న్యాయాధిపతులు 3:1-4
న్యాయాధిపతులు 3:1-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కనానులో యుద్ధాలను అనుభవించని ఆ ఇశ్రాయేలీయులందరిని పరీక్షించడానికి యెహోవా విడిచిపెట్టిన దేశాలు ఇవి ఆయన యుద్ధం చేసే పూర్వ అనుభవంలేని ఇశ్రాయేలీయుల సంతానానికి యుద్ధం నేర్పించడానికి మాత్రమే ఇలా చేశారు: ఫిలిష్తీయుల అయిదుగురు పరిపాలకులు, కనానీయులందరూ, సీదోనీయులు, బయల్-హెర్మోను నుండి లెబో హమాతు వరకు ఉన్న లెబానోను పర్వతాల్లో ఉండే హివ్వీయులు. యెహోవా మోషే ద్వారా వారి పూర్వికులకు ఇచ్చిన ఆజ్ఞలు వారు అనుసరిస్తారో లేదో చూడడానికి ఇశ్రాయేలీయులను పరీక్షించడానికి వారు అక్కడ ఉంచబడ్డారు.
న్యాయాధిపతులు 3:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలీయులకు కనానీయులకు జరిగిన యుద్ధాల గురించి తెలియని ఇశ్రాయేల్వాళ్ళందరినీ పరీక్షకు గురి చెయ్యడానికి యెహోవా ఈ శత్రు జాతులను అక్కడే ఉంచాడు ఇశ్రాయేలీయుల్లో కొత్త తరం వాళ్లకు యుద్ధం నేర్పించడానికి యెహోవా ఉండనిచ్చిన జాతులు ఇవి: ఫిలిష్తీయుల ఐదుగురు నాయకుల జాతులు, కనానీయులందరూ, సీదోనీయులు, బయల్హెర్మోను నుంచి హమాతునకు వెళ్ళే మార్గం వరకూ లెబానోను కొండలో ఉండే హివ్వీయులు. యెహోవా మోషే ద్వారా వాళ్ళ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలు వాళ్ళు అనుసరిస్తారో లేదో తెలుసుకోవాలని ఇశ్రాయేలీయులను పరీక్షించడానికి ఈ జాతులను ఆయన ఉండనిచ్చాడు.
న్యాయాధిపతులు 3:1-4 పవిత్ర బైబిల్ (TERV)
ఇతర రాజ్యాల ప్రజలంతా ఇశ్రాయేలీయుల దేశం విడిచిపెట్టేటట్టు యెహోవా బలవంతం చేయలేదు. ఇశ్రాయేలీయులను యెహోవా పరీక్షించాలనుకున్నాడు. ఈ సమయంలో జీవిస్తూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఒక్కరు కూడ కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన యుద్ధాల్లో పాల్గొనలేదు. అందుచేత ఆ ఇతర రాజ్యాలను యెహోవా వారి దేశంలో ఉండనిచ్చాడు. (ఆ యుద్ధాలలో పాల్గొనని ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాలని యెహోవా ఇలా చేసాడు). ఆ దేశంలో యెహోవా ఉండనిచ్చిన రాజ్యాల పేర్లు ఇవి: ఫిలిష్తీయుల అయిదుగురు పరిపాలకులు, కనానీయులు అందరూను, సీదోను ప్రజలు, గయెలు హెర్మోను నుండి లెబోహమాతు వరకు గల లెబానోను కొండల్లో జీవించిన హివ్వీ ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించటానికి యెహోవా ఆ రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. వారి పూర్వీకులకు మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆదేశాలకు ఇశ్రాయేలు ప్రజలు విధేయులవుతారేమోనని ఆయన చూడాలనుకున్నాడు.
న్యాయాధిపతులు 3:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగినయుద్ధములన్నిటిని చూడనివారందరిని శోధించి ఇశ్రాయేలీయుల తరతరములవారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడనివారికి యుద్ధముచేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారుల జనులును, కనానీయులందరును, సీదోనీయులును, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గమువరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులును, యెహోవా మోషేద్వారా తమ తండ్రుల కిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలిసికొనునట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను.