యాకోబు 4:1-17
యాకోబు 4:1-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ మధ్యలో ఉన్న తగాదాలు, గొడవలు ఎక్కడ నుండి వచ్చాయి? మీలో పోరాడుతున్న దురాశల నుండి వచ్చినవే కదా? మీరు కోరుకున్నదానిని పొందలేదు కాబట్టి మీరు హత్య చేస్తారు. మీరు ఆశపడిన దానిని సంపాదించుకోలేదు కాబట్టి మీరు పోరాటాలు, గొడవలు చేస్తారు. మీరు దేవుని అడగలేదు కాబట్టి మీరు పొందలేదు. మీరు అడిగినప్పుడు మీ సంతోషాల కోసం ఉపయోగించుకోవాలనే దురుద్ధేశ్యంతో అడుగుతారు కాబట్టి మీకు ఏమి దొరకదు. వ్యభిచారులారా! ఈ లోకంతో స్నేహం చేయడమంటే దేవునితో విరోధం పెట్టుకోవడమేనని మీకు తెలియదా? కాబట్టి ఈ లోకంతో స్నేహం చేసిన ప్రతివారు దేవునికి విరోధులుగా మారతారు. లేదా, “దేవుడు మనలో నివసింపచేసిన ఆత్మ కోసం ఆయన ఆరాటపడుతున్నారని” లేఖనం చెప్పడం అనవసరం అని అనుకుంటున్నారా? అయితే ఆయన అందరికి ఎక్కువ కృపను ఇస్తారు కాబట్టి, “దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు కాని, దీనులకు దయ చూపిస్తారు” అని లేఖనం చెప్తుంది. కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు. దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తారు. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి. విచారపడుతూ దుఃఖిస్తూ కన్నీరు కార్చండి. మీ నవ్వును దుఃఖంగా, మీ సంతోషాన్ని విచారంగా మార్చుకోండి. ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు. నా సహోదరీ సహోదరులారా, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడవద్దు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు లేదా ఇతరులకు తీర్పు తీర్చేవారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తారు. మీరు ధర్మశాస్త్రానికి తీర్పుతీర్చితే అప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా కాకుండా న్యాయాధికారిగా ఉన్నారని అర్థము. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవారు న్యాయాధికారి ఒక్కరే, ఆయన రక్షించగలరు నాశనం చేయగలరు. కాబట్టి మీ పొరుగువారికి తీర్పు తీర్చడానికి మీరు ఎవరు? “ఈ రోజైనా లేక రేపైనా ఏదో ఒక పట్టణానికి వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అని చెప్పేవారలారా రండి. రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవితం ఏపాటిది? కొంతసేపు కనిపించి అంతలోనే మాయమైపోయే ఆవిరివంటిది. కాబట్టి, “ప్రభువు చిత్తమైతే మనం జీవించి ఇది చేద్దాం అది చేద్దాం” అని మీరు చెప్పాలి. కాని మీరు అహంకారంతో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా గొప్పలు చెప్పుకోవడం చాలా చెడ్డది. కాబట్టి చేయవలసిన మంచి వాటి గురించి తెలిసి దాన్ని చేయడంలో విఫలమైతే వారు పాపం చేసినవారు అవుతారు.
యాకోబు 4:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా? మీకు లేని వాటిని కోరుకుంటారు. మీరు పొందలేని దాని వెనకాల పరుగులు పెడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు కానీ దేవుణ్ణి అడగరు కాబట్టి మీరేదీ పొందరు. మీరడిగినా మీకేమీ దొరకదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసం ఖర్చు చేసేందుకు చెడ్డ వాటిని అడుగుతారు. కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు. ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా? కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి. చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి. ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. సోదరులారా, మీలో ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడకండి. తన సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేక తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావంటే ధర్మశాస్త్రానికి నువ్వు లోబడడం లేదని అర్థం. ధర్మశాస్త్రానికే న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్నావని అర్థం. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందీ తీర్పు తీర్చేదీ ఒక్కరే. దేవుడే! ఆయనే రక్షించడానికీ నాశనం చేయడానికీ సమర్ధుడు. ఇతరులకి తీర్పు తీర్చడానికి నువ్వెవరు? “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట. రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది. కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి. ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది. మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.
యాకోబు 4:1-17 పవిత్ర బైబిల్ (TERV)
మీలో మీకు యుద్ధాలు, పోట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి? మీ ఆంతర్యంలోని ఆశలు మీలో యుద్ధం చేయటం వల్లనే గదా యివి జరగటం? మీరు కోరుతారు. అది లభించదు. దాని కోసం మీరు చంపటానికి కూడా సిద్ధమౌతారు. మీలో అసూయ కలుగుతుంది. అయినా మీ కోరిక తీర్చుకోలేరు. మీరు పోట్లాడుతారు. యుద్ధం చేస్తారు. కాని మీరు దేవుణ్ణి అడగరు కనుక మీ కోరిక తీరదు. మీరు దురుద్దేశ్యంతో అడుగుతారు. కనుక మీరు అడిగినా మీకు లభించదు. మీరు అడిగేది మీ సుఖాలకు ఖర్చు పెట్టాలని అడుగుతారు. నమ్మక ద్రోహులారా! ప్రపంచంతో స్నేహం చేస్తే దేవుణ్ణి ద్వేషించినట్లని మీకు తెలియదా? ప్రపంచంతో స్నేహం చెయ్యాలనుకొన్నవాడు దేవునికి శత్రువు అవుతాడు. లేఖనాల్లో ఈ విషయం వృధాగా వ్రాసారనుకుంటున్నారా? “ఆయన మనకిచ్చిన ఆత్మను మనం ఆయన కోసం మాత్రమే వాడాలని చూస్తుంటాడు.” దేవుడు మనపై ఎంతో అనుగ్రహం చూపుతున్నాడు. అందువల్ల లేఖనాల్లో, “దేవుడు అహంకారం కలవాళ్ళను ద్వేషిస్తాడు. వినయం కలవాళ్ళను కనికరిస్తాడు” అని వ్రాయబడింది. అందువల్ల దేవుని పట్ల విధేయతతో ఉండండి. సాతాన్ను ఎదిరించండి. అప్పుడు సాతాను మీనుండి పారిపోతాడు. దేవుణ్ణి మీరు సమీపిస్తే దేవుడు మిమ్మల్ని సమీపిస్తాడు. పాపాత్ములారా! మీ పాపాలు కడుక్కోండి. చంచలమైన మనస్సుగల ప్రజలారా! మీ హృదయాల్ని పవిత్రం చేసుకోండి. విచారించండి, దుఃఖించండి, శోకించండి. మీ నవ్వును దుఃఖంగా మార్చుకోండి. మీ ఆనందాన్ని విషాదంగా మార్చుకోండి. ప్రభువు సమక్షంలో మీరు తగ్గింపు కలవారుగా ఉండండి. అప్పుడు ఆయన మిమ్మల్ని పైకిలేపుతాడు. సోదరులారా! పరస్పరం దూషించుకోకండి. తన సోదరుల్ని దూషించినవాడు, లేక సోదరునిపై తీర్పు చెప్పినవాడు, ధర్మశాస్త్రాన్ని దూషించినవానిగా పరిగణింపబడతాడు. మీరు అలా చేస్తే ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి మారుగా, న్యాయాధిపతివలె ఆ ధర్మశాస్త్రంపై తీర్పు చెపుతున్నారన్నమాట. ధర్మశాస్త్రాన్నిచ్చిన వాడును, న్యాయాధిపతియు ఆయనే. రక్షించగలవాడు, నాశనం చెయ్యగలవాడు ఆయనే. మరి యితర్లపై తీర్పు చెప్పటానికి నీవెవరు? వినండి! “ఈ రోజో లేక రేపో మేము ఈ పట్టణానికో లేక ఆ పట్టణానికో వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం గడిపి వ్యాపారం చేసి డబ్బు గడిస్తాము” అని మీరంటూ ఉంటారు. అంతెందుకు, రేపేమి జరుగబోతుందో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనిపించి ఆ తర్వాత మాయమైపోయే పొగమంచు లాంటి వాళ్ళు. మీరు దానికి మారుగా, “ప్రభువు అనుగ్రహిస్తే మేము జీవించి యిదీ అదీ చేస్తాము” అని అనాలి. మీరు గర్వంగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అలా ప్రగల్భాలు పలకటం తప్పు. అందువల్ల మంచి చెయ్యటానికి నేర్చుకొన్నవాడు మంచి పనినే చెయ్యాలి. అలా చెయ్యకపోవటం పాపం అవుతుంది.
యాకోబు 4:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా? మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకైదురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు. వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. –ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత–దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? –నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. కనుక–ప్రభువు చిత్తమైతే మనము బ్రదికి యుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.