యెషయా 49:13-16
యెషయా 49:13-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆకాశాల్లారా, ఉత్సాహ ధ్వని చేయండి; భూమీ, సంతోషించు; పర్వతాల్లారా, ఆనందంతో పాట పాడండి! ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఓదారుస్తారు, బాధించబడిన తన ప్రజల పట్ల జాలి చూపిస్తారు. అయితే సీయోను, “యెహోవా నన్ను విడిచిపెట్టారు. ప్రభువు నన్ను మరచిపోయారు” అని అన్నది. “తల్లి తన చంటిబిడ్డను మరచిపోతుందా? తాను కన్న బిడ్డ మీద జాలిపడకుండ ఉంటుందా? తల్లియైన మరచిపోవచ్చు కాని నేను నిన్ను మరవను! చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను; నీ గోడలు నిత్యం నా ఎదుట ఉన్నాయి.
యెషయా 49:13-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బాధకు గురి అయిన తన ప్రజల మీద యెహోవా జాలిపడి వారిని ఓదారుస్తాడు. ఆకాశమా, ఉత్సాహధ్వని చెయ్యి. భూమీ, సంతోషించు. పర్వతాల్లారా, ఆనందగీతాలు పాడండి. అయితే సీయోను “యెహోవా నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నన్ను మరచిపోయాడు” అంది. స్త్రీ, తన గర్భాన పుట్టిన బిడ్డ మీద జాలిపడకుండా ఉంటుందా? తన చంటిపిల్లను మరచిపోతుందా? వాళ్ళు మరచిపోవచ్చు గానీ నేను నిన్ను మరచిపోను. చూడు, నా అరచేతుల్లో నిన్ను పచ్చబొట్టు పొడిపించుకున్నాను. నీ గోడలు ఎప్పటికీ నా ఎదుట ఉన్నాయి.
యెషయా 49:13-16 పవిత్ర బైబిల్ (TERV)
భూమి, ఆకాశములారా సంతోషించండి. పర్వతములారా, ఆనందంగా కేకలు వేయండి. ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఆదరిస్తాడు గనుక. తన దీన జనులకు యెహోవా దయచూపిస్తాడు. కానీ ఇప్పుడు సీయోను అంటుంది, “యెహోవా నన్ను విడిచిపెట్టాడు. నా యజమాని నన్ను మరిచిపోయాడు” అని. అయితే నేనంటాను, “ఓ స్త్రీ తన శిశువును మరచిపోగలదా? లేదు. తన గర్భంనుండి వచ్చిన శిశువును ఒక స్త్రీ మరువగలదా? లేదు. ఒక స్త్రీ తన పిల్లలను మరువజాలదు. మరి నేను (యెహోవాను) మిమ్ములను మరువజాలను. చూడు, నేను నీ పేరు నా చేతి మీద వ్రాసుకొన్నాను. ఎల్లప్పుడు నేను నిన్నుగూర్చి తలుస్తాను.
యెషయా 49:13-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి. అయితే సీయోను–యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి