న్యాయాధిపతులు 7:9-18 - Compare All Versions
న్యాయాధిపతులు 7:9-18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ రాత్రి యెహోవా గిద్యోనుతో, “నీవు లేచి మిద్యాను దండుపై దాడి చేయి, నేను నీ చేతులకు వారిని అప్పగిస్తున్నాను. ఒకవేళ దాడి చేయడానికి నీవు భయపడితే, నీ పనివాడైన పూరాయుతో వెళ్లు, వారు ఏం చెప్పుకుంటున్నారో విను. తర్వాత దండుపై దాడి చేయడానికి నీకు ధైర్యం వస్తుంది” అన్నారు. కాబట్టి అతడు, అతని పనివాడైన పూరా ఆ పాళెంలో ఉన్న స్థావరాల దగ్గరకు వెళ్లారు మిద్యానీయులు, అమాలేకీయులు, ఇతర తూర్పు జనాంగాలు లెక్కకు మిడతలవలె లోయలో విడిది చేశారు. వారి ఒంటెలు సముద్రతీరంలో ఇసుక రేణువుల్లా లెక్కించలేనంత ఉన్నాయి. గిద్యోను వచ్చినప్పుడు ఒక వ్యక్తి తాను కనిన కలను తన స్నేహితునికి చెబుతూ, “నాకు ఒక కల వచ్చింది. గుండ్రని యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొర్లుకుంటు వెళ్లి బలంగా గుడారానికి తగలగానే గుడారం తలక్రిందులై కూలిపోయింది” అని అన్నాడు. అతని స్నేహితుడు జవాబిస్తూ, “అది ఇశ్రాయేలీయుడైనా యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని ఇంకొకటి కాదు. దేవుడు మిద్యానీయుల దండు అంతటిని అతని చేతులకు అప్పగించారు” అన్నాడు. గిద్యోను ఆ కలను దాని భావాన్ని విని తలవంచి నమస్కరించి ఇశ్రాయేలు దండు దగ్గరకు తిరిగివెళ్లి, “లేవండి, యెహోవా మిద్యానీయుల సైన్యాన్ని మీకు అప్పగించారు” అని చెప్పాడు. ఆ మూడువందల మందిని మూడు గుంపులుగా చేసి, వారందరి చేతుల్లో బూరను ఖాళీ కుండను, ప్రతి కుండలో దివిటీని పెట్టి ఇచ్చాడు. గిద్యోను వారితో, “నన్ను గమనించి వెంబడించండి, నేను దండును సమీపించినప్పుడు నేను చేసినట్లే మీరూ చేయండి. నేను, నాతో ఉన్నవారందరు మా బూరలు ఊదినప్పుడు, దండు చుట్టూ ఉన్న మీరు మీ బూరలు ఊదుతూ, ‘యెహోవా కోసం, గిద్యోను కోసం’ అంటూ కేకలు వేయండి.”
న్యాయాధిపతులు 7:9-18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ రాత్రి యెహోవా అతనితో ఇలా అన్నాడు “నువ్వు లేచి ఆ శిబిరం మీదికి వెళ్ళు. దాని మీద నీకు జయం ఇస్తాను. వెళ్ళడానికి నీకు భయమైతే నీ పనివాడు పూరాతో కలిసి ఆ శిబిరం దగ్గరికి దిగి వెళ్ళు. ఆ శిబిరంలో ఉన్నవాళ్ళు చెప్పుకుంటున్న దాన్ని వినిన తరువాత నువ్వు ఆ శిబిరంలోకి దిగి వెళ్ళడానికి నీకు ధైర్యం వస్తుంది” అని చెప్పినప్పుడు, అతడు, అతని పనివాడైన పూరా ఆ శిబిరంలో బయట కాపలా వాళ్ళున్న చోటికి వెళ్ళారు. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పుప్రాంతాల వాళ్ళు లెక్కకు మిడతల్లా ఆ మైదానంలో పోగై ఉన్నారు. వాళ్ల ఒంటెలు సముద్ర తీరంలో ఉన్న యిసుక రేణువుల్లా లెక్కకు మించి ఉన్నాయి. గిద్యోను దిగి వచ్చినప్పుడు, ఒకడు తాను కనిన కలను మరో సైనికుడికి చెప్తూ “నాకొక కలొచ్చింది. బార్లీ రొట్టె ఒకటి మిద్యానీయుల శిబిరంలోకి దొర్లి, ఒక గుడారానికి తాకి, దాన్ని పడగొట్టి తలకిందులు చేయగా ఆ గుడారం కూలిపోయింది” అన్నాడు. అందుకు అతని స్నేహితుడు “అది ఇశ్రాయేలీయుడు యోవాషు కొడుకు గిద్యోను ఖడ్గమే తప్ప మరొకటి కాదు. దేవుడు మిద్యానీయుల మీద, ఈ శిబిరం మీద, అతనికి జయం ఇస్తున్నాడు” అని జవాబిచ్చాడు. గిద్యోను ఆ కల, దాని భావం విన్నప్పుడు, అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల శిబిరంలోకి తిరిగి వెళ్లి “లెండి, యెహోవా మిద్యానీయుల సైన్యం మీద మీకు జయం ఇచ్చాడు” అని చెప్పి, ఆ మూడు వందలమందిని మూడు గుంపులుగా చేశాడు. ఒక్కొక్కరి చేతికి ఒక బూర, ఒక ఖాళీ కుండ, ఆ కుండలో ఒక దివిటీని ఇచ్చి, వాళ్లతో ఇలా అన్నాడు “నన్ను చూసి, నేను చేసినట్టు చేయండి. చూడండి! నేను వాళ్ల శిబిరం మీదకి వెళ్తున్నాను. నేను చేసినట్టే మీరూ చెయ్యాలి. నేను, నాతో ఉన్నవాళ్ళందరు బూరలను ఊదేటప్పుడు మీరు కూడా ఆ శిబిరం చుట్టూ బూరలు ఊదుతూ, ‘యెహోవాకు, గిద్యోనుకు, జయం’ అని కేకలు వెయ్యాలి” అని చెప్పాడు.
న్యాయాధిపతులు 7:9-18 TERV (పవిత్ర బైబిల్)
రాత్రివేళ గిద్యోనుతో యెహోవా మాట్లాడాడు. అతనితో యెహోవా ఇలా చెప్పాడు: “లెమ్ము, మిద్యాను సైన్యాన్ని నీవు ఓడించేటట్టు నేను చేస్తాను. వారి పాళెము వద్దకు దిగి వెళ్లు. ఒంటరిగా వెళ్లేందుకు నీవు భయపడితే, నీ సేవకుడు పూరాను నీ వెంట తీసుకుని వెళ్లు. మిద్యాను ప్రజల పాళెము లోపలికి వెళ్లు. ఆ మనుష్యులు చెప్పుకుంటున్న విషయాలు విను. ఆ తర్వాత వారి మీద దాడి చేసేందుకు నీకు భయం ఉండదు.” కనుక గిద్యోను, అతని సేవకుడు పూరా శత్రువుల పాళెము చివరి భాగానికి వెళ్లారు. మిద్యాను ప్రజలు, అమాలేకు ప్రజలు, తూర్పు ప్రాంత ప్రజలందరూ ఆ లోయలో విడిదిచేశారు. వారు చాలామంది మనుష్యులు ఉన్నందుచేత వారు ఒక మిడతల దండులా కనిపించారు. సముద్రతీరంలో ఇసుక రేణువులవలె ఆ ప్రజలకు ఒంటెలు ఉన్నట్టు కనిపించింది. గిద్యోను శత్రువుల విడిది దగ్గరకు వచ్చి, అక్కడ ఒక మనిషి మాట్లాడటం విన్నాడు. అతడు తాను చూచిన ఒక కలను గూర్చి తన స్నేహితునితో చెబుతున్నాడు, “ఒక గుండ్రని రొట్టె దొర్లుకుంటూ మిద్యాను ప్రజల విడిదిలోకి వచ్చింది. ఆ రొట్టె గుడారాన్ని బలంగా గుద్దుకోవటం చేత ఆ గుడారం తలక్రిందులై నేల మట్టంగా పడిపోయింది” అని ఆ మనిషి చెబుతూ ఉన్నాడు. ఆ మనిషి స్నేహితునికి అతని కల భావం తెలుసు. “నీ కలకు ఒకే ఒక అర్థం ఉంటుంది. ఇశ్రాయేలు వాడగు ఆ మనిషిని గూర్చినదే నీ కల. అది యోవాషు కుమారుడు గిద్యోను గూర్చినది. మిద్యాను సైన్యం అంతటినీ ఓడించేందుకు గిద్యోనుకు దేవుడు సహాయం చేస్తాడని దాని భావం” అని ఆ మనిషి స్నేహితుడు చెప్పాడు. ఆ మనుష్యులు ఆ కలను గూర్చి, దాని భావం గూర్చి చెప్పుకోవటం విన్న తర్వాత గిద్యోను దేవునికి సాష్టాంగ పడ్డాడు. తర్వాత గిద్యోను ఇశ్రాయేలీయుల విడిదికి తిరిగి వెళ్లిపోయాడు. గిద్యోను ప్రజలందరినీ పిలిచి, “లేవండి! మిద్యాను ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు” అని చెప్పాడు. అప్పుడు గిద్యోను మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసాడు. ఒక్కో మనిషికీ ఒక్కో బూరను, ఒక్కో ఖాళీ కుండనూ గిద్యోను ఇచ్చాడు. ప్రతి ఖాళీ కుండలోను మండుతున్న ఒక దివిటీ ఉంది. అప్పుడు గిద్యోను వారితో ఇలా చెప్పాడు: “నన్ను గమనించి నేను చేసినట్టు చేయండి. శత్రువు విడిది చివరి భాగం వరకు నన్ను అనుసరించండి. నా వెంబడి రండి. ఆ విడిది చివరి భాగానికి నేను వెళ్లగానే, సరిగ్గా నేను చేసినట్టే చేయండి. మీరు శత్రువు విడిదిని చుట్టుముట్టండి. నేనూ, నాతో ఉన్న వాళ్లందరూ బూరలు ఊదుతాము. మేము బూరలు ఊదినప్పుడు మీరు కూడా మీ బూరలు ఊదండి. అప్పుడు ‘యెహోవాకు, గిద్యోనుకు విజయం అని కేకలు వేయండి!’”
న్యాయాధిపతులు 7:9-18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను–నీవు లేచి దండుమీదికి పొమ్ము, నీ చేతికి దాని నప్పగించెదను. పోవుటకు నీకు భయమైనయెడల నీ పనివాడైన పూరాతోకూడ దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీచేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పని వాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. మిద్యానీయులును అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతలవలె ఆ మైదానములో పరుండి యుండిరి. వారి ఒంటెలు సముద్రతీరమందున్న యిసుక రేణువులవలె లెక్కలేనివై యుండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా–నేనొక కలగంటిని, అదేమనగా యవలరొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి యొక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను. అందుకు వాని చెలికాడు–అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమేగాని మరేమికాదు; దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతనిచేతికి అప్పగింప బోవుచున్నాడని ఉత్తరమిచ్చెను. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్లి–లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ మూడువందలమందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆకుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను–నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి; ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను, నేను చేయునట్లు మీరు చేయవలెను. నేనును నాతో నున్నవారందరును బూరలను ఊదునప్పుడు మీరును దండు పాళెమంతటిచుట్టు బూరలను ఊదుచు–యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయ వలెనని చెప్పెను.