యెషయా 64:1-4
యెషయా 64:1-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీరు ఆకాశాన్ని చీల్చివేసి దిగివస్తే, పర్వతాలు మీ ఎదుట వణుకుతాయి! మంట ఎండుకొమ్మల్ని కాల్చినప్పుడు, ఆ మంటకు నీళ్లు మరిగినట్లు, మీ శత్రువులకు మీ పేరు తెలిసేలా మీరు దిగిరండి, మీ ఎదుట దేశాలు వణికేలా చేయండి! మేము ఊహించని భయంకరమైన పనులు మీరు చేసినప్పుడు మీరు దిగివచ్చారు, పర్వతాలు మీ ఎదుట వణికాయి. తన కోసం ఎదురు చూసే వారి పక్షంగా కార్యం చేసే మిమ్మల్ని తప్ప అనాది కాలం నుండి ఏ దేవున్ని ఎవరూ చూడలేదు అలాంటి దేవుడు ఉన్నాడని ఎవరూ వినలేదు ఎవరూ గ్రహించలేదు.
యెషయా 64:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆకాశాలను చీల్చుకుని నువ్వు దిగివస్తే ఎంత బాగుండు! నీ సన్నిధిలో పర్వతాలు కంపించి పోతాయి. మంటలు గచ్చ పొదలను తగలబెట్టేలా నీళ్ళు పొంగేలాగా చేసినట్టు నీ పేరు నీ శత్రువులకు తెలియజేయడానికి నువ్వు దిగి రా! మేము ఊహించని ఆశ్చర్యకరమైన విషయాలు నువ్వు మునుపు చేసినప్పుడు, నువ్వు దిగివచ్చావు. పర్వతాలు నీ ఎదుట వణికాయి. నీ కోసం ఎదురు చూసేవారి పక్షంగా నువ్వు పనులు చేసే వాడివి. నిన్ను తప్ప తన పని ఇలా జరిగించే వేరే దేవుణ్ణి అనాది కాలం నుంచి ఎవరూ చూడలేదు, వినలేదు, గ్రహించలేదు.
యెషయా 64:1-4 పవిత్ర బైబిల్ (TERV)
నీవు ఆకాశాలను చీల్చుకొని భూమి మీదికి దిగివస్తే అప్పుడు సమస్తం మారిపోతుంది. పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి. మండుతున్న పొదల్లా, పర్వతాలు అగ్ని జ్వాలల్లో కాలిపోతాయి. నిప్పుమీది నీళ్లలా పర్వతాలు కాగిపోతాయి. అప్పుడు నీ శత్రువులు నిన్ను గూర్చి తెలుసుకొంటారు. అప్పుడు రాజ్యాలన్ని నిన్ను చూడగా భయంతో వణుకుతాయి. (కానీ నీ ఈ సంగతులు జరిగించాలని మేము నిజంగా కోరటంలేదు. పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి.) నీ ప్రజలు నిజంగా ఎన్నడూ నీ మాట వినలేదు. నీవు చెప్పిన విషయాలను నీ ప్రజలు నిజంగా ఎన్నడూ వినలేదు. నీవంటి దేవుణ్ణి ఏ మనిషీ ఎన్నడూ చూడలేదు. నీవు తప్ప ఇంక ఏ దేవుడూ లేడు. ప్రజలు సహనంతో నీకొరకు కనిపెట్టివుంటే అప్పుడు నీవు వారికోసం గొప్ప కార్యాలు చేస్తావు.
యెషయా 64:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయురీతిగాను నీవు దిగివచ్చెదవు గాక. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు