యాకోబు 2:1-5

యాకోబు 2:1-5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నా సహోదరీ సహోదరులారా, మహిమగల మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసం గలవారిగా పక్షపాతం చూపకండి. బంగారు ఉంగరాలు, విలువైన బట్టలు వేసుకున్న ధనవంతుడు, అలాగే మురికిబట్టలు వేసుకున్న పేదవాడు మీ సంఘానికి వచ్చినప్పుడు, విలువైన బట్టలు వేసుకున్న ధనవంతుడిని ప్రత్యేకంగా గమనించి, “దయచేసి ఇక్కడ కూర్చోండి” అని చెప్పి, పేదవానితో “అక్కడ నిలబడు” అని “నా కాళ్ల దగ్గర కూర్చో” అని చెబితే, మీరు వ్యత్యాసాలు చూపిస్తూ దుర్మార్గపు ఆలోచనలతో విమర్శించినవారు అవుతారు కదా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి. దేవుడు తనను ప్రేమించినవారికి వాగ్దానం చేసిన ప్రకారం విశ్వాసంలో ధనవంతులుగా ఉండడానికి, తన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఈ లోకంలో పేదవారిని దేవుడు ఎంచుకోలేదా?

యాకోబు 2:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నా సహోదరులారా, మహిమ స్వరూపి అయిన మన ప్రభు యేసు క్రీస్తును విశ్వసించే వారుగా పక్షపాతం లేకుండా ఉండండి. ఎవరైనా బంగారు ఉంగరాలు పెట్టుకుని, ఖరీదైన బట్టలు వేసుకున్న వాడు, మాసిన బట్టలు వేసుకొన్న పేదవాడొకడు, వీరిద్దరూ మీ సమావేశానికి వచ్చారనుకోండి. మీ దృష్టి ఖరీదైన బట్టలు వేసుకున్నవాడి మీద ఉంచి, “దయచేసి ఈ మంచి చోట కూర్చోండి,” అని చెప్పి, పేదవానితో, “నువ్వు అక్కడ నిలబడు,” లేదా, “నా కాళ్ళ దగ్గర కూర్చో,” అంటే, మీరు చెడు ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని తేడా చూపుతున్నట్టే కదా? నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో పేదవారిని విశ్వాసంలో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా?

యాకోబు 2:1-5 పవిత్ర బైబిల్ (TERV)

నా సోదరులారా! తేజోవంతుడైన మన యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్న మీరు పక్షపాతం చూపకూడదు. బంగారు ఉంగరాలు, మంచి దుస్తులు వేసుకొన్నవాడొకడు, మాసిన దుస్తులు వేసుకొన్నవాడొకడు మీ సమావేశానికి వస్తారనుకోండి. అప్పుడు మీరు మంచి దుస్తులు వేసుకొన్నవాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ, “రండి! ఈ మంచి స్థానంలో కూర్చోండి” అని అంటూ, పేదవానితో, “నీవక్కడ నిలబడు!” అనిగాని, “నా కాళ్ళ దగ్గర కూర్చో” అనిగాని అంటే, మీరు వ్యత్యాసము చూపుతున్నట్లే కదా! దుర్బుద్ధితో తీర్పు చెప్పినట్లే కదా! నా ప్రియమైన సోదరులారా! ప్రపంచం దృష్టిలో పేదవాళ్ళు విశ్వాసంలో ధనికులు కావాలనీ, వాళ్ళు తన రాజ్యానికి వారసులు కావాలనీ దేవుడు వాళ్ళను ఎన్నుకోలేదా? తనను ప్రేమించినవాళ్ళకు రాజ్యాన్నిస్తానని దేవుడు యింతకు క్రితమే వాగ్దానం చేసాడు.

యాకోబు 2:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మోమాటముగలవారై యుండకుడి. ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి–నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో–నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?