యాకోబు 1:1-7
యాకోబు 1:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు సేవకుడనైన యాకోబు, వివిధ దేశాలకు చెదిరిపోయిన పన్నెండు గోత్రాల వారికి వ్రాస్తున్నాను: మీకు శుభాలు. నా సహోదరీ సహోదరులారా, మీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలవల్ల ఓర్పు వస్తుందని మీకు తెలుసు కాబట్టి, మీకు ఎప్పుడైనా ఎలాంటి శోధనలు ఎదురైనా వాటిని బట్టి సంతోషించండి. మీరు పరిణతి చెంది సంపూర్ణులై ఏ విషయంలో కొదువలేనివారై ఉండేలా పట్టుదల తన పనిని చేయనివ్వండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు. మీరు అడిగినప్పుడు సందేహించకుండా విశ్వాసంతో అడగండి ఎందుకంటే, సందేహించేవారు గాలికి రేగి ఎగసిపడే సముద్రపు అలల్లాంటివారు; కాబట్టి వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు.
యాకోబు 1:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు దాసుడైన యాకోబు, చెదరిపోయిన పన్నెండు గోత్రాల వారికి అభినందనలు. నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి. ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు. మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు. అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు.
యాకోబు 1:1-7 పవిత్ర బైబిల్ (TERV)
దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకు సేవకుడైన యాకోబునైన నేను, చెదరిపోయి, పలు ప్రాంతాలలో నివసిస్తున్న పన్నెండు గోత్రాల వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వ్రాయునదేమనగా: నా సోదరులారా! మీకు పరీక్షలు కలిగినప్పుడు పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షింపబడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు. మీరు చేసే పనిలో పూర్తిగా సహనం చూపండి. అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణత పొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు. మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా యిస్తాడు. కనుక మీకు కూడా యిస్తాడు. కాని దేవుణ్ణి అడిగినప్పుడు సంశయించకుండా విశ్వాసంతో అడగండి. సంశయించేవాడు గాలికి ఎగిరి కొట్టుకొను సముద్రం మీది తరంగంతో సమానము. అలాంటివాడు ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించకూడదు.
యాకోబు 1:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తుయొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. మీరు సంపూర్ణులును, అనూ నాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు.