హోషేయ 4:1-3
హోషేయ 4:1-3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇశ్రాయేలీయులారా, యెహోవా వాక్కు వినండి, యెహోవా ఈ దేశ వాసులైన మీమీద నేరం మోపుతున్నారు: “ఈ దేశంలో నమ్మకత్వం, ప్రేమ దేవుని గురించిన జ్ఞానం అనేవి లేవు. శపించడం, అబద్ధాలు చెప్పడం, హత్య చేయడం, దొంగిలించడం, వ్యభిచారం చేయడం మాత్రమే ఉన్నాయి; వారు దౌర్జన్యాలు మానలేదు, నిత్యం రక్తపాతం జరుగుతూ ఉంది. ఈ కారణంచేత దేశం ఎండిపోతుంది, అందులో నివసించేవారు నీరసించి పోతున్నారు; అడవి జంతువులు, ఆకాశపక్షులు, సముద్రపు చేపలు నశించిపోతున్నాయి.
హోషేయ 4:1-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మాట ఆలకించండి. సత్యం, కనికరం, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం దేశంలో లేకపోవడం చూసి. యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుతున్నాడు. అబద్ధసాక్ష్యం పలకడం, అబద్ధమాడడం. హత్య, దొంగతనం, వ్యభిచారం అలవాటై పోయింది. ప్రజలు కన్నం వేస్తారు. మానక హత్య చేస్తారు. కాబట్టి దేశం ఎండిపోతూ ఉంది. దాని పశువులు, పక్షులు, దానిలో నివసించే వాళ్ళంతా క్షీణించి పోతున్నారు. సముద్రంలో చేపలు సైతం గతించిపోతున్నాయి.
హోషేయ 4:1-3 పవిత్ర బైబిల్ (TERV)
ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా సందేశం వినండి! ఈ దేశంలో నివసించే ప్రజల మీద ఆయనకు గల వ్యాజ్యెం ఏమిటో యెహోవా చెపుతాడు వినండి. “ఈ దేశంలోని ప్రజలు నిజంగా దేవుణ్ణి ఎరుగరు. ప్రజలు దేవునికి సత్యవంతులుగాను, నమ్మకస్తులుగాను లేరు. ప్రజలు (అబద్ధపు) ఒట్టు పెట్టుకుంటారు, అబద్ధాలు చెపుతారు, చంపుతారు, దొంగిలిస్తారు. వారు వ్యభిచార పాపం చేసి పిల్లల్ని కంటారు. ప్రజలు మరల మరల హత్య చేస్తారు. అందుచేత దేశం చచ్చినవాడి కోసం ఏడుస్తున్న ఒక మనిషిలాగ ఉంది. దాని ప్రజలంతా బలహీనంగా ఉన్నారు. చివరికి పొలాల్లోని పశువులు, ఆకాశంలోని పక్షులు, సముద్రంలోని చేపలు కూడ చనిపోతున్నాయి.
హోషేయ 4:1-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలువారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు. అబద్ధసాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్యచేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్యచేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులును ఆకాశపక్షులును కాపురస్థులందరును క్షీణించుచున్నారు, సముద్రమత్స్యములు కూడ గతించిపోవుచున్నవి.