యెషయా 40:26-31
యెషయా 40:26-31 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ కళ్లు ఎత్తి ఆకాశం వైపు చూడండి: వీటన్నటిని సృజించింది ఎవరు? నక్షత్ర సమూహాన్ని ఒక్కొక్క దానిని తీసుకువస్తూ, వాటి వాటి పేర్ల ప్రకారం పిలిచేవాడే గదా. తన గొప్ప శక్తినిబట్టి, తనకున్న శక్తివంతమైన బలాన్నిబట్టి వాటిలో ఏ ఒక్క దానిని విడిచిపెట్టలేదు. యాకోబూ, “నా త్రోవ యెహోవాకు మరుగై ఉంది; నా న్యాయాన్ని నా దేవుడు పట్టించుకోలేదు” అని నీవెందుకు అంటున్నావు? ఇశ్రాయేలూ, నీవెందుకు ఇలా చెప్తున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? భూమి అంచులను సృష్టించిన యెహోవా నిత్యుడైన దేవుడు. ఆయన సొమ్మసిల్లరు, అలసిపోరు, ఆయన జ్ఞానాన్ని ఎవరూ గ్రహించలేరు. ఆయన అలిసిపోయిన వారికి బలమిస్తారు శక్తిలేనివారికి శక్తిని ఇస్తారు. యువత సొమ్మసిల్లి అలసిపోతారు, యువకులు తడబడి పడిపోతారు. కాని యెహోవా కోసం ఎదురు చూసేవారు, నూతన బలాన్ని పొందుతారు. వారు గ్రద్ద వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు; అలసిపోకుండా పరుగెత్తుతారు. సొమ్మసిల్లకుండా నడుస్తారు.
యెషయా 40:26-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ కళ్ళు పైకెత్తి చూడండి. ఆ నక్షత్రాలన్నిటినీ ఎవరు సృజించారు? వాటిని వరుసలో నిలిపి వాటి పేరుల చొప్పున పిలిచేవాడే గదా. తన అధికశక్తి చేతా తన బలాతిశయం చేతా ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టడు. యాకోబూ “నా మార్గం యెహోవాకు తెలియదు, నా న్యాయం నా దేవునికి కనబడదు” అని నీవెందుకు అంటున్నావు? ఇశ్రాయేలూ, నీవెందుకు ఇలా చెబుతున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం. అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే. యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు. అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.
యెషయా 40:26-31 పవిత్ర బైబిల్ (TERV)
పైన ఆకాశాలను చూడు. ఆ నక్షత్రాలన్నింటినీ ఎవరు సృష్టించారు? ఆకాశంలోని ఆ “సైన్యాలు” అన్నింటిని ఎవరు సృష్టించారు? ప్రతి నక్షత్రం దాని పేరుతో సహా ఎవరికి తెలుసు? సత్యవంతుడైన దేవుడు చాలా బలం, శక్తి గలవాడు, అందుచేత ఈ నక్షత్రాల్లో ఒక్కటి కూడ తప్పిపోదు. యాకోబూ, ఇది నిజం! ఇశ్రాయేలూ, దీనిని నీవు నమ్మాలి! “నేను జీవించే విధము యెహోవా చూడలేదు దేవుడు నన్ను కనుగొని శిక్షించాడు అని నీవెందుకు చెపుతున్నావు?” యెహోవా అలసిపోడు, ఆయనకు విశ్రాంతి అవసరంలేదు. భూమిమీద దూర స్థలాలన్నింటినీ యెహోవాయే సృష్టించాడు. యెహోవా నిత్యమూ జీవిస్తాడు. బలహీనులు బలంగా ఉండేటట్టు యెహోవా సహాయం చేస్తాడు. శక్తిలేని వాళ్లను ఆయన శక్తి మంతులుగా చేస్తాడు. యువకులు అలసిపోతారు, వారికి విశ్రాంతి కావాలి. చివరికి బాలురు కూడ తొట్రిల్లి, పడిపోతారు. కాని యెహోవా మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడే మనుష్యులు తిరిగి బలంగల వాళ్లవుతారు. అది వారు పక్షి రాజులా రెక్కలు కలిగి ఉన్నట్టుగా ఉంటుంది. వారు విశ్రాంతి అవసరం లేకుండా పరుగుల మీద పరుగులు తీస్తూ ఉంటారు. వారు అలసి పోకుండా నడుస్తారు.
యెషయా 40:26-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులుపెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయనయొక్కటియైనను విడిచిపెట్టడు. యాకోబూ–నా మార్గము యెహోవాకు మరుగై యున్నది నా న్యాయము నా దేవునిదృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురువారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.