హోషేయ 6:1-7

హోషేయ 6:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

“రండి, మనం యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. ఆయన మనల్ని ముక్కలుగా చీల్చారు కాని ఆయనే మనల్ని బాగుచేస్తారు; ఆయన మనల్ని గాయపరచారు కాని ఆయన మన గాయాలను కడతారు. రెండు రోజుల తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తారు, ఆయన సన్నిధిలో మనం బ్రతికేటట్టు, మూడవ రోజున ఆయన మనల్ని పునరుద్ధరిస్తారు. మనం యెహోవా గురించి తెలుసుకుందాం; ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సూర్యోదయం ఎంత నిశ్చయమో, ఆయన ప్రత్యక్షమవ్వడం అంతే నిశ్చయం; ఆయన శీతాకాలం వర్షాల్లా, భూమిని తడిపే తొలకరి వానలా దగ్గరకు వస్తారు.” “ఎఫ్రాయిమూ, నిన్ను నేనేం చేయాలి? యూదా, నిన్ను నేనేం చేయాలి? మీ ప్రేమ ప్రొద్దున వచ్చే పొగమంచులా, ఉదయకాలపు మంచులా అదృశ్యమవుతుంది. కాబట్టి నా ప్రవక్తల ద్వారా మిమ్మల్ని ముక్కలు చేశాను, నా నోటిమాటల ద్వారా మిమ్మల్ని చంపాను, అప్పుడు నా తీర్పులు మెరుపులా ప్రకాశిస్తాయి. ఎందుకంటే నేను దయను కోరుతున్నాను బలిని కాదు, దహనబలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టము. ఆదాములా వారు నా నిబంధనను మీరారు; వారు నాకు నమ్మకద్రోహం చేశారు.

షేర్ చేయి
చదువండి హోషేయ 6

హోషేయ 6:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మనం యెహోవా దగ్గరికి తిరిగి వెళ్దాం రండి. ఆయన మనలను చీల్చివేశాడు. ఆయనే మనలను స్వస్థపరుస్తాడు. ఆయన మనలను గాయపరిచాడు. ఆయనే మనకు కట్లు కడతాడు. రెండు రోజుల తరువాత ఆయన మనలను బ్రతికిస్తాడు. మనం ఆయన సముఖంలో బ్రతికేలా, మూడవ రోజున ఆయన మనలను తిరిగి లేపుతాడు. యెహోవాను తెలుసుకుందాం రండి. యెహోవాను తెలుసుకోడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం. ఆయన్ని అనుసరించుదాము రండి. పొద్దు పొడవడం ఎంత కచ్చితమో ఆయన రావడం అంత కచ్చితం. వర్షం చినుకుల్లాగా భూమిని తడిపే తొలకరి వర్షంలాగా ఆయన మన దగ్గరికి వస్తాడు. ఎఫ్రాయిమూ, నేను నిన్నేం చేయాలి? యూదా, నిన్నేమి చెయ్యాలి? ఉదయం పొగమంచు లాగా త్వరగా ఆరిపోయే మంచు బిందువుల్లాగా మీ భక్తి ఉంది. కాబట్టి నేను ప్రవక్తల మూలంగా వారిని ముక్కలు చేశాను. నా నోటిమాటలతో నేను వారిని హతమార్చాను. నీ శాసనాలు వెలుగులాగా ప్రకాశిస్తున్నాయి. నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను. దహనబలుల కంటే నన్ను గురించిన జ్ఞానం, అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలని కోరుతున్నాను. ఆదాములాగా వారు విశ్వాస ఘాతకులై నా నిబంధనను ఉల్లంఘించారు.

షేర్ చేయి
చదువండి హోషేయ 6

హోషేయ 6:1-7 పవిత్ర బైబిల్ (TERV)

“రండి, మనం తిరిగి యెహోవా దగ్గరకు వెళ్దాం. ఆయన మనల్ని గాయపరిచాడు. కాని ఆయనే మనలను బాగుచేస్తాడు. ఆయన మనలను గాయపర్చాడు. కాని ఆయనే మనకు కట్టుకడతాడు. తర్వాత ఆయన మనలను మరల బతికిస్తాడు. మూడోనాడు ఆయన మనలను తిరిగి లేపుతాడు. అప్పుడు మూడవ రోజున మనం ఆయన ఎదుట జీవించగలం. మనం యెహోవాను గూర్చి నేర్చుకొందాము. ప్రభువును తెలుసుకొనేందుకు మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం. సూర్యోదయం వస్తుందని మనకు తెలిసినట్లే ఆయన వస్తున్నాడని మనకు తెలుసు. యెహోవా వర్షంలాగ మన దగ్గరకు వస్తాడు. నేలను తడిపే వసంతకాలపు వర్షంలాగ ఆయన వస్తాడు.” “ఎఫ్రాయిమూ, నిన్ను నేను (యెహోవా) ఏమి చేయాలి? యూదా, నిన్ను నేను ఏమి చేయాలి? నీ నమ్మకత్వం ఉదయపు మంచులాగ ఉంది. వేకువనే ఉండకుండా పోయే హిమంలాగ నీ నమ్మకత్వం ఉంది. నేను ప్రవక్తలను ఉపయోగించి ప్రజల కోసం న్యాయచట్టం చేశాను. నా ఆజ్ఞచేతనే ప్రజలు చంపబడ్డారు. కాని, ఆ నిర్ణయాల మూలంగానే మంచి విషయాలు వస్తాయి. ఎందుచేతనంటే, నాకు కావల్సింది నమ్మకమైన ప్రేమయే. అంతేగాని బలిఅర్పణ కాదు. ప్రజలు నన్ను తెలుసుకోవాలని నా కోరిక దహనబలులు తీసుకొని వచ్చేందుకు కాదు. అయితే ఆదాము చేసినట్టు ప్రజలు నా ఒడంబడికను ఉల్లంఘించారు. వారి దేశంలో వారు నాకు అపనమ్మకంగా ఉన్నారు.

షేర్ చేయి
చదువండి హోషేయ 6

హోషేయ 6:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మనము యెహోవాయొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవదినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును. ఎఫ్రాయిమూ, నిన్ను నేనేమిచేతును? యూదా, నిన్ను నేనేమిచేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవు నట్లును మీ భక్తి నిలువకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలె ప్రకాశించునట్లు ప్రవక్తలచేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను, నానోటిమాటల చేత వారిని వధించియున్నాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లువారు నాయెడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరియున్నారు.

షేర్ చేయి
చదువండి హోషేయ 6