యెషయా 64:1-12 - Compare All Versions

యెషయా 64:1-12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మీరు ఆకాశాన్ని చీల్చివేసి దిగివస్తే, పర్వతాలు మీ ఎదుట వణుకుతాయి! మంట ఎండుకొమ్మల్ని కాల్చినప్పుడు, ఆ మంటకు నీళ్లు మరిగినట్లు, మీ శత్రువులకు మీ పేరు తెలిసేలా మీరు దిగిరండి, మీ ఎదుట దేశాలు వణికేలా చేయండి! మేము ఊహించని భయంకరమైన పనులు మీరు చేసినప్పుడు మీరు దిగివచ్చారు, పర్వతాలు మీ ఎదుట వణికాయి. తన కోసం ఎదురు చూసే వారి పక్షంగా కార్యం చేసే మిమ్మల్ని తప్ప అనాది కాలం నుండి ఏ దేవున్ని ఎవరూ చూడలేదు అలాంటి దేవుడు ఉన్నాడని ఎవరూ వినలేదు ఎవరూ గ్రహించలేదు. మీ మార్గాలను గుర్తుచేసుకుంటూ సంతోషంగా సరియైనది చేసేవారికి సహాయం చేయడానికి మీరు వస్తారు. అయితే మేము వాటికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నప్పుడు మీరు కోప్పడ్డారు. అలా అయితే మేము ఎలా రక్షింపబడగలం? మేమందరం అపవిత్రులమయ్యాము, మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డలుగా ఉన్నాయి; మేమందరం ఆకులా వాడిపోయాము, గాలిలా మా పాపాలు మమ్మల్ని తుడిచివేస్తున్నాయి. ఎవరూ మీ పేరిట మొరపెట్టడం లేదు మిమ్మల్ని ఆధారం చేసుకోవడానికి ఆరాటపడడం లేదు. మీరు మా నుండి మీ ముఖం దాచుకున్నారు. మమ్మల్ని మా పాపాలకు అప్పగించారు. అయినా యెహోవా! మీరే మాకు తండ్రి. మేము మట్టి, మీరు కుమ్మరి. మేమందరం మీ చేతి పనిగా ఉన్నాము. యెహోవా! ఎక్కువగా కోప్పడకండి; నిత్యం మా పాపాల్ని జ్ఞాపకం చేసుకోకండి. మేమంతా మీ ప్రజలమే కాబట్టి మా పట్ల దయ చూపించమని ప్రార్థిస్తున్నాము. మీ పరిశుద్ధ పట్టణాలు బంజరు భూమిగా మారాయి; చివరకు సీయోను బంజరు భూమిగా, యెరూషలేము నిర్జనంగా మారాయి. మా పూర్వికులు మిమ్మల్ని స్తుతించిన సుందరమైన మా కీర్తిగల మందిరం అగ్నితో కాల్చబడింది, మా ఆహ్లాదకరమైనవన్నీ నాశనమైపోయాయి. యెహోవా! ఇదంతా జరిగిన తర్వాత, మీరు చూసి ఊరుకుంటారా? మీరు మౌనంగా ఉండి మమ్మల్ని ఇంకా శిక్షిస్తూనే ఉంటారా?

షేర్ చేయి
యెషయా 64 TSA

యెషయా 64:1-12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆకాశాలను చీల్చుకుని నువ్వు దిగివస్తే ఎంత బాగుండు! నీ సన్నిధిలో పర్వతాలు కంపించి పోతాయి. మంటలు గచ్చ పొదలను తగలబెట్టేలా నీళ్ళు పొంగేలాగా చేసినట్టు నీ పేరు నీ శత్రువులకు తెలియజేయడానికి నువ్వు దిగి రా! మేము ఊహించని ఆశ్చర్యకరమైన విషయాలు నువ్వు మునుపు చేసినప్పుడు, నువ్వు దిగివచ్చావు. పర్వతాలు నీ ఎదుట వణికాయి. నీ కోసం ఎదురు చూసేవారి పక్షంగా నువ్వు పనులు చేసే వాడివి. నిన్ను తప్ప తన పని ఇలా జరిగించే వేరే దేవుణ్ణి అనాది కాలం నుంచి ఎవరూ చూడలేదు, వినలేదు, గ్రహించలేదు. నీ పద్ధతులను గుర్తుంచుకుని వాటి ప్రకారం చేసే వారికి, సంతోషంతో నీతి ననుసరించే వారికి, నువ్వు సాయం చేయడానికి వస్తావు. మేము పాపం చేసినప్పుడు నువ్వు కోపపడ్డావు. నీ పద్ధతుల్లో మాకు ఎప్పుడూ విడుదల కలుగుతుంది. మేమంతా అపవిత్రులవంటివారిగా అయ్యాం. మా నీతి పనులన్నీ బహిష్టు బట్టల్లాంటివి. మేమంతా ఆకుల్లాగా వాడిపోయే వాళ్ళం. గాలి కొట్టుకుపోయినట్టు మా దోషాలను బట్టి మేము కొట్టుకుపోతాం. నీ పేరున ఎవరూ ప్రార్థన చేయడంలేదు. నిన్ను ఆధారం చేసుకోడానికి ప్రయత్నం చేసేవాడు ఎవడూ లేడు. ఎందుకంటే మాకు కనబడకుండా నువ్వు నీ ముఖం దాచుకున్నావు. మమ్మల్ని మా పాపాలకు అప్పగించావు. అయినా, యెహోవా, నువ్వే మాకు తండ్రివి. మేము బంకమన్నులాగా ఉన్నాం. నువ్వు మాకు కుమ్మరివి. మేమంతా నీ చేతి పని. యెహోవా, ఎక్కువగా కోపపడవద్దు. మా పాపాలను ఎప్పుడూ అదే పనిగా గుర్తు పెట్టుకోవద్దు. ఇదిగో, నీ ప్రజలైన మావైపు దయచేసి చూడు. నీ పరిశుద్ధ పట్టణాలు బీడు భూములయ్యాయి. సీయోను బీడయింది. యెరూషలేము పాడుగా ఉంది. మా పూర్వీకులు నిన్ను కీర్తించిన మా అందమైన పరిశుద్ధ మందిరం అగ్నికి ఆహుతి అయింది. మాకు ప్రియమైనవన్నీ శిథిలమైపోయాయి. యెహోవా, వీటిని చూసి నువ్వెలా ఊరకుంటావు? నువ్వు మౌనంగా ఉండి మమ్మల్ని బాధపెడుతూ ఉంటావా?

షేర్ చేయి
యెషయా 64 IRVTEL

యెషయా 64:1-12 TERV (పవిత్ర బైబిల్)

నీవు ఆకాశాలను చీల్చుకొని భూమి మీదికి దిగివస్తే అప్పుడు సమస్తం మారిపోతుంది. పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి. మండుతున్న పొదల్లా, పర్వతాలు అగ్ని జ్వాలల్లో కాలిపోతాయి. నిప్పుమీది నీళ్లలా పర్వతాలు కాగిపోతాయి. అప్పుడు నీ శత్రువులు నిన్ను గూర్చి తెలుసుకొంటారు. అప్పుడు రాజ్యాలన్ని నిన్ను చూడగా భయంతో వణుకుతాయి. (కానీ నీ ఈ సంగతులు జరిగించాలని మేము నిజంగా కోరటంలేదు. పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి.) నీ ప్రజలు నిజంగా ఎన్నడూ నీ మాట వినలేదు. నీవు చెప్పిన విషయాలను నీ ప్రజలు నిజంగా ఎన్నడూ వినలేదు. నీవంటి దేవుణ్ణి ఏ మనిషీ ఎన్నడూ చూడలేదు. నీవు తప్ప ఇంక ఏ దేవుడూ లేడు. ప్రజలు సహనంతో నీకొరకు కనిపెట్టివుంటే అప్పుడు నీవు వారికోసం గొప్ప కార్యాలు చేస్తావు. మేలు చేయటంలో ఆనందించే మనుష్యులతో నీవు ఉన్నావు. నీ జీవన విధానాలను ఆ మనుష్యులు జ్ఞాపకం చేసుకొంటారు. కానీ చూడు, గతంలో మేము నీకు విరోధంగా పాపం చేశాము అందుచేత నీవు మా మీద కోపగించావు. మేమందరం పాపంతో మైలపడ్డాం. మా “నీతి” అంతా పాత మైల గుడ్డల్లాంటిదే. మేమందరం ఎండిపోయిన ఆకుల్లా ఉన్నాము. మా పాపాలు మమ్మల్ని గాలిలా కొట్టుకుపోయాయి. మేము నిన్ను ఆరాధించటం లేదు, నీ నామం మేము విశ్వసించలేదు. నిన్ను వెంబడించాలనే సంబరం మాలో ఎవ్వరికీ లేదు. అందుచేత నీవు మా వద్దనుండి తిరిగిపోయావు. మేము పాపంతో నిండిపోయాం గనుక నీ ఎదుట మేము నిస్సహాయులం. కానీ, యెహోవా, నీవు మా తండ్రివి. మేము మట్టిలాంటి వాళ్లం. నీవు కుమ్మరివి. నీ చేతులే మమ్మల్ని అందర్ని చేశాయి. యెహోవా, మా మీద ఇంకా కోపంతోనే ఉండకు. మా పాపాలను శాశ్వతంగా జ్ఞాపకం చేసుకోవద్దు. దయచేసి మమ్మల్ని చూడు, మేము నీ ప్రజలము. నీ పవిత్ర పట్టణాలు శూన్యంగా ఉన్నాయి. ఆ పట్టణాలు ఇప్పుడు అరణ్యాలవలె ఉన్నాయి. సీయోను ఒక అరణ్యం. యెరూషలేము నాశనం చేయబడింది. మా పవిత్ర ఆలయం అగ్నిచేత కాల్చి వేయబడింది. ఆ ఆలయం మాకు ఎంతో గొప్పది. మా తండ్రులు అక్కడ నిన్ను ఆరాధించారు. మాకు ఉండిన మంచి వస్తువులన్నీ ఇప్పుడు నాశనం చేయబడ్డాయి. నీవు నీ ప్రేమను ఎన్నటికీ మాకు చూపకుండా ఉంచుతాయా ఈ వస్తువులు? నీవు ఏమీ పలుకకుండనే కొనసాగుతావా? శాశ్వతంగా నీవు మమ్మల్ని శిక్షిస్తావా?

షేర్ చేయి
యెషయా 64 TERV

యెషయా 64:1-12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయురీతిగాను నీవు దిగివచ్చెదవు గాక. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు. నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించు చున్నావు. చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి బహుకాలమునుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా? మేమందరము అపవిత్రులవంటివారమైతిమి మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు. యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము. యెహోవా, అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసి కొనకుము చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమంద రము నీ ప్రజలమే గదా. నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను. యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగానుందువా? అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా?

షేర్ చేయి
యెషయా 64 TELUBSI