హోషేయ 12:1-14

హోషేయ 12:1-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఎఫ్రాయిం గాలిని మేస్తున్నాడు; అతడు రోజంతా తూర్పు గాలిని వెంటాడుతున్నాడు, విస్తారంగా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తున్నాడు. అతడు అష్షూరుతో ఒప్పందం చేస్తున్నాడు ఈజిప్టుకు ఒలీవనూనె పంపిస్తున్నాడు. యెహోవా యూదా మీద నేరారోపణ చేస్తున్నారు; ఆయన యాకోబును తన మార్గాలను బట్టి శిక్షిస్తారు ఆయన అతని క్రియలనుబట్టి అతనికి ప్రతిఫలం ఇస్తారు. తల్లి గర్భంలో అతడు తన సోదరుని కాలి మడమను పట్టుకున్నాడు; అతడు పెద్దవాడయ్యాక దేవునితో పోరాడాడు. అతడు దేవదూతతో పోరాడి గెలిచాడు; అతడు ఏడ్చి, దయచూపమని వేడుకున్నాడు. బేతేలులో అతడు దేవున్ని కనుగొన్నాడు అక్కడ అతడు ఆయనతో మాట్లాడాడు. ఆయన సైన్యాల అధిపతియైన యెహోవా, ఆయన పేరు యెహోవా! అయితే నీవు నీ దేవుని దగ్గరకు తిరిగి రావాలి; ప్రేమ, న్యాయం కలిగి ఉండాలి, నీ దేవుని కోసం ఎల్లప్పుడు వేచి ఉండాలి. వ్యాపారి తప్పుడు తూకం వాడుతూ మోసం చేయడానికి ఇష్టపడతాడు. “నేను చాలా ధనవంతుడను; నాకున్న ధనాన్ని బట్టి వారు నాలో ఏ తప్పును కాని పాపాన్ని కాని చూపించలేరు” అని ఎఫ్రాయిం అతిశయిస్తున్నాడు. “మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండి యెహోవానైన నేను మీకు దేవునిగా ఉన్నాను; మీ నియమించబడిన పండుగ రోజుల్లో ఉన్నట్లు నేను మిమ్మల్ని మరలా గుడారాల్లో నివసింపజేస్తాను. నేను ప్రవక్తలతో మాట్లాడాను. వారికి అనేక దర్శనాలను ఇచ్చి ఉపమానరీతిగా వారికి చెప్పాను.” గిలాదు చెడ్డదా? దాని ప్రజలు వ్యర్థమైన వారు! వారు గిల్గాలులో కోడెలను బలి అర్పిస్తున్నారా? వారి బలిపీఠాలు దున్నబడిన పొలంలోని రాళ్ల కుప్పల్లా ఉన్నాయి. యాకోబు అరాము దేశానికి పారిపోయాడు; ఇశ్రాయేలు భార్యను పొందడానికి సేవ చేశాడు, భార్యను సంపాదించడానికి గొర్రెలు కాచాడు. యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి తీసుకురావడానికి ఒక ప్రవక్తను వాడుకున్నారు, ప్రవక్త ద్వారా ఆయన వారిని సంరక్షించారు. కాని ఎఫ్రాయిం ఆయన మహా కోపాన్ని రేపాడు అతడు చేసిన రక్తపాతం బట్టి దేవుడు అతని మీద నేరం మోపుతారు అతని ధిక్కారం బట్టి ఆయన అతనికి ప్రతీకారం చేస్తారు.

హోషేయ 12:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. తూర్పు గాలి వెంట పరిగెడుతున్నాడు. మానక అబద్ధమాడుతూ బలాత్కారం చేస్తున్నాడు. ప్రజలు అష్షూరీయులతో సంధి చేస్తారు. ఐగుప్తునకు ఒలీవనూనె పంపిస్తారు. యూదావారి మీద యెహోవా వ్యాజ్యం వేశాడు. యాకోబు సంతతి వారు చేసిన దాన్ని బట్టి ఆయన వారిని శిక్షిస్తాడు. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేస్తాడు. తల్లి గర్భంలో యాకోబు తన సోదరుని మడిమెను పట్టుకున్నాడు. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి గెలిచాడు. అతడు కన్నీటితో అతని అనుగ్రహానికై బతిమాలాడు. బేతేలులో అతడు దేవుణ్ణి కలుసుకున్నాడు. అక్కడ ఆయన అతనితో మాట్లాడాడు. ఈయన యెహోవా, సేనల ప్రభువు. “యెహోవా” అని ఆయన్ను పిలవాలి. కాబట్టి నీవు నీ దేవుని వైపు తిరగాలి. నిబంధన నమ్మకత్వాన్ని, న్యాయాన్ని అనుసరించు. నీ దేవుని కోసం ఎడతెగక కనిపెట్టు. కనానీయ వర్తకులు అన్యాయపు త్రాసును వాడుతారు. దగా చెయ్యడమే వారికి ఇష్టం. “నేను ధనవంతుడినయ్యాను, నాకు చాలా ఆస్తి దొరికింది. నేను సంపాదించుకున్న దానిలో దేనిని బట్టీ శిక్షకు తగిన పాపం నాలో ఉన్నట్టు ఎవరూ చూపలేరు” అని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు. “అయితే ఐగుప్తుదేశంలో నుండి మీరు వచ్చినది మొదలు యెహోవానైన నేనే మీకు దేవుణ్ణి. నియామక దినాల్లో మీరు డేరాల్లో కాపురమున్నట్టు నేను మళ్లీ మిమ్మల్ని డేరాల్లో నివసింపజేస్తాను. ప్రవక్తలతో నేను మాటలాడాను. విస్తారమైన దర్శనాలు నేనిచ్చాను. ఉపమానరీతిగా అనేకసార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడాను. గిలాదులో దుర్మార్గం ఉన్నట్టయితే, అక్కడి ప్రజలు పనికిమాలిన వారు. గిల్గాలులో ప్రజలు ఎడ్లను బలులుగా అర్పిస్తారు. వారి బలిపీఠాలు దున్నిన చేని చాళ్ళపై ఉన్న రాళ్లకుప్పల్లాగా ఉన్నాయి. యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోకి వెళ్లిపోయాడు. భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేశాడు. భార్య కావాలని అతడు గొర్రెలు కాచాడు. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించాడు. ప్రవక్త ద్వారా వారిని కాపాడాడు. ఎఫ్రాయిము యెహోవాకు ఘోరమైన కోపం పుట్టించాడు. కాబట్టి అతని యజమాని అతని మీద రక్తాపరాధం మోపుతాడు. అతని సిగ్గులేని పనులను బట్టి అతన్ని అవమానపరుస్తాను.”

హోషేయ 12:1-14 పవిత్ర బైబిల్ (TERV)

“ఎఫ్రాయిమువాళ్లు తమ కాలాన్ని వృథా చేస్తున్నారు, ఇశ్రాయేలీయులు రోజంతా ‘గాలిని తరుముతున్నారు.’ వాళ్లు అంతకంతకు ఎక్కువగా అబద్ధాలాడుతున్నారు, వారు అంతకంతకు ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. వాళ్లు అష్షూరుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్లు తమ ఒలీవ నూనెను ఈజిప్టుకి తరలిస్తున్నారు.” యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా వాదించాను. అతను చేసిన పనులకుగాను యాకోబును శిక్షించి తీరాలి. అతను చేసిన వాటినిబట్టి అతన్ని శిక్షించాలి. యాకోబు ఇంకా తన తల్లి కడుపులో ఉండగానే తన సోదరుణ్ణి మోసగించ నారంభించాడు. యాకోబు బలిష్ఠుడైన యువకుడు. అప్పట్లో అతను దేవునితో పోరాడాడు. యాకోబు దేవుని దూతతో పోరాడి గెలిచాడు. అతను విలపించి దేవుణ్ణి ఒక సహాయం చేయమని అడిగాడు. ఇది బేతేలులో జరిగిన సంఘటన. అక్కడే ఆయన మనతో మాట్లాడాడు. ఔను, యెహోవాయే సర్వసేనాధిపతియైన దేవుడు. ఆయన పేరు యెహోవా (ప్రభువు). అందుకని, మీరు మీ దేవుని వద్దకు తిరిగి రండి. ఆయనకు విధేయులుగా ఉండండి. దయగలవారిగా నీతిమంతులుగా ఉండండి. సదా మీ దేవుని నమ్మండి. “యాకోబు ఒక వ్యాపారస్థుడు. అతను తన మిత్రుణ్ణి కూడా మోసగిస్తాడు. అతని తక్కెడలు కూడా సరైనవి కావు. ఎఫ్రాయిము ఇలా అనుకున్నాడు: ‘నేను ఐశ్వర్యవంతుణ్ణి! నాకు ధనరాశులు దొరికాయి. నా నేరాల సంగతి ఎవడూ తెలుసుకోడు. నా పాపాల గురించి ఎవడూ తెలుసుకోడు.’ “మీరు ఈజిప్టు దేశంలో ఉన్ననాటినుంచి యెహోవానైన నేనే మీకు దేవుణ్ణి. గుడార సమావేశ కాలంలో మాదిరిగా నేను మిమ్మల్ని గుడారాల్లో నివసింపజేస్తాను. నేను ప్రవక్తలతో మాట్లాడాను. నేను వాళ్లకి అనేక దర్శనాలు ఇచ్చాను. నేను పద్ధతులను సూచించాను. కాని, గిల్గాదు ప్రజలు పాపులు. అక్కడ అనేక క్షుద్ర దేవతా విగ్రహాలు ఉన్నాయి. అక్కడి ప్రజలు గిల్గాలువద్ద ఎడ్లను బలులుగా ఇస్తారు. వాళ్లకి బలిపీఠాలు అనేకం ఉన్నాయి. దున్నిన పొలంలో బురద చాళ్లు ఉన్నట్లే వాళ్లకి బారులు బారులుగా బలిపీఠాలు ఉన్నాయి. “యాకోబు అరాము దేశంలోకి పారిపోయాడు. అక్కడ, ఇశ్రాయేలు ఒక భార్యకోసం శ్రమపడ్డాడు. మరో భార్యకోసం గొఱ్ఱెల్ని మేపాడు. కాని, యెహోవా ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును ఈజిప్టునుంచి వెనక్కి రప్పించాడు. యెహోవా ఒక ప్రవక్తద్వారా ఇశ్రాయేలును భద్రంగా కాపాడాడు. కాని, ఎఫ్రాయిము యెహోవాకి మిక్కిలి కోపం కలిగించాడు. ఎఫ్రాయిము చాలామందిని హతమార్చాడు. అందుకని, అతను తన నేరాలకుగాను శిక్షింపబడతాడు. అతని ప్రభువు అతన్ని తన సిగ్గును సహించేటట్లుగా చేశాడు.”

హోషేయ 12:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు; మానక దినమెల్ల అబద్ధమాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయులతో సంధిచేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు. యూదావారిమీద యెహోవాకు వ్యాజ్యెము పుట్టెను; యాకోబు సంతతివారి ప్రవర్తననుబట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయును. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరికలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను; యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని, ఆయనకు జ్ఞాపకార్థనామము. కాబట్టి నీవు నీ దేవునితట్టు తిరుగవలెను; కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవునియందు నమ్మిక నుంచుము. ఎఫ్రాయిమువారు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు, బాధపెట్టవలె నన్న కోరిక వారికి కలదు. –నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనినిబట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. అయితే ఐగుప్తుదేశములోనుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను; నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును. ప్రవక్తలతో నేను మాటలాడి యున్నాను, విస్తారమైన దర్శనములను నేనిచ్చియున్నాను, ఉపమానరీతిగా అనేకపర్యాయములు ప్రవ క్తలద్వారా మాటలాడియున్నాను. నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు, గిల్గాలులో జనులు ఎడ్లను బలులగా అర్పింతురు, వారి బలిపీఠములు దున్నినచేని గనిమలమీదనున్న రాళ్లకుప్పలవలె ఉన్నవి యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను, భార్య కావలెనని ఇశ్రాయేలు కొలువు చేసెను, భార్య కావలెనని అతడు గొఱ్ఱెలు కాచెను. ఒక ప్రవక్తద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తుదేశములోనుండి రప్పించెను, ప్రవక్తద్వారా వారిని కాపాడెను. ఎఫ్రాయిము బహు ఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతనిమీద నేరము మోపును; అతడు పరులకు అవమానము కలుగజేసినందుకై నేనతని నవమానపరతును.