యెషయా 43:11-28

యెషయా 43:11-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. బయలుపరిచింది రక్షించింది ప్రకటించింది నేనే మీ మధ్య ఉన్నది నేనే, ఏ ఇతర దేవుడో కాదు. నేనే దేవుడను మీరు నా సాక్షులు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “అవును, పూర్వ రోజులనుండి ఉన్నవాడను నేనే. నా చేతిలో నుండి ఎవరు విడిపించలేరు. నేను చేసే పనిని తిప్పగలవారు ఎవరు?” అని యెహోవా చెప్తున్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీ విమోచకుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “మీ కోసం నేను బబులోనుకు సైన్యాన్ని పంపి బబులోనీయులందరూ వేటిని బట్టి గర్వించేవారో వారిని ఆ ఓడలలో పారిపోయేలా చేస్తాను. యెహోవానైన నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఇశ్రాయేలును సృజించిన నేనే మీకు రాజును.” యెహోవా ఇలా అంటున్నారు: సముద్రంలో మార్గాన్ని ఏర్పరచినవాడు, గొప్ప జలాల్లో దారిని కలుగజేసినవాడు, రథాలను గుర్రాలను, సైన్యాన్ని వీరులను రప్పించిన యెహోవా చెప్పే మాట ఇదే వారందరు కలిసి పడిపోయారు మరలా ఎప్పటికీ లేవరు, ఆరిపోయిన వత్తిలా వారు నిర్మూలించబడతారు: “పూర్వ విషయాల్ని మరచిపోండి; గత సంగతులను ఆలోచించకండి. చూడండి, నేను ఒక క్రొత్త పని చేస్తున్నాను! ఇప్పుడే అది మొలకెత్తుతుంది; మీరు దానిని గ్రహించలేదా? నేను అరణ్యంలో దారి కలుగజేస్తున్నాను, ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను. నేను ఏర్పరచుకున్న నా ప్రజలు త్రాగడానికి అరణ్యంలో నీళ్లు ఇస్తున్నాను ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను కాబట్టి అడవి జంతువులు, నక్కలు నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి. వారు నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు, వారు నా సుత్తిని ప్రకటిస్తారు. “అయినా యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు. ఇశ్రాయేలూ, నా గురించి నీవు విసిగిపోయావు. దహనబలులకు గొర్రెలను నా దగ్గరకు తీసుకురాలేదు, నీ బలులతో నన్ను ఘనపరచలేదు. భోజనార్పణల కోసం నేను నీ మీద భారం మోపలేదు ధూపం వేయమని నిన్ను విసిగించలేదు. నీవు నా కోసం సువాసనగల లవంగపు చెక్కను డబ్బుతో కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వుతో నన్ను తృప్తిపరచలేదు. కాని నీ పాపాలతో నన్ను విసిగించావు నీ దోషాలతో నేను అలసిపోయేలా చేశావు. “నేను నేనే నా ఇష్టానుసారంగా నీ పాపాలను తుడిచివేస్తున్నాను, నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను. నాకు గతంలో జరిగింది గుర్తు చేయి మనం కలిసి వాదించుకుందాం; నిన్ను నీవు నీతిమంతునిగా రుజువు చేసుకో. నీ మూలపురుషుడు పాపం చేశాడు; నీకు బోధించమని నేను పంపినవారు నా మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి నేను నీ మందిరంలోని ప్రధానులను అవమానించాను; నేను యాకోబును నాశనానికి ఇశ్రాయేలును దూషణకు అప్పగించాను.

యెషయా 43:11-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా అనే నేను నేనొక్కడినే. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడినీ నేనే, రక్షించిన వాడినీ నేనే. దాన్ని గ్రహించేలా చేసిందీ నేనే. మీలో ఇంకా వేరే దేవత ఎవరూ లేరు. నేనే దేవుణ్ణి, మీరు నాకు సాక్షులు.” ఇదే యెహోవా వాక్కు. “నేటి నుండి నేనే ఆయనను. నా చేతిలో నుండి ఎవరినైనా విడిపించగలిగే వాడెవడూ లేడు. నేను చేసిన పనిని తిప్పివేసే వాడెవడు?” ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, మీ విమోచకుడు యెహోవా ఇలా చెబుతున్నాడు, “మీ కోసం నేను బబులోనుపై దండెత్తి వారు గర్వకారణంగా భావించే ఓడల్లోనే పారిపోయేలా చేస్తాను. మీ పరిశుద్ధ దేవుణ్ణి, యెహోవాను నేనే. ఇశ్రాయేలు సృష్టికర్తనైన నేనే మీకు రాజుని.” సముద్రంలో రహదారి కలిగించినవాడూ, నీటి ప్రవాహాల్లో మార్గం ఏర్పాటు చేసేవాడూ రథాలూ, గుర్రాలూ, సైన్యాన్నీ యుద్ధవీరుల్నీ రప్పించినవాడూ అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు, వారంతా ఒకేసారి పడిపోయారు. ఆరిపోయిన జనపనారలాగా మళ్ళీ లేవకుండా నాశనమైపోయారు. “గతంలో జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను ఆలోచించవద్దు. ఇదిగో, నేనొక కొత్త కార్యం చేస్తున్నాను. అది ఇప్పటికే మొదలైంది. మీరు దాన్ని గమనించరా? నేను అరణ్యంలో దారి నిర్మిస్తాను. ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను. అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి. ఎందుకంటే నేను ఏర్పరచుకొన్న ప్రజలు తాగటానికి అరణ్యంలో నీళ్ళు పుట్టిస్తున్నాను. ఎడారిలో నదులు పారజేస్తాను. నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు నా గొప్పతనాన్ని ప్రచురిస్తారు. కానీ యాకోబూ, నువ్వు నాకు మొర్రపెట్టడం లేదు. ఇశ్రాయేలూ, నా విషయంలో విసిగిపోయావు. దహనబలుల కోసం నీ గొర్రెల్నీ మేకల్నీ నా దగ్గరికి తేలేదు. బలులర్పించి నన్ను ఘనపరచలేదు. నైవేద్యాలు చేయాలని నేను నీపై భారం మోపలేదు. ధూపం వేయమని నిన్ను విసిగించలేదు. నా కోసం సువాసన గల లవంగపు చెక్కను నువ్వు డబ్బు ఇచ్చి కొనలేదు. నీ బలి పశువుల కొవ్వుతో నన్ను తృప్తిపరచకపోగా, నీ పాపాలతో నన్ను విసిగించావు. నీ దోషాలతో నన్ను రొష్టుపెట్టావు. ఇదిగో, నేను, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను తుడిచి వేస్తున్నాను. నేను నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను. ఏం జరిగిందో నాకు జ్ఞాపకం చెయ్యి. మనం కలిసి వాదించుకుందాం. నీ వాదన వినిపించి నువ్వు నిరపరాధివని రుజువు చేసుకో. నీ మూలపురుషుడు పాపం చేశాడు. నీ నాయకులు నామీద తిరుగుబాటు చేశారు. కాబట్టి దేవాలయంలో ప్రతిష్ఠితులైన నాయకులను అపవిత్రపరుస్తాను. యాకోబును శాపానికి గురిచేసి, దూషణ పాలు చేస్తాను.”

యెషయా 43:11-28 పవిత్ర బైబిల్ (TERV)

నా మట్టుకు నేనే యెహోవాను. నేను ఒక్కడనే రక్షకుడను, మరి ఎవరూలేరు. మీతో మాట్లాడిన వాడను నేనే. నేనే మిమ్మల్ని రక్షించాను. ఆ సంగతులు నేనే మీకు చెప్పాను. మీతో ఉన్న ఎవరో క్రొత్తవాడు కాదు. మీరే నా సాక్షులు, నేనే దేవుడను.” సాక్షాత్తు యెహోవా చెప్పిన మాటలు ఇవి. “నేను ఎల్లప్పుడూ దేవునిగానే ఉన్నాను. నేనేదైనా చేశాను అంటే నేను చేసిన దానిని ఎవరూ మార్చలేరు. నా శక్తి నుండి మనుష్యులను ఎవ్వరూ రక్షించలేరు.” యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మిమ్మల్ని రక్షిస్తాడు. యెహోవా చెబుతున్నాడు, “నేను మీ కోసం సైన్యాలను బబులోనుకు పంపిస్తాను. అనేక మంది ప్రజలు బంధించబడతారు. ఆ కల్దీయుల ప్రజలు వారి స్వంత పడవల్లోనే తీసుకొనిపోబడతారు. (కల్దీ ప్రజలకు ఆ పడవలను గూర్చి చాలా గర్వం) నేను యెహోవాను, మీ పరిశుద్ధుడ్ని. ఇశ్రాయేలును నేను సృష్టించాను. నేను మీ రాజును.” యెహోవా సముద్రంలో మార్గాలు వేస్తాడు. కల్లోలిత జలాలలో గూడ ఆయన తన ప్రజలకు ఒక బాట వేస్తాడు. మరియు యెహోవా చెబుతున్నాడు, “రథాలు, గుర్రాలు, సైన్యాలతో నాకు విరోధంగా యుద్ధం చేసేవారు ఓడించబడతారు. వాళ్లు మళ్లీ ఎన్నటికీ లేవరు. వారు నాశనం చేయబడతారు. క్రొవ్వువత్తి మంట ఆర్పినట్టుగా వారు ఆర్పివేయబడతారు. కనుక మొదట్లో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. చాలా కాలం క్రిందట జరిగిన ఆ సంగతులను గూర్చి ఆలోచించవద్దు. ఎందుకంటే నేను నూతన కార్యాలు చేస్తాను. ఇప్పుడు మీరు క్రొత్త మొక్కలా ఎదుగుతారు. ఇది సత్యమని మీకు గట్టిగా తెలుసు. నేను నిజంగానే అరణ్యంలో బాట వేస్తాను. నిజంగానే నేను ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను. అడవి జంతువులు కూడ నాకు కృతజ్ఞత కలిగి ఉంటాయి. నిప్పుకోళ్లు, పెద్ద జంతువులు నన్ను ఘనపరుస్తాయి. అరణ్యంలో నేను నీళ్లను ప్రవహింప చేసినప్పుడు అవి నన్ను ఘనపరుస్తాయి. ఎడారిలో నేను నదులను ప్రవహింప జేసినప్పుడు అవి ఘనపరుస్తాయి. నేను ఏర్పరచుకొన్న నా ప్రజలకు నీళ్లు ఇవ్వటానికి నేను దానిని చేస్తాను. వీరే నేను చేసిన మనుష్యులు. ఈ ప్రజలు నన్ను స్తుతించుటకు పాటలు పాడతారు. “యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు. ఎందుకంటే ఇశ్రాయేలూ, నీవు నాతో విసిగిపోయావు. ప్రజలారా, మీరు మీ బలి అర్పణ గొర్రెలను నా దగ్గరకు తీసుకొని రాలేదు. మీరు నన్ను ఘనపర్చలేదు. మీరు నాకు బలులు అర్పించలేదు, మీరు నాకు బలులు ఇవ్వాలని నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు. మీకు విసుగు కలిగేంత వరకు మీరు నాకు ధూపం వేయమని మిమ్మల్ని నేను బలవంతపెట్టలేదు. కనుక మీరు నన్ను ఘనపర్చేందుకు అవసరమైన వస్తువులు కొనుటకు మీరు మీ డబ్బును ఉపయోగించలేదు. కానీ నేను మీ సేవకునిలా ఉండాలని మీరే నన్ను బలవంతం చేశారు. మీ చెడు క్రియలన్నీ నన్ను చాలా విసిగించే వరకు పాపం చేశారు. “నేను, నేనే మీ పాపాలు తుడిచివేసే వాడ్ని. నా ఆనందం కోసం నేను దీన్ని చేస్తాను. నేను మీ పాపాలు జ్ఞాపకం చేసుకోను. కానీ మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం సమావేశంగా కలుసుకొని ఏది సరైనదో నిర్ణయించాలి. మీరు చేసిన వాటిని గూర్చి చెప్పి, మీదే సరిగ్గా ఉంది అని చూపించాలి. మీ మొదటి తండ్రి పాపం చేశాడు. మీ న్యాయవాదులు నాకు విరోధమైన వాటిని చేశారు. మీ పవిత్ర పాలకులను పవిత్రులు గాకుండా నేను చేస్తాను. యాకోబు సంపూర్తిగా నావాడయ్యేటట్టు నేను చేస్తాను. ఇశ్రాయేలుకు చెడుగులు సంభవిస్తాయి.

యెషయా 43:11-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు. ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలోనుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– మీ నిమిత్తము నేను బబులోకు పంపితిని నేను వారినందరిని పారిపోవునట్లు చేసెదనువారి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును రథమును గుఱ్ఱమును సేనను శూరులను నడిపించువాడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరు ఏకముగా పండుకొని లేవకయుందురువారు లయమై జనుపనారవలె ఆరిపోయిరి. మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్య ములో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబూ, నీవు నాకు మొఱ్ఱపెట్టుటలేదు ఇశ్రాయేలూ, నన్నుగూర్చి నీవు విసికితివి గదా. దహనబలులుగా గొఱ్ఱెమేకల పిల్లలను నాయొద్దకు తేలేదు నీ బలులచేత నన్ను ఘనపరచలేదు నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు. నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు సరే గదా. నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి. నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను. నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యెమును వివరించుము. నీ మూలపితరుడు పాపముచేసినవాడే, నీ మధ్యవర్తులు నామీద తిరుగుబాటు చేసినవారే. కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను అపవిత్ర పరచితిని యాకోబును శపించితిని ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని.