యెషయా 51:1-8
యెషయా 51:1-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“నీతిని అనుసరిస్తూ యెహోవాను వెదికే వారలారా, నా మాట వినండి: మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో దానివైపు చూడండి, మీరు ఏ గని నుండి తీయబడ్డారో దానివైపు చూడండి; మీ తండ్రియైన అబ్రాహామును, మీకు జన్మనిచ్చిన శారాను చూడండి, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను, అతన్ని ఆశీర్వదించి అతన్ని అనేకమందిగా చేశాను. యెహోవా తప్పకుండా సీయోనును ఓదారుస్తారు దాని శిథిలాలన్నిటిని దయతో చూస్తారు; దాని ఎడారులను ఏదెనులా చేస్తారు. దాని బీడుభూములను యెహోవా తోటలా చేస్తారు. ఆనంద సంతోషాలు, కృతజ్ఞతాస్తుతులు, సంగీత ధ్వనులు దానిలో కనబడతాయి. “నా ప్రజలారా, మా మాట వినండి; నా దేశమా, నా మాట విను: నా దగ్గర నుండి ఒక హెచ్చరిక వెళ్తుంది; నా న్యాయం దేశాలకు వెలుగుగా మారుతుంది. నా నీతి వేగంగా సమీపిస్తుంది, నా రక్షణ మార్గంలో ఉంది. నా చేయి దేశాలకు తీర్పు తీరుస్తుంది. ద్వీపాలు నా వైపు చూస్తాయి, నిరీక్షణతో నా చేయి కోసం వేచి ఉంటాయి. ఆకాశాల వైపు మీ కళ్ళెత్తి చూడండి, క్రిందున్న భూమిని చూడండి; ఆకాశాలు పొగలా మాయమైపోతాయి, భూమి వస్త్రంలా పాతబడిపోతుంది దాని నివాసులు జోరీగల్లా చనిపోతారు. అయితే నా రక్షణ నిత్యం ఉంటుంది, నా నీతి ఎన్నటికీ విఫలం కాదు. “సరియైనది తెలిసినవారలారా, నా మాట వినండి. నా బోధను హృదయంలో ఉంచుకున్న ప్రజలారా, వినండి: కేవలం మనుష్యులు వేసే నిందలకు భయపడకండి వారి దూషణకు దిగులుపడకండి. వస్త్రాన్ని కొరికినట్లు చిమ్మెట వారిని తినివేస్తుంది; పురుగు బొచ్చును కొరికినట్లు వారిని మ్రింగివేస్తుంది. అయితే నా నీతి నిత్యం ఉంటుంది, నా రక్షణ తరతరాలు ఉంటుంది.”
యెషయా 51:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీతిని అనుసరిస్తూ యెహోవాను వెతుకుతూ ఉండే మీరు, నా మాట వినండి. ఏ బండ నుంచి మిమ్మల్ని చెక్కారో ఏ గని నుంచి మిమ్మల్ని తవ్వారో దాన్ని గమనించండి. మీ తండ్రి అబ్రాహామును, మిమ్మల్ని కనిన శారాను గమనించండి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను. అతన్ని దీవించి అనేకమందిగా చేశాను. యెహోవా సీయోనును ఆదరిస్తాడు. పాడైన దాని స్థలాలన్నిటినీ ఆయన ఆదరిస్తాడు. దాని అరణ్య ప్రదేశాన్ని ఏదెనులాగా చేశాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటలాగా చేస్తున్నాడు. దానిలో ఆనందం, సంతోషం, కృతజ్ఞత, సంగీతనాదం, ఉంటాయి. నా ప్రజలారా, నా మీద దృష్టి పెట్టండి. నా మాట వినండి! నేనొక ఆజ్ఞ జారీ చేస్తాను. రాజ్యాలకు వెలుగుగా నా న్యాయాన్ని ఉంచుతాను. నా నీతి దగ్గరగా ఉంది. నా విడుదల బయలుదేరుతుంది. నా చెయ్యి రాజ్యాలను శిక్షిస్తుంది. ద్వీపాల్లో ఉండేవాళ్ళు నా కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు నా చేతి వైపు ఆశతో చూస్తారు. ఆకాశం వైపు మీ కళ్ళు ఎత్తండి. కిందున్న భూమిని చూడండి. అంతరిక్షం, పొగలాగా కనిపించకుండా పోతుంది. భూమి బట్టలాగా మాసిపోతుంది. దాని నివాసులు ఈగల్లాగా చస్తారు. అయితే నా రక్షణ ఎప్పటికీ ఉంటుంది. నా నీతికి అంతం ఉండదు. సరైనది అంటే ఏంటో తెలిసిన మీరు నా మాట వినండి. నా చట్టాన్ని మీ హృదయంలో ఉంచుకున్న మీరు, వినండి. మనుషుల నిందకు భయపడవద్దు. వారి దూషణకు దిగులుపడవద్దు. చిమ్మెట బట్టలను కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. పురుగు, బొచ్చును కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. అయితే నా నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నా రక్షణ తరతరాలుంటుంది.
యెషయా 51:1-8 పవిత్ర బైబిల్ (TERV)
“మీలో కొంతమంది ప్రజలు మంచి జీవితాలు జీవించాలని కష్టపడి ప్రయత్నిస్తారు. సహాయంకోసం మీరు యెహోవా దగ్గరకు వెళ్తారు. నా మాట వినండి. మీ తండ్రి అబ్రాహామును మీరు చూడాలి. మీరు ఏ బండనుండి చెక్కబడ్డారో, ఆ బండ ఆయనే. అబ్రాహాము మీ తండ్రి, మీరు ఆయన్ని చూడాలి. మీకు జన్మనిచ్చిన మాతృమూర్తి శారాను మీరు చూడాలి. అబ్రాహామును నేను పిలిచినప్పుడు అతడు ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు నేను అతణ్ణి ఆశీర్వదించాను, అతడు ఒకగొప్ప వంశాన్ని ప్రారంభించాడు. అనేకానేక మంది అతనినుండి ఉద్భవించారు.” అదే విధంగా సీయోనును యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆమెను గూర్చి, ఆమె ప్రజలను గూర్చి యెహోవా విచారించి, ఆమెకోసం ఒక గొప్ప కార్యం చేస్తాడు. అరణ్యాన్ని యెహోవా మార్చేస్తాడు. అరణ్యం ఏదెను వనంలా ఒక వనం అయిపోతుంది. ఆ దేశం ఖాళీగా ఉంది గాని అది యెహోవా తోటలా తయారవుతుంది. అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారు. అక్కడ ప్రజలు వారి ఆనందాన్ని ప్రదర్శిస్తారు. కృతజ్ఞత, విజయాలను గూర్చి వారు పాటలు పాడుతారు. “నా ప్రజలారా, నా మాట వినండి! ప్రజలు ఎలా జీవించాలో అది వారికి చూపించే దీపాల్లాంటివి నా నిర్ణయాలు. నేను న్యాయవంతుడనని త్వరలోనే నేను చూపిస్తాను. త్వరలోనే నేను నిన్ను రక్షిస్తాను. నేను నా శక్తిని ప్రయోగించి, రాజ్యాలన్నింటికి తీర్పు తీరుస్తాను. దూర ప్రదేశాలన్నీ నాకోసం కనిపెట్టుకొని ఉన్నాయి. నా శక్తి వారికి సహాయం చేయాలని అవి కనిపెట్టుకొని ఉన్నాయి. ఆకాశాలవైపు చూడండి. మీ చుట్టూ క్రింద ఉన్న భూమిని చూడండి. ఆకాశాలు పొగ మేఘాల్లా మాయమైపోతాయి. భూమి పనికి మాలిన పాత గుడ్డల్లా అవుతుంది. భూమి మీద మనుష్యులు మరణిస్తారు. అయితే నా రక్షణ శాశ్వతంగా కొనసాగుతుంది. నా దయ ఎప్పటికీ అంతంకాదు. దయను అవగాహన చేసికొనే ప్రజలారా, మీరు నా మాట వినాలి. నా ఉపదేశాలను పాటించే ప్రజలారా నేను చెప్పే మాటలు మీరు వినాలి. దుష్ట ప్రజలు విషయం భయపడకండి. వారు మీకు చెప్పే చెడ్డ విషయాలను గూర్చి భయపడకండి. ఎందుకంటే వారు పాత గుడ్డల్లా ఉంటారు గనుక. చిమ్మెటలు వాటిని తినివేస్తాయి. వారు గొర్రెబొచ్చులా ఉంటారు. పురుగులు వాటిని తినివేస్తాయి. అయితే నా దయ శాశ్వతంగా కొనసాగుతుంది. నా రక్షణ శాశ్వతంగా సదా కొనసాగుతుంది.”
యెషయా 51:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలో చించుడి మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలో చించుడి మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలెనగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును నా ప్రజలారా, నా మాట ఆలకించుడి నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నాయొద్దనుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియ మింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పుతీర్చును ద్వీపవాసులు నాతట్టు చూచి నిరీక్షణ గలవా రగుదురువారు నా బాహువును ఆశ్రయింతురు. ఆకాశమువైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును భూమి వస్త్రమువలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలె చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు. నీతిననుసరించువారలారా, నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులుపడకుడి. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తర తరములుండును.