యాకోబు 1:13-18

యాకోబు 1:13-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

దేవుడు కీడు చేత శోధించబడడు; ఆయన ఎవరిని శోధించడు కాబట్టి ఎవరికైనా శోధన ఎదురైతే, “నేను దేవుని చేత శోధించబడుతున్నాను” అని అనకూడదు. ఒకరు తమ సొంత కోరికతోనే ఆకర్షించబడి వాటి ద్వారా ప్రలోభాలకు గురై శోధించబడతారు. చెడు కోరిక గర్భాన్ని ధరించి పాపానికి జన్మనిస్తుంది, ఆ పాపం పండి మరణానికి జన్మనిస్తుంది. నా ప్రియ సహోదరీ సహోదరులారా, మోసపోకండి. పైనుండి వచ్చే ప్రతీ శ్రేష్ఠమైన సంపూర్ణమైన బహుమానం వెలుగును కలిగించిన తండ్రి దగ్గర నుండి క్రిందకు వస్తున్నాయి, ఆయన ఒకచోట నిలబడని నీడల్లా ఎన్నడు మారరు. ఆయన సృష్టంతటిలో మనం మొదటి ఫలాలుగా ఉండాలని, సత్యవాక్యం చేత మనకు జన్మనివ్వడానికి ఎంచుకున్నారు.

యాకోబు 1:13-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, “ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది,” అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు, ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా. ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది. నా ప్రియ సోదరులారా, మోసపోకండి. ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు. దేవుడు, తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జీవం ఇవ్వడానికి మనలను కలగజేశాడు.

యాకోబు 1:13-18 పవిత్ర బైబిల్ (TERV)

ఒకడు శోధింపబడినప్పుడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. ఎందుకంటే దేవుడు చెడుద్వారా శోధింపడు. ఆయన ఎవర్నీ శోధించడు. దురాశలకు లోనై ఆశల్లో చిక్కుకు పోయినప్పుడు నీతికి దూరమై చెడును చెయ్యాలనే బుద్ధి పుడుతుంది. దురాశ గర్భం దాల్చి పాపాన్ని ప్రసవిస్తుంది. ఆ పాపం పండి మరణాన్ని కంటుంది. నా ప్రియమైన సోదరులారా! మోసపోకండి. ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్ఠమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. దేవుడు తన సృష్టిలో మనము ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జన్మనివ్వటానికి సంకల్పించాడు.

యాకోబు 1:13-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు–నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేప్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనా గమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.

యాకోబు 1:13-18

యాకోబు 1:13-18 TELUBSIయాకోబు 1:13-18 TELUBSIయాకోబు 1:13-18 TELUBSIయాకోబు 1:13-18 TELUBSI