యెషయా 29:17-24

యెషయా 29:17-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఇంకా కొంతకాలం తర్వాత లెబానోను సారవంతమైన పొలంగా, సారవంతమైన పొలం అడవిగా మారదా? ఆ రోజున చెవిటివారు గ్రంథంలోని మాటలు వింటారు, చీకటిలో చిమ్మ చీకటిలో గ్రుడ్డివారి కళ్లు చూస్తాయి. మరోసారి దీనులు యెహోవాలో సంతోషిస్తారు; మనుష్యుల్లో పేదవారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిలో ఆనందిస్తారు. దయలేని మనుష్యులు అదృశ్యమవుతారు, హేళన చేసేవారు మాయమవుతారు చెడు చేయడానికి ఇష్టపడేవారందరు, ఒక వ్యక్తి మీద తప్పుడు సాక్ష్యమిచ్చేవారు, న్యాయస్థానంలో మధ్యవర్తిత్వం చేసేవారిని వలలో వేసుకునేవారు అబద్ధసాక్ష్యంతో అమాయకులకు న్యాయం జరుగకుండా చేసేవారు తొలగించబడతారు. కాబట్టి అబ్రాహామును విడిపించిన యెహోవా యాకోబు వారసుల గురించి చెప్పే మాట ఇదే: “ఇకపై యాకోబు సిగ్గుపడడు; ఇకపై వారి ముఖాలు చిన్నబోవు. వారు వారి పిల్లల మధ్య నేను చేసే కార్యాలను చూసినప్పుడు, వారు నా నామాన్ని పరిశుద్ధపరుస్తారు: యాకోబు పరిశుద్ధ దేవుని ఘనపరుస్తారు, ఇశ్రాయేలు దేవునికి భయపడతారు. ఆత్మలో దారి తప్పినవారు వివేకులవుతారు; సణిగేవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు.”

యెషయా 29:17-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇంకా కొద్ది కాలంలోనే లెబానోను సారవంతమైన పొలం అవుతుంది. ఆ పొలం అడవిలా మారుతుంది. ఆ రోజున చెవిటి వాళ్ళు గ్రంథంలోని వాక్యాలు వింటారు. గుడ్డి వారు చిమ్మచీకట్లో కూడా చూస్తారు. అణచివేతకి గురైన వాళ్ళు యెహోవాలో ఆనందిస్తారు. మనుషుల్లో పేదలైన వాళ్ళు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిలో ఆనందిస్తారు. నిర్దయులు లేకుండా పోతారు. పరిహాసం చేసేవాళ్ళు అంతరిస్తారు. వీళ్ళు కేవలం ఒక్క మాట ద్వారా ఒక వ్యక్తిని నేరస్తుడిగా నిర్ధారిస్తారు. న్యాయం కోసం వచ్చేవాడి కోసం వలలు వేస్తారు. వట్టి అబద్ధాలతో నీతిమంతుణ్ణి కూలగొడతారు. అందుచేత అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు వంశం గూర్చి ఇలా చెప్తున్నాడు. “ఇకపై యాకోబు ప్రజలు సిగ్గుపడరు. అవమానంతో వాళ్ళ ముఖం పాలిపోవు. అయితే వాళ్ళ సంతానాన్నీ, వాళ్ళ మధ్య నేను చేసే పనులనూ చూసినప్పుడు వాళ్ళు నా పేరును పవిత్ర పరుస్తారు. యాకోబు పరిశుద్ధ దేవుని పేరును పవిత్రపరుస్తారు. ఇశ్రాయేలు దేవునికి భయపడతారు. అప్పుడు ఆత్మలో పొరపాటు చేసేవారు కూడా వివేకం పొందుతారు. అదేపనిగా ఫిర్యాదులు చేసేవాళ్ళు జ్ఞానం సంపాదిస్తారు.”

యెషయా 29:17-24 పవిత్ర బైబిల్ (TERV)

అసలు సత్యం ఇది. కొంచెం కాలం తర్వాత కర్మెలు పర్వతంలాగే లెబానోను పర్వతం కూడ మంచినేల అవుతుంది. మరియు కర్మెలు పర్వతం దట్టమైన అరణ్యంలా ఉంటుంది. చెవిటివారు కూడ గ్రంథంలోని మాటలు వింటారు. గ్రుడ్డివారు చీకటి, మంచుగుండా చూస్తారు. పేద ప్రజలను యెహోవా సంతోషపరుస్తాడు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధునిలో పేద ప్రజలు ఆనందిస్తారు. నీచులు, కృ-రులు అంతమయిన తర్వాత ఇది జరుగుతుంది. చెడు కార్యాలు చేయటంలో ఆనందించే వాళ్లు పోయిన తర్వాత ఇది జరుగుతుంది. (ఆ మనుష్యులు మంచివాళ్లను గూర్చి అబద్ధం చెబుతారు. వారు న్యాయస్థానంలో ప్రజలను మోసం చేయాలని చూస్తారు. నిర్దోషులను వారు నాశనం చేయాలని చూస్తారు.) కనుక యాకోబు వంశంతో యెహోవా మాట్లాడుతున్నాడు. (ఈ యెహోవాయే అబ్రాహామును విడిపించింది.) యెహోవా చెబుతున్నాడు: “ఇప్పుడు యాకోబు (ఇశ్రాయేలు ప్రజలు) ఇబ్బందిపడడు, సిగ్గుపడడు. అతడు తన పిల్లలందర్నీ చూస్తాడు, నా నామం పవిత్రం అని చెబు తాడు. ఈ ప్రజలందర్నీ నా చేతులతో నేనే చేశాను, యాకోబు యొక్క పరిశుద్ధుడు (దేవుడు) చాలా ప్రత్యేకం అని ఈ ప్రజలు చెబుతారు. ఈ ప్రజలు ఇశ్రాయేలు దేవుణ్ణి సన్మానిస్తారు. ఈ ప్రజల్లో చాలా మందికి అర్థం గాక చెడ్డపనులు చేశారు. ఈ ప్రజలు అర్థం చేసికోలేదు కానీ వాళ్ల పాఠం వాళ్లు నేర్చుకొంటారు.”

యెషయా 29:17-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనమని యెంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు. బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు. కీడుచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యెమునుబట్టి యితరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని ఉరి నొడ్డుచు మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు. అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమునుగూర్చి యీలాగు సెల విచ్చుచున్నాడు –ఇకమీదట యాకోబు సిగ్గుపడడు ఇకమీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపువారు తమ మధ్య నేనుచేయు కార్యమును చూచునప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు యాకోబు పరిశుద్ధదేవుని పరిశుద్ధపరచుదురు ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధిగలవారు వివేకులగుదురు సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు.