న్యాయాధిపతులు 4:1-16

న్యాయాధిపతులు 4:1-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఏహూదు మరణించిన తర్వాత ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు. కాబట్టి యెహోవా వారిని హాసోరులో పరిపాలించే కనాను రాజైన యాబీను చేతికి అప్పగించారు. అతని సేనాధిపతి హరోషెత్-హగ్గోయిములో నివసించిన సీసెరా. అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలున్నాయి, అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను క్రూరంగా హింసించాడు, కాబట్టి వారు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నారు. ఆ కాలంలో లప్పీదోతు భార్యయైన దెబోరా అనే ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది. ఆమె ఎఫ్రాయిం కొండ సీమలో రామాకు బేతేలుకు మధ్యనున్న దెబోరా ఖర్జూర చెట్టు క్రింద తీర్పులు తీర్చడానికి కూర్చుండేది, ఇశ్రాయేలీయులు వారి వివాదాలు పరిష్కరించుకోడానికి ఆమె దగ్గరకు వచ్చేవారు. ఆమె నఫ్తాలిలోని కెదెషు నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలిపించి, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు ఇలా ఆజ్ఞాపిస్తున్నారు: ‘నీవు వెళ్లి నఫ్తాలి జెబూలూను గోత్రాల నుండి పదివేలమంది మనుష్యులను తాబోరు పర్వతం దగ్గరకు పిలిపించు. యాబీను సేనాధిపతియైన సీసెరాను, అతని రథాలను, అతని సైన్యాన్ని కీషోను నది దగ్గరకు నడిపించి నీ చేతికి అతన్ని అప్పగిస్తాను.’ ” బారాకు ఆమెతో, “నీవు నాతో వస్తే నేను వెళ్తాను నీవు రాకపోతే వెళ్లను” అన్నాడు. అప్పుడు దెబోరా, “నీతో నేను తప్పకుండా వస్తాను, అయితే నీ ప్రయాణం వలన నీకు ఘనత రాదు, ఎందుకంటే యెహోవా ఒక స్త్రీకి సీసెరాను అప్పగిస్తారు” అని చెప్పి ఆమె బారాకుతో కలిసి కెదెషుకు వెళ్లింది. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషుకు పిలిపించినప్పుడు పదివేలమంది పురుషులు అతనితో వెళ్లారు. దెబోరా కూడా అతనితో వెళ్లింది. కెనీయుడైన హెబెరు మోషే మామయైన హోబాబు సంతతివారైన వారైన కెనీయులను విడిచిపెట్టి కెదెషు దగ్గర ఉన్న జయనన్నీములోని మస్తకిచెట్టు దగ్గర తన గుడారం వేసుకున్నాడు. అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు పర్వతం మీదికి వెళ్లాడని సీసెరాకు చెప్పినప్పుడు, సీసెరా హరోషెత్-హగ్గోయిము నుండి కీషోను వాగువరకు తన సైన్యమంతటిని, తన తొమ్మిది వందల ఇనుప రథాలను పిలిపించుకున్నాడు. అప్పుడు దెబోరా బారాకుతో, “వెళ్లు! ఈ రోజు యెహోవా నీ చేతికి సీసెరాను అప్పగించారు. యెహోవా నీకు ముందుగా వెళ్లలేదా?” అని అడిగినప్పుడు బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు పర్వతం నుండి దిగి వెళ్లాడు. బారాకు దాడి చేసినప్పుడు యెహోవా సీసెరాను, అతని రథాలన్నిటిని, అతని సైన్యాన్ని ఖడ్గంతో హతం చేయగా సీసెరా తన రథాన్ని దిగి కాలినడకన పారిపోయాడు. బారాకు ఆ రథాలను, సైన్యాన్ని హరోషెత్-హగ్గోయిము వరకు వెంటాడగా సీసెరా సైన్యమంతా ఖడ్గంతో చంపబడ్డారు; ఏ ఒక్కరు మిగల్లేదు.

న్యాయాధిపతులు 4:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఏహూదు చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు మళ్ళీ యెహోవా దృష్టికి దోషులయ్యారు గనక హాసోరులో ఏలే కనాను రాజైన యాబీను చేతికి ఆయన వాళ్ళను అప్పగించాడు. అతని సేనాధిపతి పేరు సీసెరా. అతడు యూదేతరుల ప్రాంతం హరోషెతులో ఉంటున్నాడు. అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలు ఉన్నాయి. అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను కఠినంగా హింసలపాలు చేసినప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టారు. ఆ రోజుల్లో లప్పీదోతు భార్య దెబోరా అనే ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది. ఆమె ఎఫ్రాయిమీయుల ఎడారిలో రమాకు బేతేలుకు మధ్య ఉన్న దెబోరా ఖర్జూర చెట్టు కింద తీర్పులు తీర్చడానికి కూర్చుని ఉండేది. తమ వివాదాలు పరిష్కరించుకోడానికి ఇశ్రాయేలీయులు ఆమె దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. ఆమె నఫ్తాలిలోని కెదెషులో నుంచి అబీనోయము కొడుకు బారాకును పిలిపించి అతనితో ఇలా అంది “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, ‘నువ్వు వెళ్లి నఫ్తాలీయుల్లో, జెబూలూనీయుల్లో పదివేల మందిని తాబోరు కొండ దగ్గరికి రప్పించు. యాబీను సేనాధిపతి సీసెరాను, అతని రథాలను, అతని సైన్యాన్ని, కీషోను నది దగ్గర చేర్చి, అక్కడ అతని మీద నీకు జయం అనుగ్రహిస్తాను.’” అప్పుడు బారాకు “నువ్వు నాతోబాటు వస్తేనే వెళ్తాను గాని నువ్వు నాతో రాకపోతే నేను వెళ్లను” అని ఆమెతో చెప్పాడు. అప్పుడు ఆమె “నీతో నేను తప్పకుండా వస్తాను. అయితే, నువ్వు చేసే ఈ ప్రయాణంవల్ల నీకు ఘనత దొరకదు. ఒక స్త్రీ చాకచక్యం వలన యెహోవా సీసెరాను అప్పగిస్తాడు” అని చెప్పి, లేచి బారాకుతోబాటు కెదెషుకు వెళ్ళింది. బారాకు జెబూలూనీయులను, నఫ్తాలీయులను కెదెషుకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుషులు అతనితో వెళ్ళారు. దెబోరా కూడా అతనితో వెళ్ళింది. ఈలోపు కయీనీయుడైన హెబెరు మోషే మామ హోబాబు సంతానం వారైన కయీనీయుల నుంచి వేరుపడి కెదెషు దగ్గర ఉన్న జయనన్నీములో ఉన్న మస్తకి చెట్టు దగ్గర తన గుడారం వేసుకుని ఉన్నాడు. అబీనోయము కొడుకైన బారాకు తాబోరు కొండపైకి వెళ్ళాడని సీసెరాకు తెలిసినప్పుడు సీసెరా తన రథాలన్నిటినీ, తన తొమ్మిదివందల ఇనుప రథాలను యూదేతరుల ప్రాంతమైన హరోషెతు నుంచి కీషోను నది వరకూ తన పక్షంగా ఉన్న ప్రజలందరినీ పిలిపించినప్పుడు దెబోరా “వెళ్ళు. యెహోవా సీసెరా మీద నీకు జయం ఇచ్చిన రోజు ఇదే. యెహోవా నిన్ను నడిపిస్తున్నాడు కదా” అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ పదివేలమంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీదినుంచి దిగి వచ్చాడు. బారాకు వాళ్ళను చంపడానికి వీలుగా యెహోవా సీసెరాను, అతని రథాలన్నిటినీ, అతని సైనికులను కలవరపరచినప్పుడు, సీసెరా తన రథం దిగి కాలినడకన పారిపోయాడు. బారాకు, ఆ రథాలను, సైన్యాన్ని యూదేతరుల ప్రాంతం హరోషెతు వరకూ తరిమినప్పుడు సీసెరా సైన్యమంతా కత్తివాత చేత కూలిపోయింది. ఒక్కడు కూడా బ్రతకలేదు.

న్యాయాధిపతులు 4:1-16 పవిత్ర బైబిల్ (TERV)

చెడ్డవి అని యెహోవా చెప్పిన వాటినే ప్రజలు ఏహూదు చనిపోయిన తర్వాత మరల చేశారు. కనుక కనాను రాజు యాబీను ఇశ్రాయేలీయులను ఓడించేలాగ యెహోవా చేశాడు. యాబీను హాసోరు పట్టణంలో పరిపాలించాడు. సీసెరా అను పేరుగలవాడు యాబీను రాజు సైన్యానికి సేనాధిపతి. హరోషెతు హాగ్గోయిం అనే పట్టణంలో సీసెరా నివసించాడు. సీసెరాకు తొమ్మిదివందల ఇనుప రథాలున్నాయి. అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల ఎడల చాలా క్రూరంగా ఉన్నాడు. కనుక సహాయం కోసం వారు యెహోవాకు మొరపెట్టారు. దెబోరా అనే పేరుగల ఒక ప్రవక్తి ఉంది. ఆమె లప్పీదోతు అను పేరుగల వాని భార్య. ఆ కాలంలో ఆమె ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి. ఒక రోజు దెబోరా ఖర్జూర చెట్టు క్రింద కూర్చుని ఉంది. సీసెరా విషయం ఏమి చెయ్యాలి అని ఆమెను అడిగేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఆమె దగ్గరకు వచ్చారు. ఎఫ్రాయిము కొండ దేశంలో రామా, బేతేలుకు మధ్య దెబోరా యొక్క ఖర్జూర చెట్టు ఉంది. బారాకు అను పేరుగల మనిషికి దెబోరా ఒక వర్తమానం పంపింది. ఆమెను కలుసుకునేందుకు రమ్మని ఆమె అతనిని అడిగింది. బారాకు అబీనోయము అనే పేరుగల వాని కుమారుడు. బారాకు నఫ్తాలి ప్రాంతంలోని కెదెషు పట్టణంలో నివసించేవాడు. దెబోరా బారాకుతో ఇలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడు యెహోవా నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ‘వెళ్లి నఫ్తాలి జెబూలూను వంశాల నుండి పదివేల మంది పురుషులను సమావేశపరచి, ఆ మనుష్యులను తాబోరు కొండకు నడిపించు. యాబీను రాజు సైన్యాధిపతి సీసెరాను నేను నీ దగ్గరకు రప్పిస్తాను. సీసెరాను, అతని రథాలను, మరియు అతని సైన్యాన్ని కీషోను నది దగ్గరకు నేను రప్పిస్తాను. అక్కడ నీవు సీసెరాను ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను.’” అప్పుడు బారాకు, “నీవు నాతో కూడా వస్తే నేను వెళ్లి ఈ పని చేస్తాను. కాని నీవు నాతో రాకపోతే, నేనూ వెళ్లను” అని దెబోరాతో చెప్పాడు. “ఓ, నేను తప్పకుండా నీతో వస్తాను” అని దెబోరా జవాబిచ్చింది. “కానీ నీ వైఖరి మూలంగా, సీసెరా ఓడించబడినప్పుడు నీవు ఘనత పొందవు. ఒక స్త్రీ సీసెరాను ఓడించేటట్టు యెహోవా చేస్తాడు” అని చెప్పింది. కనుక బారాకుతో కూడ కెదెషు పట్టణానికి దెబోరా వెళ్లింది. కెదెషు పట్టణం దగ్గర జెబూలూను, నఫ్తాలి వంశాలను బారాకు సమావేశ పరిచాడు. ఆ వంశాల నుండి అతనిని వెంబడించేందుకు పదివేల మంది పురుషులను సమావేశపర్చాడు. దెబోరా కూడా బారాకుతో వెళ్లింది. కెనితీ ప్రజలకు చెందిన, హెబెరు అను పేరుగల ఒకడు ఉన్నాడు. (కెనితీ ప్రజలు హోబాబు వంశస్థులు. హోబాబు మోషే భార్యకు సోదరుడు.) జయనన్నీము అనుచోట మస్తకి చెట్టు దగ్గర హెబెరు తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. జయనన్నీము కెదెషు పట్టణానికి దగ్గరగా ఉంది. అబీనోయము కుమారుడు బారాకు తాబోరు కొండ దగ్గర ఉన్నాడని సీసెరాతో ఎవరో చెప్పారు. కనుక సీసెరా తన తొమ్మిదివందల ఇనుప రథాలను సిద్ధం చేసాడు. సీసెరా తన మనుష్యులందరినీ ఒక్క చోట చేర్చాడు. వారు హారోషెతు హగ్గోయిము పట్టణం నుండి కీషోను నది దగ్గరకు సాగిపోయారు. అప్పుడు దెబోరా, “ఈ వేళ నీవు సీసెరాను ఓడించేందుకు యెహోవా సహాయం చేస్తాడు. నీ కోసం యెహోవా ఇప్పటికే మార్గాన్ని చక్కగా తయారు చేశాడని నీకు గట్టిగా తెలుసు” అని బారాకుతో చెప్పింది. కనుక పదివేల మంది మనుష్యులను తాబోరు కొండ నుండి బారాకు నడిపించాడు. బారాకు, అతని మనుష్యులు సీసెరా మీద దాడిచేసారు. యుద్ధ సమయంలో సీసెరాను, అతని సైన్యాన్ని, రథాలను యెహోవా కలవరపర్చాడు. ఏమి చేయాలో వారికి తెలియలేదు. అందుచేత బారాకు, అతని మనుష్యులు సీసెరా సైన్యాన్ని ఓడించారు. కానీ, సీసెరా తన రథాన్ని విడిచిపెట్టి కాలినడకన పారిపోయాడు. బారాకు సీసెరా సైన్యంతో పోరాటం కొనసాంగించాడు. హారోషెతు, హగ్గోయిము వరకూ కూడా సీసెరా రథాలను, సైన్యాన్ని బారాకు, అతని మనుష్యులు తరిమి వేసారు. బారాకు, అతని మనుష్యులు వారి ఖడ్గాలను ఉపయోగించి సీసెరా మనుష్యులను చంపివేసారు. సీసెరా మనుష్యులలో ఒక్కడు కూడా ప్రాణంతో విడువబడలేదు.

న్యాయాధిపతులు 4:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఏహూదు మరణమైనతరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనానురాజైన యాబీనుచేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా. అతనికి తొమ్మిదివందల ఇనుపరథము లుండెను. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధపెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి. ఆ కాలమున లప్పీదోతునకు భార్యయైన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమెయొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కెదెషులోనుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను–నీవువెళ్లి నఫ్తాలీయులలోను జెబూలూనీయులలోను పదివేలమంది మనుష్యులను తాబోరు కొండయొద్దకు రప్పించుము; నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతియైన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటియొద్దకు కూర్చి నీ చేతికి అత నిని అప్పగించెదనని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చియుండలేదా? అని దెబోరా చెప్పగా బారాకు –నీవు నాతోకూడ వచ్చినయెడల నేను వెళ్లెదనుగాని నీవు నాతోకూడ రాని యెడల నేను వెళ్లనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె–నీతో నేను అగత్యముగా వచ్చెదను; అయితే నీవుచేయు ప్రయాణమువలన నీకు ఘనతకలుగదు, యెహోవా ఒక స్త్రీచేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతోకూడ కెదెషునకు వెళ్లెను. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషునకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుష్యులు అతనివెంట వెళ్లిరి; దెబోరాయు అతనితోకూడ పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామయైన హోబాబు సంతతివారైన కయీనీయులనుండి వేరు పడి కెదెషునొద్దనున్న జయనన్నీములోని మస్తకివృక్షము నొద్ద తన గుడారమును వేసికొనియుండెను. అబీనో యము కుమారుడైన బారాకు తాబోరుకొండమీదికిపోయెనని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటిని తన తొమ్మిదివందల ఇనుప రథములను అన్యుల హరోషెతునుండి కీషోను వాగువరకు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా దెబోరా–లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరునుగదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు కొండమీదినుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతువరకు తరుమగా సీసెరాయొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలియుండలేదు