యెషయా 53:9-11
యెషయా 53:9-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోటిలో ఏ మోసం లేదు కాని అతడు చనిపోయినప్పుడు దుర్మార్గులతో సమాధి చేశారు, ధనవంతుల సమాధిలో అతన్ని ఉంచారు. అయినా అతన్ని నలగ్గొట్టడం యెహోవాకు ఇష్టమైంది, యెహోవా అతని జీవితాన్ని పాపపరిహారబలిగా అర్పించినా, అతడు తన సంతానాన్ని చూస్తాడు, దీర్ఘకాలం జీవిస్తాడు, యెహోవా చిత్తం అతని హస్తంలో వృద్ధిచెందుతుంది. అతడు శ్రమ పొందిన తర్వాత జీవిత వెలుగును చూసి తృప్తి చెందుతాడు; నీతిమంతుడైన నా సేవకుడు తన జ్ఞానంతో అనేకమందిని సమర్థిస్తాడు, వారి దోషాలను అతడు భరిస్తాడు.
యెషయా 53:9-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతడు చనిపోయినప్పుడు నేరస్థులతో అతన్ని సమాధి చేశారు. ధనవంతుని దగ్గర అతన్ని ఉంచారు. అతడు ఏ నేరమూ చేయలేదు. అతని నోట మోసం ఎప్పుడూ లేదు. అయినా ఆయన్ని నలగ్గొట్టడం, బాధించడం యెహోవాకు ఇష్టమయింది. ఆయన అతనికి వ్యాధి కలగచేశాడు. ఆయన జీవితాన్ని మీ పాప పరిహారంగా మీరు ఎంచితే ఆయన తన సంతానాన్ని చూస్తాడు. ఆయన చాలాకాలం జీవిస్తాడు. ఆయన ద్వారా యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది. తన వేదన వలన కలిగిన ఫలితం చూసి ఆయన సంతృప్తి పొందుతాడు. నీతిమంతుడైన నా సేవకుడు అనేకమంది దోషాలను భరించి తన జ్ఞానంతో వారిని నిర్దోషులుగా ఎంచుతాడు.
యెషయా 53:9-11 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన చనిపోయి ధనికునితో పాతి పెట్టబడ్డాడు. దుష్టులతో పాటు ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన దౌర్జన్యం చేయలేదు. ఆయన ఎన్నడూ మోసం చేయలేదు. అయినా ఆయన్ని నలుగ గొట్టాలని శ్రమకలిగించాలని, యెహోవాకు ఇష్టం. యెహోవా ఆయన ప్రాణాన్ని పాప పరిహర బలిగా అర్పించితే ఆయన బహుకాలం జీవించి తన సంతానాన్ని చూస్తాడు. ఆయనలో యెహోవా చిత్తం సఫలమవుతుంది. ఆయన తన ఆత్మలో ఎన్నో శ్రమల పొందిన తర్వాత వెలుగును చూచి సంతృప్తి చెందుతాడు. నీతిమంతుడైన నా సేవకుడు తన జ్ఞానం వల్ల అనేకులను నీతిమంతులుగా చేస్తాడు.
యెషయా 53:9-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.