యెషయా 1:10-20
యెషయా 1:10-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి; గొమొర్రా ప్రజలారా! మన దేవుని ఉపదేశాన్ని శ్రద్ధగా వినండి. యెహోవా ఇలా అంటున్నారు, “విస్తారమైన మీ బలులు నాకెందుకు? దహనబలులుగా ఇచ్చిన పొట్టేళ్లు, బాగా క్రొవ్విన జంతువుల క్రొవ్వు నాకు వెగటు కలిగించాయి; ఎద్దుల, గొర్రెపిల్లల, మేకపోతుల రక్తంలో నాకు ఆనందం లేదు. మీరు నా సన్నిధికి వస్తున్నప్పుడు, నా ఆవరణాలను త్రొక్కడానికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? విలువలేని అర్పణలు తీసుకురావడం ఆపండి! మీ ధూపం నాకు అసహ్యం కలిగిస్తుంది. అమావాస్యలు, సబ్బాతులు, ప్రత్యేక సమావేశాలు మీ దుష్ట సమావేశాలు నేను భరించలేను. మీ అమావాస్య ఉత్సవాలు, నియమించబడిన పండుగలు నా పూర్ణాత్మతో నేను అసహ్యిస్తున్నాను. అవి నాకు భారంగా ఉన్నాయి; వాటిని భరించలేక అలిసిపోయాను. ప్రార్థనలో మీరు మీ చేతులు చాచినప్పుడు, మిమ్మల్ని చూడకుండ కళ్లు కప్పుకుంటాను; మీరు చాలా ప్రార్థనలు చేసినా నేను వినను. “మీ చేతులు రక్తంతో నిండిపోయాయి! “మిమ్మల్ని మీరు కడుక్కుని శుభ్రం చేసుకోండి. మీ చెడు కార్యాలు నాకు కనిపించకుండా వాటిని తొలగించండి; తప్పు చేయడం మానండి. సరియైనది చేయడం నేర్చుకోండి; న్యాయాన్ని వెదకండి. అణచివేయబడుతున్న వారి పక్షాన ఉండండి. తండ్రిలేనివారికి న్యాయం తీర్చండి. విధవరాలి పక్షాన వాదించండి. “రండి, మనం విషయాన్ని పరిష్కరించుకుందాం” అని యెహోవా అంటున్నారు. “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా అవుతాయి; కెంపులా ఎర్రగా ఉన్నా, అది ఉన్నిలా తెల్లగా అవుతాయి. మీరు ఇష్టపడి నా మాట వింటే, మీరు భూమి ఇచ్చే మంచి పంటను తింటారు; ఒకవేళ మీరు ఎదిరించి తిరుగుబాటు చేస్తే, మీరు ఖడ్గం చేత నాశనమవుతారు” యెహోవా ఈ మాట చెప్తున్నారు.
యెషయా 1:10-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి. గొమొర్రా ప్రజలారా, మన దేవుని ధర్మశాస్త్రం ఆలకించండి. “యెహోవా ఇలా అంటున్నాడు. విస్తారమైన మీ బలులు నాకెందుకు?” “దహనబలులుగా అర్పించిన పాట్టేళ్లు, బలిసిన దూడల కొవ్వు నాకు వెగటు పుట్టించాయి. దున్నపోతుల రక్తం, గొర్రె పిల్లల రక్తం, మేకపోతుల రక్తం అంటే నాకు ఇష్టం లేదు. మీరు నా సన్నిధిలో నన్ను కలుసుకోడానికి వస్తున్నప్పుడు, నా ప్రాంగణాలు తొక్కమని మిమ్మల్ని ఎవరడిగారు? అర్థం లేని అర్పణలు మీరు ఇక తీసుకు రావొద్దు. ధూపార్పణ నాకు అసహ్యం. అమావాస్య, విశ్రాంతి దినాలు, సమాజ కూటాలు జరుగుతున్నాయి కాని, మీ దుర్మార్గ సమావేశాలు నేను సహించలేను. మీ అమావాస్య ఉత్సవాలు, నియామక ఉత్సవాలు నాకు అసహ్యం. అవి నాకు బాధాకరం. వాటిని సహించలేక విసిగిపోయాను. మీరు మీ చేతులు ప్రార్థనలో చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పేసుకుంటాను. మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి. మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి. మీ దుష్టత్వం మానండి.” మంచి చెయ్యడం నేర్చుకోండి. న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి. తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి. వితంతువు పక్షాన నిలబడండి. యెహోవా ఇలా అంటున్నాడు. “రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.” “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా అవుతాయి. కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి. మీరు ఇష్టపడి నాకు లోబడితే, మీరు ఈ దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు. తిరస్కరించి తిరుగుబాటు చేస్తే, కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.” యెహోవా నోరు ఈ మాట పలికింది.
యెషయా 1:10-20 పవిత్ర బైబిల్ (TERV)
సొదొమ నాయకులారా, యెహోవా సందేశం వినండి. గొమొర్రా ప్రజలారా, దేవుని ఉపదేశాలు వినండి. దేవుడు అంటున్నాడు: “ఇంకా ఎందుకు మీరు నాకు బలులు అర్పిస్తూనే ఉన్నారు? మీ మేకల బలులు, దూడల కొవ్వు, గొర్రెలు, మేకలు నాకు వెక్కసం అయ్యాయి. మీరు నన్ను కలుసుకొనేందుకు వచ్చినప్పుడు, నా ఆవరణం అంతా తిరుగుతారు. మిమ్మల్ని ఇలా చేయమన్నది ఎవరు? “నా కోసం పనికిమాలిన బలులు ఇక మీదట తీసుకొని రావద్దు. మీరు నాకు అర్పించే ధూపం నాకు అసహ్యం మీ అమావాస్య, సబ్బాతు, పవిత్ర రోజుల పండుగలను నేను సహించను. మీ పరిశుద్ధ సమావేశాలలో మీరు చేసేది నాకు అసహ్యం. మీ నెలసరి సమావేశాలు, సభలు నాకు బొత్తిగా అసహ్యం. ఈ సమావేశాలు నాకు చాలా బరువులా తయారయ్యాయి. ఆ బరువులు మోయటం నాకు విసుగు. “మీరు నన్ను ప్రార్థించాలని మీ చేతులు పైకి ఎత్తుతారు కానీ నేను మిమ్మల్ని చూడటానికి కూడా ఒప్పుకోను. మీరు మరిన్ని ప్రార్థనలు చేస్తారు కాని నేను మీ ప్రార్థనలు వినేందుకు ఒప్పుకోను. ఎందుకంటే మీ చేతులు రక్తమయము. “మిమ్మల్ని మీరు కడుక్కోండి. మిమ్మల్ని మీరు పరిశుభ్రం చేసుకోండి. మీరు చేస్తున్న చెడు పనులు చాలించండి. ఆ చెడు పనులు చూడటం నాకు ఇష్టం లేదు. తప్పు చేయటం మానివేయండి. మంచి పనులు చేయటం నేర్చుకోండి. ఇతరుల విషయంలో న్యాయంగా ఉండండి. ఇతరులను బాధించే వారిని శిక్షించండి. తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం చేయండి. భర్తలు చనిపోయిన స్త్రీలకు సహాయం చేయండి.” యెహోవా చెబుతున్నాడు, “రండి, ఈ విషయాలు మనం పరిష్కరించుకొందాము. మీ పాపాలు కెంపులాగా ఎర్రగా ఉన్నా సరే వాటిని కడగవచ్చు, మీరు మంచులా తెల్లగా అవుతారు. మీ పాపాలు చాలా ఎర్రగా ఉన్నా సరే మీరు మాత్రం ఉన్నిలాగ తెల్లగా మారవచ్చును. “నేను చెప్పే మాటలు మీరు వింటే అప్పుడు ఈ దేశపు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. కానీ మీరు వినేందుకు నిరాకరిస్తే, మీరు నాకు వ్యతిరేకమే. మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేసేస్తారు.” యెహోవా తానే ఈ విషయాలు చెప్పాడు.
యెషయా 1:10-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆల కించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే –విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొల గింపుడి. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు –రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.