హోషేయ 10:1-13

హోషేయ 10:1-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఇశ్రాయేలు విస్తరించిన ద్రాక్షచెట్టు; అతడు బాగా ఫలించాడు. అతడు ఫలించినకొద్దీ, అతడు ఎక్కువ బలిపీఠాలను కట్టాడు. అతని భూమి సారవంతమైన కొద్ది, అతడు తన పవిత్ర రాళ్లను అలంకరించాడు. వారి హృదయం కపటమైనది, ఇప్పుడు వారు తమ అపరాధానికి శిక్షను భరించాలి. యెహోవా వారి బలిపీఠాలను పడగొట్టి, వారి పవిత్ర రాళ్లను నాశనం చేస్తారు. అప్పుడు వారు, “మనకు రాజు లేడు ఎందుకంటే మనం యెహోవాకు భయపడలేదు. ఒకవేళ మనకు రాజు ఉన్నా కూడా, అతడు మనకు ఏమి చేయగలడు?” అంటారు. వారు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, అబద్ధ ప్రమాణాలు చేస్తారు ఒప్పందాలు చేసుకుంటారు; కాబట్టి వాదనలు దున్నబడిన పొలంలో విషపు మొక్కల్లా మొలుస్తాయి. సమరయలో నివసించే ప్రజలు, బేత్-ఆవెనులో ఉన్న దూడ విగ్రహం గురించి భయపడతారు. దాని ఘనత పోయిందని దాని ప్రజలు దుఃఖపడతారు, దాని వైభవం గురించి ఆనందించిన దాని యాజకులు ఏడుస్తారు. అది అష్షూరుకు కొనిపోబడి, మహారాజుకు కానుకగా ఇవ్వబడుతుంది. ఎఫ్రాయిం అవమానించబడుతుంది; ఇశ్రాయేలు తాను చేసిన తప్పుడు ఆలోచనలను బట్టి సిగ్గుపడుతుంది. సమరయ రాజు నాశనమవుతాడు, అతడు నీటిలో విరిగిపోయిన రెమ్మలా కొట్టుకు పోతాడు. ఇశ్రాయేలు పాపానికి ప్రతిరూపాలైన దుష్టత్వం కలిగిన క్షేత్రాలు నాశనం చేయబడతాయి. ముండ్ల చెట్లు, గచ్చపొదలు పెరిగి వారి బలిపీఠాలను కప్పుతాయి. అప్పుడు వారు పర్వతాలతో, “మమ్మల్ని కప్పండి!” అని కొండలతో, “మామీద పడండి!” అని అంటారు. “ఇశ్రాయేలూ, గిబియా కాలం నుండి నీవు పాపం చేస్తూ ఉన్నావు. నీవు అదే స్థితిలో ఉండిపోయావు. గిబియాలోని దుర్మార్గుల మీదికి మరలా యుద్ధం రాలేదా? నాకు ఇష్టమైనప్పుడు, నేను వారిని శిక్షిస్తాను; వారి రెండంతల పాపం కోసం వారిని బంధకాలలో పెట్టడానికి దేశాలు వారికి విరుద్ధంగా కూడుకుంటాయి. ఎఫ్రాయిం శిక్షణ పొందిన పెయ్యలా ఉంది, నూర్పిడి అంటే దానికి ఇష్టం; కాబట్టి దాని నున్నటి మెడ మీద నేను కాడి పెడతాను, నేను ఎఫ్రాయిం మీద స్వారీ చేస్తాను, యూదా భూమిని దున్నాలి, యాకోబు భూమిని చదును చేయాలి. మీ కోసం నీతిని విత్తండి, మారని ప్రేమ అనే పంట కోయండి. దున్నబడని భూమిని చదును చేయండి; ఎందుకంటే, యెహోవా మీ దగ్గరకు వచ్చి, నీతి వర్షం మీపై కురిపించే వరకు, యెహోవాను వెదికే సమయం ఇదే. కాని మీరు దున్ని దుష్టత్వాన్ని నాటారు, మీరు చెడును కోశారు, మీరు వంచన ఫలాలు తిన్నారు. మీరు మీ సొంత బలాన్ని, మీకున్న అనేకమంది యోధులను నమ్ముకున్నారు.

హోషేయ 10:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇశ్రాయేలు గుబురుగా పెరిగిన ద్రాక్ష చెట్టుతో సమానం. వారి ఫలం విరగ గాసింది. ఫలించినకొద్దీ వారు బలిపీఠాలను మరి ఎక్కువగా కట్టుకున్నారు. తమ భూమి సారవంతమైన కొద్దీ, వారు తమ దేవతా స్థంభాలను మరి విశేషంగా నిర్మించారు. వారి హృదయం కపటమైనది, వారు త్వరలోనే తమ అపరాధానికి శిక్ష పొందుతారు. యెహోవా వారి బలిపీఠాలను కూల్చేస్తాడు. వారి దేవతా స్థంభాలను ధ్వంసం చేస్తాడు. వాళ్ళిలా అంటారు. “మనకు రాజు లేడు, మనం యెహోవాకు భయపడం. రాజు మనకేమి చేస్తాడు?” వారు శుష్కప్రియాలు వల్లిస్తారు. అబద్ధ ప్రమాణాలతో ఒప్పందాలు చేస్తారు. అందువలన నాగటి చాళ్లలో విషపు మొక్కలాగా దేశంలో వారి తీర్పులు మొలుస్తున్నాయి. బేతావెనులో ఉన్న దూడల విషయమై దాని ప్రజలు భయపడతారు. దాని వైభవం పోయిందని ప్రజలు, సంతోష పడుతూ వచ్చిన దాని అర్చకులు దుఃఖిస్తారు. వారు గొప్ప రాజుకు కానుకగా అష్షూరు దేశంలోకి బందీలుగా వెళ్ళిపోతారు. ఎఫ్రాయిము అవమానం పాలవుతుంది. ఇశ్రాయేలు వారు విగ్రహాల మాటలు విన్నందుకు సిగ్గు పడతారు. షోమ్రోను రాజు నాశనమైపోతాడు. నీళ్లలో కొట్టుకు పోయే పుడకలాగా ఉంటాడు. ఇశ్రాయేలు వారి పాపానికి ప్రతిరూపాలైన ఆవెనులోని ఎత్తయిన పూజా స్థలాలు నాశనం అవుతాయి. వారి బలిపీఠాల మీద ముళ్ళ కంప పెరుగుతుంది. పర్వతాలతో “మమ్మల్ని కప్పండి” అనీ, కొండలను చూసి “మా మీద పడండి” అనీ వారు చెబుతారు. ఇశ్రాయేలూ, గిబియా దినాల నుండి నీవు పాపం చేస్తూ వచ్చావు. వారు అక్కడ ఉండిపోయారు. గిబియాలో ఉన్న దుర్మార్గుల మీదికి యుద్ధం ముంచుకు రాలేదా? నేను అనుకున్నప్పుడు వారిని శిక్షిస్తాను. వారు చేసిన రెండింతల దోషక్రియలకు నేను వారిని బంధించినప్పుడు, అన్యప్రజలు సమకూడి వారి మీదికి వస్తారు. ఎఫ్రాయిము కంకులు నూర్చడంలో నైపుణ్యం సంపాదించిన పెయ్య. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కడతాను. ఎఫ్రాయిము పొలం దున్నుతాడు. యూదా భూమిని దున్నుతాడు. యాకోబు దాన్ని చదును చేస్తాడు. మీ కోసం నీతి విత్తనం వేయండి. నిబంధన విశ్వాస్యత అనే కోత కోయండి. ఇదివరకెప్పుడూ దున్నని బీడుభూమి దున్నండి. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతివర్షం కురిపించే వరకూ, యెహోవాను వెదకడానికి ఇదే అదను. నీవు దుర్మార్గం అనే పంటకోసం దుక్కి దున్నావు. పాపమనే కోత కోసుకున్నావు. ఎందుకంటే నీ పథకాలపై ఆధారపడ్డావు. నీకున్న అసంఖ్యాకమైన సైనికులను నమ్ముకున్నావు.

హోషేయ 10:1-13 పవిత్ర బైబిల్ (TERV)

విస్తారమైన పండ్లు ఫలించే ద్రాక్షావల్లిలాంటిది ఇశ్రాయేలు. ఇశ్రాయేలుకు దేవుని దగ్గరనుండి ఎన్నెన్నో లభించాయి. కానీ అతడు ఇంకా ఇంకా ఎక్కువ బలిపీఠాలను బూటకపు దేవుళ్లకు కట్టాడు. అతని భూమి క్రమంగా ఎక్కువగా ఫలించింది. కనుక అతడు బూటకపు దేవుళ్లను గౌరవించుటకు స్తంభాలను నిలిపాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మోసం చేయాలని చూశారు కానీ ఇప్పుడు వారు తమ దోషాన్ని అంగీకరించాలి. వారి బలిపీఠాలను యెహోవా విరుగగొడ్తాడు. వారి స్మారక శిలలను ఆయన నాశనం చేస్తాడు. ఇప్పుడు, “మాకు రాజు లేడు. మేము యెహోవాను గౌరవించము. అయినా రాజు మాకు ఏమీ చేయలేడు.” అని ఇశ్రాయేలీయులు చెపుతారు. వారు వాగ్దానాలు చేస్తారు కానీ వారు వట్టి అబద్ధాలు మాత్రమే చెపుతున్నారు. వారి వాగ్దానాలను వారు నిలబెట్టుకోరు. ఇతర దేశాలతో వారు ఒప్పందాలు చేస్తారు. ఆ ఒప్పందాలు దేవునికి ఇష్టం లేదు. ఆ న్యాయమూర్తులు, దున్నబడిన పొలంలో విషపు కలుపు మొక్కల్లాంటివారు. సమరయ ప్రజలు బేతావెను దగ్గర దూడలను పూజిస్తారు. ఆ ప్రజలు, యాజకులు నిజంగా ఏడుస్తారు. ఎందుకంటే అందమైన వారి విగ్రహం ఎత్తుకుపోబడింది. అష్షూరు రాజుకు కానుకగా అది ఎత్తుకొనిపోబడింది. ఎఫ్రాయిము యొక్క అవమానకరమైన విగ్రహాన్ని అతడు ఉంచుకొంటాడు. ఇశ్రాయేలు తన విగ్రహం విషయమై సిగ్గుపడుతుంది. సమరయ బూటకపు దేవుడు నాశనం చేయబడతాడు. అది నీటిమీద తేలిపోతున్న చెక్క ముక్కలాగ ఉంటుంది. ఇశ్రాయేలు పాపంచేసి, ఎత్తయిన స్థలాలు అనేకం నిర్మించింది. ఆవెనులోనున్న ఎత్తయిన స్థలాలు అన్నీ నాశనం చేయబడతాయి. వాటి బలిపీఠాలమీద ముళ్ల కంపలు, పిచ్చిమొక్కలు మొలుస్తాయి. అప్పుడు వారు “మమ్మల్ని కప్పండి!” అని పర్వతాలతోను, “మా మీద పడండి!” అని కొండలతోను చెపుతారు. “ఇశ్రాయేలూ, గిబియా కాలంనుండి నీవు పాపం చేశావు. (మరియు ఆ ప్రజలు అక్కడ పాపం చేస్తూనే ఉన్నారు). ఆ దుర్మార్గులను గిబియాలో యుద్ధం నిజంగా పట్టుకొంటుంది. వారిని శిక్షించటానికి నేను వస్తాను. వారికి విరోధంగా సైన్యాలు కలిసి ఉమ్మడిగా వస్తాయి. ఇశ్రాయేలీయులను వారి రెండు పాపాల నిమిత్తం ఆ సైన్యాలు శిక్షిస్తాయి. “ఎఫ్రాయిము నూర్పిడి కళ్లంలో ధాన్యం మీద నడవడానికి ఇష్టపడే శిక్షణగల పెయ్యలాగ ఉన్నాడు. దాని మెడమీద నేను ఒక కాడిని పెడతాను. తాళ్లను నేను ఎఫ్రాయిము మీద ఉంచుతాను. అప్పుడు యూదా దున్నటం మొదలు పెడతాడు. యాకోబు తానే భూమిని చదును చేస్తాడు.” నీవు మంచితనాన్ని నాటితే సత్య ప్రేమను కోస్తావు. నీవు నేలను దున్ని యెహోవాతో కలిసి పంటకోస్తావు. ఆయన వచ్చి, మంచితనాన్ని వర్షంలాగ నీమీద కురిపిస్తాడు! కానీ మీరు దుర్మార్గం నాటారు. కష్టాన్ని పంటగా కోశారు. మీ అబద్ధాల ఫలం మీరు తిన్నారు. ఎందుచేతనంటే మీరు మీ శక్తిని, మీ సైనికులను నమ్ముకొన్నారు.

హోషేయ 10:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష . చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించినకొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి; తమ భూమి ఫలవంతమైనకొలది వారు తమ దేవతాస్తంభములను మరి విశేషముగా చేసిరి. వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు; యెహోవావారి బలిపీఠములను తుత్తునియలుగా చేయును, వారు ప్రతిష్ఠించిన దేవతాస్తంభములను పాడుచేయును. –రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు. అబద్ధప్రమాణములు చేయుదురు, సంధులు చేయుదురు, వట్టిమాటలు పలుకుదురు, అందువలన భూమి చాళ్లలో విషపుకూర మొలచునట్టుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. బేతావెనులోనున్న దూడవిషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు, దాని ప్రభావము పోయెనని ప్రజలును, సంతోషించుచుండిన దాని అర్చకులును దుఃఖింతురు. ఎఫ్రాయిము అవమానము నొందుటకు, ఇశ్రాయేలువారు తాము చేసిన ఆలోచనవలన సిగ్గు తెచ్చుకొనుటకు, అది అష్షూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును. షోమ్రోను నాశమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకొనిపోవు నురుగుతో సమానమగును. ఇశ్రాయేలువారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నతస్థలములు లయమగును, ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠములమీద పెరుగును, పర్వతములను చూచి–మమ్మును మరుగుచేయుడనియు, కొండలను చూచి–మామీద పడుడనియు వారు చెప్పుదురు. ఇశ్రాయేలూ, గిబియా దినములనుండి నీవు పాపము చేయుచు వచ్చితివి, అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గులమీద జరిగిన యుద్ధము గిబియాలో వారిమీదికి రాగా నా యిష్టప్రకారము నేను వారిని శిక్షింతును; వారు చేసిన రెండు దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారిమీదికి వత్తురు. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది; అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును; ఎఫ్రాయిముచేత దున్నిం చుటకు నేనొకని నియమింతును, యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసికొనును. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమ యము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి. నీ ప్రవర్తన నాధారము చేసికొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోతకోసియున్నారు. అబద్ధమునకు ఫలము పొందియున్నారు.