న్యాయాధిపతులు 2:10-15
న్యాయాధిపతులు 2:10-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ తరమంతా తమ పూర్వికుల దగ్గరకు చేర్చబడిన తర్వాత యెహోవాను, ఆయన ఇశ్రాయేలు కోసం చేసిన కార్యాలు తెలియని వేరే తరం మొదలైంది. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో చెడు కార్యాలు చేసి బయలు దేవుళ్లను పూజించారు. వారు తమను ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన తమ పూర్వికుల దేవుడైన యెహోవాను తిరస్కరించారు. తమ చుట్టూ ఉన్న జనాంగాల దేవుళ్ళను వెంబడించి పూజించారు. వారు యెహోవాకు కోపం రప్పించారు. వారు యెహోవాను విడిచి, బయలు అష్తారోతు ప్రతిమలను సేవించారు. యెహోవా ఇశ్రాయేలుపై కోపం వచ్చి, వారిని దోచుకునేవారి చేతికి అప్పగించారు. ఆయన వారి చుట్టూ ఉన్న శత్రువుల చేతికి వారిని అమ్మివేశారు, వారు ఆ శత్రువుల ఎదుట నిలువలేకపోయారు. ఇశ్రాయేలు పోరాడడానికి వెళ్లినప్పుడు, యెహోవా వారికి ప్రమాణం చేసినట్టు వారిని ఓడించడానికి ఆయన హస్తం వారికి విరుద్ధంగా ఉండేది. వారు ఎంతో బాధపడ్డారు.
న్యాయాధిపతులు 2:10-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ తరం వారంతా తమ తమ పితరుల దగ్గరికి చేరారు. వారి తరువాత యెహోవానుగాని, ఆయన ఇశ్రాయేలీయుల కోసం చేసిన కార్యాలను గాని తెలియని తరం ఒకటి మొదలయ్యింది. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో పాపం చేసి, బయలు దేవుళ్ళను పూజించారు. ఐగుప్తుదేశంలో నుంచి వాళ్ళను రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను అనుసరించి, వాళ్ళ చుట్టూ ఉండే ఆ ప్రజల దేవుళ్ళకు సాగిలపడి, యెహోవాకు కోపం పుట్టించారు. వాళ్ళు యెహోవాను విడిచిపెట్టి బయలును అష్తారోతు దేవతను పూజించారు. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద రాజుకుంది. ఆయన వారిని దోపిడీగాళ్ళకు అప్పగించాడు. వాళ్ళు ఇశ్రాయేలీయులను దోచుకున్నారు. తమ చుట్టూ ఉన్న శత్రువుల చేతికి ఆయన వారిని అప్పగించాడు కాబట్టి వారు తమ శత్రువులను ఎదిరించలేకపోయారు. వారు యుద్ధానికి ఎటు వెళ్ళినా సరే, ఆయన ప్రమాణపూర్వకంగా చెప్పినట్టుగానే వారు ఓడిపోయేలా యెహోవా హస్తం వారికీ విరోధంగా ఉంది. వాళ్లకు ఘోర బాధ కలిగింది.
న్యాయాధిపతులు 2:10-15 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తరం వారంతా చనిపోయాక తరువాత తరం పెరిగింది. యెహోవాను గూర్చిగాని, ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన వాటిని గూర్చిగాని ఈ కొత్త తరం వారికి తెలియదు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు కీడు చేస్తూ తప్పుడు దేవత బయలును సేవించారు. ప్రజలు ఈ కీడు చేయటం యెహోవా చూశాడు. ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి యెహోవా బయటకు తీసుకుని వచ్చాడు. ఈ ప్రజల పూర్వీకులు యెహోవాను ఆరాధించారు. కాని ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను అనుసరించటం మానుకొన్నారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసించిన ప్రజలయొక్క తప్పుడు దేవుళ్లను పూజించటం మొదలు పెట్టారు. అది యెహోవాకు కోపం కలిగించింది. ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరించటం మానివేసి బయలు, అష్తారోతులను పూజించటం మొదలు పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలమీద యెహోవాకు కోపం వచ్చింది. కనుక శత్రువులు ఇశ్రాయేలీయుల మీద దాడిచేసి వారి ఆస్తులను తీసుకునేట్టుగా యెహోవా చేశాడు. యెహోవా వారి చుట్టూరా ఉన్న వారి శత్రువుల ద్వారా వారు ఓడిపోయేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువులనుండి వారిని వారు కాపాడుకోలేక పోయారు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి బయటకు వెళ్లినప్పుడల్లా ఓడిపోయారు. యెహోవా వారి పక్షంగా లేని కారణంచేత వారు ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసిస్తున్న ప్రజల దేవతలను సేవిస్తే, వారు ఓడిపోతారని యెహోవా ముందుగానే వారిని హెచ్చరించాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలా శ్రమ అనుభవించారు.
న్యాయాధిపతులు 2:10-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ తరమువారందరు తమపితరులయొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమపితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచుకొనువారిచేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి. యెహోవావారితో చెప్పినట్లు, యెహోవావారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవావారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను.