యెషయా 18:1-5

యెషయా 18:1-5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

కూషు నదుల అవతల సందడి చేసే రెక్కల దేశమా, నీకు శ్రమ! అది సముద్ర మార్గంలో నీటి మీద జమ్ము పడవలలో దూతలను పంపుతుంది. తొందరపడే దూతలారా! వారు నునుపైన చర్మం గల ఎత్తైన ప్రజల దగ్గరకు, దూరంలోనున్న భయపెట్టే ప్రజల దగ్గరకు, నదులు పారుచున్న దేశం కలిగి దౌర్జన్యం వింత భాష కలిగిన దేశం దగ్గరకు వెళ్లండి. సమస్త లోకవాసులారా, భూలోక నివాసులారా, పర్వతాలమీద ఒక జెండాను ఎత్తినప్పుడు మీరు చూస్తారు, బూర ఊదినప్పుడు మీరు వింటారు. యెహోవా నాతో చెప్పే మాట ఇది: “సూర్యకాంతిలోని తీవ్రమైన వేడిలా, వేసవి కోతకాలంలోని పొగమంచు మేఘంలా, నేను నిశ్శబ్దంగా నా నివాసస్థలం నుండి చూస్తాను.” కోతకాలం రాకముందే, పువ్వు వాడిపోయినప్పుడు పువ్వు ద్రాక్షగా మారుతున్నప్పుడు ఆయన మడ్డికత్తులతో ద్రాక్షతీగెలను కత్తిరించి విస్తరించే తీగెలను తీసివేస్తారు.

యెషయా 18:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అయ్యో! ఇతియోపియా నదుల అవతల టపటపా కొట్టుకునే రెక్కలున్న దేశానికి దుఃఖం! అది సముద్రంపై నీళ్ళ మీద జమ్ము పడవల్లో రాయబారులను పంపిస్తూ ఉంది. వేగిరపడే వార్తాహరులారా! వెళ్ళండి. నున్నని చర్మం కలిగి పొడుగ్గా ఉండే ప్రజల దగ్గరికి వెళ్ళండి! చుట్టూ ఉన్న వాళ్ళనీ, దూరంగా ఉండే వాళ్ళనీ భయకంపితులను చేస్తూ, అణచివేసే ఆ బలమైన జనాల దగ్గరకూ, నదులు విభజించే వాళ్ళ దేశానికీ వెళ్ళండి! ప్రపంచంలో నివసించే మీరు, భూమిపైన జీవించే మీరు పర్వతాల పైన సంకేతంగా జెండా ఎత్తినప్పుడు చూడండి! బాకా ఊదినప్పుడు వినండి! యెహోవా నాకు చెప్పిన మాట ఇదే. “వేసవిలో ఉడుకెత్తే వేడిలా, కోతకాలంలో ఏర్పడే పొగమంచు మబ్బులా నేను నిశ్శబ్దంగా నా నివాస స్థలం నుండి గమనిస్తూ ఉంటాను.” కోతకాలం రాకముందు పువ్వు వికసించే దశ ముగిసిన తర్వాత, పువ్వు ద్రాక్షగా మారుతున్న దశలో ఆయన పోటకత్తులతో ద్రాక్షకాయలను కత్తిరిస్తాడు. వ్యాపిస్తున్న ద్రాక్ష కొమ్మలను నరికి అవతల పారవేస్తాడు.

యెషయా 18:1-5 పవిత్ర బైబిల్ (TERV)

ఇథియోపియా నదుల తీరంలో దేశాన్ని చూడు. దేశం కీటకాలతో నిండిపోయింది. నీవు వాటి రెక్కల పటపట శబ్దం వినవచ్చు. ఆ దేశం సముద్రం మీద జమ్ము పడవల్లో మనుష్యులను ఆవలికి పంపిస్తుంది. వేగంగా పోయే సందేశహరులు, ఎత్తుగా బలంగా ఉండే మనుష్యుల దగ్గరకు వెళ్తారు. (ఎత్తుగా బలంగా ఉండే ఈ మనుష్యులంటే అన్ని చోట్ల ప్రజలకు భయం. వారు బలంగల రాజ్యం. వారి రాజ్యం ఇతర రాజ్యాలను జయిస్తుంది. నదుల మూలంగా విభజించబడిన దేశంలో వారు ఉన్నారు). వారికి ఏదో కీడు జరుగుతుంది అని ఆ ప్రజలకు హెచ్చరిక చేయి. ఆ రాజ్యానికి ఈ సంగతి సంభవించటం ప్రపంచంలోని ప్రజలంతా చూస్తారు. ఒక కొండ మీద ఎగురవేసిన పతాకంలా ప్రజలు ఈ విషయాన్ని తేటగా చూస్తారు. ఎత్తయిన ఈ మనుష్యులకు సంభవించే ఆ సంగతిని గూర్చి భూలోకంలో జీవించే ప్రజలంతా వింటారు. యుద్ధానికి ముందు ఊదే శంఖంలా వారు దీనిని తేటగా వింటారు. యెహోవా చెప్పాడు: “నా కోసం సిద్ధం చేయబడిన స్థలంలో నేను ఉంటాను. ఈ సంగతులు సంభవించటం నేను మౌనంగా చూస్తాను. అందమైన ఒక వేసవి రోజు, మధ్యాహ్నం ప్రజలు విశ్రాంతి తీసుకొంటూ ఉంటారు. (అది వర్షాలు లేని ఎండాకాలపు కోత సమయం, ఉదయపు మంచు మాత్రమే ఉంటుంది) అప్పుడు ఏదో జరుగుతుంది. అది పూవులు వికసించిన తరువాత సమయం క్రొత్త ద్రాక్షలు మొగ్గ తొడిగి, పెరుగుతూ ఉంటాయి. అయితే కోతకు ముందు శత్రువు వచ్చి, మొక్కలు నరికేస్తాడు. శత్రువు ద్రాక్షలను చితుకగొట్టి, పారవేస్తాడు.

యెషయా 18:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఓహో కూషు నదుల అవతల తటతట కొట్టుకొను చున్న రెక్కలుగల దేశమా! అది సముద్రమార్గముగా జలములమీద జమ్ము పడవ లలో రాయబారులను పంపుచున్నది –వేగిరపడు దూతలారా, యెత్తయినవారును నునుపైన చర్మముగలవారునగు జనమునొద్దకు దూరములోనున్న భీకరజనమునొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశముగలవారును దౌష్టికులై జన ములను త్రొక్కు చుండువారునగు జనము నొద్దకు పోవుడి. పర్వతములమీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు భూమిమీద కాపురముండు మీరు చూడుడి బాకా ఊదునప్పుడు ఆలకించుడి. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు –ఎండ కాయుచుండగాను వేసవికోతకాలమున మేఘ ములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాసస్థలమున కనిపెట్టుచుందును. కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరు వాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తులచేత ద్రాక్షతీగెలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును.