యాకోబు 2:14-19
యాకోబు 2:14-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా సహోదరీ సహోదరులారా, క్రియలు లేకుండా ఎవరైనా మాకు విశ్వాసం ఉందని చెప్తే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుందా? ఒక సహోదరునికి గాని సహోదరికి గాని వేసుకోవడానికి బట్టలు తినడానికి తిండి లేనప్పుడు మీరు వారి శరీరాలకు అవసరమైనవి ఇవ్వకుండ వారితో, “సమాధానంతో వెళ్లి చలి కాచుకుని, తృప్తిగా తిను” అని చెప్తే ఏం ప్రయోజనం? అలాగే క్రియలు లేకపోతే ఆ విశ్వాసం దానికదే మరణిస్తుంది. అయితే ఎవరైనా, “నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి.” క్రియలు లేకుండా మీ విశ్వాసాన్ని నాకు చూపించు, నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని నీకు చూపిస్తానని చెప్పవచ్చు. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు అది మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుతాయి.
యాకోబు 2:14-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా సోదరులారా, ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెప్పి, క్రియలు లేనివాడైతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం అతన్ని రక్షించగలదా? ఒక సోదరునికి గాని, సోదరికి గాని కట్టుకోడానికి బట్టలు, ఆ రోజు తినడానికి భోజనం అవసరం అయితే, మీలో ఒకడు అలాటి వారితో, “శాంతిగా వెళ్ళు, వెచ్చగా ఉండు, తృప్తిగా తిను” అని చెబితే ఏం ప్రయోజనం? అదే విధంగా, క్రియలు లేకుండా విశ్వాసం ఒక్కటే ఉంటే, అదీ చచ్చినదే. అయినా ఒకడు, “నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి” అనవచ్చు. క్రియలు లేని నీ విశ్వాసం నాకు చూపించు. అప్పుడు నేను నా క్రియల ద్వారా నా విశ్వాసం చూపిస్తాను. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు సరే. కానీ దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయి. నమ్మి గడగడా వణుకుతున్నాయి.
యాకోబు 2:14-19 పవిత్ర బైబిల్ (TERV)
నా సోదరులారా! “నాకు విశ్వాసం ఉంది” అని అన్న వ్యక్తి ఆ విశ్వాసాన్ని క్రియా రూపకంగా చూపకపోతే అది నిష్ప్రయోజనం. అలాంటి విశ్వాసం అతణ్ణి రక్షించగలదా? ఒక సోదరుడో లేక సోదరియో కూడూ గుడ్డా లేక బాధపడ్తున్నారనుకోండి. అప్పుడు మీరు అతనితో, “క్షేమంగా వెళ్ళిరా! కడుపునిండా తిని, ఒంటి నిండా దుస్తులు వేసుకో!” అని అంటూ వాళ్ళ అవసరాలు తీర్చకపోతే దానివల్ల వచ్చిన లాభమేమిటి? విశ్వాసంతో పాటు క్రియ లేకపోతే ఆ విశ్వాసం పూర్తిగా నిష్ప్రయోజనమైపోతుంది. కాని, “ఒకనిలో విశ్వాసం ఉండవచ్చు. మరొకనిలో క్రియ ఉండవచ్చు!” అని మీరనవచ్చు! అలాగైతే క్రియలు లేకుండా మీలో ఉన్న విశ్వాసాన్ని నాకు చూపండి. నేను క్రియారూపకంగా నా విశ్వాసాన్ని చూపుతాను. ఒక్కడే దేవుడున్నాడని మీరు విశ్వసిస్తారు. మంచిదే. దయ్యాలు కూడా దాన్ని నమ్ముతాయి. అయినా, దేవుడు తమను శిక్షిస్తాడేమోనని భయపడ్తూ ఉంటాయి.
యాకోబు 2:14-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక–సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు –నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలులేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.