హెబ్రీయులకు 9:1-5

హెబ్రీయులకు 9:1-5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మొదటి నిబంధనలో దేవుని ఆరాధించడానికి కొన్ని నియమాలు, భూసంబంధమైన ప్రత్యక్ష గుడారం ఉన్నాయి. ఆ గుడారం ఇలా ఏర్పరచబడింది. దానిలోని మొదటి గదిలో ఒక దీప దీపస్తంభం, ఒక బల్ల దానిపై అర్పించబడిన రొట్టెలు ఉన్నాయి, ఆ గదికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెర వెనుక అతి పరిశుద్ధ స్థలం అని పిలువబడే గది ఉంది, దానిలో ధూపం వేయడానికి బంగారు బలిపీఠం, బంగారంతో కప్పబడిన నిబంధన పెట్టె ఉన్నాయి. ఆ పెట్టెలో మన్నా ఉంచబడిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, వ్రాయబడిన నిబంధన రాతిపలకలు ఉన్నాయి. ఈ పెట్టె పైన మహిమగల కెరూబులు తమ రెక్కలతో ప్రాయశ్చిత్త పీఠంను కాపాడుతూ ఉన్నాయి. అయితే ఈ సంగతుల గురించి వివరంగా ఇప్పుడు మనం చర్చించలేము.

హెబ్రీయులకు 9:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మొదటి ఒప్పందానికి కూడా భూమి మీద ఒక ఆరాధనా స్థలమూ, ఆరాధనకు సంబంధించిన నియమాలూ ఉన్నాయి. ఇది ఎలాగంటే, ప్రత్యక్ష గుడారంలో ఒక గదిని సిద్ధం చేశారు. ఇది వెలుపలి గది. దీనిలో ఒక బల్ల, సన్నిధిలో ఉంచే రొట్టెలు ఉంచారు. దీనినే పరిశుద్ధ స్థలం అని పిలిచారు. ఇక రెండవ తెర వెనుక మరో గది ఉంది. దీన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలిచారు. అందులో బంగారంతో చేసిన సాంబ్రాణి పళ్ళెం ఉంది. ఇక్కడ ఇంకా, బంగారం తొడుగు ఉన్న నిబంధన మందసం కూడా ఉంది. ఆ పెట్టెలో ఒక బంగారు పాత్ర, ఆ పాత్రలో మన్నా ఉంది. ఇంకా ఆ పెట్టెలో చిగిరించిన అహరోను కర్ర, నిబంధనకు సంబంధించిన రెండు రాతి పలకలు ఉన్నాయి. “కరుణా పీఠం” అని పిలిచే మందసం మూతను కప్పుతూ తేజస్సుతో నిండిన కెరూబుల ఆకృతులున్నాయి. వాటిని గూర్చి ఇప్పుడు వివరించడం సాధ్యం కాదు.

హెబ్రీయులకు 9:1-5 పవిత్ర బైబిల్ (TERV)

సేవా నియమాలను గురించి, మానవ నిర్మితమైన గుడారమును గురించి మొదటి ఒడంబడికలో వ్రాయబడి ఉంది. గుడారం వేసి మొదటి గదిని సిద్ధం చేసేవాళ్ళు. ఆ గదిలో ఒక దీప స్థంభం, ఒక బల్ల, ప్రతిష్ఠించబడిన రొట్టె ఉంచేవాళ్ళు. ఈ గదిని పవిత్రస్థానమని పిలిచేవాళ్ళు. మరొక తెరవేసి రెండవ గదిని సిద్ధం చేసేవాళ్ళు. దీన్ని అతి పవిత్ర స్థానమని పిలిచేవాళ్ళు. ఇక్కడ బంగారు ధూప వేదిక, మరియు బంగారు రేకుచేత కప్పబడిన ఒడంబడిక మందసము ఉండేవి. ఈ మందసంలో మన్నా ఉంచబడిన బంగారుగిన్నె, చిగురు వేసిన అహరోను చేతికర్ర, ఒడంబడిక పలకలు ఉండేవి. ఈ మందసం మీద కరుణాపీఠం ఉండేది. దానికి యిరువైపులా దేవదూతలు ఉండేవారు. వారి రెక్కలు ఆ కరుణాపీఠాన్ని కప్పి ఉంచేవి. కాని వీటిని గురించి ప్రస్తుతం వివరంగా చర్చించలేము.

హెబ్రీయులకు 9:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మెుదటి నిబంధనకైతే సేవానియమములును ఈ లోక సంబంధమైన పరిశుద్ధస్థలమును ఉండెను. ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టె లును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను. అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధనమందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.