యాకోబు 3:3-18

యాకోబు 3:3-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మనం గుర్రాలను లోబరచుకోవడానికి వాటి నోటికి కళ్లెం వేసి దాని ఆధారంగా వాటి శరీరమంతటిని త్రిప్పుతాము. ఓడలను చూడండి; చాలా పెద్దగా ఉంటాయి, అవి బలమైన గాలికి కొట్టుకొనిపోతున్నా దానిని నడిపేవాని ఇష్ట ప్రకారం చాలా చిన్నగా ఉండే చుక్కాని సహాయంతో త్రిప్పబడుతుంది. అలాగే నాలుక చిన్న అవయవమే కానీ అది అధికంగా ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పురవ్వ వల్ల ఎంతో పెద్ద అడవి కాల్చివేయబడుతుంది. కాబట్టి నాలుక అగ్నిలాంటిది. నాలుక ఒక పాపాల పుట్టగా మన అవయవాల మధ్య ఉంచబడింది; అది శరీరమంతటిని పాడుచేస్తుంది, ప్రకృతి చక్రంలో చిచ్చు పెడుతుంది; నరకాగ్ని చేత దానికదే కాలిపోతుంది. మృగాలను, పక్షులను, ప్రాకే ప్రాణులను, సముద్రపు జీవులను మానవజాతి అదుపుచేస్తుంది, అదుపుచేసింది. కాని నిరంతరం చెడుచేస్తూ, మరణకరమైన విషంతో నిండిన నాలుకను ఎవరూ అదుపుచేయలేరు. ఆ నాలుకతోనే తండ్రియైన దేవుని స్తుతిస్తాం, ఆ నాలుకతోనే దేవుని పోలికతో చేయబడిన వారిని శపిస్తాము. ఒకే నోటి నుండి స్తుతి శాపాలు వస్తున్నాయి. నా సహోదరీ సహోదరులారా, మనం అలా ఉండకూడదు. ఒక నీటి ఊటలో ఒకే చోట నుండి మంచినీరు ఉప్పునీరు వస్తాయా? నా సహోదరీ సహోదరులారా, అంజూర చెట్టుకు ఒలీవల పండ్లు, ద్రాక్షతీగెలకు అంజూర పండ్లు కాస్తాయా? అదే విధంగా ఉప్పునీటి ఊట నుండి మంచినీరు రావు. మీలో జ్ఞానం, గ్రహింపు కలవారు ఎవరు? జ్ఞానం వలన వచ్చిన సహనంతో మీ క్రియలను మీ మంచి ప్రవర్తన ద్వారా చూపించాలి. అయితే మీ హృదయాల్లో తీవ్రమైన అసూయ, స్వార్థపూరితమైన దురాశలు ఉన్నప్పుడు గొప్పలు చెప్పుకోవద్దు, సత్యాన్ని తృణీకరించవద్దు. అలాంటి జ్ఞానం పరలోక నుండి దిగివచ్చింది కాదు ఈ లోక సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది కాదు దయ్యాలకు సంబంధించిన జ్ఞానము. ఎక్కడైతే అసూయ స్వార్థపూరితమైన దురాశలు ఉంటాయో అక్కడ ప్రతి విధమైన అక్రమాలు దుర్మార్గాలు ఉంటాయి. పైనుండి వచ్చిన జ్ఞానం మొదట స్వచ్ఛంగా ఉంటుంది, తర్వాత శాంతికరంగా, సహనంతో, లోబడేదానిగా, దయతో నిండుకొని మంచి ఫలాలను కలిగి, పక్షపాతం కాని మోసం కాని లేనిదై ఉంటుంది. శాంతిలో విత్తిన శాంతిని కలుగజేసినవారు నీతి అనే పంట కోస్తారు.

యాకోబు 3:3-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

గుర్రాలు మనకు లోబడడానికి దాని నోటికి కళ్ళెం పెట్టి, దాని శరీరం అంతా మనకు లోబడేలా చేస్తాం కదా! ఓడలు పెద్దవిగా ఉన్నా, బలమైన గాలులతో ముందుకు సాగుతున్నా, ఆ ఓడ నడిపేవాడు చిన్న చుక్కానితో దాన్ని తిప్పగలుగుతాడు. అలాగే, నాలుక శరీరంలో చిన్న భాగమే అయినా, ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పు రవ్వ ఎంత పెద్ద అడవిని తగల బెడుతుందో గమనించండి! నాలుక కూడా ఒక అగ్ని. పాప ప్రపంచం మన శరీరంలో అమర్చి ఉన్నట్టు అది ఉండి, శరీరమంతటినీ మలినం చేసి, జీవన మార్గాన్ని తగలబెడుతుంది. తరవాత నరకాగ్నికి గురై కాలిపోతుంది. అన్ని రకాల అడవి మృగాలను, పక్షులను, పాకే ప్రాణులను, సముద్ర జీవులను మానవుడు తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకున్నాడు కూడా. కాని, మనుషుల్లో ఏ ఒక్కరూ నాలుకను ఆధీనంలో ఉంచుకోలేక పోతున్నారు. అది ఎడతెగని దుష్టత్వం. అది మరణం కలిగించే విషంతో నిండి ఉంది. నాలుకతో మన ప్రభువైన తండ్రిని స్తుతిస్తాం. అదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న మనిషిని శపిస్తాం. ఒకే నోటినుంచి స్తుతి, శాపం రెండూ బయటకు వస్తాయి. నా సోదరులారా, ఇలా ఉండకూడదు. ఒకే ఊటలోనుంచి మంచి నీళ్ళు, చేదు నీళ్ళు, రెండూ ఊరుతాయా? నా సోదరులారా, అంజూరపు చెట్టుకు ఒలీవ పళ్ళు, ద్రాక్ష తీగెలకు అంజూరుపళ్ళు కాస్తాయా? అదేవిధంగా, ఉప్పునీటి ఊట నుంచి మంచి నీళ్ళు రావు. మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి. కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి. ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది. ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి. అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం. తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది. సమ్మతి గలది. కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది. శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది.

యాకోబు 3:3-18 పవిత్ర బైబిల్ (TERV)

చెప్పినట్లు వినాలనే ఉద్దేశ్యంతో మనం గుఱ్ఱం నోటికి కళ్ళెం వేస్తాం. అలా చేస్తేనే మనం దాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోగలము. ఓడను ఉదాహరణగా తీసుకొండి. అది చాలా పెద్దగా ఉంటుంది. బలమైన గాలివల్ల అది నడుస్తుంటుంది. కాని దాన్ని నావికుడు చిన్న చుక్కానితో తన యిష్టం వచ్చిన చోటికి తీసుకు వెళ్ళగలడు. అదేవిధంగా నాలుక శరీరంలో చిన్న భాగమైనా గొప్పలు పలుకుతుంది. చిన్న నిప్పురవ్వ పెద్ద అడవిని ఏ విధంగా కాలుస్తుందో గమనించండి. నాలుక నిప్పులాంటిది. అది చెడుతో నిండిన ప్రపంచానికి ప్రతినిధిగా మన శరీరంలో ఉంది. అది మన శరీరంలో ఒక భాగంగా ఉండి శరీరమంతా చెడును వ్యాపింపచేస్తుంది. మనిషి యొక్క జీవితానికే నిప్పంటిస్తుంది. నాలుక ఈ నిప్పును నరకం నుండి పొందుతుంది. మానవుడు అన్ని రకాల జంతువుల్ని, పక్షుల్ని, ప్రాకే జీవుల్ని, సముద్రంలోని ప్రాణుల్ని మచ్చిక చేసుకొంటున్నాడు; ఇదివరకే మచ్చిక చేసుకొన్నాడు. కాని నాలుకను ఎవ్వరూ మచ్చిక చేసుకోలేదు. అది ప్రాణాంతకమైన విషంతో కూడుకున్న ఒక అవయవం. అది చాలా చెడ్డది. విరామం లేకుండా ఉంటుంది. మనం, మన నాలుకతో ప్రభువును, తండ్రిని స్తుతిస్తాము. అదే నాలుకతో దేవుని పోలికలో సృష్టింపబడిన మానవుణ్ణి శపిస్తాము. స్తుతి, శాపము ఒకే నోటినుండి సంభవిస్తున్నాయి. నా సోదరులారా! ఇది తప్పు. ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు ఒకే ఊట నుండి పారుతున్నాయా? నా సోదరులారా! అంజూరపు చెట్టుకు ఒలీవ పండ్లు, లేక ద్రాక్షతీగకు అంజూరపు పండ్లు కాస్తాయా? అలాగే ఉప్పునీటి ఊటనుండి మంచి నీళ్ళు ఊరవు. జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు మీలో ఎవరైనా ఉన్నారా? అలాగైతే వాళ్ళను సత్‌ప్రవర్తనతో, వినయంతో కూడుకొన్న విజ్ఞానంతో సాధించిన కార్యాల ద్వారా చూపమనండి. ఒకవేళ మీ హృదయాల్లో అసూయతో కూడుకొన్న కోపము, స్వార్ధంతో కూడుకొన్న ఆశ ఉంటే మీలో వివేకముందని ప్రగల్భాలు చెప్పుకోకండి. అలా చేస్తే నిజాన్ని మరుగు పరచినట్లౌతుంది. మీలో ఉన్న ఈ జ్ఞానము పరలోకంలో నుండి దిగి రాలేదు. ఇది భూలోకానికి చెందింది. ఇందులో ఆధ్యాత్మికత లేదు. ఇది సాతానుకు చెందింది. ఎందుకంటే అసూయ, స్వార్థము, ఎక్కడ ఉంటాయో అక్కడ అక్రమాలు, అన్ని రకాల చెడు పద్ధతులు ఉంటాయి. కాని పరలోకం నుండి వచ్చిన జ్ఞానం మొదట పవిత్రమైనది. అది శాంతిని ప్రేమిస్తుంది. సాధుగుణం, వినయం, సంపూర్ణమైన దయ, మంచి ఫలాలు, నిష్పక్షపాతం, యథార్థత కలిగియుంటుంది. శాంతి స్థాపకులు శాంతిని విత్తి, నీతి అనే పంటను కోస్తారు.

యాకోబు 3:3-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును. ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును! నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రియైన ప్రభువు ను స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు. నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు. మీలో జ్ఞాన వివేకములుగలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవికానిమత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును. అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది. నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.