హోషేయ 6:1-3
హోషేయ 6:1-3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“రండి, మనం యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. ఆయన మనల్ని ముక్కలుగా చీల్చారు కాని ఆయనే మనల్ని బాగుచేస్తారు; ఆయన మనల్ని గాయపరచారు కాని ఆయన మన గాయాలను కడతారు. రెండు రోజుల తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తారు, ఆయన సన్నిధిలో మనం బ్రతికేటట్టు, మూడవ రోజున ఆయన మనల్ని పునరుద్ధరిస్తారు. మనం యెహోవా గురించి తెలుసుకుందాం; ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సూర్యోదయం ఎంత నిశ్చయమో, ఆయన ప్రత్యక్షమవ్వడం అంతే నిశ్చయం; ఆయన శీతాకాలం వర్షాల్లా, భూమిని తడిపే తొలకరి వానలా దగ్గరకు వస్తారు.”
హోషేయ 6:1-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మనం యెహోవా దగ్గరికి తిరిగి వెళ్దాం రండి. ఆయన మనలను చీల్చివేశాడు. ఆయనే మనలను స్వస్థపరుస్తాడు. ఆయన మనలను గాయపరిచాడు. ఆయనే మనకు కట్లు కడతాడు. రెండు రోజుల తరువాత ఆయన మనలను బ్రతికిస్తాడు. మనం ఆయన సముఖంలో బ్రతికేలా, మూడవ రోజున ఆయన మనలను తిరిగి లేపుతాడు. యెహోవాను తెలుసుకుందాం రండి. యెహోవాను తెలుసుకోడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం. ఆయన్ని అనుసరించుదాము రండి. పొద్దు పొడవడం ఎంత కచ్చితమో ఆయన రావడం అంత కచ్చితం. వర్షం చినుకుల్లాగా భూమిని తడిపే తొలకరి వర్షంలాగా ఆయన మన దగ్గరికి వస్తాడు.
హోషేయ 6:1-3 పవిత్ర బైబిల్ (TERV)
“రండి, మనం తిరిగి యెహోవా దగ్గరకు వెళ్దాం. ఆయన మనల్ని గాయపరిచాడు. కాని ఆయనే మనలను బాగుచేస్తాడు. ఆయన మనలను గాయపర్చాడు. కాని ఆయనే మనకు కట్టుకడతాడు. తర్వాత ఆయన మనలను మరల బతికిస్తాడు. మూడోనాడు ఆయన మనలను తిరిగి లేపుతాడు. అప్పుడు మూడవ రోజున మనం ఆయన ఎదుట జీవించగలం. మనం యెహోవాను గూర్చి నేర్చుకొందాము. ప్రభువును తెలుసుకొనేందుకు మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం. సూర్యోదయం వస్తుందని మనకు తెలిసినట్లే ఆయన వస్తున్నాడని మనకు తెలుసు. యెహోవా వర్షంలాగ మన దగ్గరకు వస్తాడు. నేలను తడిపే వసంతకాలపు వర్షంలాగ ఆయన వస్తాడు.”
హోషేయ 6:1-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మనము యెహోవాయొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవదినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.