హోషేయ 14:1-3
హోషేయ 14:1-3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవా దగ్గరకు మరలా రా! నీ పాపాలను బట్టి నీవు పడిపోయావు! మాటలు సిద్ధపరచుకొని యెహోవా దగ్గరకు రా. ఆయనతో ఇలా చెప్పు: “మా పాపాలన్నీ క్షమించండి మమ్మల్ని దయతో స్వీకరించండి, కోడెలకు బదులుగా మేము మా పెదవులను అర్పిస్తాము. అష్షూరు మమ్మల్ని రక్షించలేదు; మేము యుద్ధ గుర్రాలను ఎక్కము. మా చేతులు చేసిన వాటితో మేము, ‘మా దేవుళ్ళు’ అని ఇక ఎన్నడు చెప్పము, ఎందుకంటే మీరు తండ్రిలేనివారికి దయ చూపుతారు.”
హోషేయ 14:1-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు. ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగి రండి. మీరు చెప్పవలసినదేమిటంటే “మా పాపాలన్నిటిని పరిహరించు. మమ్మల్ని అనుగ్రహంతో స్వీకరించు. అప్పుడు మేము మా పెదాల ఫలాలను అంటే స్తుతులను అర్పిస్తాము. అష్షూరీయులు మమ్మల్ని రక్షించరు. మేమిక మీదట గుర్రాలెక్కి యుద్ధానికి పోము. ‘మీరే మాకు దేవుడు’ అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రిలేని వారికి వాత్సల్యం నీ దగ్గరే దొరుకుతుంది.”
హోషేయ 14:1-3 పవిత్ర బైబిల్ (TERV)
ఇశ్రాయేలూ, నీవు పడిపోయి దేవునికి విరోధముగా పాపము చేశావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా వద్దకు తిరిగిరా. నీవు చెప్పబోయే విషయాల గురించి ఆలోచించుము. యెహోవా వద్దకు తిరిగిరా. ఆయనతో ఇలా చెప్పు, “మా పాపాన్ని తీసివేయి. మా మంచి పనులను అంగీకరించు. మా పెదవులనుండి స్తుతిని సమర్పిస్తాము. అష్షూరు మమ్మల్ని కాపాడదు. మేమిక యుద్ధగుర్రాలపైన స్వారీ చేయము. మేము మా స్వహస్తాలతో చేసిన విగ్రహాలను ఇంకెప్పుడూ మరల ‘ఇది మా దేవుడు’ అని అనము. ఎందుకంటే, అనాధుల పట్ల జాలి చూపేది నువ్వొక్కడివే.”
హోషేయ 14:1-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా–మా పాపములన్నిటిని పరిహ రింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి. అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కము–మీరే మాకు దేవుడని మేమికమీదట మా చేతి పనితో చెప్పము; తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.