న్యాయాధిపతులు 7:1-8
న్యాయాధిపతులు 7:1-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు యెరుబ్-బయలు, అనగా గిద్యోను, అతని మనుష్యులందరు పెందలకడనే లేచి హరోదు బుగ్గ దగ్గర గుడారాలు వేసుకున్నారు. మిద్యానీయుల శిబిరం లోయలో మోరె కొండ దగ్గర వారికి ఉత్తరాన ఉంది. యెహోవా గిద్యోనుతో, “నీతో ఎక్కువ మంది మనుష్యులు ఉన్నారు కాబట్టి నేను మిద్యానును వారి చేతులకు అప్పగించను. ఒకవేళ అప్పగిస్తే వారు, ‘మా బాహుబలమే మమ్మల్ని రక్షించింది’ అని ఇశ్రాయేలీయులు అతిశయిస్తారు. కాబట్టి నీవు, ‘ఎవరు భయంతో వణకుతున్నారో, వారు వెంటనే గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవచ్చు అని ప్రకటించు’ ” అని చెప్పారు. అప్పుడు ఇరవైరెండువేలమంది తిరిగి వెళ్లిపోగా పదివేలమంది మిగిలారు. మరల యెహోవా గిద్యోనుతో, “మనుష్యులు ఇంకా ఎక్కువే ఉన్నారు. వారిని నీళ్ల దగ్గరకు తీసుకెళ్లు అక్కడ నీకోసం వారిని పరీక్షిస్తాను. ‘ఇతడు నీతో వెళ్తాడు’ అని నేను చెప్తే అతడు వెళ్లాలి; ఒకవేళ ‘ఇతడు నీతో వెళ్లడు’ అని నేను చెప్తే అతడు వెళ్లకూడదు” అని ఆజ్ఞాపించారు. కాబట్టి గిద్యోను మనుష్యులను నీళ్ల దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అక్కడ యెహోవా అతనితో, “కుక్క గతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికే వారిని త్రాగడానికి మోకాళ్లమీద ఉన్నవారిని వేరు చేయి” అన్నారు. వారిలో చేతితో నోటికందించుకొని కుక్కల్లా గతికిన వారు మూడువందలమంది. మిగితా అందరు మోకాళ్లమీద వంగి నీళ్లు త్రాగారు. అప్పుడు యెహోవా గిద్యోనుతో, “గతికిన మూడువందల మనుష్యులతో నేను మిమ్మల్ని రక్షించి, మిద్యానీయులను మీ చేతులకు అప్పగిస్తాను. మిగిలినవారం తిరిగి వెళ్లిపోవాలి” అని ఆజ్ఞాపించారు. కాబట్టి గిద్యోను మిగితా ఇశ్రాయేలీయులను ఇంటికి పంపించాడు, అయితే మూడువందలమంది మనుష్యులు ఆహారాన్ని, బూరలను పట్టుకున్నారు. మిద్యాను దండు అతనికి క్రింద లోయలో దిగారు.
న్యాయాధిపతులు 7:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెరుబ్బయలు, (అంటే గిద్యోను) అతనితో ఉన్నవారంతా తెల్లవారే లేచి హరోదు బావి దగ్గరికి వచ్చినప్పుడు లోయలో ఉన్న మోరె కొండకు ఉత్తరంగా మిద్యానీయుల శిబిరం కనబడింది. యెహోవా గిద్యోనుతో “నీతో ఉన్నవారు ఎక్కువ మంది. నేను వాళ్ల చేతికి మిద్యానీయులను అప్పగించడం తగదు. ఇశ్రాయేలీయులు, ‘నా కండబలమే నాకు రక్షణ కలుగజేసింది’ అనుకుని తమను తామే గొప్ప చేసుకోవచ్చు. కాబట్టి నువ్వు, ‘భయపడి, వణుకుతున్న వాడెవడైనా ఉంటే తొందరగా గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లిపోవాలి’ అని ప్రజలందరూ వినేలా ప్రకటించు” అని చెప్పాడు. అప్పుడు ప్రజల్లోనుంచి ఇరవై రెండు వేలమంది తిరిగి వెళ్లిపోయారు. ఇంకా అక్కడ పదివేలమంది ఉన్నారు. యెహోవా “ఈ ప్రజలు ఇంకా ఎక్కువమందే. నీళ్ల దగ్గరికి వాళ్లను దిగేలా చెయ్యి. అక్కడ నీ కోసం వాళ్ల సంఖ్య తగ్గిస్తాను. ‘ఇతను నీతో కలిసి వెళ్ళాలి’ అని ఎవరి గురించి చెబుతానో అతడు నీతో కలిసి వెళ్ళాలి. ‘ఇతడు నీతో కలిసి వెళ్లకూడదు’ అని ఎవరి గురించి చెప్తానో అతడు వెళ్ళకూడదు” అని గిద్యోనుతో చెప్పాడు. అతడు నీళ్ల దగ్గరికి ఆ ప్రజలను దిగేలా చేసినప్పుడు యెహోవా “కుక్క తాగినట్టు తన నాలుకతో నీళ్ళు తాగిన వాణ్ణి, నీళ్ళు తాగడానికి మోకాళ్ళు వంచిన వాణ్ణి, వేరువేరుగా ఉంచు” అని గిద్యోనుతో చెప్పాడు. చేత్తో నోటికందించుకుని నీళ్ళు తాగినవాళ్ళు మూడు వందల మంది. మిగిలిన వాళ్ళందరు నీళ్లు తాగడానికి మోకాళ్ళు వంచినవాళ్ళే. అప్పుడు యెహోవా “చేత్తో నోటికందించుకుని నీళ్ళు తాగిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను. మిద్యానీయుల మీద జయం ఇస్తాను. తక్కిన ప్రజలందరూ తమ తమ ప్రాంతాలకు వెళ్ళొచ్చు” అని గిద్యోనుతో చెప్పాడు. ఎంపిక చేసిన ప్రజలు వెళ్లిపోయినవారి ఆహారం, బూరలు తీసుకున్నారు. యెహోషువా ప్రజలందరినీ వాళ్ళ గుడారాలకు పంపివేశాడు. కాని ఆ మూడువందల మందిని అక్కడే ఉంచుకున్నాడు. మిద్యానీయుల శిబిరం అతనికి దిగువ భాగంలో లోయలో ఉంది.
న్యాయాధిపతులు 7:1-8 పవిత్ర బైబిల్ (TERV)
మరునాడు ఉదయాన్నే యెరుబ్బయలు, (గిద్యోను) మరియు అతని మనుష్యులందరూ హరోదు బావి దగ్గర దిగారు. మోరె కొండ దిగువన ఉన్న లోయలో మిద్యాను ప్రజలు బసచేసారు. ఇది గిద్యోనుకు, అతని మనుష్యులకు ఉత్తరాన ఉంది. అప్పుడు యెహోవా, “మిద్యాను ప్రజలను ఓడించేందుకు నేను నీ మనుష్యులకు సహాయం చేయబోతున్నాను. కాని ఆ పని కోసం నీ దగ్గర ఉన్న మనుష్యులు చాలా ఎక్కువ మంది. ఇశ్రాయేలు ప్రజలు వారిని వారే రక్షించుకొన్నారని అతిశయించి నన్ను మరచిపోవటం నాకు ఇష్టం లేదు. కనుక ఇప్పుడు నీ మనుష్యులకు ఒక ప్రకటన చెయ్యి. ‘భయపడేవారు ఎవరైనా సరే గిలాదు కొండ విడిచి పోవచ్చును. అలాంటి వారు తిరిగి ఇంటికి వెళ్లి పోవచ్చును’ అని వారితో చెప్పుము” అని గిద్యోనుతో అన్నాడు. ఆ సమయంలో ఇరవైరెండు వేల మంది గిద్యోనును విడిచిపెట్టి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. కానీ ఇంకా పదివేల మంది మనుష్యులు మిగిలిపోయారు. “ఇంకా చాలా మంది మనుష్యులున్నారు. ఆ మనుష్యులను నీళ్ల దగ్గరకు క్రిందికి తీసుకుని వెళ్లు, అక్కడ నేను నీ కోసం వారిని పరీక్షిస్తాను. ‘ఇతడు నీతో వెళ్తాడు’ అని నేను చెబితే అతడు వెళతాడు. కాని నేను, ‘అతడు నీతో వెళ్లడు’ అని అంటే ఆ మనుష్యుడు వెళ్లకూడదు” అని గిద్యోనుతో యెహోవా చెప్పాడు. కనుక గిద్యోను ఆ మనుష్యులను నీళ్ల దగ్గరకు క్రిందికి నడిపించాడు. ఆ నీళ్ల దగ్గర గిద్యోనుతో యెహోవా ఇలా చెప్పాడు, “ఈ మనుష్యులను ఈ విధంగా వేరు చెయ్యి. కుక్క గతికినట్లు గతుకుతూ నీళ్లు తాగే వారంతా ఒక గుంపు. మరియు మోకాళ్ల మీద వంగి నీళ్లు తాగే మనుష్యులంతా మరో గుంపుగా చేయబడాలి.” నోటి దగ్గరకు నీళ్లు తెచ్చేందుకు తమ చేతులనుపయోగించి కుక్క గతికినట్లు గతికిన వారు మూడు వందల మంది. మిగిలిన వాళ్లంతా మోకాళ్ల మీద వంగి నీళ్లు త్రాగారు. యెహోవా గిద్యోనుతో, “కుక్కలా గతికి నీళ్లు తాగిన మూడువందల మందిని నేను వాడుకొంటాను. మిమ్మల్ని రక్షించేందుకు ఆ మనుష్యులను నేను వాడుకొంటాను. మరియు మిద్యాను ప్రజలను ఓడించేట్లుగా నేను చేస్తాను. మిగిలిన మనుష్యులను వారి ఇళ్లకు వెళ్లిపోనియ్యి” అని చెప్పాడు. కనుక మిగిలిన ఇశ్రాయేలు మనుష్యులను గిద్యోను వారి ఇళ్లకు పంపి వేసాడు. గిద్యోను ఆ మూడు వందల మంది మనుష్యులను తన వెంట ఉంచుకొన్నాడు. ఇళ్లకు వెళ్లిపోయిన వారి బూరలను, ఆహార పదార్థాలను ఆ మూడు వందల మంది ఉంచుకొన్నారు. గిద్యోను పాళెమునకు క్రింద లోయలో మిద్యానీయుల పాళెము ఉండెను.
న్యాయాధిపతులు 7:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు యెరుబ్బయలు, అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరును, వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళెము వారికి కనబడెను. యెహోవా –నీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారిచేతికి మిద్యానీయులను అప్పగింపతగదు; ఇశ్రాయేలీయులు– నా బాహుబలము నాకు రక్షణ కలుగచేసికొనెననుకొని నామీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు–ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచితిరిగి వెళ్లవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలోనుండి ఇరువది రెండువేలమంది తిరిగి వెళ్లిపోయిరి. పదివేలమంది నిలిచియుండగా యెహోవా–ఈ జను లింక ఎక్కువమంది, నీళ్లయొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీకొరకు వారిని శోధించెదను. ఇతడు నీతోకూడ పోవలెనని నేను ఎవనిగూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను; ఇతడు నీతో పోకూడదని యెవనిగూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్లయొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా–కుక్కగతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకుమోకాళ్లూని క్రుంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికందించుకొని గతికినవారిలెక్క మూడు వందలమంది; మిగిలిన జనులందరు నీళ్లు త్రాగుటకు మోకాళ్లూని క్రుంగిరి. అప్పుడు యెహోవా–గతికిన మూడు వందల మనుష్యులద్వారా మిమ్మును రక్షించెదను; మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను; జనులందరు తమతమ చోట్లకు వెళ్లవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరిని తమ గుడారములకు వెళ్లనంపెనుగాని ఆ మూడువందలమందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను.