యెషయా 28:16-17 - Compare All Versions
యెషయా 28:16-17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడండి, నేను సీయోనులో ఒక రాయిని, పరీక్షించబడిన రాయిని వేశాను, అది స్థిరమైన పునాదికి అమూల్యమైన మూలరాయి; దానిపై నమ్మకముంచేవారు ఎప్పుడూ భయాందోళనలకు గురికారు. నేను న్యాయాన్ని కొలమానంగా, నీతిని మట్టపు గుండుగా చేస్తాను: వడగండ్లు మీ అబద్ధం అనే ఆశ్రయాన్ని తుడిచివేస్తాయి. మీ దాగుచోటు నీటికి కొట్టుకుపోతుంది.
యెషయా 28:16-17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దానికి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, నేను సీయోనులో ఒక పునాది రాయి వేస్తాను. అది పరిశోధనకి గురైన రాయి. ఒక ప్రశస్తమైన మూలరాయిని వేస్తాను. అది దృఢమైన పునాది రాయి. విశ్వాసం ఉంచే వాడు సిగ్గుపడడు. నేను న్యాయాన్ని కొలబద్దగానూ, నీతిని ఒడంబంగానూ చేస్తాను. వడగళ్ళు మీ అబద్దాలనే ఆశ్రయాన్ని తుడిచి పెట్టేస్తాయి. మీరు దాగి ఉన్న చోటును వరద నీళ్ళు ముంచెత్తుతాయి.
యెషయా 28:16-17 TERV (పవిత్ర బైబిల్)
ఆ విషయాల మూలంగా, నా ప్రభువు యెహోవా చెబుతున్నాడు: “సీయోనులో నేల మీద నేను ఒక బండను, ఒక మూలరాయిని ఉంచుతాను. ఇది చాలా ప్రశస్తమైన రాయి. ముఖ్యమైన ఈ బండమీదనే సమస్తం నిర్మించబడుతుంది. ఆ బండను విశ్వసించిన వారు నిరాశ చెందరు. “ఒక గోడ తిన్నగా ఉన్నట్టు చూపించటానికి మనుష్యులు మట్టపుగుండు కట్టిన దారం ఉపయోగిస్తారు. అదే విధంగా ఏది సరైనదో చూపించేందుకు నేను న్యాయం, మంచితనం ఉపయోగిస్తాను. చెడ్డ వాళ్లయిన మీరు మీ అబద్ధాలు, మాయల వెనుక దాగుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు శిక్షించబడతారు. మనం దాగుకొనే స్థలాలను నాశనం చేసేందుకు వస్తున్న తుఫాను, లేక వరదలా అది ఉంటుంది.
యెషయా 28:16-17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు –సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును.