యాకోబు 3:2-6
యాకోబు 3:2-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మనమందరం అనేక విషయాల్లో తడబడతాము. మాట్లాడంలో తప్పులు చేయనివారు పరిపూర్ణులై శరీరమంతటిని ఒక కళ్లెంతో అదుపులో ఉంచుకోగల శక్తిని కలిగి ఉంటారు. మనం గుర్రాలను లోబరచుకోవడానికి వాటి నోటికి కళ్లెం వేసి దాని ఆధారంగా వాటి శరీరమంతటిని త్రిప్పుతాము. ఓడలను చూడండి; చాలా పెద్దగా ఉంటాయి, అవి బలమైన గాలికి కొట్టుకొనిపోతున్నా దానిని నడిపేవాని ఇష్ట ప్రకారం చాలా చిన్నగా ఉండే చుక్కాని సహాయంతో త్రిప్పబడుతుంది. అలాగే నాలుక చిన్న అవయవమే కానీ అది అధికంగా ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పురవ్వ వల్ల ఎంతో పెద్ద అడవి కాల్చివేయబడుతుంది. కాబట్టి నాలుక అగ్నిలాంటిది. నాలుక ఒక పాపాల పుట్టగా మన అవయవాల మధ్య ఉంచబడింది; అది శరీరమంతటిని పాడుచేస్తుంది, ప్రకృతి చక్రంలో చిచ్చు పెడుతుంది; నరకాగ్ని చేత దానికదే కాలిపోతుంది.
యాకోబు 3:2-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మనమందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. తన మాటలలో తప్పిపోని వాడు లోపం లేనివాడుగా ఉండి తన శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోగలుగుతాడు. గుర్రాలు మనకు లోబడడానికి దాని నోటికి కళ్ళెం పెట్టి, దాని శరీరం అంతా మనకు లోబడేలా చేస్తాం కదా! ఓడలు పెద్దవిగా ఉన్నా, బలమైన గాలులతో ముందుకు సాగుతున్నా, ఆ ఓడ నడిపేవాడు చిన్న చుక్కానితో దాన్ని తిప్పగలుగుతాడు. అలాగే, నాలుక శరీరంలో చిన్న భాగమే అయినా, ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పు రవ్వ ఎంత పెద్ద అడవిని తగల బెడుతుందో గమనించండి! నాలుక కూడా ఒక అగ్ని. పాప ప్రపంచం మన శరీరంలో అమర్చి ఉన్నట్టు అది ఉండి, శరీరమంతటినీ మలినం చేసి, జీవన మార్గాన్ని తగలబెడుతుంది. తరవాత నరకాగ్నికి గురై కాలిపోతుంది.
యాకోబు 3:2-6 పవిత్ర బైబిల్ (TERV)
మనమంతా ఎన్నో తప్పులు చేస్తుంటాము. తాను ఆడే మాటల్లో ఏ తప్పూ చేయనివాడు పరిపూర్ణుడు. అలాంటివాడు కళ్ళెం వేసి తన శరీరాన్ని అదుపులో పెట్టుకోగలడు. చెప్పినట్లు వినాలనే ఉద్దేశ్యంతో మనం గుఱ్ఱం నోటికి కళ్ళెం వేస్తాం. అలా చేస్తేనే మనం దాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోగలము. ఓడను ఉదాహరణగా తీసుకొండి. అది చాలా పెద్దగా ఉంటుంది. బలమైన గాలివల్ల అది నడుస్తుంటుంది. కాని దాన్ని నావికుడు చిన్న చుక్కానితో తన యిష్టం వచ్చిన చోటికి తీసుకు వెళ్ళగలడు. అదేవిధంగా నాలుక శరీరంలో చిన్న భాగమైనా గొప్పలు పలుకుతుంది. చిన్న నిప్పురవ్వ పెద్ద అడవిని ఏ విధంగా కాలుస్తుందో గమనించండి. నాలుక నిప్పులాంటిది. అది చెడుతో నిండిన ప్రపంచానికి ప్రతినిధిగా మన శరీరంలో ఉంది. అది మన శరీరంలో ఒక భాగంగా ఉండి శరీరమంతా చెడును వ్యాపింపచేస్తుంది. మనిషి యొక్క జీవితానికే నిప్పంటిస్తుంది. నాలుక ఈ నిప్పును నరకం నుండి పొందుతుంది.
యాకోబు 3:2-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును. గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును. ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును! నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.