యెషయా 44:21-28
యెషయా 44:21-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“యాకోబూ, వీటిని గుర్తు చేసుకో, ఎందుకంటే, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. నేను నిన్ను నిర్మించాను, నీవు నా సేవకుడవు; ఇశ్రాయేలూ, నేను నిన్ను మరచిపోను. మేఘం విడిపోవునట్లు నీ దోషాలను ఉదయకాలపు మంచు మబ్బు తొలగిపోయేలా నీ పాపాలను, తుడిచివేశాను. నేను నిన్ను విడిపించాను. నా దగ్గరకు తిరిగి రా.” యెహోవా దీనిని చేశారు కాబట్టి ఆకాశాల్లారా, ఆనందంతో పాడండి; భూమి లోతుల్లారా, బిగ్గరగా అరవండి. పర్వతాల్లారా, అరణ్యమా, నీలో ఉన్న ప్రతి చెట్టు సంగీత నాదం చేయండి. యెహోవా యాకోబును విడిపించారు ఆయన ఇశ్రాయేలులో తన మహిమను చూపిస్తారు. “నిన్ను గర్భంలో రూపించిన నీ విమోచకుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “యెహోవాను నేనే అన్నిటిని సృష్టించాను, నేనే ఆకాశాలను విశాలపరిచాను నేను నేనే భూమికి ఆకారమిచ్చాను. నేనే అబద్ధ ప్రవక్తల సూచనలను భంగం చేస్తాను, సోదె చెప్పేవారిని వెర్రివారిగా చేస్తాను. జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి చదువును వ్యర్థం చేసేది నేనే. నా సేవకుని మాటలను స్థిరపరచి నా దూతల ఆలోచనను నెరవేర్చేది నేనే. “యెరూషలేము నివాస స్థలంగా అవుతుందని యూదా పట్టణాలు మరలా కట్టబడతాయని వాటిలో పాడైన స్థలాలను బాగుచేయబడతాయని చెప్పాను. నేను నీటి లోతులతో, ‘ఎండిపో, నీ ప్రవాహాలను ఎండిపోయేటట్లు చేస్తాను’ అని చెప్పాను. నేను కోరెషు గురించి, ‘అతడు నా కాపరి, నా ఇష్టాన్నంతటిని నెరవేరుస్తాడు’ అని చెప్పాను. అతడు, ‘యెరూషలేము తిరిగి కట్టబడాలి’ అని ‘మందిరం పునాదులు వేయబడాలి’ అని చెప్తాడు.”
యెషయా 44:21-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యాకోబూ, ఇశ్రాయేలూ, వీటిని గురించి ఆలోచించు. నువ్వు నా సేవకుడివి. నేనే నిన్ను నిర్మించాను. ఇశ్రాయేలూ, నువ్వు నాకు సేవకుడివి. నేను నిన్ను మరచిపోను. మంచు విడిపోయేలా నేను నీ అతిక్రమాలను, మేఘాలు తొలగిపోయేలా నీ పాపాలను తుడిచివేశాను. నేను నిన్ను విమోచించాను. నా దగ్గరికి తిరిగి రా. యెహోవా ఆ పని పూర్తి చేశాడు. ఆకాశాల్లారా, గీతాలు పాడండి. భూమీ, దాని కింది అగాధ స్థలాలు గొప్ప ధ్వని చేయండి. పర్వతాలూ, అరణ్యం, అందులోని ప్రతి వృక్షం, సంగీతనాదం చేయండి. యెహోవా యాకోబును విమోచిస్తాడు. ఆయన ఇశ్రాయేలులో తన మహిమను కనపరుస్తాడు.” గర్భంలో నిన్ను నిర్మించినవాడు, నీ విమోచకుడు అయిన యెహోవా ఈ విధంగా చెబుతున్నాడు, “యెహోవా అనే నేనే సమస్తాన్నీ జరిగించేవాణ్ణి. నేనొక్కడినే ఆకాశాలను విశాలపరచాను. నేనే భూమిని చక్కబరచిన వాణ్ణి. నేనే ప్రగల్భాలు పలికేవారి ప్రవచనాలను వ్యర్ధం చేసేవాణ్ణి. సోదె చెప్పేవాళ్ళను వెర్రివాళ్ళుగా, జ్ఞానులను వెనక్కి మళ్ళించి వారి తెలివిని బుద్ధిహీనతగా చేసేవాణ్ణి నేనే. నా సేవకుని మాటలను స్థిరపరిచే వాణ్ణీ, నా సందేశకుల ఆలోచనలు నెరవేర్చే వాణ్ణీ నేనే. యెరూషలేములో ప్రజలు నివసిస్తారనీ యూదా పట్టణాలను తిరిగి కడతారనీ నేను ఆజ్ఞాపించాను. దాని పాడైన స్థలాలను బాగు చేసేవాణ్ణి నేనే. నీ లోతైన సముద్రాలను ‘ఎండిపో’ అని చెప్పి వాటిని ఇంకిపోయేలా చేసేది నేనే. కోరెషుతో, ‘నా మందకాపరీ, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడా’ అని చెప్పేవాణ్ణి నేనే. అతడు ‘యెరూషలేమును తిరిగి కట్టండి’ అనీ ‘దేవాలయం పునాది వేయండి’ అనీ ఆజ్ఞాపిస్తాడని నేను చెబుతున్నాను.”
యెషయా 44:21-28 పవిత్ర బైబిల్ (TERV)
“యాకోబూ, ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకో. ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవని జ్ఞాపకం ఉంచుకో. నిన్ను నేను సృజించాను. నీవు నా సేవకుడవు. కనుక ఇశ్రాయేలూ, నన్ను మరచిపోవద్దు. నీ పాపాలు ఒక పెద్ద మేఘంలా ఉండేవి. కాని ఆ పాపాలను నేను తుడిచి వేశాను. గాలిలో అదృశ్యమైన ఒక మేఘంలా నీ పాపాలు పోయాయి. నేను నిన్ను తప్పించి కాపాడాను, కనుక తిరిగి నా దగ్గరకు వచ్చేయి.” యెహోవా గొప్ప కార్యాలు చేశాడు. గనుక ఆకాశాలు ఆనందిస్తున్నాయి. భూమి, దాని అగాధ స్థలాల్లో సహితం సంతోషిస్తుంది. పర్వతాలు దేవునికి వందనాలు చెల్లిస్తూ పాటలు పాడుతున్నాయి. అరణ్యంలో చెట్లన్నీ ఆనందంగా ఉన్నాయి. ఎందుకు? ఎందుకంటే యాకోబును యెహోవా రక్షించాడు గనుక. ఇశ్రాయేలుకు యెహోవా గొప్ప కార్యాలు చేశాడు గనుక. నీవు ఏమైయున్నావో అలా నిన్ను యెహోవా చేశాడు. నీవు ఇంకా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే యెహోవా దీనిని చేశాడు. “యెహోవాను, నేనే సమస్తం చేశాను. ఆకాశాలను నేనే అక్కడ ఉంచాను. నేనే భూమిని నా యెదుట పరచాను.” అని యెహోవా చెబుతున్నాడు. అబద్ధపు ప్రవక్తలు అబద్ధాలు చెబుతారు. అయితే వారి అబద్ధాలు, అబద్ధాలుగా యెహోవా చూపిస్తాడు. మంత్రాలు చేసే మనుష్యులను యెహోవా వెర్రివారిగా చేస్తాడు. జ్ఞానులను గూడ యెహోవా కలవరపెడ్తాడు. వారికి చాలా తెలుసు. అని వారు అనుకొంటున్నారు. కాని వాళ్లు వెర్రివాళ్లలా కనిపించేట్టు యెహోవా చేస్తాడు. ప్రజలకు సందేశాలు అందించేందుకు యెహోవా తన సేవకులను పంపిస్తాడు. ఆ సందేశాలను యెహోవా వాస్తవం చేస్తాడు. ప్రజలు చేయాల్సిన వాటిని గూర్చి వారికి చెప్పడానికి యెహోవా సందేశహరులను పంపిస్తాడు. వారి సలహా మంచిది అని యెహోవా సూచిస్తున్నాడు. “ప్రజలు మరల నీలో నివసిస్తారు” అని యెరూషలేముతో యెహోవా చెబుతున్నాడు. “మీరు మరల నిర్మించబడతారు” అని యూదా పట్టణాలతో యెహోవా చెబుతున్నాడు. “నేను మరల మిమ్మల్ని పట్టణాలుగా చేస్తాను” అని నాశనం చేయబడిన పట్టణాలతో యెహోవా చెబుతున్నాడు. “ఎండిపొండి! మీ కాలువలను నేను ఎండిపోయేట్టు చేస్తాను” అని లోత్తెన జలాలతో యెహోవా చెబుతున్నాడు. యెహోవా కోరేషుతో చెబుతున్నాడు, “నీవు నా గొర్రెల కాపరివి. నేను కోరిన వాటిని నీవు చేస్తావు. ‘నీవు మరల కట్టబడతావు’ అని యెరూషలేముతో నీవు చెబుతావు. ‘నీ పునాదులు మరల నిర్మించబడతాయి’” అని నీవు ఆలయంతో చెబుతావు.
యెషయా 44:21-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్న తునిగా కనుపరచుకొనును గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థముచేయు వాడను సోదెగాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను –యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే. నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను కోరెషుతో–నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో–నీవు కట్టబడుదువనియు దేవాలయ మునకు పునాదివేయబడుననియు నేను చెప్పు చున్నాను.