యెషయా 31:1-9
యెషయా 31:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లెక్కచేయకుండా యెహోవా నుండి సహాయం కోసం చూడకుండ సహయం కోసం ఈజిప్టుకు వెళ్లే వారికి గుర్రాలపై ఆధారపడేవారికి, తమ రథాల సంఖ్యపై గుర్రపురౌతుల గొప్ప బలం మీద నమ్మకం ఉంచే వారికి శ్రమ. అయినా ఆయన చాలా తెలివైనవారు, వినాశనం తీసుకురాగలరు; ఆయన తన మాట వెనుకకు తీసుకోరు. ఆయన దుష్టప్రజల మీద, కీడు చేసేవారికి సహయపడేవారి మీద లేస్తారు. ఈజిప్టువారు కేవలం మనుష్యులే, దేవుడు కాదు; వారి గుర్రాలు మాంసమే కాని ఆత్మ కాదు. యెహోవా తన చేయి చాపగా సహయం చేసేవారు తడబడతారు, సహయం పొందేవారు పడతారు; వారందరు కలిసి నాశనమవుతారు. యెహోవా నాతో చెప్పే మాట ఇదే: తప్పించడానికి గొర్రెల కాపరులందరు కలిసివచ్చి ఎన్ని శబ్దాలు చేసినా భయపడకుండా వారి కేకలకు కలవరపడకుండా సింహం ఒక కొదమసింహం తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యాల యెహోవా యుద్ధం చేయడానికి సీయోను పర్వతం మీదికి దాని కొండ మీదికి దిగి వస్తారు. అటూ ఇటూ ఎగిరే పక్షుల్లా సైన్యాల యెహోవా యెరూషలేమును కాపాడతారు; ఆయన దానిని కాపాడుతూ విడిపిస్తారు. దాని మీద దాటి వెళ్తూ దానిని రక్షిస్తారు. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరిపై తిరుగుబాటు చేశారో ఆయన వైపు తిరగండి. మీ పాపిష్ఠి చేతులు తయారుచేసిన వెండి బంగారు విగ్రహాలను ఆ రోజున మీలో ప్రతి ఒక్కరు పారవేస్తారు. “మనుష్యులు చేయని ఖడ్గానికి అష్షూరు పడిపోతుంది. మానవులు చేయని ఖడ్గం వారిని మ్రింగివేస్తుంది. వారు ఖడ్గం ఎదుట నుండి పారిపోతారు వారి యవ్వనస్థులు వెట్టిచాకిరి చేస్తారు. వారి ఆశ్రయ కోట భయంతో పడిపోతుంది; వారి అధిపతులు యుద్ధ జెండా చూసి భయపడిపోతారు” అని యెహోవా ప్రకటించారు. సీయోనులో ఆయన అగ్ని యెరూషలేములో ఆయన కొలిమి ఉన్నాయి.
యెషయా 31:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి పట్టించుకోకుండా, ఆలోచన కోసం యెహోవా దగ్గరకి వెళ్ళకుండా సహాయం కోసం ఐగుప్తుకి వెళ్ళే వాళ్ళకీ, గుర్రాలపై ఆధార పడేవాళ్ళకీ, అసంఖ్యాకంగా ఉన్న వాళ్ళ రథాలపైనా, లెక్కకు మించిన రౌతుల పైనా నమ్మకం ఉంచే వాళ్ళకీ బాధ! అయినా ఆయన జ్ఞాని. ఆయన నాశనాన్ని పంపిస్తాడు. తన మాటలను ఆయన వెనక్కి తీసుకోడు. దుర్మార్గుల ఇంటి మీదికీ, పాపులకు సహాయం చేసే వాళ్ళ మీదికీ ఆయన లేస్తాడు. ఐగుప్తు వాడు మనిషే. దేవుడు కాదు. వాళ్ళ గుర్రాలు రక్త మాంసాలే, ఆత్మ కాదు. యెహోవా తన చేతిని చాపినప్పుడు సహాయం చేసిన వాడూ, సహాయం పొందినవాడూ, ఇద్దరూ పతనమవుతారు. ఇద్దరూ నాశనం అవుతారు.” యెహోవా నాకు ఇలా చెప్పాడు. “ఒక సింహం, ఒక కొదమ సింహం తాను వేటాడి తెచ్చిన జంతువు దగ్గర గర్జించినప్పుడు దాన్ని తప్పించడానికి కొందరు గొర్రెల కాపరులు ఎన్ని శబ్దాలు చేసినా కొదమ సింహం వాళ్ళ శబ్దాలకి ఏ మాత్రం భయపడదు. అక్కడి నుంచి జారుకోడానికి ప్రయత్నించదు. ఆ విధంగా సేనల ప్రభువు అయిన యెహోవా యుద్ధం చేయడానికి సీయోను పర్వతం పైకి దిగి వస్తాడు. ఆ పర్వతంపై ఆయన యుద్ధం చేస్తాడు. ఎగురుతూ ఉండే పక్షిలాగా సేనల ప్రభువు యెహోవా యెరూషలేమును కాపాడుతాడు. ఆయన దానిపై సంచరించేటప్పుడు దాన్ని సంరక్షిస్తాడు, విడిపిస్తాడు, భద్రపరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఎవరి నుండి మీరు పూర్తిగా తొలగిపోయారో ఆయన వైపుకి తిరగండి. మీలో ప్రతి ఒక్కడూ తన చేతులతో పాపం చేసి తయారు చేసిన వెండి విగ్రహాలనూ, బంగారు విగ్రహాలనూ ఆ రోజున పారవేస్తాడు. అష్షూరు కత్తి మూలంగా కూలుతుంది. అయితే అది మనిషి ఝళిపించే కత్తి కాదు. అతడు ఆ కత్తిని ఎదుర్కోలేక పారిపోతాడు. అతని పిల్లలు బానిసలై బలవంతంగా కఠిన శ్రమ చేస్తారు. మహా భయం చేత వాళ్ళు నమ్మకాన్ని అంతా కోల్పోతారు. అతని అధిపతులు యెహోవా యుద్ధ జెండాను చూసినంతనే భయపడిపోతారు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ఆయన అగ్ని సీయోనులోనూ, ఆయన కొలిమి యెరూషలేములోనూ ఉన్నాయి.
యెషయా 31:1-9 పవిత్ర బైబిల్ (TERV)
సహాయం కోసం ఈజిప్టుకు దిగి వెళ్తున్న ఆ ప్రజలను చూడండి. ప్రజలు గుర్రాల కోసం అడుగుతున్నారు. గుర్రాలు వారిని రక్షిస్తాయని వారనుకొంటున్నారు. ఈజిప్టు రథాలు, గుర్రాలపై సైనికులు వారిని కాపాడుతారని ఆ ప్రజలు నిరీక్షిస్తున్నారు. ఆ సైన్యం చాలా పెద్దది. కనుక వారు క్షేమంగా ఉన్నాం అని ప్రజలు అనుకొంటున్నారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుడు) ప్రజలు విశ్వసించటం లేదు. ప్రజలు సహాయం కోసం యెహోవాను అడుగుట లేదు. అయితే జ్ఞానం గలవాడు యెహోవాయే. మరియు వారికి కష్టం రప్పించేవాడూ యెహోవాయే. యెహోవా ఆదేశాన్ని ప్రజలు మార్చజాలరు. యెహోవా లేచి దుష్టుల (యూదా) మీద పోరాడుతాడు. వారికి సహాయం చేయాలని ప్రయత్నించే వారి (ఈజిప్టు) మీద యెహోవా పోరాడుతాడు. ఈజిప్టు ప్రజలు కేవలం మానవమాత్రులే, దేవుడు కారు. ఈజిప్టు గుర్రాలు కేవలం జంతువులే, ఆత్మలు కావు. యెహోవా తన హస్తం చాపగా, సహాయకుడు (ఈజిప్టు) ఓడించబడతాడు. సహాయం కోరిన ప్రజలు (యూదా) పతనం అవుతారు. ఆ మనుష్యులంతా ఒక్కుమ్మడిగా నాశనం చేయబడతారు. “ఒక సింహంగాని, సింహపు పిల్లగాని తినటానికి ఒక జంతువును పట్టుకొంటే, ఆ సింహం, చచ్చిన జంతువు మీద నిలబడి గర్జిస్తుంది. ఆ సమయంలో ఆ గొప్ప సింహాన్ని ఏదీ భయపెట్టలేదు. మనుష్యులు వచ్చి, సింహం మీద కేకలు వేస్తే, సింహం భయపడదు. మనుష్యులు పెద్ద ధ్వని చేయవచ్చు కానీ సింహం మాత్రం పారిపోదు” అని యెహోవా నాతో చెప్పాడు. అదే విధంగా సర్వశక్తిమంతుడైన యెహోవా సీయోను కొండమీద దిగివస్తాడు. ఆ కొండ మీద యెహోవా పోరాడతాడు. పక్షులు వాటి గూళ్ల చుట్టూ ఎగిరినట్టు, సర్వశక్తిమంతుడైన యెహోవా యెరూషలేమును కాపాడుతాడు. యెహోవా దానిని రక్షిస్తాడు. యెహోవా “దానిపై దాటి”, యెరూషలేమును రక్షిస్తాడు. ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని మీద తిరుగుబాటు చేశారు. మీరు తిరిగి దేవుని దగ్గరకు రావాలి. మీరు తయారు చేసిన వెండి, బంగారు విగ్రహాలను ప్రజలు పూజించటం అప్పుడు మాని వేస్తారు. మీరు ఆ విగ్రహాలను తయారు చేసినప్పుడు మీరు నిజంగా పాపం చేసారు. నిజమే, అష్షూరు ఖడ్గం చేత ఓడించబడుతుంది, కానీ ఆ ఖడ్గం మానవ ఖడ్గం కాదు. అష్షూరు ఓడించబడుతుంది. కానీ ఆ నాశనం మనిషి ఖడ్గం ద్వారా జరగదు. అష్షూరు దేవుని ఖడ్గం నుండి పారిపోతుంది. కానీ యువకులు పట్టుబడి, బానిసలవుతారు. వారి భద్రతా స్థలం నాశనం చేయబడుతుంది. వారి నాయకులు ఓడించబడి, వారి పతాకాన్ని విడిచిపెడ్తారు. ఆ విషయాలన్నీ యెహోవా చెప్పాడు. యెహోవా అగ్ని (బలిపీఠం) సీయోను మీద ఉంది. యెహోవా కొలిమి (బలిపీఠం) యెరూషలేములో ఉంది.
యెషయా 31:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యు లనియువారిని ఆశ్రయించువారికి శ్రమ. అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల యింటివారిమీదను కీడుచేయువారికి తోడ్పడువారిమీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ కావు యెహోవా తన చెయ్యిచాపగా సహాయముచేయు వాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు –తప్పించుటకై గొఱ్ఱెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమసింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్య పడకయు తనకు దొరికినదానిమీద గర్జించునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని దాని కొండమీదికిని దిగి వచ్చును. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవనిమీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయనవైపు తిరుగుడి. మీకు మీరు పాపము కలుగజేసికొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును. నరునిది కాని ఖడ్గమువలన అష్షూరీయులు కూలు దురు మనుష్యునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గ మెదుటనుండివారు పారిపోవుదురు వారి పడుచువారు దాసులగుదురు భీతిచేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతినొంది వెనుక దీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సీయోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి.