యెషయా 38:1-22 - Compare All Versions
యెషయా 38:1-22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతనియొద్దకు వచ్చి–నీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తనముఖమును గోడతట్టు త్రిప్పుకొని –యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. –నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము–నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున దేమనగా–నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను; ఇంక పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండ విడిపించెదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవావలన నీకు కలిగిన సూచన; ఆహాజు ఎండ గడియారముమీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల పదిమెట్లు ఎక్క జేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కెను. యూదారాజైన హిజ్కియా రోగియై ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచియించినది. –నా దినములమధ్యాహ్నకాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశ్శేషము పోగొట్టుకొని యున్నాను. యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక పోవుదునని నేననుకొంటిని. నా నివాసము పెరికివేయబడెను గొఱ్ఱెలకాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తి కొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తిచేయుచున్నావు. ఉదయమగువరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా యెముకలన్నియు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తిచేయుదువు మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణిం చెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూట బడి యుండుము. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమునుబట్టి నా సంవత్సరములన్నియు నేను మెల్లగా నడచు కొందును. ప్రభువా, వీటివలన మనుష్యులు జీవించుదురు వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయు దువు మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పార వేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయిం చరు. సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు మన జీవితదినములన్నియు యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము. మరియు యెషయా–అంజూరపుపండ్ల ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను. మరియు హిజ్కియా–నేను యెహోవా మందిరమునకు పోయెదననుటకు గురుతేమని యడిగి యుండెను.
యెషయా 38:1-22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ రోజుల్లో హిజ్కియాకు ప్రాణాంతకమైన జబ్బు చేసింది. ప్రవక్త, ఆమోజు కొడుకు యెషయా అక్కడకు వచ్చాడు. “‘నువ్వు చనిపోబోతున్నావు, ఇక బతకవు. కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో’ అని యెహోవా సెలవిస్తున్నాడు” అని చెప్పాడు. అప్పుడు హిజ్కియా గోడవైపు తిరిగి, “యెహోవా, యథార్థ హృదయంతో, సత్యంతో నీ సన్నిధిలో నేనేవిధంగా జీవించానో, సమస్తాన్నీ ఏ విధంగా నీ దృష్టికి మంచిదిగా జరిగించానో, కృపతో జ్ఞాపకం చేసుకో” అని కన్నీళ్ళతో యెహోవాను ప్రార్థించాడు. అప్పుడు యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, “నువ్వు తిరిగి హిజ్కియా దగ్గరికి పోయి అతనితో ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చేదేమంటే నీ కన్నీళ్లు నేను చూశాను. నీ ప్రార్థన అంగీకరించాను. నీ జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను. నిన్ను, ఈ పట్టణాన్ని అష్షూరు రాజు చేతి నుండి విడిపించి కాపాడతాను. తాను పలికిన మాట నెరవేరుతుంది అనడానికి యెహోవా నీకిచ్చే సూచన ఇదే, ఆహాజు ఎండ గడియారం మీద సూర్యకాంతి చేత ముందుకు జరిగిన నీడ మళ్ళీ పది మెట్లు ఎక్కేలా చేస్తాను.’” అప్పుడు సూర్యకాంతిలో ముందుకు జరిగిన మెట్లలో పది మెట్లు మళ్ళీ వెనక్కి జరిగింది. యూదారాజు హిజ్కియా జబ్బుపడి తిరిగి ఆరోగ్యం పొందిన తరువాత అతడు రచించిన ప్రార్థన. “నా జీవితం సగభాగంలో నేను పాతాళ ద్వారం గుండా వెళ్ళాల్సివచ్చింది. మిగిలిన సగభాగం నేనిక కోల్పోయినట్టే. యెహోవాను, సజీవుల దేశంలో యెహోవాను చూడక పోయేవాణ్ణి. మృతుల లోకంలో పడిపోయి ఇక మనుషులకు కనిపించనేమో అనుకున్నాను. నా జీవం తీసేశారు. గొర్రెల కాపరి గుడిసెలాగా అది నా దగ్గర నుండి తీసివేశారు. నేతపనివాడు చేసినట్టు నా జీవితాన్ని చుట్టేస్తున్నాను. ఆయన నన్ను మగ్గం నుండి దూరం చేశాడు. ఒక్క రోజులోనే నువ్వు నా జీవితాన్ని ముగిస్తున్నావు. (ఉదయం దాకా ఓర్చుకున్నాను. సింహం లాగా నా ఎముకలన్నిటినీ విరిచేశాడు.) ఒక్క రోజులోనే నువ్వు నన్ను సమాప్తి చేస్తావు. ముళ్ళ తోక పిట్టలాగా కిచ కిచలాడాను. పావురం లాగా కూశాను. పైకి చూసీ చూసీ నా కళ్ళు అలసిపోయాయి. నలిగి పోయాను. యెహోవా, నాకు సహాయం చెయ్యి. నేనేమనగలను? ఆయన నా గురించి మాట పలికాడు, ఆయనే దాన్ని జరిగించాడు. నా హృదయంలో నిండి ఉన్న దుఃఖాన్ని బట్టి నా సంవత్సరాలన్నీ తడబడుతూ గడిపేస్తాను. ప్రభూ, నీవు పంపిన బాధలు మనుషులకు మంచివే. వాటి వల్లనే నా ఆత్మ జీవిస్తున్నది. నువ్వు నన్ను బాగు చేసి నన్ను జీవింపజేశావు. ఆ తీవ్రమైన బాధ వల్లనే నాకు నెమ్మది కలిగింది. నీ ప్రేమతో నా ప్రాణాన్ని నాశనం అనే గోతి నుండి విడిపించావు. నా పాపాలన్నిటినీ నీ వీపు వెనుకకు పారవేశావు. ఎందుకంటే పాతాళంలో నీకు స్తుతి కలగదు. మరణం నీకు స్తుతి చెల్లించదు. సమాధిలోకి వెళ్ళినవారు నీ నమ్మకత్వంపై ఆశ పెట్టుకోరు. సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతిస్తారు! ఈ రోజున నేను సజీవుడిగా నిన్ను స్తుతిస్తున్నాను. తండ్రులు తమ కొడుకులకు నీ సత్యాన్ని తెలియజేస్తారు. యెహోవా నన్ను రక్షించేవాడు. నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో సంగీత వాయిద్యాలు వాయిస్తాను.” యెషయా “ఒక అంజూరు పండ్ల ముద్దను ఆ పుండుకు కట్టండి, అప్పుడు అతడు బాగుపడతాడు” అని చెప్పాడు. దానికి ముందు హిజ్కియా “నేను మళ్ళీ యెహోవా మందిరానికి వెళతాను అనేదానికి సూచన ఏమిటి?” అని అతణ్ణి అడిగాడు.
యెషయా 38:1-22 TERV (పవిత్ర బైబిల్)
ఆ కాలంలో హిజ్కియాకు జబ్బు చేసింది. అతనికి దాదాపు మరణ పరిస్థితి ఏర్పడింది. ఆమోజు కుమారుడు యెషయా ప్రవక్త అతన్ని చూడటానికి వెళ్లాడు. “నేను ఈ సంగతులు నీతో చెప్పాలని యెహోవా నాకు చెప్పాడు. ‘త్వరలోనే నీవు మరణిస్తావు. కనుక నీవు చనిపోయినప్పుడు నీ కుటుంబం వారు ఏం చేయాలో నీవు వారితో చెప్పాలి. నీవు మళ్లీ బాగుపడవు’ అని యెషయా రాజుతో చెప్పాడు.” హిజ్కియా దేవాలయపు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అతడు చెప్పాడు, “యెహోవా, నేను నీ యెదుట ఎల్లప్పుడూ నమ్మకమైన పవిత్ర హృదయంతో జీవించానని దయచేసి జ్ఞాపకం చేసికొనుము. నీవు మంచివి అనే పనులే నేను చేశాను.” తర్వాత హిజ్కియా గట్టిగా ఏడ్వటం మొదలు బెట్టాడు. యెహోవా దగ్గర్నుండి యెషయా ఈ సందేశాన్ని స్వీకరించాడు; “హిజ్కియా దగ్గరకు వెళ్లి అతనితో చెప్పు, నీ పూర్వీకుడైన దావీదు దేవుడు, యెహోవా చెప్పే సంగతులు ఇవి, ‘నీ ప్రార్థనలు నేను విన్నాను, నీ దుఃఖపు కన్నీళ్లు నేను చూశాను. నేను నీ ఆయుష్షు పదిహేను సంవత్సరాలు ఎక్కువ చేస్తాను. అష్షూరు రాజు నుండి నిన్ను నేను కాపాడుతాను. నిన్ను, ఈ పట్టణాన్ని నేను రక్షిస్తాను.’” యెహోవా చెప్పిన వాటిని చేస్తాడని నీకు చూపించేందుకు యిదే సంకేతం. “చూడు, ఆహాజు మెట్ల మీద ఉన్న ఎండ గడియారము నీడను పది అడుగులు వెనుకకు వెళ్లేటట్టు నేను చేస్తున్నాను. దిగిపోయిన సూర్యుని నీడ పది అడుగులు వెనుకకు వెళ్తుంది.” హిజ్కియా రోగమునుండి స్వస్థత పొందినప్పుడు వ్రాసిన గీతం: నేను వృద్ధుడనయ్యేంత వరకు బ్రతుకుతానని నాలో నేను అనుకొన్నాను. కానీ నేను పాతాళ ద్వారాలగుండా వెళ్లాల్సిన సమయం అది. ఇప్పుడు నేను నా సమయమంతా అక్కడే గడపాలి. కనుక నేను చెప్పాను: “సజీవుల దేశంలో ప్రభువైన యెహోవాను నేను మరల చూడను. భూమిమీద మనుష్యులు జీవించుట నేను మరల చూడను. నా ఇల్లు, నా గొర్రెల కాపరి గుడారం లాగివేయబడి నానుండి తీసివేయబడుతుంది. మగ్గమునుండి ఒకడు బట్టను చుట్టి కత్తిరించినట్టు నా పని అయిపోయింది. ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొనివచ్చావు. రాత్రి అంతా నేను సింహంలా గట్టిగా అరిచాను. అయితే సింహం ఎముకలు నమిలినట్టు నా ఆశలు అణగ ద్రొక్కబడ్డాయి. ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చావు. నేను గువ్వలా మూల్గాను. నేను పక్షిలా ఏడ్చాను. నా కళ్లు క్షీణించాయి కానీ నేను ఆకాశం తట్టు చూస్తూనే ఉన్నాను. నా ప్రభువా, నాకు కష్టాలు ఉన్నాయి. నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేయుము.” నేనేం చెప్పగలను? జరిగేదేమిటో నా ప్రభువు నాకు చెప్పాడు. నా యజమాని దానిని జరిగిస్తాడు. నా ఆత్మలో నాకు ఈ కష్టాలు కలిగాయి. కనుక ఇప్పుడు నేను జీవితాంతం దీనుడనుగా ఉంటాను. నా ప్రభూ, నా ఆత్మ మరల జీవించేట్టుగా ఈ కష్ట సమయాన్ని ఉపయోగించు నా ఆత్మ బలపడి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేయుము. నేను బాగుపడేందుకు సహాయం చేయి. మరల జీవించేందుకు నాకు సహాయం చేయుము. చూడండి, నా కష్టాలు తొలగి పోయాయి. ఇప్పుడు నాకు శాంతి ఉంది. నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు. నీవు నన్ను సమాధిలో మురిగి పోనివ్వలేదు. నీవు నా పాపాలన్నీ క్షమించావు. నీవు నా పాపాలను దూరంగా పారవేశావు. చచ్చినవాళ్లు నీకు స్తుతులు పాడరు. పాతాళంలోని ప్రజలు నిన్ను స్తుతించరు. చచ్చినవాళ్లు సహాయం కోసం నిన్ను నమ్ముకోరు. వారు భూగర్భంలోనికి వెళ్తారు, మరల ఎన్నటికీ మాట్లాడరు. నేడు నాలాగే బ్రతికి ఉన్న మనుష్యులే నిన్ను స్తుతించేవారు. నీవు నమ్మదగిన వాడవని ఒక తండ్రి తన పిల్లలతో చెప్పాలి. కనుక నేను అంటాను: “యెహోవా నన్ను రక్షించాడు కనుక మా జీవిత కాలమంతా మేము యెహోవా ఆలయంలో పాటలు పాడి, వాయిద్యాలు వాయిస్తాం.” అప్పుడు యెషయా, “నీవు అంజూరపు పండ్లను దంచి, నీ పుండ్ల మీద వేయాలి, అప్పుడు, నీవు స్వస్థపడతావు” అని హిజ్కియాతో చెప్పాడు. కానీ హిజ్కియా, “నేను బాగవుతానని రుజువు చేసేందుకు యెహోవా దగ్గర్నుండి వచ్చే గురుతు ఏమిటి? నేను యెహోవా మందిరానికి వెళ్ల గలుగుతానని రుజువుచేసే సంకేతం ఏమిటి?” అని యెషయాను అడిగాడు.
యెషయా 38:1-22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త అతని దగ్గరకు వెళ్లి, “యెహోవా చెప్పే మాట ఇదే: నీవు చనిపోబోతున్నావు; నీవు కోలుకోవు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో” అన్నాడు. హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు త్రిప్పుకుని యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు, “యెహోవా, నేను నమ్మకంగా యథార్థ హృదయంతో, మీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, మీ దృష్టిలో సరియైనది ఎలా చేశానో జ్ఞాపకం చేసుకోండి.” హిజ్కియా భారంగా ఏడ్చాడు. అప్పుడు యెహోవా వాక్కు యెషయాకు ఇలా వచ్చింది: “నీవు వెళ్లి హిజ్కియాకు ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీ ప్రార్థన విని నీ కన్నీరు చూశాను. నీ జీవితంలో ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను. అంతేకాక, నిన్ను, ఈ పట్టణాన్ని అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాను. నేను ఈ పట్టణాన్ని కాపాడతాను. “ ‘యెహోవా తాను చెప్పిన మాట నెరవేరుస్తారని తెలియజేయడానికి యెహోవా నీకు ఇచ్చే సూచన ఇదే: ఆహాజు ఎండ గడియారం మీద సూర్యకాంతి వలన ముందుకు జరిగిన నీడ మళ్ళీ పది మెట్లు వెనుకకు వెళ్లేలా నేను చేస్తాను.’ ” కాబట్టి సూర్యకాంతి ముందుకు జరిగిన మెట్లలో పది మెట్లు మరలా వెనుకకు జరిగింది. యూదా రాజైన హిజ్కియా అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత అతని రచన: నేను, “నా జీవిత సగభాగంలో నేను మరణ ద్వారం గుండా వెళ్లాలా, నా మిగిలిన జీవితకాలమంతా పొగొట్టుకున్నానా?” నేను, “సజీవుల దేశంలో నేనిక యెహోవాను చూడలేను; నా తోటి మనుష్యులను చూడలేను ఈ లోకంలో ఇప్పుడు నివసించే వారితో ఉండలేను. గొర్రెల కాపరి గుడారంలా నా ఇల్లు పడవేయబడి నా నుండి తీసివేయబడింది. నేతపనివాడు వస్త్రం చుట్టినట్లు నా జీవితాన్ని ముగిస్తున్నాను, ఆయన నన్ను మగ్గం నుండి వేరుచేశారు. ఒక్క రోజులోనే మీరు నాకు ముగింపు తెచ్చారు. ఉదయం వరకు ఓపికగా ఉన్నాను, కాని సింహం విరిచినట్లు ఆయన నా ఎముకలన్నీ విరిచారు; పగలు రాత్రి మీరు నా ముగింపు తెచ్చారు. కొంగలా చిన్న పిట్టలా నేను కిచకిచ అరిచాను, దుఃఖపడే పావురంలా మూలిగాను ఆకాశాల వైపు చూసి నా కళ్లు అలసిపోయాయి. నేను బెదిరిపోయాను; ప్రభువా, నాకు సహాయం చేయండి.” కాని నేనేమి అనగలను? ఆయనే నాకు మాట ఇచ్చారు, ఆయనే ఇది నెరవేర్చారు. నాకు కలిగిన వేదన బట్టి నా సంవత్సరాలన్నీ దీనుడిగా జీవిస్తాను. ప్రభువా! వీటి వలన మనుష్యులు జీవిస్తారు. వాటిలో కూడా నా ఆత్మకు జీవం దొరుకుతుంది. మీరు నాకు ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చారు నన్ను జీవింపచేశారు. నేను అనుభవించిన ఈ వేదన ఖచ్చితంగా నాకు నెమ్మది కలగడానికే. మీ ప్రేమతో నా ప్రాణాన్ని నాశనం అనే గోతినుండి విడిపించారు; నా పాపాలన్నిటిని మీ వెనుక పారవేశారు. ఎందుకంటే, సమాధి మిమ్మల్ని స్తుతించలేదు, మరణం మీకు స్తుతులు పాడలేదు. సమాధిలోనికి వెళ్లేవారు మీ నమ్మకత్వం కోసం నిరీక్షించలేరు. నేను ఈ రోజు స్తుతిస్తున్నట్లు, సజీవులు, సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తారు; తల్లిదండ్రులు తమ పిల్లలకు మీ నమ్మకత్వాన్ని తెలియజేస్తారు. యెహోవా నన్ను రక్షిస్తారు. మనం బ్రతికినన్ని రోజులు యెహోవా మందిరంలో తంతి వాద్యాలు వాయిస్తూ పాడదాము. యెషయా, “అంజూర పండ్ల ముద్ద తయారుచేసి ఆ పుండుకు రాస్తే అతడు బాగుపడతాడు” అన్నాడు. హిజ్కియా, “నేను యెహోవా ఆలయానికి వెళ్తాను అనడానికి గుర్తు ఏంటి?” అని అడిగాడు.