యెషయా 51:9-23

యెషయా 51:9-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా హస్తమా, మేలుకో మేలుకో, బలాన్ని ధరించుకో! పాత తరంలో ఉన్నట్లు గడచిన కాలంలో ఉన్నట్లు లేచిరా. రాహాబును ముక్కలుగా నరికింది నీవే కదా? సముద్రపు మృగాన్ని పొడిచింది నీవే కదా? సముద్రాన్ని లోతైన జలాలను ఎండిపోయేలా చేసింది నీవే కదా, విడిపించబడిన వారు దాటి వెళ్లేలా సముద్ర లోతుల్లో దారి చేసింది నీవే కదా? యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు. వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు; నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది. వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు. దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి. “నేను నేనే మిమ్మల్ని ఓదార్చుతాను. చనిపోయే మనుష్యులకు గడ్డివంటి మనుష్యులకు మీరు ఎందుకు భయపడతారు? ఆకాశాలను విస్తరింపజేసి భూమి పునాదులను వేసిన మీ సృష్టికర్తయైన యెహోవాను ఎందుకు మరచిపోయారు? బాధించేవాడు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాని కోపాన్ని చూసి ప్రతిరోజు ఎందుకు భయపడుతూ బ్రతుకుతున్నారు? బాధించేవాని కోపం ఏమయ్యింది? క్రుంగిపోయిన ఖైదీలు త్వరలో విడుదల పొందుతారు; వారు తమ చెరసాల గోతిలో చనిపోరు. వారికి ఆహారం తక్కువకాదు. నేను మీ దేవుడనైన యెహోవాను, సముద్రపు అలలు ఘోషించేలా నేను దానిని రేపుతాను. సైన్యాల యెహోవా అని ఆయనకు పేరు. నీ నోటిలో నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను, నేను ఆకాశాలను స్థాపించాను, భూమి పునాదులు వేసినవాడను ‘మీరే నా ప్రజలు’ అని సీయోనుతో చెప్పాను.” యెరూషలేమా లే, మేలుకో, మేలుకో! యెహోవా ఉగ్రత పాత్రను ఆయన చేతి నుండి తీసుకుని నీవు త్రాగావు. ప్రజలను తడబడేలా చేసే పాత్రలోనిది అంతా మడ్డితో సహా పూర్తిగా నీవు త్రాగావు. ఆమెకు పుట్టిన పిల్లలందరిలో తనకు దారి చూపడానికి ఎవరూ లేరు; ఆమె పెంచిన పిల్లలందరిలో తన చేతిని పట్టుకునే వారెవరూ లేరు. ఈ రెండు విపత్తులు నీ మీదికి వచ్చాయి. నిన్ను ఎవరు ఓదార్చగలరు? విధ్వంసం, వినాశనం, కరువు, ఖడ్గం నీ మీదికి వచ్చాయి, నిన్ను ఎవరు ఆదరించగలరు? నీ పిల్లలు మూర్ఛపోయారు. దుప్పి వలలో చిక్కుకున్నట్లు ప్రతి వీధి మూలల్లో వారు పడిపోయారు. యెహోవా ఉగ్రతతో నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు. ద్రాక్షరసం లేకుండానే మత్తులో మునిగి శ్రమపడినదానా, ఈ మాట విను. తన ప్రజల కోసం వాదించే నీ దేవుడు నీ ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, నిన్ను తడబడేలా చేసే పాత్రను, నా ఉగ్రత పాత్రను నీ చేతిలో నుండి తీసివేశాను. నీవు మరలా దానిని త్రాగవు. ‘మేము మీమీద నడిచేటట్లు క్రింద పడుకో’ అని నీతో చెప్పి నిన్ను బాధపెట్టేవాని చేతుల్లో దానిని పెడతాను, నీవు నీ వీపును నేలకు వంచి నడిచి వెళ్లడానికి ఒక వీధిగా చేశావు.”

యెషయా 51:9-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా హస్తమా లే! బలం ధరించుకో. పూర్వకాలంలో పురాతన తరాల్లో లేచినట్టు లే. భయంకరమైన సముద్ర జంతువును నరికివేసింది నువ్వే గదా? డ్రాగన్ను పొడిచేసింది నువ్వే గదా? చాలా లోతైన నీళ్లున్న సముద్రాన్ని ఇంకిపోయేలా చేసింది నువ్వే గదా? విడుదల పొందినవాళ్ళు దాటిపోయేలా సముద్ర లోతుల్లో దారి చేసింది నువ్వే గదా? యెహోవా విమోచించినవారు సంగీతనాదంతో సీయోనుకు తిరిగి వస్తారు. వారి తలలమీద ఎప్పటికీ నిలిచే సంతోషం ఉంటుంది. సంతోషానందాలు వారికి నిండుగా ఉంటాయి. దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోతాయి. నేను, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. చనిపోయే మనుషులకు, గడ్డిలాంటి మనుషులకు మీరెందుకు భయపడతారు? ఆకాశాలను పరచి భూమి పునాదులు వేసిన మీ సృష్టికర్త అయిన యెహోవాను ఎందుకు మరచిపోతున్నారు? బాధించేవాడు ఎంతో కోపంతో మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ప్రతిరోజూ నిరంతర భయంతో ఉన్నారు. బాధించేవాడి కోపం ఏమయింది? కుంగిపోయిన వారిని యెహోవా త్వరగా విడుదల చేస్తాడు. అతడు గోతిలోకి పోడు. చావడు. అతనికి తిండి లేకుండా పోదు. నేను యెహోవాను. నీ దేవుణ్ణి. సముద్రపు అలలు ఘోషించేలా దాన్ని రేపుతాను. నేను సేనల ప్రభువు యెహోవాను. నేను ఆకాశాలను పరచడానికీ భూమికి పునాదులు వేయడానికీ “నువ్వే నా ప్రజ” అని సీయోనుతో చెప్పడానికీ నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను. యెరూషలేమా! లే. లేచి నిలబడు. యెహోవా చేతినుంచి కోపంతో నిండిన పాత్రను తీసుకుని తాగినదానా! నువ్వు పాత్రలోనిదంతా తాగావు. తూలేలా తాగావు. ఆమె కనిన కొడుకులందరిలో ఆమెకు దారి చూపేవాడు ఎవడూ లేడు. ఆమె పెంచిన కొడుకులందరిలో ఆమె చెయ్యి పట్టుకునే వాడెవడూ లేడు. రెండు విపత్తులు నీ మీదికి వచ్చాయి. నీతో కలిసి ఎవరు ఏడుస్తారు? ధ్వంసం, నాశనం, కరువు, కత్తి నీ మీదికి వచ్చాయి. నిన్నెవరు ఓదారుస్తారు? నీ కొడుకులు మూర్ఛపోయారు. దుప్పి వలలో చిక్కుపడినట్టు, ప్రతి వీధిలో పడియున్నారు. యెహోవా కోపంతో నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు. అయితే ద్రాక్షమద్యం లేకుండానే మత్తుగా ఉండి బాధపడినదానా, ఈ మాట విను. నీ యెహోవా ప్రభువు తన ప్రజల పక్షాన వాదించే నీ దేవుడు ఇలా చెబుతున్నాడు, “ఇదిగో, నువ్వు తూలేలా చేసే పాత్రను నా కోపంతో నిండిన ఆ పాత్రను నీ చేతిలోనుంచి తీసివేశాను. నీవది మళ్ళీ తాగవు. నిన్ను బాధించేవాళ్ళ చేతిలో దాన్ని పెడతాను. ‘మేము నీ మీద నడిచిపోతాం. సాష్టాంగ పడు’ అని వాళ్ళు నీతో చెబితే నువ్వు నీ వీపును దాటే వారికి దారిగా చేసి నేలకు దాన్ని వంచావు గదా.”

యెషయా 51:9-23 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా హస్తమా (శక్తి) మేలుకో! మేలుకో! నీ బలం సిద్ధం చేయి. చాలాకాలం క్రిందట నీవు చేసినట్టు పూర్వకాలాల్లో నీవు చేసినట్టు నీ బలాన్ని ప్రయోగించు. రాహాబును ఓడించిన శక్తి నీవే. మకరాన్ని నీవే ఓడించావు. సముద్రం ఎండిపోయేట్టు నీవే చేశావు. మహా అగాధ జలాలను ఎండిపోయేట్టు నీవు చేశావు. సముద్రపు అతి లోతైన స్థలాలను నీవు త్రోవగా చేశావు. నీ ప్రజలు ఆ మార్గాన వెళ్లి రక్షించబడ్డారు. యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు. వారు ఆనందంగా సీయోనుకు తిరిగి వస్తారు. వారు ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారు. వారి ఆనందం వారి తలలమీద శాశ్వత కిరీటంలా ఉంటుంది. ఆనందంతో వారు పాటలు పాడుతూంటారు. దుఃఖం అంతా దూరమైపోతుంది. యెహోవా చెబుతున్నాడు, “నిన్ను ఆదరించే వాడను నేనే. కనుక ఇతరులను గూర్చి నీవెందుకు భయపడాలి? వాళ్లు కేవలం బ్రతికి, చచ్చే మనుష్యులు మాత్రమే. వాళ్లు కేవలం మానవ మాత్రులు. వారు కూడా గడ్డిలాగే చస్తారు.” యెహోవా మిమ్మల్ని చేశాడు. తన శక్తితో ఆయన భూమిని చేశాడు. తన శక్తితో ఆకాశాలను భూమికి పైగా ఆయన విస్తరింపజేసాడు. కానీ ఆయనను, ఆయన శక్తిని మీరు మరచిపోతారు. కనుక మీకు హాని చేసే కోపిష్ఠులైన మనుష్యులను గూర్చి ఎల్లప్పుడు మీరు భయపడుతుంటారు. ఆ మనుష్యులు మిమ్మును నాశనం చేయాలని పథకం వేసారు. కానీ ఇప్పుడు వాళ్లెక్కడ? వాళ్లంతా పోయారు. చెరసాలలోని మనుష్యులు త్వరలోనే విడుదల చేయబడతారు. వాళ్లు చెరసాలలోనే మరణించి, కుళ్లిపోరు. ఆ మనుష్యులకు సరిపడినంత ఆహారం ఉంటుంది. “నేను యెహోవాను, మీ దేవుడను. నేను సముద్రాన్ని కదలిస్తాను, కెరటాలు పుట్టిస్తాను.” (ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.) “నా సేవకా, నీవు చెప్పాలని నేను కోరే మాటలను నేనే నీకు ఇస్తాను. నా చేతులతో నిన్ను నేను కప్పిఉంచి కాపాడుతాను. క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చేసేందుకు నిన్ను నేను ఉపయోగించుకొంటాను. ‘మీరు నా ప్రజలు అని ఇశ్రాయేలుతో చెప్పేందుకు నిన్ను నేను వాడుకొంటాను.’” మేలుకో! మేలుకో! యెరూషలేమా, లెమ్ము! నీ మీద యెహోవా చాలా కోపగించాడు. అందువల్ల నీవు శిక్షించబడ్డావు. నీవు తాగాల్సిన ఒక విషపుపాత్రలా ఉంది ఆ శిక్ష. నీవు దానిని తాగావు. యెరూషలేముకు చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ వారిలో ఎవ్వరూ ఆమెకు నాయకులు కాలేదు. ఆమె పెంచిన పిల్లలు ఎవ్వరు ఆమెను నడిపించే మార్గదర్శులు కాలేదు. యెరూషలేముకు జంట జంటలుగా కష్టాలు వచ్చాయి, దొంగిలించటం, చొరబడటం, మహా ఆకలిపోరాటం. నీవు శ్రమ అనుభవిస్తున్నప్పుడు నీకు ఎవ్వరూ సహాయం చేయలేదు. ఎవరూ నీ మీద దయచూపించలేదు. నీ ప్రజలు బలహీనులయ్యారు. వారు నేలమీద పడి, అలానే ఉండిపోయారు. ప్రతి వీధిమలుపులోను వారు పడివున్నారు. వారు వలలో పట్టబడిన జంతువుల్లా ఉన్నారు. వారు ఇంకెంత మాత్రం భరించలేనంతగా, యెహోవా కోపంచేత శిక్షించబడ్డారు. దేవుడు వారికి ఇంకా ఎక్కువ శిక్ష విధిస్తాను అన్నప్పుడు వారు మరీ బలహీనులై పోయారు. అయ్యో, యెరూషలేమూ, నా మాట విను. ఒక త్రాగుబోతువానిలా నీవు బలహీనంగా ఉన్నావు, కానీ నీవు ద్రాక్షరసం తాగినందుచేత కాదు మత్తుగా ఉన్నది. నీవు ఆ “విషపు పాత్ర” మూలంగా బలహీనంగా ఉన్నావు. నీ దేవుడు, యజమానియైన యెహోవా తన ప్రజలకోసం పోరాడుతాడు. ఆయన నీతో ఇలా అంటున్నాడు: “చూడు, ఈ ‘విషపు పాత్రను’ (శిక్షను) నీ వద్దనుండి నేను తొలగించి వేస్తున్నాను. నీ మీద నా కోపాన్ని తీసివేస్తున్నాను. ఇంకెంత మాత్రం నీవు నా కోపం మూలంగా శిక్షించబడవు. నీకు హాని చేసిన వారిని శిక్షించటానికి ఇప్పుడు నేను నా కోపాన్ని వినియోగిస్తాను. ఆ ప్రజలు నిన్ను చంపటానికి ప్రయత్నించారు. ‘మా యెదుట, సాష్టాంగపడు, మేము నీ మీద నడుస్తాం’ అని వారు నీతో చెప్పారు. వాళ్ల ముందు సాష్టాంగ పడేట్టు వారు నిన్ను బలవంతం చేశారు. అప్పుడు ఆ మనుష్యులు నడుచుటకు నీ వీపును ధూళిగా చేశారు. వారు ప్రయాణం చేయుటకు నీవు ఒక తోవలా ఉన్నావు.”

యెషయా 51:9-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచి నట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా? అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా? విమోచింపబడినవారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవే గదా? యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండునువారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? బాధపెట్టువాడు నాశనము చేయుటకుసిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను? క్రుంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడనైన యెహోవాను సముద్రముయొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను. యెరూషలేమా, లెమ్ము లెమ్ము యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చు కొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూప గలవాడెవడును లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టు కొనువాడెవడును లేకపోయెను. ఈ రెండు అపాయములు నీకు సంభవించెను నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు నాశనము కరవు ఖడ్గము నీకు ప్రాప్తించెను, నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు దుప్పి వలలో చిక్కు పడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు. యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోనువారు నిండియున్నారు. ద్రాక్షారసములేకయే మత్తురాలవై శ్రమపడినదానా, ఈ మాట వినుము. నీ ప్రభువగు యెహోవా తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు –ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలోనుండి తీసివేసియున్నాను నీవికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమనివారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదావారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.