యెషయా 50:4-11
యెషయా 50:4-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అలసినవారిని బలపరిచే మాటలు మాట్లాడడానికి చక్కగా ఉపదేశించే నాలుకను ప్రభువైన యెహోవా నాకు ఇచ్చారు. ఆయన ప్రతి ఉదయం నన్ను మేల్కొలుపుతారు, శిష్యునిలా నేను శ్రద్ధగా వినేలా చేస్తారు. ప్రభువైన యెహోవా నా చెవులు తెరిచారు; నేను తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను వెనుతిరగలేదు. నన్ను కొట్టినవారికి నా వీపు అప్పగించాను, నా గడ్డం పెరికినవారికి నా చెంపలు అప్పగించాను; హేళన చేసిన వారి నుండి, ఉమ్మివేసిన వారి నుండి నా ముఖం దాచుకోలేదు. ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తారు కాబట్టి నేను సిగ్గుపరచబడను. నేను సిగ్గుపరచబడనని నాకు తెలుసు కాబట్టి నా ముఖాన్ని చెకుముకి రాయిలా చేసుకున్నాను. నన్ను నీతిమంతునిగా ఎంచే వాడు సమీపంలోనే ఉన్నాడు. నాపై ఎవరు అభియోగాలు మోగపలరు? మనం కలిసి వాదించుకుందాం! నా ప్రతివాది ఎవడు? అతడు నన్ను ఎదిరించాలి! ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తారు. నన్ను ఎవరు ఖండిస్తారు? వారందరూ వస్త్రంలా పాతబడిపోతారు. చిమ్మెటలు వారిని తినివేస్తాయి. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినే వారెవరు? వెలుగు లేకుండా ఉంటూ చీకటిలో నడిచేవాడు యెహోవా నామాన్ని నమ్మి తన దేవునిపై ఆధారపడాలి. అయితే ఇప్పుడు అగ్నిని ముట్టించి మీ చుట్టూ మండుతున్న దివిటీలను పెట్టుకునే మీరందరు, వెళ్లండి, మీ మంటల వెలుగులో నడవండి మీరు వెలిగించిన దివిటీల మంటల్లో నడవండి. నా చేతి నుండి మీరు పొందుకునేది ఇదే: మీరు వేదనలో పడుకుంటారు.
యెషయా 50:4-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అలసినవాణ్ణి నా మాటలతో ఆదరించే జ్ఞానం నాకు కలిగేలా శిష్యునికి ఉండాల్సిన నాలుక యెహోవా నాకిచ్చాడు. శిష్యునిలాగా నేను వినడానికి ఆయన ప్రతి ఉదయాన నన్ను మేల్కొలుపుతాడు. ప్రభువైన యెహోవా నా చెవికి వినే బుద్ధి పుట్టించాడు కాబట్టి నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా దూరం జరగలేదు. నన్ను కొట్టే వారికి నా వీపును, వెంట్రుకలు పెరికే వారికి నా చెంపలను అప్పగించాను. ఉమ్మి వేసేవారికి, అవమానించే వారికి నా ముఖం దాచుకోలేదు. ప్రభువైన యెహోవా నాకు సాయం చేస్తాడు కాబట్టి నేనేమీ సిగ్గుపడలేదు. నాకు సిగ్గు కలగదని తెలుసు కాబట్టి నా ముఖాన్ని చెకుముకి రాయిలాగా చేసుకున్నాను. నన్ను నీతిమంతునిగా ఎంచే దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు. నన్ను వ్యతిరేకించే వాడెవడు? మనం కలిసి వాదించుకుందాం. నా ప్రతివాది ఎవడు? అతణ్ణి నా దగ్గరికి రానివ్వండి. ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. నా మీద ఎవరు నేరం మోపుతారు? వారంతా బట్టలాగా పాతబడిపోతారు. వారిని చిమ్మెట తినివేస్తుంది. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినే వాడెవడు? వెలుగు లేకుండా చీకటిలో నడిచేవాడు యెహోవా నామాన్ని ఆశ్రయించి ఆయన్ని నమ్ముకోవాలి. ఇదిగో, నిప్పులు వెలిగించి మీ చుట్టూ మంటలను పెట్టుకొనే వారంతా మీ అగ్ని వెలుగులో, మీరు వెలిగించిన మంటల్లో నడవండి. ఇది మీకు నా చేతినుండే కలుగుతున్నది. మీరు వేదనతో పండుకుంటారు.
యెషయా 50:4-11 పవిత్ర బైబిల్ (TERV)
ఉపదేశం చేయగల సామర్థ్యాన్ని నా ప్రభువైన యెహోవా నాకు ఇచ్చాడు. కనుక ఈ విచారగ్రస్థ ప్రజలకు ఇప్పుడు నేను ఉపదేశము చేస్తాను. ప్రతి ఉదయం ఆయన నన్ను మేల్కొలిపి, ఒక విద్యార్థిలా నాకు ఉపదేశిస్తాడు. నేను నేర్చుకొనేందుకు నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. మరియు నేను ఆయన మీద తిరుగబడలేదు. నేను ఆయనను వెంబడించటం మానను. నేను ఆ ప్రజల్ని నన్ను కొట్టనిస్తాను. వాళ్లను నా గడ్డం పీకనిస్తాను. వాళ్లు నన్ను చెడ్డ మాటలు తిట్టి, నా మీద ఉమ్మి వేసినప్పుడు నేను నా ముఖం దాచుకోను. నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. కనుక వారు చెప్పే చెడ్డ మాటలు నాకు హాని కలిగించవు. నేను బలవంతుడనై ఉంటాను. నేను నిరాశ చెందనని నాకు తెలుసు. యెహోవా నాతో ఉన్నాడు. నేను నిర్దోషినని ఆయనకు తెలుసును. కనుక నేను దోషినని ఎవరూ చూపించలేరు. నాదే తప్పు అని ఎవరైనా రుజువు చేయాలనుకొంటే, ఆ వ్యక్తి నా దగ్గరకు రావాలి. మేము ఒక తీర్పు జరిగిస్తాం. అయితే చూడండి, నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. అందుచేత నేను చెడ్డవాడినని ఎవ్వరూ చూపించలేరు. అలాంటి వాళ్లంతా పనికిమాలిన గుడ్డల్లా అవుతారు. వాటిని చెదలు తినేస్తాయి. యెహోవాను గౌరవించే ప్రజలు ఆయన సేవకుని మాటకూడా వింటారు. ఆ సేవకుడు ఏం జరుగుతుందో తెలియకుండానే సంపూర్ణంగా దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తాడు. అతడు వాస్తవంగా యెహోవా నామాన్నే నమ్ముకొంటాడు, మరియు ఆ సేవకుడు తన దేవుని మీద ఆధారపడతాడు. “ప్రజలారా, చూడండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా జీవించాలనుకొంటున్నారు. మీ మంటలను, జ్వాలలను మీరే అంటిస్తున్నారు. అలానే, మీ దారిన మీరు జీవిస్తున్నారు. కానీ మీరు శిక్షించబడతారు. మీరు మీ మంటల్లో, జ్వాలల్లో పడతారు, మీరు కాల్చివేయబడుతారు. అలా జరిగేట్టు నేను చేస్తాను.
యెషయా 50:4-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు వినకుండ నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్ప గించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్నికొరవులను మీచుట్టు పెట్టుకొనువారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి నా చేతివలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదనగలవారై పండుకొనెదరు.