యాకోబు 3:7-12

యాకోబు 3:7-12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మృగాలను, పక్షులను, ప్రాకే ప్రాణులను, సముద్రపు జీవులను మానవజాతి అదుపుచేస్తుంది, అదుపుచేసింది. కాని నిరంతరం చెడుచేస్తూ, మరణకరమైన విషంతో నిండిన నాలుకను ఎవరూ అదుపుచేయలేరు. ఆ నాలుకతోనే తండ్రియైన దేవుని స్తుతిస్తాం, ఆ నాలుకతోనే దేవుని పోలికతో చేయబడిన వారిని శపిస్తాము. ఒకే నోటి నుండి స్తుతి శాపాలు వస్తున్నాయి. నా సహోదరీ సహోదరులారా, మనం అలా ఉండకూడదు. ఒక నీటి ఊటలో ఒకే చోట నుండి మంచినీరు ఉప్పునీరు వస్తాయా? నా సహోదరీ సహోదరులారా, అంజూర చెట్టుకు ఒలీవల పండ్లు, ద్రాక్షతీగెలకు అంజూర పండ్లు కాస్తాయా? అదే విధంగా ఉప్పునీటి ఊట నుండి మంచినీరు రావు.

యాకోబు 3:7-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అన్ని రకాల అడవి మృగాలను, పక్షులను, పాకే ప్రాణులను, సముద్ర జీవులను మానవుడు తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకున్నాడు కూడా. కాని, మనుషుల్లో ఏ ఒక్కరూ నాలుకను ఆధీనంలో ఉంచుకోలేక పోతున్నారు. అది ఎడతెగని దుష్టత్వం. అది మరణం కలిగించే విషంతో నిండి ఉంది. నాలుకతో మన ప్రభువైన తండ్రిని స్తుతిస్తాం. అదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న మనిషిని శపిస్తాం. ఒకే నోటినుంచి స్తుతి, శాపం రెండూ బయటకు వస్తాయి. నా సోదరులారా, ఇలా ఉండకూడదు. ఒకే ఊటలోనుంచి మంచి నీళ్ళు, చేదు నీళ్ళు, రెండూ ఊరుతాయా? నా సోదరులారా, అంజూరపు చెట్టుకు ఒలీవ పళ్ళు, ద్రాక్ష తీగెలకు అంజూరుపళ్ళు కాస్తాయా? అదేవిధంగా, ఉప్పునీటి ఊట నుంచి మంచి నీళ్ళు రావు.

యాకోబు 3:7-12 పవిత్ర బైబిల్ (TERV)

మానవుడు అన్ని రకాల జంతువుల్ని, పక్షుల్ని, ప్రాకే జీవుల్ని, సముద్రంలోని ప్రాణుల్ని మచ్చిక చేసుకొంటున్నాడు; ఇదివరకే మచ్చిక చేసుకొన్నాడు. కాని నాలుకను ఎవ్వరూ మచ్చిక చేసుకోలేదు. అది ప్రాణాంతకమైన విషంతో కూడుకున్న ఒక అవయవం. అది చాలా చెడ్డది. విరామం లేకుండా ఉంటుంది. మనం, మన నాలుకతో ప్రభువును, తండ్రిని స్తుతిస్తాము. అదే నాలుకతో దేవుని పోలికలో సృష్టింపబడిన మానవుణ్ణి శపిస్తాము. స్తుతి, శాపము ఒకే నోటినుండి సంభవిస్తున్నాయి. నా సోదరులారా! ఇది తప్పు. ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు ఒకే ఊట నుండి పారుతున్నాయా? నా సోదరులారా! అంజూరపు చెట్టుకు ఒలీవ పండ్లు, లేక ద్రాక్షతీగకు అంజూరపు పండ్లు కాస్తాయా? అలాగే ఉప్పునీటి ఊటనుండి మంచి నీళ్ళు ఊరవు.

యాకోబు 3:7-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రియైన ప్రభువు ను స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు. నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.