉండేలా, సుత్తితో మేకులు కొట్టి దానిని బిగిస్తారు. దోసకాయ పొలంలో దిష్టిబొమ్మలా, వారి విగ్రహాలు మాట్లాడలేవు; అవి నడవలేవు కాబట్టి వాటిని మోయాలి. వాటికి భయపడవద్దు; అవి ఏ హాని చేయలేవు అలాగే ఏ మేలు కూడా చేయలేవు.” యెహోవా, మీలాంటి వారు ఎవరు లేరు; మీరు గొప్పవారు, మీ నామం ఘనమైనది. దేశాలకు మీరు రాజు, మిమ్మల్ని గౌరవించని వాడెవడు? గౌరవం మీకు చెందినదే. దేశాలకు చెందిన జ్ఞానులైన నాయకులందరిలో వారి రాజ్యాలన్నిటిలో, మీలాంటి వారెవ్వరూ లేరు. వారంతా తెలివిలేనివారు, మూర్ఖులు; వారు పనికిరాని చెక్క విగ్రహాల బోధను వింటున్నారు. తర్షీషు నుండి సాగగొట్టబడిన వెండి ఊఫజు నుండి బంగారం తీసుకురాబడ్డాయి. హస్తకళాకారుడు, కంసాలివాడు తయారుచేసిన వాటికి నీలం, ఊదా రంగుల వస్త్రాలు ధరింపచేశారు, అవన్నీ నైపుణ్యం కలిగిన పనివారిచేత తయారుచేయబడ్డాయి. అయితే యెహోవాయే నిజమైన దేవుడు; ఆయన సజీవుడైన దేవుడు, నిత్య రాజు. ఆయనకు కోపం వచ్చినప్పుడు, భూమి కంపిస్తుంది; ఆయన ఉగ్రతను దేశాలు సహించలేవు. “వారితో ఇలా చెప్పు: ‘ఆకాశాన్ని, భూమిని సృజించని ఈ దేవుళ్ళు భూమి మీద నుండి, ఆకాశం క్రిందనుండి నశించిపోతారు.’ ” అయితే దేవుడు తన శక్తితో భూమిని చేశారు; ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు. ఆయన ఉరిమినప్పుడు ఆకాశ జలాలు గర్జిస్తాయి; ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. ఆయన వర్షంతో మెరుపులు పంపి తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు. మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. అతడు చేసే చిత్రాలు మోసం; వాటిలో ఊపిరి లేదు. అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి. యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు. ఆయన పేరు సైన్యాల యెహోవా. ఆక్రమణలో ఉంటున్నవారలారా, దేశాన్ని విడిచి వెళ్లడానికి మీ వస్తువులను సర్దుకోండి. ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నారు: “ఈ సమయంలో నేను ఈ దేశంలో నివసించేవారిని తరిమివేస్తాను. వారు పట్టబడేలా నేను వారి మీదికి కష్టం రప్పిస్తాను.” నా గాయం వల్ల నాకు శ్రమ! నా గాయం మానిపోయేది కాదు! అయినా, “ఇది నా జబ్బు, నేను భరించాలి” అని నాలో నేను చెప్పుకున్నాను. నా గుడారం నాశనమైంది; దాని త్రాళ్లన్నీ తెగిపోయాయి. నా పిల్లలు నా నుండి వెళ్లిపోయారు, వారిక లేరు; నా గుడారం వేయడానికి నాకు బసను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఎవరూ లేరు. కాపరులు తెలివిలేనివారు వారు యెహోవా దగ్గర విచారణ చేయరు; కాబట్టి వారు వర్ధిల్లరు వారి మంద అంతా చెదరిపోయింది. వినండి! నివేదిక వస్తుంది ఉత్తర దేశం నుండి ఒక గొప్ప కలకలం! అది యూదా పట్టణాలను నిర్జనంగా, నక్కల విహారంగా చేస్తుంది. యెహోవా, మనుష్యుల ప్రాణాలు వారివి కాదని నాకు తెలుసు; తమ అడుగులు నిర్దేశించుకోవడం వారికి చేతకాదు. యెహోవా, నన్ను క్రమశిక్షణలో పెట్టు, కానీ న్యాయమైన కొలతతో మాత్రమే మీ కోపంలో కాదు, లేకపోతే మీరు నన్ను పూర్తిగా నాశనం చేస్తారు. మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరు పెట్టుకొనని జనాంగాల మీద మీ కోపాన్ని కుమ్మరించండి. వారు యాకోబును మ్రింగివేశారు; వారు అతన్ని పూర్తిగా మ్రింగివేశారు అతని మాతృభూమిని నాశనం చేశారు.

యిర్మీయా 10:1-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మీ గురించి చెప్పే మాటలు వినండి. యెహోవా చెప్పేదేమంటే, అన్యజాతుల ప్రజల ఆచారాలు పాటించకండి. వారు ఆకాశంలో కనబడే సూచనలకు భయపడతారు. కానీ మీరు మాత్రం భయపడవద్దు. ఆ ప్రజల ఆచారాలు నిష్ప్రయోజనం. ఒకడు అడవిలో చెట్టు నరకుతాడు, పనివాడు దాన్ని గొడ్డలితో చెక్కుతాడు. అప్పుడు వారు దానికి వెండి బంగారు వస్తువులు అలంకరిస్తారు. అది కదలకుండా ఉండేలా దానికి సుత్తితో మేకులు కొట్టి బిగిస్తారు. అవి దోస తోటల్లో దిష్టి బొమ్మల్లాగా నిలబడి ఉంటాయి. పలకవు, నడవలేవు కాబట్టి వాటిని ఎవరైనా మోయాలి. అవి మీకు హాని చేయలేవు. కాబట్టి వాటికి భయపడకండి. వాటి వలన మంచి ఏమీ జరగదు. యెహోవా, నీలాంటివాడు ఎవరూ లేరు. నువ్వు గొప్పవాడివి. నీ బల ప్రభావాలను బట్టి నీ పేరు ఎంతో ఘనతకెక్కింది. లోక జాతులకు రాజువైన నీకు భయపడని వాడెవడు? ఆయా రాజ్యాల ప్రజల్లోని జ్ఞానులందరిలో నీవంటి వాడెవడూ లేడు. కాబట్టి మనుషులు నీలో భయభక్తులు నిలపాలి. వారంతా బుద్ధి హీనులు, అవివేకులు. చెక్కిన బొమ్మలను పూజించడం వలన వారికి కలిగే జ్ఞానం సున్నా. తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టిన వెండినీ ఉఫాజ్ నుండి బంగారాన్నీ తెస్తారు. అది కూలీల చేతి పని. ఆ విగ్రహాలకు నీలి, ఊదా రంగు వస్త్రాలు తొడిగారు. అవన్నీ వైపుణ్యం గల పనివారు చేసినవే. అయితే యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే సజీవుడైన దేవుడు, శాశ్వతమైన రాజు. ఆయన కోపాన్ని చూస్తే భూమి కంపిస్తుంది. ఆయన కోపాన్ని రాజ్యాలు తట్టుకోలేవు. మీరు వారితో ఇలా చెప్పాలి. “భూమ్యాకాశాలను సృష్టించని ఈ దేవుళ్ళు భూమి మీదా, ఆకాశం కిందా ఉండకుండా నశించిపోతారు. ఆయన తన బలంతో భూమిని సృష్టించాడు. తన జ్ఞానంతో ప్రపంచాన్ని స్థాపించాడు, తన తెలివితో ఆకాశాన్ని చక్కగా పరిచాడు. ఆయన స్వరం ఆకాశమండలంలో నీటి గర్జనలాగా వినిపిస్తుంది. భూదిగంతాల్లో నుండి ఆయన ఆవిరి మేఘాలు వచ్చేలా చేస్తాడు. వర్షంతో బాటు ఆయన మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగుల నుండి గాలిని పంపిస్తాడు. ప్రతి మనిషీ తెలివిలేని మూర్ఖుడు. విగ్రహాలు పోతపోసే ప్రతివాడూ తాను చేసిన విగ్రహాన్నిబట్టి అవమానం పొందుతాడు. అతడు పోత పోసిన విగ్రహాలు నకిలీవి. వాటికి ప్రాణం లేదు. అవి ఉపయోగం లేనివి. అవన్నీ ఎగతాళి పనులు. వాటి మీద తీర్పు జరిగినప్పుడు అవి నశించి పోతాయి. యాకోబు వంశానికి వారసత్వంగా ఉన్నవాడు అలాంటి వాడు కాడు. ఆయన సమస్తాన్నీ నిర్మించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన వారసత్వం. సేనల ప్రభువు అని ఆయనకు పేరు. ముట్టడిలో ఉన్న ప్రజలారా, దేశం విడిచి వెళ్ళడానికి నీ సామాను సర్దుకోండి.” యెహోవా చేప్పేదేమంటే “నేను ఈసారి ఈ దేశ నివాసులను బయటికి విసిరివేస్తాను. వారు పట్టబడేలా చేసి నిస్పృహకు గురి చేస్తాను.” అయ్యో, నా ఎముకలకు దెబ్బ తగిలి ఆ గాయం పుండుగా మారింది. అయితే “ఇది నాకు కలిగిన బాధ. నేను దీనిని సహించాల్సిందే” అనుకుంటాను. నా గుడారం చిందర వందర అయ్యింది. నా డేరా తాళ్ళు అన్నీ తెగిపోయాయి. వారు నా పిల్లలను తీసుకెళ్ళిపోయారు. అందుకే వారు లేరు. నా డేరా నిలబెట్టడానికి, వాటి తెరలు వేయడానికి నా దగ్గర ఎవరూ లేరు. కాపరులు మూర్ఖులై యెహోవాను అడగరు. కాబట్టి వారికి విజయం లేదు. వారి మందలన్నీ చెదరిపోతున్నాయి. అదిగో వినండి, వార్త రానే వచ్చింది, వారి రాక ధ్వని వినబడుతూ ఉంది. యూదా పట్టణాలను పాడు చేసి, వాటిని నక్కల నివాసంగా చేయడానికి ఉత్తరదేశం నుండి వస్తున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుతూ ఉంది. యెహోవా, మనుషులు తమ మార్గాలను నిర్ణయించుకోవడం వారికి చేతకాదనీ, మంచిగా ప్రవర్తించడం వారి వశంలో లేదనీ నాకు తెలుసు. యెహోవా, నన్ను నీ న్యాయవిధిని బట్టి క్రమశిక్షణలో పెట్టు. అలా కాక నీ కోపాన్ని బట్టి శిక్షించావంటే నేను నాశనమైపోతాను. నిన్నెరగని అన్యజనాల మీదా నీ పేరున ప్రార్థించని వంశాల మీదా నీ కోపాన్ని కుమ్మరించు. ఎందుకంటే వారు యాకోబు వంశాన్ని పూర్తిగా నిర్మూలం చేయడానికి మింగివేశారు. దాని నివాస స్థలాలను పాడు చేశారు.

యిర్మీయా 10:1-25 పవిత్ర బైబిల్ (TERV)

ఇశ్రాయేలు వంశీయులారా యెహోవా చెప్పే మాట వినుము! యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “అన్యదేశ ప్రజలవలె నీవు జీవించవద్దు! ఆకాశంలో వచ్చే ప్రత్యేక సంకేతాలకు నీవు భయపడవద్దు! అన్యదేశాలవారు ఆకాశంలో తాము చూచే కొన్ని సంకేతాలకు భయపడతారు. కాని మీరు మాత్రం అలాంటి వాటికి భయపడరాదు. ఇతర దేశ ప్రజల ఆచారాలు లెక్క చేయవలసినవికావు. వారి విగ్రహాలు అడవిలో దొరికే కర్రముక్కల కంటే వేరేమీ కాదు. వారి విగ్రహాలను ఒక పనివాడు తన ఉలితో చెక్కి మలుస్తాడు. వెండి బంగారాలతో వారి విగ్రహాలను అందంగా తీర్చిదిద్దుతారు. వాటిని పడిపోకుండా సుత్తులతో మేకులు కొట్టి నిలబెడతారు. బీర తోటలోని దిష్టి బొమ్మల్లా వారి విగ్రహాలుంటాయి. వారి విగ్రహాలు మాట్లాడవు. వారి విగ్రహాలు నడవలేవు. ఆ విగ్రహాలను మనుష్యులు మోయాలి! కావున ఆ విగ్రహాలకు భయపడకు. అవి నిన్ను ఏమీ చేయలేవు. పైగా అవి నీకసలు ఏ రకమైన సహాయమూ చేయలేవు!” యెహోవా, నీవంటి దైవం మరొకరు లేరు! నీవు గొప్పవాడవు! నీ నామము గొప్పది మరియు శక్తి గలది. ఓ దేవా, ప్రతివాడూ నిన్ను గౌరవించాలి. సర్వదేశాలకూ నీవు రాజువు. వారందరి గౌరవానికి నీవు అర్హుడవు. ప్రపంచ దేశాలలో చాలామంది జ్ఞానులున్నారు. కాని వారిలో ఏ ఒక్కడు నీకు సాటిరాడు. అన్యదేశవాసులు మందబుద్ధులు, మూర్ఖులు. వారి బోధనలన్నీ పనికిరాని చెక్క బొమ్మల పేరుతో వచ్చినవి. వారు తర్షీషు నగరంనుండి వెండిని, ఉపాజు నగరం నుండి బంగారాన్ని తెచ్చి విగ్రహాలను చేస్తారు. విగ్రహాలు వడ్రంగులచే, లోహపు పని వారిచే చేయబడతాయి. ఈ విగ్రహాలను నీలి రంగు, ఊదారంగు బట్టలతో అలంకరిస్తారు. “జ్ఞానులు” ఆ “దేవుళ్ల” ని చేస్తారు. కాని యెహోవా నిజమైన దేవుడు. ఆయన మాత్రమే నిజంగా జీవిస్తున్న దేవుడు! శాశ్వతంగా పాలించే రాజు ఆయనే. దేవునికి కోపం వచ్చినప్పుడు భూమి కంపిస్తుంది. ప్రపంచ రాజ్యాల ప్రజలు ఆయన కోపాన్ని భరించలేరు. “ఈ వర్తమానం ఆ ప్రజలకు తెలియజేయుము, ‘ఆ బూటకపు దేవతలు భూమిని, ఆకాశాన్ని సృష్టించలేదు. ఆ చిల్లర దేవుళ్లు నాశనం చేయబడతారు. వారు భూమి నుండి, ఆకాశము నుండి మాయమవుతారు.’” తన శక్తితో భూమిని సృష్టించినది నిత్యుడగు దేవుడే. దేవుడు తన జ్ఞాన సంపదచే ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు. తన అవగాహనతో దేవుడు ఆకాశాన్ని భూమిపైన వ్యాపింపజేశాడు. భయంకరమైన శబ్ధంగల పిడుగులను దేవుడే కలుగజేస్తాడు. ఆకాశంనుండి ధారాపాతంగా వర్షం పడేలా కూడా దేవుడే చేస్తాడు. భూమి నలుమూలల నుండీ ఆకాశంలోకి మేఘాలు లేచేలా ఆయన చేస్తాడు. ఆయన ఉరుములు మెరుపులతో వానపడేలా చేస్తాడు. ఆయన తన గిడ్డంగుల నుండి గాలి వీచేలా చేస్తాడు. ప్రజలు మందబుద్ధి గలవారయ్యారు! లోహపు పనివారు వారు చేసిన విగ్రహాల చేత మూర్ఖులయ్యారు. వారి బొమ్మలు అబద్ధాలకు ప్రతీకలు. అవి జడపదార్థములు ఆ విగ్రహాలు ఎందుకూ కొరగానివి. అవి హాస్యాస్పదమైనవి. తీర్పు తీర్చే కాలంలో ఆ విగ్రహాలు నాశనం చేయబడతాయి. కాని యాకోబు యొక్క దేవుడు ఆ విగ్రహాలవంటి వాడు కాదు. ఆయన సర్వసృష్టికి కారకుడు. ఇశ్రాయేలు తన ప్రజగా వర్థిల్లటానికి ఆయన దానిని ఎంపిక చేసినాడు. ఆయన పేరు “యెహోవా సర్వశక్తిమంతుడు.” మీకున్నదంతా సర్దుకొని వెళ్లటానికి సిద్దమవ్వండి. యూదా ప్రజలారా మీరు నగరంలో చిక్కుకున్నారు. శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు. యెహోవా ఇలా చెప్పాడు, “ఈ సారి యూదా ప్రజలను ఈ దేశంనుండి వెళ్ల గొడతాను. వారికి బాధను, శ్రమను కలుగజేస్తాను. వారికి ఒక గుణ పాఠం నేర్పటానికి నేనిదంతా చేస్తాను.” అయ్యో నేను (యిర్మీయా) బాగా గాయపడ్డాను నా గాయం మానరానిది. “ఇది నా రోగం, నేను దానిచే బాధ పడవలసినదే” అని నేను తలపోశాను. నా గుడారం పాడైపోయింది. దాని తాళ్లన్నీ తెగిపోయాయి. నా పిల్లలు నన్ను వదిలేశారు. వారు వెళ్లిపోయారు. నా గుడారం మరల నిర్మించటానికి సహాయం చేయుటకు ఒక్కడు కూడా మిగలలేదు. నాకు ఆశ్రయం కల్పించటానికి ఒక్కడూ మిగలలేదు. గొర్రెల కాపరులు (నాయకులు) మందమతులయ్యారు! వారు యెహోవాను కనుగొనే ప్రయత్నం చేయరు, వారు జ్ఞాన శూన్యులు. అందువల్లనే వారి మందలు (ప్రజలు) చెల్లాచెదురై తప్పిపోయాయి. ఒక పెద్ద శబ్దం వస్తోంది, వినుము! ఆ పెద్ద శబ్దం ఉత్తర దిశనుండి వస్తూవుంది. అది యూదా నగరాలను నాశనం చేస్తుంది. యూదా ఒక వట్టి ఎడారిలా మారుతుంది. అది గుంట నక్కలకు స్థావరమవుతుంది. యెహోవా, వారి స్వంత జీవితాలను వారి స్వాధీనంలో ఉంచుకోరని నాకు తెలుసు. ప్రజలు వారి భవిష్యత్తును గూర్చి పథకాలను వేసుకోలేరు. జీవించుటకు సరైన మార్గం వారికి తెలియదు. ఏది సన్మార్గమో ప్రజలకు నిజంగా తెలియదు. యెహోవా, మమ్మల్ని సరిదిద్దుము! నీవు మమ్ము నశింపజేయవచ్చు కాని మాపట్ల నిష్పక్షపాతంగా వుండుము! కోపంలో మమ్మల్ని శిక్షించవద్దు! నీకు కోపంవస్తే, అన్యదేశాలను శిక్షించుము. వారు నిన్నెరుగరు; గౌరవించరు. ఆ ప్రజలు నిన్ను పూజించరు. ఆ రాజ్యాలు యాకోబు వంశాన్ని నాశనం చేశాయి. వారు ఇశ్రాయేలును పూర్తిగా నాశనం చేశారు. వారు ఇశ్రాయేలు యొక్క స్వంత దేశాన్ని నాశనం చేశారు.

యిర్మీయా 10:1-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మునుగూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చు చున్నదేమనగా–అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసినపని. వెండి బంగారములచేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలక యుండునట్లు మేకులుపెట్టి సుత్తెలతో బిగగొట్టి దాని నిలుపుదురు. అవి తాటిచెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడువనేరవు గనుక వాటిని మోయవలసివచ్చెను; వాటికి భయపడకుడి అవి హానిచేయనేరవు మేలుచేయుట వాటివలనకాదు. యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహా త్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘనమైనదాయెను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోను నీవంటివాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు; బొమ్మల పూజవలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్షీషునుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాజునుండి బంగారమును తెత్తురు, అది పని వాని పనియేగదా; పోతపోయువాడు దాని చేసెను, నీల ధూమ్రవర్ణములుగల వస్త్రములు వాటికున్నవి, అవన్నియు నేర్పరులగు పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఈలాగు చెప్పవలెను–ఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమిమీద నుండకుండను ఆకాశముక్రింద ఉండకుండను నశించును. ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ నియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనా గారములలోనుండి గాలిని రావించును. తెలివిలేని ప్రతిమనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమునుబట్టి అవమానము నొందు చున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు, విమర్శకాలములో అవి నశించి పోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్యములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు. నివాసినీ, ముట్టడివేయబడుచున్న దేశము విడిచి వెళ్లుటకై నీ సామగ్రిని కూర్చుకొనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసరివేయుచున్నాను, వారు పట్టబడవలెనని వారిని ముట్టడి వేయించుచున్నాను. కటకటా, నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే –ఈ దెబ్బ నాకు తగినదే యనుకొని నేను దాని సహించుదును. నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్లన్నియు తెగిపోయెను, నా పిల్లలు నాయొద్దనుండి తొలగిపోయి యున్నారు, వారు లేకపోయిరి, ఇకమీదట నా గుడారమును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడును లేడు. కాపరులు పశుప్రాయులై యెహోవాయొద్ద విచారణచేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు, వారి మందలన్నియు చెదరిపోవుచున్నవి. ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది, యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును, నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తరదేశమునుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమునుబట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపుము. నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థిం పని వంశములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము; వారు యాకోబును మ్రింగివేయుచున్నారు, నిర్మూలము చేయవలెనని వారు అతని మ్రింగివేయుచున్నారు, వాని నివాసమును పాడుచేయుచున్నారు.