హోషేయ 1:2-11
హోషేయ 1:2-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా హోషేయ ద్వారా మాట్లాడడం ఆరంభించినప్పుడు, యెహోవా ఇలా అన్నారు, “వెళ్లు, ఒక వ్యభిచారిణిని పెళ్ళి చేసుకో, ఆమెతో పిల్లలు కను, ఎందుకంటే ఈ దేశం కూడా ఒక వ్యభిచారిణిలా యెహోవాకు నమ్మకద్రోహం చేస్తూ ఉంది.” కాబట్టి అతడు దిబ్లయీము కుమార్తెయైన గోమెరును పెళ్ళి చేసుకున్నాడు, ఆమె గర్భవతియై అతనికి కుమారున్ని కన్నది. అప్పుడు యెహోవా హోషేయతో అన్నారు, “అతనికి యెజ్రెయేలు అనే పేరు పెట్టు, ఎందుకంటే యెజ్రెయేలులో జరిగిన రక్తపాతాన్ని బట్టి త్వరలో నేను యెహు వంశాన్ని శిక్షిస్తాను, ఇశ్రాయేలు రాజ్యాన్ని తుదముట్టిస్తాను. ఆ రోజు యెజ్రెయేలు లోయలో నేను ఇశ్రాయేలు విల్లు విరగ్గొడతాను.” గోమెరు మళ్ళీ గర్భవతియై ఆడపిల్లను కన్నది. అప్పుడు యెహోవా హోషేయతో ఇలా అన్నారు, “ఆమెకు లో-రుహామా అని పేరు పెట్టు, ఎందుకంటే నేను ఇక ఇశ్రాయేలును ప్రేమించను వారిని ఏమాత్రం క్షమించను. అయితే యూదా వారికి నా ప్రేమను చూపించి వారిని రక్షిస్తాను; విల్లు, ఖడ్గం, యుద్ధం, గుర్రాలు, రౌతుల వల్ల కాదు, కాని వారి దేవుడనైన యెహోవా అనే నేనే వారిని రక్షిస్తాను.” ఆమె లో-రుహామాను పాలు మాన్పించిన తర్వాత, గోమెరుకు మరో కుమారుడు పుట్టాడు. అప్పుడు యెహోవా ఇలా అన్నారు, “అతనికి లో-అమ్మీ అని పేరు పెట్టు, ఎందుకంటే మీరు నా జనం కాదు, నేను మీ దేవుడను కాదు. “అయినా ఇశ్రాయేలీయులు సముద్రతీరాన ఉన్న ఇసుకంత విస్తారంగా కొలువలేనంతగా లెక్కపెట్టలేనంతగా ఉంటారు. ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో, అక్కడే వారు ‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు. యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏకమవుతారు; వారు ఒక నాయకున్ని నియమించుకుంటారు, వారు ఈ దేశంలో ఎదుగుతారు, ఎందుకంటే యెజ్రెయేలు దినం గొప్పగా ఉండబోతుంది.
హోషేయ 1:2-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా హోషేయతో మొదట మాట్లాడినప్పుడు ఇలా ఆజ్ఞాపించాడు. “వెళ్ళి ఒక వేశ్యను నీకు భార్యగా తెచ్చుకో. ఆమె వ్యభిచారం ఫలితంగా పుట్టిన సంతానాన్ని స్వీకరించు. ఎందుకంటే దేశం నన్ను విడిచిపెట్టి నీచమైన వ్యభిచార కార్యాలు చేసింది.” కాబట్టి హోషేయ వెళ్ళి దిబ్లయీము కూతురు గోమెరును పెళ్ళాడాడు. ఆమె గర్భం ధరించి అతనికొక కొడుకుని కన్నది. యెహోవా అతనికి ఇలా ఆజ్ఞాపించాడు. “వీడికి ‘యెజ్రెయేల్’ అని పేరు పెట్టు. యెజ్రెయేలులో యెహూ వంశం వారు రక్తపాతం చేశారు. దాన్ని బట్టి ఇక కొంతకాలానికి నేను వారిని శిక్షిస్తాను. ఇశ్రాయేలువారికి రాజ్యం ఉండకుండాా తీసేస్తాను. ఆ రోజుల్లో జరిగేది ఏమిటంటే, నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరిచేస్తాను.” గోమెరు మళ్లీ గర్భం ధరించి ఆడపిల్లను కన్నది. యెహోవా అతనికి ఇలా చెప్పాడు. “దీనికి ‘లో రూహామా’ అని పేరు పెట్టు. ఎందుకంటే ఇకపై నేను ఇశ్రాయేలును క్షమించడం కోసం వారిపై జాలి పడను. అయితే యూదావారిపై జాలి చూపుతాను. వారి దేవుడైన యెహోవా అనే నేనే వారిని రక్షిస్తాను. విల్లు, ఖడ్గం, సమరం, గుర్రాలు, రౌతులు అనే వాటి వల్ల కాదు.” లో రూహామా పాలు మానిన తరువాత ఆమె తల్లి గర్భం ధరించి మరొక కొడుకును కన్నది. యెహోవా ఇలా చెప్పాడు. “వీడికి ‘లో అమ్మీ’ అని పేరు పెట్టు. ఎందుకంటే మీరు నా ప్రజలు కారు, నేను మీకు దేవుణ్ణి కాను. అయినప్పటికీ ఇశ్రాయేలీయుల జనసంఖ్య సముద్రతీరంలో ఇసుకంత విస్తారం అవుతుంది. దాన్ని కొలవలేము, లెక్కబెట్టలేము. ఎక్కడ ‘మీరు నా ప్రజలు కారు’ అని వారితో చెప్పానో, అక్కడే ‘మీరు సజీవుడైన దేవుని ప్రజలు’ అని వారికి చెబుతారు. యూదా, ఇశ్రాయేలు ఒక్క చోట సమకూడుతారు. తమపై ఒకే నాయకుణ్ణి నియమించుకుంటారు. ఆ దేశంలో నుండి బయలు దేరుతారు. ఆ యెజ్రెయేలు దినం మహా ప్రభావ దినం.”
హోషేయ 1:2-11 పవిత్ర బైబిల్ (TERV)
ఇది హోషేయకు యెహోవా ఇచ్చిన మొదటి సందేశం. “వెళ్లి, ఒక వేశ్యను పెండ్లి చేసుకొని, ఆ వేశ్య ద్వారా పిల్లల్ని కను. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు వేశ్యల్లా ప్రవర్తించారు-వారు యెహోవాకు అపనమ్మకంగా జీవించారు” అని యెహోవా చెప్పాడు. కనుక దిబ్లయీము కుమార్తెయైన గోమెరును హోషేయ పెండ్లి చేసుకొన్నాడు. గోమెరు గర్భవతియై, హోషేయకు ఒక కుమారుని కన్నది. యెహోవా హోషేయతో, “అతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టు. ఎందుచేతనంటే యెహూ యెజ్రెయేలు లోయలో రక్తం చిందించిన కారణంగా నేను యెహూ కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజ్యాన్ని నేను నాశనం చేస్తాను. ఆ సమయంలో యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు విల్లును నేను విరుగగొడ్తాను” అని చెప్పాడు. మరల గోమెరు గర్భవతియై ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. యెహోవా హోషేయతో ఇలా చెప్పాడు: “ఆమెకు లో-రూహామా అని పేరు పెట్టు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యానికి నేను ఇక ఎంతమాత్రం కరుణ చూపించను. నేను వారిని క్షమించను. కాని యూదా రాజ్యానికి నేను కరుణ చూపిస్తాను. యూదా రాజ్యాన్ని నేను రక్షిస్తాను. వారిని రక్షించేందుకు విల్లుగాని, ఖడ్గంగాని నేను ఉపయోగించను. వారిని రక్షించేందుకు యుద్ధ గుర్రాలనుగాని, సైనికులనుగాని నేను ఉపయోగించను. నేను నా స్వంత శక్తిచేతనే వారిని రక్షిస్తాను.” గోమెరు లో-రూహామాకు చనుబాలు ఇవ్వటం చాలించగానే ఆమె మరల గర్భవతి అయ్యింది. ఆమె మరొక కుమారుని కన్నది. అప్పుడు, “అతనికి లో-అమ్మీ అని పేరు పెట్టు. ఎందుచేతనంటే మీరు నా ప్రజలు కారు, నేను మీ దేవుణ్ణి కాను” అని యెహోవా చెప్పాడు. “రాబోయే కాలంలో ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుక రేణువుల్లా ఉంటుంది. ఇసుకను నీవు కొలవలేవు. లెక్కించ లేవు. ఏ స్థలంలోనైతే ‘మీరు నా ప్రజలు కారు’ అని వారితో చెప్పబడిందో అక్కడే ‘మీరు జీవంగల దేవుని పిల్లలు’ అని వారితో చెప్పడం జరుగుతుంది. “అప్పుడు యూదా ప్రజలు మరియు ఇశ్రాయేలు ప్రజలు సమావేశపరచబడతారు. వారు ఒక పాలకుని తమకోసం ఏర్పాటు చేసుకొంటారు. మరియు వారి రాజ్యం ఆ దేశం పట్టజాలనంత పెద్దదిగా ఉంటుంది! యెజ్రెయేలు దినం నిజంగా గొప్పగా ఉంటుంది.
హోషేయ 1:2-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మొదట యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెను–జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారముచేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడుపోయి దిబ్లయీము కుమార్తెయైన గోమె రును పెండ్లిచేసికొనెను. ఆమె గర్భవతియై అతనికొక కుమారుని కనగా యెహోవా అతనితో ఈలాగు సెలవిచ్చెను–ఇతనికి యెజ్రెయేలని పేరుపెట్టుము. యెజ్రెయేలులో యెహూ యింటివారు కలుగజేసికొనిన రక్తదోషమునుబట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలువారికి రాజ్యముండకుండ తీసి వేతును. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరల గర్భవతియై కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా–దీనికి లోరూహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము; ఇకమీదట నేను ఇశ్రాయేలువారిని క్షమించను, వారియెడల జాలిపడను. అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును. లోరూహామా (జాలినొందనిది) పాలువిడిచిన తరువాత తల్లి గర్భవతియై కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా–మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై యుండను గనుక లోఅమ్మీ (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము. ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందు–మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే–మీరు జీవముగల దేవుని కుమారులైయున్నారని వారితో చెప్పుదురు. యూదావారును ఇశ్రాయేలువారును ఏకముగా కూడుకొని, తమపైన నొకనిని ప్రధానుని నియమించుకొని తామున్న దేశములోనుండి బయలుదేరుదురు; ఆ యెజ్రెయేలు దినము మహా ప్రభావముగల దినముగానుండును.