యెషయా 16:1-14

యెషయా 16:1-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఎడారి వైపు ఉన్న సెల నుండి దేశాన్ని పాలించేవానికి కప్పంగా గొర్రెపిల్లలను సీయోను కుమార్తె పర్వతానికి పంపండి. గూటినుండి చెదరగొట్టబడి ఇటు అటు ఎగిరే పక్షుల్లా అర్నోను రేవుల దగ్గర మోయాబు స్త్రీలు ఉంటారు. మోయాబు అంటుంది, “మనస్సు సిద్ధం చేసుకో, నిర్ణయం తీసుకో. చీకటి కమ్మినట్టుగా మిట్టమధ్యాహ్నం నీ నీడ మామీద ఉండనివ్వు. పారిపోయినవారిని దాచి పెట్టు, శరణార్థులకు ద్రోహం చేయకు. పారిపోయిన మోయాబీయులను నీతో ఉండనివ్వు; నాశనం చేసేవాని నుండి కాపాడే ఆశ్రయంగా ఉండు.” హాని చేసేవారు అంతం అవుతారు, విధ్వంసం ఆగిపోతుంది; అణచివేసేవారు భూమి మీద లేకుండా మాయమవుతారు. మారని ప్రేమలో సింహాసనం స్థాపించబడుతుంది; దావీదు కుటుంబం నుండి సత్యవంతుడైన ఒకడు దానిపై కూర్చుని న్యాయంగా తీర్పు తీర్చుతూ నీతిన్యాయాలను జరిగించడానికి త్వరపడతాడు. మోయాబు గర్వం గురించి మేము విన్నాము దాని అహంకారం చాలా ఎక్కువ దాని ప్రగల్భాలు, గర్వం, దౌర్జన్యం గురించి విన్నాం; అయితే దాని ప్రగల్భాలు వట్టివే. కాబట్టి మోయాబీయులు రోదిస్తారు, వారందరూ కలిసి మోయాబు గురించి ఏడుస్తారు. కీర్ హరెశెతుకు ఎండు ద్రాక్షపండ్ల విలపించి దుఃఖిస్తారు. హెష్బోను పొలాలు, షిబ్మా ద్రాక్షతీగెలు కూడా వాడిపోయాయి. యాజెరు వరకు వ్యాపించిన అరణ్యం వరకు ప్రాకిన శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలను దేశాల పాలకులు త్రొక్కివేశారు. వాటి తీగెలు విశాలంగా వ్యాపించి సముద్రాన్ని దాటాయి. అందువల్ల యాజెరు ఏడ్చినట్లు నేను షిబ్మా ద్రాక్షతీగెల కోసం ఏడుస్తాను. హెష్బోనూ ఎల్యాలెహు, నా కన్నీటి చేత మిమ్మల్ని తడుపుతాను. నీ పండిన ఫలాల కోసం నీ పంటల కోసం వేసే సంతోషపు కేకలు ఆగిపోయాయి. ఫలభరితమైన పొలాల నుండి ఆనంద సంతోషాలు తీసివేయబడతాయి; ద్రాక్షతోటలో ఎవరూ పాడరు, కేకలు వేయరు; గానుగులలో ద్రాక్షగెలలను ఎవరూ త్రొక్కరు. ఎందుకంటే, నేను వారి సంతోషపు అరుపులు ఆపివేశాను. నా హృదయం వీణలా మోయాబు గురించి, నా అంతరంగం కీర్ హరెశెతు గురించి విలపిస్తుంది. మోయాబు తన క్షేత్రాల దగ్గరకు వెళ్లినప్పుడు అది కేవలం ఆయాసపడుతుంది; ప్రార్ధన చేయడానికి తన క్షేత్రానికి వెళ్లినప్పుడు దానికి ఏమి దొరకదు. యెహోవా మోయాబు గురించి ముందే పలికిన వాక్కు ఇది. అయితే యెహోవా ఇప్పుడు ఇలా చెప్తున్నారు: “మూడు సంవత్సరాల్లో, కూలివాని లెక్క ప్రకారం ఖచ్చితంగా మోయాబు ఘనతతో పాటు దానిలోని అనేకమంది తృణీకరించబడతారు; దానిలో మిగిలినవారు అతితక్కువగా, బలహీనంగా ఉంటారు.”

యెషయా 16:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నిర్జన ప్రదేశం వైపు ఉన్న సెల నుంచి దేశాన్ని పరిపాలన చేసే వాడికి, సీయోను కుమార్తె పర్వతానికి పొట్టేళ్లను పంపండి. గూటి నుంచి చెదిరి ఇటు అటు ఎగిరే పక్షుల్లా అర్నోను రేవుల దగ్గర మోయాబు కుమార్తెలు కనిపిస్తారు. “ఆలోచన చెప్పు. న్యాయం అమలు చెయ్యి. చీకటి కమ్మినట్టు మధ్యాహ్నం పూట నీ నీడ మా మీద ఉండనివ్వు. పలాయనంలో ఉన్నవాళ్ళను దాచి పెట్టు. పారిపోయిన వాళ్ళను పట్టిచ్చి ద్రోహం చెయ్యకు. మోయాబు నుంచి పలాయనం అయిన వాళ్ళను నీతో నివాసం ఉండనివ్వు. నాశనం చేసే వాళ్ళు వాళ్ళ మీదకి రాకుండా వాళ్లకు దాక్కునే చోటుగా ఉండు.” ఎందుకంటే బలాత్కారం ఆగిపోతుంది. నాశనం నిలిచిపోతుంది. అణగదొక్కేవాళ్ళు దేశంలో నుండి అదృశ్యం అవుతారు. నిబంధనా నమ్మకత్వంతో సింహాసన స్థాపన జరుగుతుంది. దావీదు గుడారంలోనుంచి ఒకడు అక్కడ నమ్మకంగా కూర్చుంటాడు. అతడు తీర్పు తీరుస్తాడు, న్యాయం వెదకుతాడు, నీతి జరిగిస్తాడు. మోయాబు గర్వం గురించి మేము విన్నాం. అతని అహంకారం, అతని ప్రగల్భాలు, అతని క్రోధం గురించి విన్నాం. కానీ అతని ప్రగల్భాలు వట్టివి. కాబట్టి మోయాబీయులు మోయాబును గూర్చి విలపిస్తారు. అందరూ విలపిస్తారు. మీరు పూర్తిగా పాడైన కీర్ హరెశెతు ద్రాక్షపళ్ళ గుత్తుల కోసం మూలుగుతారు. ఎందుకంటే హెష్బోను పొలాలు, సిబ్మా ద్రాక్షాతీగెలు వాడిపోయాయి. దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జాతుల అధికారులు అణగదొక్కారు. అవి యాజరు వరకూ వ్యాపించాయి, ఎడారిలోకి పాకాయి. దాని తీగెలు విశాలంగా వ్యాపించి సముద్రాన్ని దాటాయి. యాజరుతో కలిసి నేను సిబ్మా ద్రాక్షాతీగెల కోసం ఏడుస్తాను. హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లతో నిన్ను తడుపుతాను. ఎందుకంటే నీ వేసవికాల ఫలాల మీద, నీ పంట మీద నీ కేరింతలను నేను అంతమొందించాను. ఆనంద సంతోషాలు ఫలభరితమైన పొలాల నుంచి అదృశ్యం అవుతాయి. నీ ద్రాక్షల తోటలో సంగీతం వినిపించదు. ఉత్సాహ ధ్వని వినబడదు. గానుగుల్లో ద్రాక్షగెలలను తొక్కేవాడు లేడు. ద్రాక్షల తొట్టి తొక్కేవారి సంతోషభరితమైన కేకలు నేను నిలుపు చేశాను. మోయాబు కోసం నా గుండె కొట్టుకుంటోంది. కీర్ హరెశెతు కోసం నా అంతరంగం తీగవాయిద్యంలా నిట్టూర్పు విడుస్తోంది. మోయాబీయులు ఉన్నత స్థలానికి వచ్చి సొమ్మసిల్లి ప్రార్థన చెయ్యడానికి తమ గుడిలో ప్రవేశించినప్పుడు, వారి ప్రార్థనల వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇంతకు ముందు యెహోవా మోయాబు గురించి చెప్పిన మాట ఇదే. మళ్ళీ యెహోవా మాట్లాడుతున్నాడు. “మూడేళ్ళలోపు మోయాబు ఘనత అదృశ్యం అవుతుంది. అతనికి అనేకమంది జనం ఉన్నా చాలా తక్కువగానూ ప్రాముఖ్యత లేనివాళ్ళుగానూ ఉంటారు.”

యెషయా 16:1-14 పవిత్ర బైబిల్ (TERV)

ఆ దేశపు రాజుకు మీరు ఒక కానుక పంపాలి. సెలానుండి అరణ్యంగుండా సీయోను కుమార్తె కొండకు (యెరూషలేము) మీరు ఒక గొర్రెపిల్లను పంపాలి. మోయాబు స్త్రీలు అర్నోను నది దాటేందుకు ప్రయత్నిస్తారు. సహాయం కోసం వారు ఒకచోట నుండి మరోచోటుకు పరుగులెత్తుతారు. వారు, గూడు నేల కూలినప్పుడు తప్పిపోయిన చిన్న పిట్ట పిల్లలా ఉంటారు. “మాకు సహాయం చేయండి, మేం ఏం చేయాలో మాకు చెప్పండి! మధ్యాహ్నపు ఎండనుండి నీడ కాపాడినట్టు మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడండి. మా శత్రువుల నుండి మేం పారిపోతున్నాం మమ్మల్ని దాచిపెట్టండి. మమ్మల్ని మా శత్రువులకు అప్పగించకండి అని వారంటారు. ఆ మోయాబు ప్రజలు వారి ఇండ్లనుండి బలవంతంగా వెళ్లగొట్టబడ్డారు. కనుక వాళ్లను మీ దేశంలో నివాసం ఉండనియ్యండి. వారి శత్రువులనుండి వారిని కాపాడండి.” దోచుకోవటం ఆగిపోతుంది. శత్రువు ఓడించబడతాడు. ఇతరులను బాధించే పురుషులు దేశం నుండి వెళ్లిపోతారు. అప్పుడు క్రొత్త రాజు వస్తాడు. ఈ రాజు దావీదు వంశంవాడు. ఆయన నిజాయితీ పరుడు. ఆయన ప్రేమ, దయగలవాడు. ఈ రాజు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. సరియైనవి, మంచివి ఆయన చేస్తాడు. మోయాబు ప్రజలు చాలా గర్విష్ఠులని, మోసగాళ్లని మేము విన్నాం. ఈ ప్రజలు తిరుగు బాటు దారులు, గర్విష్ఠులు. అయితే వారి గొప్పలన్నీ వట్టి మాటలే. ఆ గర్వం చేత మొత్తం మోయాబు దేశం శ్రమ అనుభవిస్తుంది. మోయాబు ప్రజలంతా ఏడుస్తారు. ప్రజలు విచారిస్తారు. గతంలో వారికి ఉన్నవన్నీ మళ్లీ కావాలనుకొంటారు. కీర్హరెశెతు ద్రాక్షపండ్ల అడలు కావాలని వారు కోరుకొంటారు. హెష్బోను పొలాలు, సిబ్మా ద్రాక్ష వల్లులు, ద్రాక్ష పండ్లు ఫలించటం లేదని ప్రజలు విచారంగా ఉంటారు. విదేశీ పాలకులు ద్రాక్ష వల్లులను నరికివేశారు. శత్రుసైన్యాలు యాజరు పట్టణం వరకు చాలా దూరం, అరణ్యంలోనికి విస్తరించారు. సముద్రం వరకు వారు విస్తరించారు. “ద్రాక్ష పండ్లు నాశనం చేయబడ్డాయి. కనుక యాజరు, సిబ్మా ప్రజలతోబాటు నేనూ ఏడుస్తాను. పంట ఉండదు గనుక హెష్బోను, ఏలాలే ప్రజలతోబాటు నేనూ ఏడుస్తాను. వేసవి పండ్లు ఏమీ ఉండవు. సంతోషపు కేకలు అక్కడ ఉండవు. కర్మెలులో పాటలు పాడటం మరియు సంతోషం ఉండదు. పంట కోత సమయంలో సంతోషం అంతా నేను నిలిపివేస్తాను. ద్రాక్షపండ్లు ద్రాక్షరసం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ అవన్నీ వ్యర్థం అవుతాయి. అందుచేత మోయాబు గూర్చి నాకు చాలా విచారం కీర్హరెశు గూర్చి నాకు చాలా విచారం ఈ పట్టణాల గూర్చి నాకు ఎంతెంతో దుఃఖం. మోయాబు ప్రజలు ఎత్తయిన వారి పూజాస్థలాలకు వెళ్తారు. ప్రజలు ప్రార్థించాలని ప్రయత్నిస్తారు. కానీ సంభవించిన సంగతులన్నీ వారు చూస్తారు, ప్రార్థించలేనంత బలహీనులవుతారు.” మోయాబును గూర్చి ఈ విషయాలు యెహోవా ఎన్నోసార్లు చెప్పాడు. ఇప్పుడు “మూడు సంవత్సరాల్లో (కూలీ వాని కాలం లెక్క ప్రకారం) ఆ ప్రజలందరూ ఉండరు, వారికి అతిశయాస్పదమైనవన్నీ పోతాయి. కొంతమంది మనుష్యులు మిగిలి ఉంటారు. కానీ వారు ఎక్కువ మంది ఉండరు” అని యెహోవా చెబుతున్నాడు.

యెషయా 16:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అరణ్యపుతట్టుననున్న సెలనుండి దేశము నేలువానికి తగిన గొఱ్ఱెపిల్లలను కప్పముగా సీయోనుకుమార్తె పర్వతమునకు పంపుడి గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె అర్నోను రేవులయొద్ద మోయాబు కుమార్తెలు కన బడుదురు. ఆలోచన చెప్పుము విమర్శచేయుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనియ్యుము. చెదరినవారిని దాచిపెట్టుము పారిపోయినవారిని పెట్టియ్యకుము నేను వెలివేసినవారిని నీతో నివసింపనిమ్ము దోచుకొనువారు వారిమీదికి రాకుండునట్లు మోయా బీయులకు ఆశ్రయముగా ఉండుము బలాత్కారులు ఓడిపోయిరి సంహారము మాని పోయెను. అణగద్రొక్కువారు దేశములోలేకుండ నశించిరి. కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. మోయాబీయులు బహు గర్వముగలవారని మేము విని యున్నామువారి గర్వమునుగూర్చియు వారి అహంకార గర్వక్రోధములనుగూర్చియు విని యున్నాము.వారు వదరుట వ్యర్థము. కావున మోయాబీయులు మోయాబునుగూర్చి అంగలార్చుదురు అందరును అంగలార్చుదురు మోయాబీయులారా కేవలము పాడైయున్న కీర్హరెశెతు ద్రాక్షపండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షా వల్లులు వాడిపోయెను దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అణగద్రొక్కిరి. అవి యాజరువరకు వ్యాపించెను అరణ్యములోనికి ప్రాకెను దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షా వల్లుల నిమిత్తము ఏడ్చెదను హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లచేత నిన్ను తడిపె దను ఏలయనగా ద్రాక్షతొట్టి త్రొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలములమీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనందసంతోషములు ఫలభరితమైన పొలమునుండి మానిపోయెను ద్రాక్షలతోటలో సంగీతము వినబడదు ఉత్సాహ ధ్వని వినబడదు గానుగలలో ద్రాక్షగెలలను త్రొక్కువాడెవడును లేడు ద్రాక్షలతొట్టి త్రొక్కువాని సంతోషపుకేకలు నేను మాన్పించియున్నాను. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది కీర్హరెశెతు నిమిత్తము నా ఆంత్రములు సితారావలె వాగుచున్నవి. మోయాబీయులు ఉన్నతస్థలమునకు వచ్చి ఆయాస పడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించునప్పుడువారికేమియు దొరకకపోవును. పూర్వకాలమున యెహోవా మోయాబునుగూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే; అయితే యెహోవా ఇప్పుడీలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు –కూలివాని లెక్కప్రకారము మూడేండ్లలోగా మోయాబీయులయొక్క ప్రభావమును వారి గొప్ప వారి సమూహమును అవమానపరచబడును శేషము బహు కొద్దిగా మిగులును అది అతి స్వల్ప ముగా నుండును.