హోషేయ 2:1-23
హోషేయ 2:1-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“మీరు మీ సోదరులతో, ‘మీరు నా ప్రజలు’ అని, మీ సహోదరీలతో, ‘నా ప్రియమైన వారలారా’ అని అనండి. “మీ తల్లిని గద్దించండి, గద్దించండి, ఆమె నా భార్య కాదు, నేను ఆమె భర్తను కాను. ఆమె తన వ్యభిచార చూపును మానుకోవాలి, తన రొమ్ముల మధ్య నుండి పరపురుషులను తొలగించాలి. లేకపోతే ఆమెను దిగంబరిని చేస్తాను, ఆమె బట్టలు తీసివేసి ఆమె పుట్టిన రోజున ఉన్నట్లు ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమెను ఎడారిలా చేస్తాను, ఎండిపోయిన భూమిలా చేస్తాను దప్పికతో ఆమె చచ్చునట్లు చేస్తాను. ఆమె పిల్లల మీద నా ప్రేమను చూపించను, ఎందుకంటే, వారు వ్యభిచారం వలన పుట్టిన పిల్లలు. వారి తల్లి వ్యభిచారం చేసింది, అవమానంలో వారిని కన్నది. ఆమె, ‘నేను నా ప్రేమికుల వెంట వెళ్తాను, వారు నాకు నా ఆహారం, నీళ్లు, ఉన్ని, జనపనార, ఒలీవనూనె, పానీయం ఇస్తారు’ అన్నది. కాబట్టి ముళ్ళపొదలను ఆమె దారిని అడ్డుగా వేస్తాను; ఆమె తన దారి కనబడకుండ నేను గోడ కడతాను. ఆమె తన ప్రేమికుల వెంటపడుతుంది కాని వారిని కలుసుకోలేదు; ఆమె వారిని వెదుకుతుంది కాని వారు కనబడరు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, ‘నేను నా మొదటి భర్త దగ్గరకు తిరిగి వెళ్తాను, ఇప్పటి కంటే అప్పుడే నా స్థితి బాగుండేది.’ ఆమెకు ధాన్యం, నూతన ద్రాక్షరసం, నూనె, విస్తారమైన వెండి, బంగారాలు, ఇచ్చింది నేనే అని ఆమె గుర్తించలేదు, వాటిని బయలు కోసం వాడింది. “కాబట్టి కోతకాలంలో నా ధాన్యం నేను తీసివేస్తాను, ద్రాక్షరసం సిద్ధంగా ఉన్నప్పుడు దానిని తీసివేస్తాను. ఆమె దిగంబరత్వాన్ని కప్పుకోడానికి నేను ఇచ్చిన నా ఉన్నిని, నా జనపనారను తిరిగి తీసుకుంటాను. కాబట్టి ఇప్పుడు ఆమె ప్రేమికుల కళ్లెదుట, ఆమె కామాతురతను బయటపెడతాను, ఆమెను నా చేతిలో నుండి ఎవ్వరూ విడిపించలేరు. ఆమె ఉత్సవ వేడుకలన్నిటిని: ఆమె వార్షిక పండుగలు, అమావాస్యలు, ఆమె సబ్బాతు దినాలు అన్ని ఆగిపోయేలా చేస్తాను. తన ప్రేమికులు తనకు ఇచ్చిన జీతం అని ఆమె చెప్పుకునే, ఆమె ద్రాక్షలను అంజూర చెట్లను నేను పాడుచేస్తాను; వాటిని దట్టమైన అడవిగా మారుస్తాను, అడవి జంతువులు వాటిని తినివేస్తాయి. ఆమె బయలులకు ధూపం వేసిన రోజుల గురించి, నేను ఆమెను శిక్షిస్తాను; ఆమె నగలు ఆభరణాలతో అలంకరించుకుని, తన ప్రేమికుల వెంట వెళ్లిపోయింది, కాని నన్ను మరచిపోయింది” అని యెహోవా చెప్తున్నారు. కాబట్టి ఆమెను ఆకర్షించబోతున్నాను; నేను ఆమెను అరణ్యంలోకి నడిపించి, ఆమెతో మృదువుగా మాట్లాడతాను. అక్కడ ఆమె ద్రాక్షతోటలను ఆమెకు తిరిగి ఇస్తాను, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అక్కడ ఆమె తన యవ్వన రోజుల్లో ఉన్నట్లు, ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రోజున ఉన్నట్లు స్పందిస్తుంది. యెహోవా ఇలా అంటున్నారు, “ఆ రోజున నీవు నన్ను, ‘నా భర్తవు’ అని అంటావు; నీవు నన్ను ఇక ఎన్నడు ‘నా బయలు’ అని పిలువవు. నేను ఆమె పెదవుల నుండి బయలుల పేర్లు తీసివేస్తాను; ఇక ఎన్నడు వారి పేర్లు ప్రస్తావించబడవు. ఆ రోజున నా ప్రజల కోసం అడవి జంతువులతో, ఆకాశ పక్షులతో, నేలను ప్రాకే జంతువులతో నిబంధన చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధం దేశంలో లేకుండా చేస్తాను, అప్పుడు వారు క్షేమంగా పడుకుంటారు. నీవు శాశ్వతంగా నాతో ఉండేలా, నేను నిన్ను నీతి, న్యాయంతో, మారని ప్రేమతో, దయతో ప్రధానం చేసుకుంటాను. నీవు యెహోవాను తెలుసుకునేలా, నేను నమ్మకాన్ని బట్టి నిన్ను ప్రధానం చేసుకుంటాను. “ఆ రోజున నేను జవాబిస్తాను,” అని యెహోవా అంటున్నారు. “నేను ఆకాశాలకు జవాబిస్తాను, అవి భూమికి జవాబిస్తాయి; భూమి ధాన్యంతో, నూతన ద్రాక్షరసంతో, ఒలీవనూనెతో మాట్లాడుతుంది. అవి యెజ్రెయేలుతో మాట్లాడతాయి. నేను ఆమెను నా కోసం దేశంలో నాటుతాను; ‘నా ప్రియురాలు కాదు,’ అని ఎవరి గురించి అన్నానో ఆ వ్యక్తికే నా ప్రేమను చూపిస్తాను. ‘నా ప్రజలు కారు,’ అని ఎవరి గురించి అన్నానో వారితో, ‘మీరు నా ప్రజలు’ అని చెప్తాను; అప్పుడు వారు, ‘మీరే మా దేవుడు’ అంటారు.”
హోషేయ 2:1-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ సోదరులతో “మీరు నా ప్రజలు” అని చెప్పండి. మీ అక్కచెల్లెళ్ళతో “మీరు కనికరానికి నోచుకున్నారు” అని చెప్పండి. మీ అమ్మపై న్యాయవిచారణ మొదలుపెట్టు. వ్యాజ్యం వెయ్యి. ఆమె నా భార్యా కాదు, నేనామెకు భర్తనీ కాను. ఆమె మొదట తన వేశ్యా వృత్తిని మానుకోమనండి. తన స్తనాల మధ్య నుండి వ్యభిచారాన్ని తొలగించుకోమనండి. లేకపోతే ఆమెను నగ్న శరీరిగా చేస్తాను. ఆమె పుట్టిన దినాన ఎలా ఉన్నదో అలా బట్టలు లేకుండా చేసేస్తాను. ఆమెను అరణ్యంలాగా ఎండిన భూమిలాగా చేస్తాను. దాహంతో అలమటించి చనిపోయేలా చేస్తాను. ఆమె పిల్లల మీద జాలి చూపను. ఎందుకంటే దాని పిల్లలు వ్యభిచారం వల్ల పుట్టినవారు. వారి తల్లి కులట. వారిని కన్నతల్లి సిగ్గు లేకుండా ప్రవర్తించింది. ఆమె “నా విటుల వెంట పోతాను. వాళ్ళు నాకు అన్నపానాలు, ఉన్ని, జనపనార, నూనె, పానీయం ఇస్తారు” అనుకుంది. కాబట్టి దాని దారికి అడ్డంగా ముళ్ళ కంచె వేస్తాను. దానికి దారి కనబడకుండా గోడ కడతాను. అది తన విటులను వెంటాడినా వారిని కలుసుకోలేక పోతుంది. ఎంత వెతికినా వారు దానికి కనబడరు. అప్పుడు ఆమె అంటుంది. “నా మొదటి భర్త దగ్గరికి తిరిగి వెళ్తాను. ఎందుకంటే ఇప్పటి కంటే అదే బాగుంది.” దానికి ధాన్య ద్రాక్షారస తైలాలను, ధారాళంగా వెండి బంగారాలను ఇచ్చినవాణ్ణి నేనే అని ఆమెకు తెలియలేదు. వాటిని వారు బయలు దేవునికి ఉపయోగించారు. కాబట్టి నా ధాన్యాన్ని నా ద్రాక్షారసాన్ని వాటి కోత కాలాల్లో ఆమె దగ్గర నుండి తీసేసుకుంటాను. ఆమె తన నగ్నత కప్పుకోవడానికి ఉపయోగించిన నా ఉన్ని, జనపనార లాగేసుకుంటాను. దాని విటులు చూస్తుండగానే ఆమె బట్టలు విప్పేస్తాను. నా చేతిలో నుండి ఆమెను విడిపించే వారెవరూ ఉండరు. ఆమె ఉత్సవాలన్నీ ఆపిస్తాను. ఆమె పండగలూ అమావాస్య పర్వదినాలూ విశ్రాంతి దినాలూ వార్షిక ఉత్సవాలు ఆగిపోయేలా చేస్తాను. “ఇవి నా విటులు నాకిచ్చిన జీతం” అని వేటిని గురించి చెప్పిందో ఆ ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను ధ్వంసం చేస్తాను. అడవి జంతువులు వాటిని తినివేసేలా వాటిని కారడవిలాగా చేస్తాను. అది బయలు దేవుళ్ళ పండగలు ఆచరించినందుకు నేను దాన్ని శిక్షిస్తాను. ఆ దేవుళ్ళకు ధూపం వేసినందుకు. నగలు పెట్టుకుని, సింగారించుకుని. నన్ను మర్చిపోయి దాని విటులను వెంటాడినందుకు దాన్ని శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు. ఆ తరవాత ఆమెను మళ్లీ నావైపు తిప్పుకుంటాను. ఆమెను అరణ్యంలోకి తీసుకుపోతాను. అక్కడ ఆమెతో ప్రేమగా మాటలాడతాను. ఆమెకు ద్రాక్షతోటలు రాసిస్తాను. ఆకోరు లోయను ఆశాద్వారంగా చేస్తాను. యవ్వనప్రాయంలో ఐగుప్తు దేశంలోనుండి వచ్చిన రోజుల్లో నా మాట విన్నట్టు ఆమె నాకు స్పందిస్తుంది. “ఆ రోజుల్లో” యెహోవా అంటున్నాడు. “నీవు ‘నా బయలు’ అని నన్ను సంబోధించవు. ‘నా భర్త’ అంటావు.” ఇక మీదట బయలు దేవుళ్ళ పేర్లు నీ నోటినుండి తుడిచి వేస్తాను. ఆ పేర్లు ఇక ఎన్నటికీ జ్ఞాపకానికి రావు. “ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో, పక్షులతో, నేలపై పాకే జీవులతో నిబంధన చేస్తాను. దేశంలో విల్లును, కత్తిని, యుద్ధాన్ని లేకుండా చేస్తాను. వారు నిర్భయంగా పడుకునేలా చేస్తాను. నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను. నీతిన్యాయాలను బట్టి, నిబంధన విశ్వాస్యతను బట్టి, కరుణను బట్టి నీ భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను. యెహోవానైన నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను. ఆ దినాన నేను జవాబిస్తాను.” ఆకాశాలు చేసే విన్నపం నేను ఆలకిస్తాను. అవి భూమి చేసే మనవికి జవాబు ఇస్తాయి. భూధాన్య ద్రాక్షారస తైలాల మనవి ఆలకింపగా, అవి యెజ్రెయేలు చేసే మనవి ఆలకిస్తాయి. నేను ఆమెను భూమిలో నాకోసం నాటుతాను. లో రుహమా పై నేను జాలి పడతాను. నా ప్రజలు కానివారితో “మీరే నా ప్రజలు” అని నేను చెప్పగా, వారు “నీవే మా దేవుడివి” అంటారు. ఇదే యెహోవా వాక్కు.
హోషేయ 2:1-23 పవిత్ర బైబిల్ (TERV)
“అప్పుడు మీరు మీ సోదరులతో ‘మీరు నా ప్రజలు’ అనియు, మీ స్వంతవారితో ‘ఆయన మీ యెడల కరుణ చూపించాడు’ అని చెబుతారు. “మీ తల్లితో గట్టిగా వాదించండి, ఎందుకంటే ఆమె నా భార్య కాదు! నేను ఆమె భర్తను కాను! వేశ్యలాగ ఉండటం మానుకోమని ఆమెతో చెప్పండి. ఆమె స్తనాల మధ్య నుండి ఆమె విటులను తొలగించి వేయమని ఆమెతో చెప్పండి. ఆమె తన వ్యభిచారం మానుకోవటానికి నిరాకరిస్తే నేను ఆమె వస్త్రాలు తీసివేసి దిగంబరిగా చేస్తాను. ఆమెను, ఆమె పుట్టిన రోజున ఉన్నట్టుగానే చేస్తాను. నేను ఆమె ప్రజలను తొలగించివేస్తాను. ఆమె ఎండిపోయిన ఖాళీ ఎడారిలాగ ఉంటుంది. దాహంతో నేను ఆమెను చంపివేస్తాను. ఆమె పిల్లల మీద నేను జాలిపడను. ఎందుకంటే వారు వ్యభిచార సంతానం కనుక. వారి తల్లి ఒక వేశ్యలాగ ప్రవర్తించింది. వారి తల్లి, ఆమె చేసిన పనుల విషయంలో సిగ్గుపడాలి. ఆమె, ‘నేను నా విటుల దగ్గరకు వెళ్తాను, నా విటులు నాకు భోజనపానాలు ఇస్తారు. వారు ఉన్ని మరియు మేలు రకపు సన్నని వస్త్రాలు ఇస్తారు. ద్రాక్షామద్యం, ఒలీవనూనె వారు నాకు ఇస్తారు’ అని చెప్పింది. “అందుచేత, యెహోవానైన నేను మీ (ఇశ్రాయేలు) మార్గాన్ని ముళ్లతో అడ్డువేస్తాను. నేను ఒక గోడ కట్టిస్తాను. అప్పుడు తన దారులను ఆమె తెలుసుకోలేక పోతుంది. ఆమె తన విటుల వెనుక పరుగులెత్తుతుంది కానీ ఆమె వారిని కలుసుకోలేక పోతుంది. ఆమె తన విటుల కోసం వెదుకుతుంది. కాని ఆమె వారిని కనుగొనలేక పోతుంది. అప్పుడు ఆమె, ‘నేను నా మొదటి భర్త (దేవుడు) దగ్గరకు వెళ్తాను. నేను ఆయనతో ఉన్నప్పుడు నా జీవితం బాగా ఉండింది. ఇప్పటికంటే నా జీవితం అప్పుడే మేలు’ అని అంటుంది. “ధాన్యం, ద్రాక్షారసం, నూనె ఇచ్చేవాడను నేనే అని ఆమె (ఇశ్రాయేలు)కు తెలియదు. నేను ఆమెకు వెండి బంగారాలు ఇంకా ఇంకా ఎక్కువగా ఇస్తూ పోయాను. కాని బయలు విగ్రహాలు చేయుటకు ఇశ్రాయేలీయులు ఈ వెండి బంగారాలు ఉపయోగించారు. కనుక నేను (యెహోవాను) తిరిగి వస్తాను. నా ధాన్యం కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు నేను దానిని తీసివేసుకొంటాను. ద్రాక్షలు సిద్ధంగా ఉన్న సమయంలో నా ద్రాక్షారసం నేను తీసివేసుకొంటాను. నా ఉన్ని, మేలురకపు వస్త్రాలు నేను తీసివేసుకొంటాను. ఆమె తన నగ్న శరీరాన్ని కప్పుకునేందుకు వీటిని నేను ఆమెకు ఇచ్చాను. కాని ఇప్పుడు నేను ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమె ప్రేమికులు ఆమె నగ్నత్వాన్ని చూస్తారు. నా శక్తినుండి ఆమెను ఎవ్వరూ తప్పించలేరు. నేను (దేవుడు) ఆమె సరదానంతా తీసివేస్తాను. ఆమె పండుగ రోజులను, ఆమె అమావాస్య విందులను, ఆమె విశ్రాంతి దినాలను, ప్రత్యేక విందులను నేను నిలిపి వేస్తాను. ఆమె ద్రాక్షావల్లులను, అంజూరపు చెట్లను నేను నాశనం చేస్తాను. ‘నా విటులు వీటిని నాకు ఇచ్చారు’ అని ఆమె చెప్పింది. కాని ఆమె తోటలను నేను మార్చివేస్తాను. అవి భయంకరమైన అడవులుగా మారిపోతాయి. అడవి మృగాలు వచ్చి ఆ మొక్కలను తింటాయి. “ఆమె బయలు దేవతలను సేవించింది. కనుక ఆమెను నేను శిక్షిస్తాను. బయలు దేవతలకు ఆమె ధూపం వేసింది. ఆమె వస్త్రాలు ధరించి, నగలు, ముక్కుకమ్మి పెట్టుకొంది. అప్పుడు ఆమె తన విటుల దగ్గరకు వెళ్లి, నన్ను మరచిపోయింది. యెహోవా ఇలాగున చెపుతున్నాడు. “కనుక నేను (యెహోవా) ఆమెతో ప్రేమగా మాట్లాడతాను. ఆమెను ఎడారిలోకి నడిపించి, ఆమెతో నేను మృదువుగా మాట్లాడతాను. అక్కడ ద్రాక్షాతోటలను ఆమెకు ఇస్తాను. ఆకోరు (శ్రమగల)లోయను ఒక నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అప్పుడు తన యౌవన దశలో ఈజిప్టు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు చెప్పినట్టుగా ఆమె జవాబు చెపుతుంది. యెహోవా ఇలాగున చెపుతున్నాడు. “ఆ సమయంలో ‘నా భర్తవు’ అని నీవు నన్ను పిలుస్తావు. ‘నా బయలు’ అని నీవు నన్ను పిలవవు. ఆమె నోటినుండి బయలు దేవత పేర్లను నేను తొలగించివేస్తాను. అప్పుడు ఆ బయలు దేవతల పేర్లను ప్రజలు మరల ఉపయోగించరు. “ఆ సమయంలో పొలంలోని పశువులతోను, ఆకాశంలోని పక్షులతోను, నేలమీద ప్రాకే ప్రాణులతోను ఇశ్రాయేలీయులకోసం నేను ఒక ఒడంబడిక చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధ ఆయుధాలు నేను విరుగగొడతాను. ఆ దేశంలో ఆయుధాలు ఏవీ మిగలవు. ఇశ్రాయేలు ప్రజలు ప్రశాంతంగా పడుకోగల్గునట్లు నేను దేశాన్ని క్షేమంగా ఉంచుతాను. మరియు నేను (యెహోవా) నిన్ను శాశ్వతంగా నా వధువుగా చేసుకొంటాను. మంచితనం, న్యాయం, ప్రేమ, కరుణలతో నిన్ను నేను నా వధువుగా చేసుకొంటాను. నిన్ను నాకు నమ్మకమైన వధువుగా చేసుకొంటాను. అప్పుడు నీవు నిజంగా యెహోవాను తెలుసుకొంటావు. ఆ సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను. యెహోవా ఇలాగున చెపుతున్నాడు. “నేను ఆకాశాలతో మాట్లాడుతాను. అవి భూమికి వర్షాన్ని ఇస్తాయి. ధాన్యం, ద్రాక్షా మద్యం, నూనెలను భూమి ఇస్తుంది. అవి యెజ్రెయేలు అవసరాలను తీరుస్తాయి. భూమిమీద ఆమెను నేను నాటుతాను. లో-రూహామాకు నేను దయచూపిస్తాను. లో-అమ్మీకీ ‘నీవు నా ప్రజ’ అని నేను చెపుతాను. ‘నీవు మా దేవుడవు’అని వారు నాతో చెపుతారు.”
హోషేయ 2:1-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీరు నా జనులని మీ సహోదరులతోను జాలి నొందినవారని మీ స్వదేశీయులతోను మీరు చెప్పుడి. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటివలె దానిని దిగంబరురాలినిగాచేసి, పాడుపెట్టి యెండిపోయిన భూమివలెను ఉంచి, దప్పిచేత లయపరచకుండునట్లు, మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి; అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను; దాని పిల్లలు జారసంతతియై యున్నారు, వారి తల్లి వేశ్యాత్వము చేసియున్నది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయునది గనుక వారియందు నేను జాలిపడను. అది – నాకు అన్నపానములను గొఱ్ఱెబొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది. ముండ్లకంచె దాని మార్గములకు అడ్డము వేయుదును; దాని మార్గములు దానికి కనబడకుండ గోడ కట్టుదును. అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేక పోవును; ఎంత వెదకినను వారు దానికి కనబడకయుందురు. అప్పుడు అది–ఇప్పటి కంటె పూర్వమే నా స్థితి బాగుగ నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటియొద్దకు వెళ్లుదుననుకొనును. దానికి ధాన్య ద్రాక్షారసతైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే యని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉప యోగపరచెను. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీనియొద్ద నుండి తీసివేసెదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొఱ్ఱెబొచ్చును జనుపనారయు దానికి దొరకకుండ నేను ఉంచుకొందును; దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నా చేతిలోనుండి దాని విడిపించువాడొకడును లేకపోవును. దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతిదినములను నియామకకాలములను మాన్పింతును. –ఇవి నా విటకాండ్రు నాకిచ్చినజీతమని అది తన ద్రాక్ష చెట్లనుగూర్చియు అంజూరపుచెట్లనుగూర్చియు చెప్పినది గదా. నేను వాటిని లయపరతును, అడవిజంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవివలె చేతును. అది నన్ను మరచిపోయి నగలుపెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపమువేసియుండుటనుబట్టియు దాని విటకాండ్రను వెంటాడియుండుటనుబట్టియు నేను దానిని శిక్షింతును; ఇది యెహోవా వాక్కు. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును; అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్లనిత్తును; ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణద్వారముగా చేసెదను, బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చటనుండి నా మాట వినును; నీవు–బయలు అని నన్ను పిలువక–నా పురుషుడవు అనిపిలుతువు, ఇదే యెహోవా వాక్కు. –అది ఇక మీదట బయలుదేవతల పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండను అవి దాని నోట రాకుండను నేను చేసెదను. ఆ దినమున నేను నా జనులపక్షముగా భూజంతువులతోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకుజంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతినిబట్టి తీర్పుతీర్చుటవలనను, దయాదాక్షిణ్యములు చూపుటవలనను నిన్ను ప్రధానము చేసికొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమునుబట్టి నిన్ను ప్రధానము చేసికొందును. ఆ దినమున నేను మనవి ఆలకింతును; ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమియొక్క మనవి ఆలకించును; భూమి ధాన్య ద్రాక్షారసతైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలుచేయు మనవి ఆలకించును. నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితో–మీరే నా జనమని నేను చెప్పగా వారు–నీవే మా దేవుడవు అనియందురు; ఇదే యెహోవా వాక్కు.