హెబ్రీయులకు 8:1-7

హెబ్రీయులకు 8:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మనం చెప్తున్న దానిలోని ముఖ్య సారాంశమిది: పరలోకంలో సర్వోన్నతుని సింహాసనం యొక్క కుడి వైపున కూర్చుని ఉన్న వానిని మనం ప్రధాన యాజకునిగా కలిగి ఉన్నాం, ఆయన మానవుని చేత కాక దేవుని చేత తయారుచేయబడిన నిజమైన ప్రత్యక్షగుడారంలో అతిపరిశుద్ధమైన స్థలంలో ప్రధాన యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు. ప్రతి ప్రధాన యాజకుడు దేవునికి కానుకలను బలులను అర్పించడానికి నియమించబడి ఉన్నాడు కాబట్టి ఈయన కూడ దేవునికి ఏదైనా సమర్పించాల్సిన అవసరం ఉండింది. ఆయన భూమి మీద ఉండి ఉంటే, ఒక యాజకుడై ఉండేవాడు కాడు, ధర్మశాస్త్రంలో వ్రాసి ఉన్న ప్రకారం అర్పణలు అర్పించే యాజకులు ఇప్పటికే ఉన్నారు. పరలోకంలో ఉన్న దానికి కేవలం ఒక నమూనాగా ఛాయాచిత్రంగా ఉన్న పరిశుద్ధ స్థలంలో యాజకులుగా వారు సేవ చేస్తారు. ఇందుకే మోషే గుడారాన్ని నిర్మిస్తున్నప్పుడు దాన్ని గురించి ఇలా హెచ్చరిక పొందాడు: “పర్వతం మీద నేను నీకు చూపించిన నమూనా ప్రకారమే ప్రతిదీ చేసేలా చూడాలి.” అయితే నిజానికి నూతన నిబంధన మరింత గొప్ప వాగ్దానాలపై స్థాపించబడింది కాబట్టి, యేసు మధ్యవర్తిగా ఉన్న ఈ నిబంధన గత నిబంధన కన్న శ్రేష్ఠమైనదైనట్లే ఆయనకు అప్పగించబడిన పరిచర్య కూడా శ్రేష్ఠమైనదే. అయితే మొదటి నిబంధన లోపం లేనిదైతే, రెండవ దాని కోసం వెదకాల్సిన అవసరమే లేదు.

హెబ్రీయులకు 8:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇప్పుడు మేం చెబుతున్న విషయంలో ముఖ్యాంశం ఇది. మనకు ఒక ప్రధాన యాజకుడున్నాడు. ఆయన పరలోకంలో మహా ఘనత వహించిన దేవుని సింహాసనానికి కుడివైపున ఆసీనుడై ఉన్నాడు. మానవ నిర్మితం కాకుండా ప్రభువే నెలకొల్పిన ప్రత్యక్ష గుడారం అయిన పరిశుద్ధ గర్భాలయంలో ఆయన సేవకుడుగా ఉన్నాడు. ప్రధాన యాజకుణ్ణి కానుకలూ, బలులూ అర్పించడానికి నియమిస్తారు. కాబట్టి అర్పించడానికి ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు క్రీస్తు భూమి మీదే ఉంటే యాజకుడిగా ఉండనే ఉండడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించేవారున్నారు. మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు, “పర్వతం పైన నీకు నేను చూపించిన నమూనా ప్రకారమే దాన్ని చేయాలి” అని దేవుడు హెచ్చరించాడు. కాబట్టి యాజకులు సేవ చేస్తున్న గుడారం పరలోకంలో ఉండే వాటికి నకలుగా, నీడగా ఉంది. కానీ ఇప్పుడు క్రీస్తు మరింత మేలైన పరిచర్యను పొందాడు. ఎందుకంటే శ్రేష్ఠమైన వాగ్దానాలపై ఏర్పడిన శ్రేష్ఠమైన ఒప్పందానికి ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఎందుకంటే మొదటి ఒప్పందం లోపం లేనిదైతే రెండవ ఒప్పందానికి అవకాశం ఉండదు.

హెబ్రీయులకు 8:1-7 పవిత్ర బైబిల్ (TERV)

మేము చెబుతున్న దానిలో ముఖ్య అంశం ఏమిటంటే: పరలోకంలో మహోన్నతుని సింహాసనానికి కుడివైపు కూర్చోగల అధికారమున్న ప్రధాన యాజకుడు మనకున్నాడు. అంతేకాక ఆయన నిజమైన గుడారంలో, అంటే ప్రభువు నిర్మించిన పరిశుద్ధాలయములో సేవ చేస్తున్నాడు. ఈ గుడారం మానవుడు నిర్మించింది కాదు. కానుకల్ని, బలుల్ని అర్పించటానికి ప్రధాన యాజకుడు నియమించబడతాడు. అందువల్ల ఈయన దగ్గర కూడా అర్పించటానికి ఏదైనా ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఈయన భూలోకంలో ఉండినట్లయితే యాజకుడుగా పని చేసేవాడు కాదు. ఎందుకంటే, ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా కానుకలు అర్పించే యాజకులు యిదివరకే భూలోకంలో ఉన్నారు. వాళ్ళు భూమ్మీదనున్న పరిశుద్ధ స్థలములో సేవచేస్తూ ఉంటారు. భూలోకంలో ఉన్న ఈ పరిశుద్ధ స్థలము పరలోకంలో ఉన్న దానికి నీడ లాంటిది, అంటే ప్రతిబింబం. ఈ కారణంగానే, మోషే గుడారాన్ని నిర్మించటానికి మొదలు పెట్టినప్పుడు దేవుడు అతనితో, “నేను నీకు కొండమీద చూపించిన విధంగా దాన్ని నిర్మించు!” అని హెచ్చరించాడు. యేసు మధ్యవర్తిగా ఉండి నియమించిన ఒడంబడిక పాత దానికన్నా ఉత్తమమైనది. అందులో ఉత్తమ వాగ్దానాలున్నాయి. అందువల్ల దేవుడు యేసుకిచ్చిన యాజకత్వము వాళ్ళు చేసే యాజకత్వం పనికన్నా ఉత్తమమైనది. ఎందుకంటే ఒకవేళ మొదటి ఒడంబడికలో ఏ తప్పూ లేక పోయినట్లయితే యింకొక ఒడంబడిక యొక్క అవసరం ఉండక పోయేది.

హెబ్రీయులకు 8:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా, మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడుకాక ప్రభువే సాప్థిచిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ప్రతి ప్రధానయాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైన ఉండుట అవశ్యము. ధర్మశాస్త్రప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమిమీద ఉన్నయెడల యాజకుడై యుండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు –కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు. ఈయనయైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేప్ఠమైన సేవకత్వము పొంది యున్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు.