యెషయా 41:1-29

యెషయా 41:1-29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ద్వీపాల్లారా, నా ఎదుట మౌనంగా ఉండండి! దేశాలు తమ బలాన్ని నూతన పరచుకోవాలి! వారు ముందుకు వచ్చి మాట్లాడాలి; తీర్పు తీర్చే స్థలం దగ్గర మనం కలుసుకుందాము. “తన సేవ కోసం తూర్పు నుండి ఒకరిని పురికొల్పి నీతిలో పిలిచింది ఎవరు? ఆయన అతనికి దేశాలు అప్పగిస్తారు రాజులను అతని ఎదుట అణచివేస్తారు. అతడు తన ఖడ్గంతో వాటిని ధూళిగా చేస్తాడు, తన విల్లుతో గాలికి ఎగిరే పొట్టులా మారుస్తాడు. అతడు వారిని వెంటాడుతాడు, ఇంతకుముందు తాను వెళ్లని దారైనా క్షేమంగా వెళ్తాడు. ఎవరు దీనిని ఆలోచించి జరిగించారు? మొదటి నుండి తరాలను పిలిచింది ఎవరు? యెహోవానైన నేనే; వారిలో మొదటి వారితో ఉంది నేనే, చివరి వరకు వారితో ఉండేది నేనే.” ద్వీపాలు దానిని చూసి భయపడుతున్నాయి; భూమి అంచులు వణుకుతున్నాయి. వారు వచ్చి చేరుతున్నారు; వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, “ధైర్యంగా ఉండండి!” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. శిల్పి కంసాలివాన్ని ప్రోత్సహిస్తాడు, సుత్తితో నునుపు చేసేవాడు, “అది బాగుంది” అని అతుకు గురించి చెప్తూ దాగిలి మీద కొట్టే వానిని ప్రోత్సహిస్తాడు. ఇంకొకడు విగ్రహం కదలకుండా మేకులతో దానిని బిగిస్తాడు. “అయితే, నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను ఏర్పరచుకున్న యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము వారసులారా, భూమి అంచుల నుండి నేను మిమ్మల్ని తీసుకువచ్చాను, మారుమూల ప్రాంతాల నుండి పిలుచుకున్నాను. నేను అన్నాను, ‘నీవు నా సేవకుడవు’; నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను త్రోసివేయలేదు. కాబట్టి భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను; దిగులుపడకు, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచి నీకు సహాయం చేస్తాను; నీతిగల నా కుడిచేతితో నిన్ను ఆదరిస్తాను. “నీ మీద కోప్పడిన వారందరు ఖచ్చితంగా సిగ్గుపడి అవమానం పొందుతారు; నిన్ను వ్యతిరేకించేవారు కనబడకుండా నశించిపోతారు. నీ శత్రువుల కోసం నీవు వెదకినా, వారు నీకు కనపడరు. నీతో యుద్ధం చేసేవారు ఏమి లేనివారిగా అవుతారు. నీ దేవుడనైన యెహోవాను, నేను నీ కుడిచేతిని పట్టుకుని, భయపడకు అని నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాను. భయపడకు, పురుగులాంటి యాకోబూ! కొద్ది మందిగా ఉన్న ఇశ్రాయేలూ, భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను” అని నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా చెప్తున్నారు. “చూడు, నేను నిన్ను పదునుగా ఉండి, అనేకమైన పళ్ళు కలిగిన క్రొత్త నూర్చే పలకగా చేస్తాను. నీవు పర్వతాలను నూర్చి నలగ్గొడతావు, కొండలను పొట్టులా చేస్తావు. నీవు వాటిని చెరగగా, గాలికి కొట్టుకుపోతాయి, సుడిగాలి వాటిని చెదరగొడుతుంది. అయితే నీవు యెహోవాలో సంతోషిస్తావు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడతావు. “పేదవారు, దరిద్రులు నీళ్లు వెదకుతారు కాని వారికి నీరు దొరకక వారి నాలుకలు దాహంతో ఎండిపోతాయి. అయితే, యెహోవానైన నేను వారికి జవాబిస్తాను; ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడిచిపెట్టను. నేను చెట్లులేని ఎత్తు స్థలాల మీద నదులను ప్రవహింపచేస్తాను, లోయల మధ్యలో ఊటలు ఉబికేలా చేస్తాను. ఎడారిని నీటి మడుగుగా, ఎండిపోయిన నేలను ఊటలుగా చేస్తాను. నేను ఎడారిలో దేవదారు వృక్షాలు, తుమ్మచెట్లు, గొంజిచెట్లు, ఓలీవ చెట్లు నాటుతాను. అరణ్యంలో సరళ వృక్షాలను, ఈత చెట్లను, నేరేడు చెట్లను కలిపి నాటుతాను. అప్పుడు ప్రజలు అది చూసి యెహోవా చేయి దీనిని చేసిందని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే దీనిని కలుగజేశారని తెలుసుకుని స్పష్టంగా గ్రహిస్తారు. “మీ వాదన చెప్పండి” అని యెహోవా అంటున్నారు. “మీ రుజువులు చూపించండి” అని యాకోబు రాజు అంటున్నారు. “విగ్రహాల్లారా, ఏమి జరుగబోతుందో మాకు చెప్పండి. గతంలో జరిగిన వాటి గురించి చెప్పండి, తద్వారా మేము వాటిని పరిశీలించి అవి ఎలా నెరవేరాయో తెలుసుకుంటాము. జరుగబోయే సంగతులను మాకు తెలియజేయండి, భవిష్యత్తులో ఏమి జరుగబోతుందో చెప్పండి, అప్పుడు మీరు దేవుళ్ళని మేము గ్రహిస్తాము. మేము దిగులుపడి భయపడేలా మేలైనా కీడైనా, ఏదో ఒకటి చేయండి. కాని మీరు వట్టివారి కంటే తక్కువవారు మీ పనులు ఏమాత్రం విలువలేనివి; మిమ్మల్ని కోరుకునేవారు అసహ్యులు. “ఉత్తరం వైపు నుండి నేను ఒకడిని రేపుతున్నాను. నా పేరిట ప్రార్థించే వాడొకడు సూర్యోదయ దిక్కునుండి వస్తున్నాడు. కుమ్మరి మట్టిని త్రొక్కినట్లు ఒకడు బురదను త్రొక్కినట్లు అతడు పాలకులను త్రొక్కుతాడు. మేము అంగీకరించేలా మొదటి నుండి జరిగిన వాటిని మాకు ఎవరు చెప్పారు? ‘అతడు చేసింది న్యాయమే’ అని మేము చెప్పేలా గతాన్ని ఎవరు చెప్పారు? దాని గురించి చెప్పిన వారెవరూ లేరు, దాని గురించి ముందే ఎవరు చెప్పలేదు. మీ మాటలు విన్న వారెవరూ లేరు. ‘చూడండి, వారిక్కడ ఉన్నారు!’ అని మొదట సీయోనుతో చెప్పింది నేనే. యెరూషలేముకు శుభవార్త చెప్పడానికి నేను ఒక దూతను పంపాను. నేను చూడగా అక్కడ ఎవరూ లేరు, దేవుళ్ళలో సలహా చెప్పడానికి ఎవరూ లేరు, నేను వారిని ప్రశ్నిస్తే జవాబు ఇవ్వడానికి ఎవరూ లేరు. చూడండి, వారందరు మాయాస్వరూపులే వారి క్రియలు మోసమే; వారి పోత విగ్రహాలు వట్టి గాలి అవి శూన్యములే.

యెషయా 41:1-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“ద్వీపాల్లారా, నా ఎదుట మౌనంగా ఉండి వినండి. జాతులు వచ్చి నూతన బలం పొందండి. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడాలి. రండి, మనం కలిసి చర్చించి వివాదం తీర్చుకుందాం. నీతియుతమైన పరిచర్య జరిగించే ఇతణ్ణి తూర్పు నుండి ప్రేరేపించి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి రాజ్యాలను అప్పగిస్తున్నాడు, రాజులను అతనికి లోబరుస్తున్నాడు. అతని ఖడ్గానికి వారిని ధూళిలాగా అప్పగిస్తున్నాడు. అతని విల్లుకి వారిని ఎగిరిపోయే పొట్టులాగా అప్పగిస్తున్నాడు. అతడు వారిని తరుముతున్నాడు. తాను ఇంతకుముందు వెళ్ళని దారైనా సురక్షితంగా దాటిపోతున్నాడు. దీన్ని ఎవడు ఆలోచించి జరిగించాడు? ఆదినుండి మానవ జాతులను పిలిచిన వాడినైన యెహోవా అనే నేనే. నేను మొదటివాడిని, చివరి వారితో ఉండేవాణ్ణి. ద్వీపాలు చూసి దిగులు పడుతున్నాయి. భూదిగంతాలు వణకుతున్నాయి, ప్రజలు వచ్చి చేరుకుంటున్నారు. వారు ఒకడికొకడు సహాయం చేసుకుంటారు. ‘ధైర్యంగా ఉండు’ అని ఒకడితో ఒకడు చెప్పుకుంటారు. ‘అది బాగా ఉంది’ అని చెబుతూ శిల్పి కంసాలిని ప్రోత్సాహపరుస్తాడు. సుత్తెతో నునుపు చేసేవాడు దాగలి మీద కొట్టేవాణ్ణి ప్రోత్సాహపరుస్తాడు ఆ విగ్రహం కదిలిపోకుండా వారు మేకులతో దాన్ని బిగిస్తారు. నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను ఎన్నుకున్న యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగంతాల నుండి నేను నిన్ను తీసుకువచ్చాను. దూరంగా ఉన్న అంచుల నుండి నిన్ను పిలిచాను. నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను. నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి. దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను. నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను. నీ మీద కోపపడే వారంతా సిగ్గుపడి, అవమానం పాలవుతారు. నిన్ను ఎదిరించే వారు కనబడకుండా నశించిపోతారు నువ్వెంత వెదికినా నీతో కలహించే వారు కనిపించరు. నీతో యుద్ధం చేసే వారు లేకుండా పోతారు, పూర్తిగా మాయమైపోతారు. నీ దేవుణ్ణి అయిన యెహోవా అనే నేను, ‘భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను’ అని చెబుతూ నీ కుడిచేతిని పట్టుకున్నాను. పురుగులాంటి యాకోబూ, అల్పమైన ఇశ్రాయేలూ, ‘భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను’” అని యెహోవా సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే నీ విమోచకుడు. “ఇదిగో చూడు, నిన్ను పదునైన కొత్త నూర్పిడి బల్లగా నియమించాను. నువ్వు పర్వతాలను నూర్చి, వాటిని పొడి చేస్తావు. కొండలను పొట్టులాగా చేస్తావు. నువ్వు వాటిని ఎగరేసినప్పుడు గాలికి అవి కొట్టుకుపోతాయి. సుడిగాలికి అవి చెదరిపోతాయి. నువ్వు యెహోవాను బట్టి సంతోషిస్తావు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి బట్టి అతిశయపడతావు. దీనులు, అవస్థలో ఉన్నవారు నీటి కోసం వెదుకుతున్నారు. నీళ్లు దొరక్క వారి నాలుక దప్పికతో ఎండిపోతున్నది. యెహోవా అనే నేను వారికి జవాబిస్తాను. ఇశ్రాయేలు దేవుడినైన నేను వారిని విడిచిపెట్టను. ఇది యెహోవా చేతి కార్యమనీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే దీన్ని కలిగించాడనీ మనుషులు గ్రహించి స్పష్టంగా తెలుసుకుంటారు. నేను చెట్లు లేని ఎత్తు స్థలాల మీద నదులను పారిస్తాను. లోయల మధ్యలో ఊటలు ఉబికేలా చేస్తాను. అరణ్యాన్ని నీటి మడుగుగా, ఎండిపోయిన నేలను నీటిబుగ్గలుగా చేస్తాను. నేను అరణ్యంలో దేవదారు వృక్షాలు, తుమ్మచెట్లు, గొంజిచెట్లు, తైలవృక్షాలు నాటిస్తాను. ఎడారిలో తమాల వృక్షాలు, సరళ వృక్షాలు, నేరేడు చెట్లు నాటిస్తాను. మీ వాదంతో రండి” అని యెహోవా అంటున్నాడు. “మీ రుజువులు చూపించండి” అని యాకోబు రాజు చెబుతున్నాడు. జరగబోయే వాటిని విశదపరచి మాకు తెలియజెప్పండి. గతంలో జరిగిన వాటిని మేం పరిశీలించి వాటి ఫలాన్ని తెలుసుకునేలా వాటిని మాకు తెలియజెప్పండి. ఇకముందు జరగబోయే సంగతులను తెలియజెప్పండి. అప్పుడు మీరు దేవుళ్ళని మేం ఒప్పుకుంటాం. మేము విస్మయం చెందేలా మేలైనా, కీడైనా, ఏదైనా పని చేయండి. మీకు ఉనికి లేదు. మీ పనులు శూన్యం. మిమ్మల్ని ఆశించేవారు అసహ్యులు. ఉత్తరదిక్కు నుండి నేనొకణ్ణి పురిగొల్పుతున్నాను. అతడు నా పేరున ప్రార్థిస్తాడు. అతడు సూర్యోదయ దిక్కునుండి వచ్చి ఒకడు బురద తొక్కే విధంగా, కుమ్మరి మన్ను తొక్కే విధంగా రాజులను అణగదొక్కుతాడు. జరిగినదాన్ని మొదటి నుండి మాకు చెప్పి మమ్మల్ని ఒప్పించినవాడేడీ? “అతడు చెప్పింది సరైనదే” అని మేము చెప్పేలా పూర్వకాలంలో దాన్ని మాకు చెప్పింది ఎవరు? ఎవరూ వినిపించలేదు, వినడానికి మీరెవరికీ చెప్పలేదు. వినండి, “ఇదిగో, ఇవే అవి” అని మొదట సీయోనుతో నేనే చెప్పాను. యెరూషలేముకు సందేశం ప్రకటించడానికి నేనే ఒకణ్ణి పంపించాను. నేను చూసినప్పుడు ఎవ్వరూ లేరు. నేను వారిని ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పడానికి, మంచి సలహా ఇవ్వడానికి ఎవరూ లేరు. వారంతా మోసగాళ్ళు. వారు చేసేది మాయ. వారి విగ్రహాలు శూన్యం. అవి వట్టి గాలిలాంటివి.

యెషయా 41:1-29 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా చెబుతున్నాడు: “దూర దేశాల్లారా, మౌనంగా ఉండి నా దగ్గరకు రండి. దేశాల్లారా, ధైర్యంగా ఉండండి. నా దగ్గరకు వచ్చి మాట్లాడండి. మనం కలిసికొందాం. ఎవరిది సరియైనదో నిర్ణయించేద్దాం. ఈ ప్రశ్నలకు నాకు జవాబు చెప్పండి: తూర్పునుండి వస్తోన్న ఆ మనిషిని మేల్కొలిపింది ఎవరు? మంచితనం నాతో కూడ నడుస్తుంది. అతడు తన ఖడ్గం ఉపయోగించి రాజ్యాలను ఓడిస్తాడు. వారు ధూళి అవుతారు. అతడు తన విల్లును ఉపయోగించి రాజులను జయిస్తాడు. వారు గాలికి కొట్టుకొని పోయే పొట్టులా పారిపోతారు. అతడు సైన్యాలను తరుముతాడు, ఎన్నడూ బాధనొందడు. అతడు అంతకు ముందు ఎన్నడూ వెళ్లని స్థలాలకు వెళ్తాడు. ఈ సంగతులు జరిగేట్టు చేసింది ఎవరు? ఇది ఎవరు చేశారు? ఆదినుండి మనుష్యులందరినీ పిలిచింది ఎవరు? యెహోవాను నేనే ఈ సంగతులను చేశాను. యెహోవాను నేనే మొట్ట మొదటి వాడ్ని ఆరంభానికి ముందే నేను ఇక్కడ ఉన్నాను. అన్నీ ముగింపు అయన తర్వాత కూడ నేను ఇక్కడ ఉంటాను. దూర దూర స్థలాలూ, మీరంతా చూచి భయపడండి. భూమ్మీద దూరంగా ఉన్న స్థలాలూ, మీరంతా భయంతో వణకండి. మీరంతా దగ్గరగా రండి, నా మాటలు వినండి. “పనివాళ్లూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకొంటారు. ఒకరిని ఒకరు బలపర్చుకొంటారు. ఒక పనివాడు ఒక విగ్రహం చేసేందుకు కర్ర కోస్తాడు. ఆ వ్యక్తి కంసాలికి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మరో మనిషి సుత్తెతో లోహాన్ని మెత్తగా చేస్తాడు. అప్పుడు ఆ పనివాడు దాగలితో పని చేసేవాడ్ని ప్రోత్సహిస్తాడు. ‘ఈ పని బాగుంది, లోహం ఊడిపోదు’ అంటాడు ఈ చివరి పనివాడు. అందుచేత అతడు ఆ విగ్రహాన్ని ఒక పీటకు మేకులతో బిగిస్తాడు. విగ్రహం పడిపోదు. అది ఎప్పటికీ కదలదు.” యెహోవా చెబుతున్నాడు: “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడివి యాకోబూ, నిన్ను నేను ఏర్పరచుకొన్నాను. నీవు అబ్రాహాము వంశంవాడివి. అబ్రాహామును నేను ప్రేమించాను. భూమిమీద నీవు చాలా దూరంగా ఉన్నావు. నీవు చాలా దూర దేశంలో ఉన్నావు. అయితే నేను నిన్ను పిలిచి, నీవు నా సేవకుడివి. నేను నిన్ను ఏర్పరచుకొన్నాను. నేను నీకు విరోధంగా తిరుగలేదు అని చెప్పాను. దిగులుపడకు, నేను నీతో ఉన్నాను. భయపడకు, నేను నీ దేవుణ్ణి. నేను నిన్ను బలంగా చేశాను. నేను నీకు సహాయం చేస్తాను. నేను మంచితనపు కుడిహస్తంతో నిన్ను బలపరుస్తాను. చూడు, కొంతమంది మనుష్యులు నీ మీద కోపంగా ఉన్నారు. కానీ వాళ్లు సిగ్గుపడతారు. నీ శత్రువులు అదృశ్యమై నశిస్తారు. నీ విరోధుల కోసం నీవు వెదకుతావు. కానీ నీవు వారిని కనుగొనలేవు. నీకు విరోధంగా యుద్ధం చేసినవాళ్లు పూర్తిగా కనబడకుండా పోతారు. నేను యెహోవాను, నీ దేవుణ్ణి నేను నీ కుడిచేయి పట్టుకొన్నాను. నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను. అని నేను నీతో చెబుతున్నాను. ప్రశస్తమైన యూదా, భయపడకు. ప్రియమైన నా ఇశ్రాయేలు ప్రజలారా భయపడవద్దు. నిజంగా నేను మీకు సహాయం చేస్తాను.” సాక్షాత్తూ యెహోవాయే ఆ మాటలు చెప్పాడు. “ఇశ్రాయేలు పరిశుద్ధుడు (దేవుడు), నిన్ను రక్షించేవాడు ఈ సంగతులు చెప్పాడు: చూడు, నిన్ను నేను ఒక క్రొత్త నూర్పిడి చెక్కగా చేశాను. ఈ పనిముట్టుకు పదునైన పండ్లు చాలా ఉన్నాయి. ధాన్యపు గింజల గుల్లలు పగులగొట్టుటకు రైతులు దీనిని ఉపయోగిస్తారు. నీవు పర్వతాలను అణగ దొక్కి, చితుక గొడ్తావు. కొండలను నీవు పొట్టులా చేస్తావు. వాటిని గాలిలో విసిరివేస్తావు. గాలి దానిని విసరి, చెదరగొడ్తుంది. అప్పుడు నీవు యెహోవాయందు సంతోషంగా ఉంటావు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) గూర్చి నీవు ఎంతగానో అతిశయిస్తావు. “పేదలు, అక్కరలో ఉన్నవారు నీళ్లకోసం వెదకుతారు. కానీ వారికి ఏమీ దొరకవు. వారు దాహంతో ఉన్నారు. వారి నాలుకలు పిడచకట్టాయి. నేను వారి ప్రార్థనలకు జవాబిస్తాను. నేను వాళ్లను విడువను, చావనివ్వను. ఎండిపోయిన కొండల మీద నేను నదులను ప్రవహింపజేస్తాను. లోయలో నీటి ఊటలను నేను ప్రవహింపజేస్తాను. అరణ్యాన్ని నీటి సరసుగా నేను చేస్తాను. ఎండిన భూములలో నీటి బుగ్గలు ఉబుకుతాయి. అరణ్యంలో వృక్షాలు పెరుగుతాయి. దేవదారు వృక్షాలు, తుమ్మ చెట్లు గొంజి చెట్లు, తైలవృక్షాలు తమాల వృక్షాలు, సరళ వృక్షాలు అక్కడ ఉంటాయి. ఈ సంగతులు జరగడం ప్రజలు చూస్తారు. యెహోవా శక్తిచేత ఇవి జరిగాయని వారు తెలుసుకొంటారు. ప్రజలు ఈ సంగతులు చూస్తారు. వారు గ్రహించటం మొదలుబెడతారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు (దేవుడు) ఈ సంగతులను చేసినట్టు వారు తెలుసుకొంటారు.” యాకోబు రాజు, యెహోవా చెబుతున్నాడు: “రండి మీ వివాదాలు నాతో చెప్పండి. మీ రుజువులు చూపించండి, సరియైన విధంగా మనం నిర్ణయంచేద్దాం. జరుగుతోన్న వాటిని గూర్చి, మీ విగ్రహాలు (అబద్ధపు దేవతలు) వచ్చి మాతో చెప్పాలి. మొదట్లో ఏమి జరిగింది? భవిష్యత్తులో ఏమి జరుగుతుంది? మాతో చెప్పండి. మేము జాగ్రత్తగా వింటాం. అప్పుడు తర్వాత ఏమి జరుగుతుంది అనేది మాకు తెలుస్తుంది. ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు గాను మేము ఎదురు చూడాల్సిన వాటిని గూర్చి చెప్పండి. అప్పుడు మీరు నిజంగానే దేవుళ్లు అని మేము నమ్ముతాం. ఏదో ఒకటి చేయండి. ఏదైనా సరే మంచిగాని చెడుగాని చేయండి. అప్పుడు మీరు బ్రతికే ఉన్నారని మాకు తెలుస్తుంది. మేము మిమ్మల్ని వెంబడించగలుగుతాం. “చూడండి, తప్పుడు దేవుళ్లారా, మీరు శూన్యం కంటె తక్కువ. మీరు ఏమీ చేయలేరు. ఉత్త పనికి మాలిన మనిషి మాత్రమే మిమ్మల్ని పూజించాలనుకొంటాడు.” “ఉత్తరాన నేను ఒక మనిషిని మేల్కొలిపాను. సూర్యోదయమయ్యే తూర్పు దిశనుండి అతడు వస్తున్నాడు. అతడు నా నామాన్ని ఆరాధిస్తాడు. కుమ్మరి మట్టి ముద్దను తొక్కుతాడు. అదే విధంగా ఈ ప్రత్యేక మనిషి రాజులను అణగదొక్కుతాడు. “ఇది జరుగక ముందే దీనినిగూర్చి మాతో ఎవరు చెప్పారు? ఆయన్ను మనం దేవుడు అని పిలవాలి. మీ విగ్రహాల్లో ఒకటి ఈ సంగతులను మాకు చెప్పిందా? లేదు. ఆ విగ్రహాల్లో ఏదీ మాకేమీ చెప్పలేదు. ఆ విగ్రహాలు ఒక్క మాట కూడ చెప్పలేదు. మరియు మీరు చెప్పే ఒక్క మాట కూడ ఆ అబద్ధపు దేవుళ్ళు వినలేవు. ఈ విషయాలను గూర్చి యెహోవాను, నేనే మొట్టమొదట సీయోనుకు చెప్పాను. ‘చూడండి, మీ ప్రజలు తిరిగి వస్తున్నారు’ అనే ఒక సందేశం ఇచ్చి ఒక సందేశహరుని యెరూషలేముకు నేను పంపించాను.” ఆ తప్పుడు దేవుళ్లను నేను చూశాను. వారిలో ఎవరూ ఏమీ చెప్పగల తెలివి లేనివాళ్లు. వాళ్లను నేను ప్రశ్నలు అడిగాను. కానీ వారు ఒక్క మాట కూడా పలుకలేదు. ఆ దేవుళ్లంతా శూన్యంకంటె తక్కువ. వాళ్లు ఏమీ చేయలేరు. ఆ విగ్రహాలు బొత్తిగా పనికి మాలినవి.

యెషయా 41:1-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ద్వీపములారా, నాయెదుట మౌనముగా నుండుడి . జనములారా, నూతనబలము పొందుడి.వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను వ్యాజ్యెము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోబరచుచున్నాడు ధూళివలెవారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించు చున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకుముందు వెళ్లనిత్రోవనే సురక్షితముగ దాటిపోవుచున్నాడు. ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను. ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి భూదిగంతములు వణకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు వారు ఒకనికొకడు సహాయము చేసికొందురు ధైర్యము వహించుమని యొకనితో ఒకడు చెప్పు కొందురు. అతుకుటనుగూర్చి –అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును సుత్తెతో నునుపుచేయువాడు దాగలి మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండ పనివాడు మేకులతో దాని బిగించును. నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందె దరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు నీతో కలహించువారిని నీవు వెదకుదువుగాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను–భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రా యేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడిచేయు దువు కొండలను పొట్టువలె చేయుదువు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు. దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకకవారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించు నట్లు చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటిం చెదను అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి వృక్షములను నాటెదను. –వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పు చున్నాడు. జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి. ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు మాయాసంతానము మీ కార్యము శూన్యము మిమ్మును కోరుకొనువారు హేయులు. ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కు నట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును. మేము ఒప్పుకొనునట్లు జరిగినదానిని ఆదినుండియు తెలియజెప్పినవాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వ కాలమున దానిని తెలియజెప్పినవాడెవడు? దాని తెలియజెప్పువాడెవడును లేడు వినుపించు వా డెవడును లేడు మీ మాటలు వినువాడెవడును లేడు. ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పిన వాడను నేనే యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేనే పంపితిని. నేను చూడగా ఎవడును లేకపోయెను నేను వారిని ప్రశ్నవేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త యెవడును లేకపోయెను. వారందరు మాయాస్వరూపులువారి క్రియలు మాయ వారి పోతవిగ్రహములు శూన్యములు అవి వట్టిగాలియై యున్నవి.