హోషేయ 14:1-9
హోషేయ 14:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవా దగ్గరకు మరలా రా! నీ పాపాలను బట్టి నీవు పడిపోయావు! మాటలు సిద్ధపరచుకొని యెహోవా దగ్గరకు రా. ఆయనతో ఇలా చెప్పు: “మా పాపాలన్నీ క్షమించండి మమ్మల్ని దయతో స్వీకరించండి, కోడెలకు బదులుగా మేము మా పెదవులను అర్పిస్తాము. అష్షూరు మమ్మల్ని రక్షించలేదు; మేము యుద్ధ గుర్రాలను ఎక్కము. మా చేతులు చేసిన వాటితో మేము, ‘మా దేవుళ్ళు’ అని ఇక ఎన్నడు చెప్పము, ఎందుకంటే మీరు తండ్రిలేనివారికి దయ చూపుతారు.” “నేను వారి నమ్మకద్రోహాన్ని సరిచేస్తాను, మనస్పూర్తిగా వారిని ప్రేమిస్తాను, ఎందుకంటే వారి మీదున్న నా కోపం చల్లారింది. నేను ఇశ్రాయేలుకు మంచులా ఉంటాను; అతడు తామరలా వికసిస్తాడు. లెబానోను దేవదారు చెట్టులా అతని వేర్లు భూమి లోతుకు వెళ్తాయి; అతని చిగురు పెరుగుతుంది. అతని వైభవం ఒలీవ చెట్టులా, అతని సువాసన లెబానోను దేవదారులా ఉంటుంది. అతని నీడలో ప్రజలు నివసిస్తారు; వారు ధాన్యంలా అభివృద్ధి చెందుతారు, వారు ద్రాక్షలా వికసిస్తారు, ఇశ్రాయేలు కీర్తి లెబానోను ద్రాక్షరసంలా ఉంటుంది. ఎఫ్రాయిమూ, ఇకనుండి విగ్రహాలతో నాకేం పని? నేనే అతనికి జవాబిస్తాను, అతన్ని సంరక్షిస్తాను. నేను పచ్చని సరళ వృక్షం వంటి వాన్ని; నా వలనే నీకు ఫలం కలుగుతుంది.” జ్ఞానులెవరు? వారు ఈ విషయాలు గ్రహించాలి. వివేచన గలవారెవరు? వారు కూడ గ్రహించాలి. యెహోవా మార్గాలు సరియైనవి; నీతిమంతులు వాటిలో నడుస్తారు, కాని తిరుగుబాటుదారులు వాటిలో తొట్రిల్లుతారు.
హోషేయ 14:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు. ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగి రండి. మీరు చెప్పవలసినదేమిటంటే “మా పాపాలన్నిటిని పరిహరించు. మమ్మల్ని అనుగ్రహంతో స్వీకరించు. అప్పుడు మేము మా పెదాల ఫలాలను అంటే స్తుతులను అర్పిస్తాము. అష్షూరీయులు మమ్మల్ని రక్షించరు. మేమిక మీదట గుర్రాలెక్కి యుద్ధానికి పోము. ‘మీరే మాకు దేవుడు’ అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రిలేని వారికి వాత్సల్యం నీ దగ్గరే దొరుకుతుంది.” వారు నన్ను వదిలి వెళ్ళిపోయిన తరువాత నేను వారిని బాగు చేస్తాను. వారి మీదనున్న నా కోపం చల్లారింది. మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తాను. చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను. తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు. లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షంలాగా వారు వేరు పారుతారు. అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. ఒలీవచెట్టు కు ఉండే శోభ అతనికి కలుగుతుంది. లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది. అతని నీడలో నివసించేవారు తిరిగి వస్తారు. ధాన్యం వలే వారు తిరిగి మొలుస్తారు. ద్రాక్షచెట్టులాగా వికసిస్తారు. లెబానోను ద్రాక్షరసానికి ఉన్న కీర్తి వారికి ఉంటుంది. ఎఫ్రాయిము ఇలా అంటాడు “బొమ్మలతో నాకిక పనేమిటి?” నేనే అతనికి జవాబిచ్చి ఆలకిస్తున్నాను. నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేస్తున్నాను. నేను సతత హరిత సరళ వృక్షం వంటి వాణ్ణి. నావల్లనే నీకు ఫలం కలుగుతుంది. ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు? వాటిని గ్రహించి తెలుసుకునే బుద్ధిమంతులెవరు? ఎందుకంటే యెహోవా మార్గాలు యథార్థమైనవి. నీతిమంతులు వాటిలో నడుచుకుంటారు. అయితే తిరుగుబాటు చేసేవారు తడబడి కూలుతారు.
హోషేయ 14:1-9 పవిత్ర బైబిల్ (TERV)
ఇశ్రాయేలూ, నీవు పడిపోయి దేవునికి విరోధముగా పాపము చేశావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా వద్దకు తిరిగిరా. నీవు చెప్పబోయే విషయాల గురించి ఆలోచించుము. యెహోవా వద్దకు తిరిగిరా. ఆయనతో ఇలా చెప్పు, “మా పాపాన్ని తీసివేయి. మా మంచి పనులను అంగీకరించు. మా పెదవులనుండి స్తుతిని సమర్పిస్తాము. అష్షూరు మమ్మల్ని కాపాడదు. మేమిక యుద్ధగుర్రాలపైన స్వారీ చేయము. మేము మా స్వహస్తాలతో చేసిన విగ్రహాలను ఇంకెప్పుడూ మరల ‘ఇది మా దేవుడు’ అని అనము. ఎందుకంటే, అనాధుల పట్ల జాలి చూపేది నువ్వొక్కడివే.” అందుకు యెహోవా ఇలా అంటాడు: “నా కోపం చల్లారింది, కనుక, నన్ను వీడి పోయినందుకు నేను వాళ్లని క్షమిస్తాను. నేను వాళ్లని ధారాళంగా ప్రేమిస్తాను. నేను ఇశ్రాయేలీయులకు మంచువలె వుంటాను. ఇశ్రాయేలు తామర పుష్పంలాగ వికసిస్తాడు. అతడు లెబానోను దేవదారు వృక్షంలాగా వేరుతన్ని దృఢంగా నిలుస్తాడు. అతని శాఖలు విస్తరిస్తాయి, అతను అందమైన దేవదారు వృక్షంలాగ ఉంటాడు. అతను లెబానోనులోని దేవదారు చెట్లు వెలువరించే సువాసనలాగ ఉంటాడు. ఇశ్రాయేలీయులు మరల నా పరిరక్షణలో జీవిస్తారు. గోధుమ కంకుల్లాగ పెరుగుతారు. ద్రాక్షా తీగల్లాగ పుష్పించి ఫలిస్తారు. వారు లెబానోను ద్రాక్షారసంవలె ఉంటారు.” “ఎఫ్రాయిమూ, విగ్రహాలతో ఇక నీకెంత మాత్రమూ పనిలేదు. నీ ప్రార్థనలు ఆలకించేది నేనే. నిన్ను కాపాడేది నేనే. నిరంతరం పచ్చగానుండే మీ ఫలము నానుండి వస్తుంది.” వివేకవంతుడు ఈ విషయాలు గ్రహిస్తాడు. చురుకైనవాడు ఈ విషయాలు నేర్చుకోవాలి. యెహోవా మార్గాలు సరైనవి. మంచివాళ్లు వాటిద్వారా జీవిస్తారు. పాపులు వాళ్లకు వాళ్లే చనిపోతారు.
హోషేయ 14:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా–మా పాపములన్నిటిని పరిహ రింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి. అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కము–మీరే మాకు దేవుడని మేమికమీదట మా చేతి పనితో చెప్పము; తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా. వారు విశ్వాసఘాతుకులు కాకుండ నేను వారిని గుణపరచుదును. వారిమీదనున్న నాకోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహిం తును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామరపుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లువారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిమూ–బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురుపెట్టు సరళవృక్షమువంటి వాడను, నావలననే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.