హెబ్రీయులకు 7:1-28
హెబ్రీయులకు 7:1-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఈ మెల్కీసెదెకు షాలేముకు రాజు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము నలుగురు రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు షాలేము రాజైన మెల్కీసెదెకు అబ్రాహామును కలిసి అతన్ని ఆశీర్వదించాడు. అబ్రాహాము అన్నిటిలో పదవ భాగాన్ని అతనికి ఇచ్చాడు. మెల్కీసెదెకు అనగా మొదట, “నీతికి రాజు అని అర్థం” అటు తర్వాత “షాలేము రాజు” అనగా, “శాంతికి రాజు” అని అర్థం తల్లి తండ్రి లేకపోయినా, వంశావళి లేకపోయినా, జీవిత ఆరంభం అంతం లేకపోయినా అతడు దేవుని కుమారునికి సాదృశ్యంగా, నిరంతరం యాజకునిగా ఉన్నాడు. ఇతడెంత గొప్పవాడో ఆలోచించండి: మన పితరుడైన అబ్రాహాము కొల్లగొట్టిన దానిలో నుండి పదో భాగాన్ని ఇచ్చాడు! లేవీ సంతతిలో నుండి యాజకులైనవారు ప్రజల నుండి అంటే, అబ్రాహాము నుండి వచ్చిన తోటివారైనా ఇశ్రాయేలీయుల నుండి పదవ వంతు వసూలు చేయాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది. ఈ మనుష్యుడు లేవీ సంతతివాడు కానప్పటికి, అబ్రాహాము నుండి పదో భాగాన్ని తీసుకుని, దేవుని వాగ్దానాలను పొందిన అతన్ని దీవించాడు. తక్కువవాడు గొప్పవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు. ఒక సందర్భంలో, దశమభాగం చనిపోయేవారి చేత వసూలు చేయబడింది; మరో సందర్భంలో, బ్రతికి ఉన్నాడని ప్రకటించబడిన వారి ద్వారా వసూలు చేయబడింది. దశమభాగం పుచ్చుకొనే లేవీయులు అబ్రాహాము ద్వారా పదో భాగాన్ని చెల్లించారు అని చెప్పవచ్చు, ఎందుకంటే మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నపుడు, లేవీ ఇంకా తన పితరుని శరీరంలోనే ఉన్నాడు. ప్రజలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం స్థాపించిన లేవీయుల యాజకత్వం ద్వారా పరిపూర్ణతను సాధించగలిగివుంటే మరొక యాజకుడు అహరోను క్రమంలో కాక, మెల్కీసెదెకు క్రమంలో రావలసిన అవసరం ఏంటి? యాజకత్వం మార్చబడినపుడు, ధర్మశాస్త్రం కూడా మార్చబడాలి. ఈ సంగతులు ఎవరి గురించి చెప్పబడ్డాయో అతడు వేరొక వంశానికి చెందిన వాడు, ఆ వంశం నుండి ఎవరు, ఎన్నడు బలిపీఠం దగ్గర పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానం నుండి వచ్చాడనేది స్పష్టం కాని ఆ గోత్రానికి సంబంధించి యాజకులను గురించి మోషే ఏమి చెప్పలేదు. మెల్కీసెదెకు వంటి వేరొక యాజకుడు వస్తే మేము చెప్పింది మరింత స్పష్టంగా అర్థమవుతుంది, యాజకుడైనవాడు వంశపారంపర్య నియమం ప్రకారం యాజకుడు కాలేదు, కాని నాశనములేని జీవానికున్న శక్తినిబట్టి యాజకుడయ్యాడు. అందుకే ఇలా ప్రకటించబడింది: “మెల్కీసెదెకు క్రమంలో, నీవు నిరంతరం యాజకునిగా ఉంటావు.” పాత నియమం బలహీనం, నిరుపయోగం కాబట్టి ప్రక్కకు పెట్టబడింది. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం దేన్ని పరిపూర్ణం చేయలేదు, కాబట్టి మనల్ని దేవునికి దగ్గర చేసే, మెరుగైన నిరీక్షణ పరిచయం చేయబడింది. అది ప్రమాణం లేకుండా కాదు! ఇతరులు ఏ ప్రమాణం చేయకుండానే యాజకులయ్యారు, అయితే ఆయన ప్రమాణంతో యాజకుడు అయ్యేటప్పుడు దేవుడు ఆయనతో ఇలా అన్నారు: “ప్రభువు ప్రమాణం చేశారు ఆయన తన మనస్సు మార్చుకోరు: ‘నీవు నిరంతరం యాజకునిగా ఉంటావు.’ ” ఈ ప్రమాణం వలన, యేసు మరింత మేలైన నిబంధనకు హామీదారు అయ్యాడు. మరణం వారిని ఆ పదవిలో కొనసాగనివ్వలేదు కాబట్టి యాజకులైనవారు అనేకమంది ఉన్నారు. అయితే యేసు నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి ఆయన శాశ్వత యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు. తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారి కోసం ఎల్లప్పుడు విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి వారిని ఆయన సంపూర్ణంగా రక్షించగలడు. పరిశుద్ధుడు, నిందారహితుడు, పవిత్రుడు, పాపుల నుండి ప్రత్యేకించబడినవాడు, ఆకాశాల కంటే పైగా హెచ్చింపబడినవాడు, మన అవసరాలను తీర్చగల ప్రధాన యాజకుడు. ఆయన ఇతర ప్రధాన యాజకుల వంటివాడు కాదు, ప్రతిదినం, మొదట తన పాపాల కోసం, తర్వాత ప్రజల పాపాల కోసం బలులు అర్పించాల్సిన అవసరం ఆయనకు లేదు. తనను తాను అర్పించుకున్నప్పుడే వారందరి పాపాల కోసం ఒకేసారి అర్పించాడు. ధర్మశాస్త్రం బలహీనతతో ఉన్న మనుష్యులను ప్రధాన యాజకులుగా నియమిస్తుంది; కాని ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన దేవుని ప్రమాణం నిత్యం పరిపూర్ణునిగా చేయబడిన దేవుని కుమారున్ని ప్రధాన యాజకునిగా నియమించింది.
హెబ్రీయులకు 7:1-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రాజులను హతమార్చి తిరిగి వస్తున్న అబ్రాహామును షాలేం పట్టణానికి రాజైన మెల్కీసెదెకు కలుసుకుని ఆశీర్వదించాడు. అబ్రాహాము తాను యుద్ధంలో పట్టుకున్న వాటిలో పదవ వంతు అతనికి ఇచ్చాడు. “మెల్కీసెదెకు” అనే అతని పేరుకు నీతికి రాజు అనీ, ఇంకా, “షాలేం రాజు”, అంటే శాంతికి రాజు అనీ అర్థం. అతడు తండ్రి లేకుండానూ, తల్లి లేకుండానూ ఉన్నాడు. ఇతనికి పూర్వీకులంటూ ఎవరూ లేరు. ఇతని జీవిత కాలానికి ప్రారంభం లేదు. జీవితానికి అంతం అంటూ లేదు. దేవుని కుమారుడిలా ఇతడు కలకాలం యాజకుడై ఉన్నాడు. ఇప్పుడు ఇతడెంత గొప్పవాడో గమనించండి. మన పూర్వికుడైన అబ్రాహాము యుద్ధంలో తాను కొల్లగొట్టిన శ్రేష్ఠమైన వస్తువుల్లో పదోవంతు ఇతనికి ఇచ్చాడు. లేవి వంశం వారిలో నుండి యాజకులైన వారు, ఇతర గోత్రాల ప్రజలు అబ్రాహాము సంతతి వారైనప్పటికీ, వారి దగ్గర పదవ వంతును కానుకగా సేకరించాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది. కానీ లేవీతో ఎలాంటి సంబంధమూ లేని మెల్కీసెదెకు అబ్రాహాము దగ్గర పదోవంతు కానుకలు స్వీకరించి అబ్రాహామును ఆశీర్వదించాడు. ఆశీర్వదించేవాడు అధికుడనీ దాన్ని అందుకునేవాడు తక్కువ వాడన్నది కాదనలేని విషయం. లేవీ క్రమంలో యాజకుడై కానుక స్వీకరించేవాడు ఒకరోజు మరణిస్తాడు. అయితే అబ్రాహాము కానుకను స్వీకరించిన వాడు శాశ్వతంగా జీవిస్తూ ఉన్నట్టుగా వివరణ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పదోవంతు కానుకలను స్వీకరించిన లేవీ తాను కూడా అబ్రాహాము ద్వారా పదవ వంతు కానుకలు ఇచ్చాడు. ఇది ఎలాగంటే, లేవీ అబ్రాహాము నుండే రావాలి కాబట్టి, అబ్రాహాము మెల్కీసెదెకుకు కానుక ఇచ్చినప్పుడు అతని గర్భవాసంలో లేవీ ఉన్నాడు. లేవీయులు యాజకులై ఉన్నప్పుడే దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఒకవేళ ఆ యాజక వ్యవస్థ వల్లనే పరిపూర్ణత కలిగిందీ అనుకుంటే లేవీయుడైన అహరోను క్రమంలో కాకుండా మెల్కీసెదెకు క్రమంలో వేరే యాజకుడు రావలసిన అవసరమేంటి? యాజకత్వం మారినప్పుడు యాజక ధర్మం కూడా మారాలి. ప్రస్తుతం ఈ విషయాలన్నీ వేరే గోత్రంలో పుట్టిన వ్యక్తిని గూర్చి చెప్పుకుంటున్నాం. ఈ గోత్రంలో పుట్టిన వారిెవరూ బలిపీఠం వద్ద సేవ చేయలేదు. మన ప్రభువు యూదా గోత్రంలో పుట్టాడు అనేది తెలిసిన విషయమే. యాజకులను గూర్చి మాట్లాడేటప్పుడు ఈ గోత్రాన్ని మోషే ఏనాడూ ప్రస్తావనే చేయలేదు. మెల్కీసెదెకు వంటి మరొక యాజకుడు వచ్చాడు కనుక మేము చెబుతున్నది మరింత స్పష్టమవుతూ ఉంది. ఈ కొత్త యాజకుడు ధర్మశాస్త్రం ప్రకారం వంశం ఆధారంగా రాలేదు. నాశనం కావడం అసాధ్యం అయిన జీవానికి ఉన్న శక్తి ఆధారంగా వచ్చాడు. “నువ్వు మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ఉండే యాజకుడివి” అని లేఖనాలు ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ విషయంలో ముందు వచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే అది బలహీనంగానూ వ్యర్ధమైనదిగానూ ఉంది. ధర్మశాస్త్రం దేనినీ పరిపూర్ణం చేయలేదు. భవిష్యత్తు గూర్చి అంత కంటే శ్రేష్ఠమైన ఆశాభావం మనలను దేవుని దగ్గరికి చేరుస్తూ ఉంది. ఈ శ్రేష్ఠమైన ఆశాభావం ప్రమాణం చేయకుండా కలగలేదు. ఇతర యాజకులైతే ప్రమాణం లేకుండానే యాజకులయ్యారు. అయితే యేసును గూర్చి మాట్లాడుతూ దేవుడు ఇలా ప్రమాణం చేశాడు, “నువ్వు కలకాలం యాజకుడిగా ఉంటావని దేవుడు ప్రమాణం చేశాడు. ఆయన తన ఆలోచనను మార్చుకోడు.” ఈ విధంగా మరింత శ్రేష్ఠమైన ఒప్పందానికి ఆయన పూచీ అయ్యాడు. ఈ యాజకులు కలకాలం సేవ చేయకుండా వారిని మరణం నిరోధిస్తుంది. అందుకే ఒకరి తరువాత మరొకరుగా అనేకమంది యాజకులు అయ్యారు. యేసు కలకాలం జీవిస్తాడు కనుక ఆయన యాజకత్వం కూడా మార్పులేనిదిగా ఉంటుంది. కాబట్టి ఈయన తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చేవారిని సంపూర్ణంగా రక్షించడానికి సమర్ధుడుగా ఉన్నాడు. వారి తరపున విన్నపాలు చేయడానికి కలకాలం జీవిస్తూ ఉన్నాడు. ఆయన కల్మషం అంటని వాడు, నిందా రహితుడు, పవిత్రుడు, పాపులకు వేరుగా ఉన్నవాడు, ఆకాశాల కంటే ఉన్నతంగా ఉన్నాడు. ఇలాటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇతర ప్రధాన యాజకుల్లాగా ప్రతిదినం ముందుగా తన సొంత పాపాల కోసం అర్పణలు అర్పించి తరువాత ప్రజల కోసం అర్పించాల్సిన అవసరం ఈయనకు లేదు. ఈయన తనను తానే అర్పణగా ఒక్కసారే అర్పించి ముగించాడు. ధర్మశాస్త్రం బలహీనతలున్న వారిని ముఖ్య యాజకులుగా నియమిస్తుంది. కాని ధర్మశాస్త్రం తరువాత వచ్చిన ప్రమాణ వాక్కు కుమారుణ్ణి ప్రధాన యాజకుడిగా నియమించింది. ఈయన శాశ్వతకాలం నిలిచే పరిపూర్ణత పొందినవాడు.
హెబ్రీయులకు 7:1-28 పవిత్ర బైబిల్ (TERV)
ఈ మెల్కీసెదెకు షాలేము రాజు, మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకొని ఆశీర్వదించాడు. అబ్రాహాము తాను జయించిన వాటిలో పదవవంతు మెల్కీసెదెకుకు యిచ్చాడు. మొదటిదిగా “మెల్కీసెదెకు” అనే పదానికి నీతికి రాజు అనే అర్థం. రెండవదిగా “షాలేము రాజు” అను యితని పేరుకు శాంతికి రాజు అనే అర్థం కూడా వుంది. మెల్కీసెదెకు తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అతని పూర్వికులెవరో మనకు తెలియదు. అతని బాల్యాన్ని గురించి కాని, అంతిమ రోజుల్ని గురించి కాని మనకు తెలియదు. దేవుని కుమారునివలె అతడు కూడా చిరకాలం యాజకుడుగా ఉంటాడు. మూల పురుషుడైన అబ్రాహాము కూడా తాను జయించినదానిలో పదవ వంతు అతనికిచ్చాడంటే, అతడు ఎంత గొప్పవాడో గ్రహించండి. ఇశ్రాయేలు ప్రజలు అబ్రాహాము వంశానికి చెందినవాళ్ళు, లేవి జాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మశాస్త్రంలో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించినదానిలో పదవవంతు సేకరించాలని ఉంది. మెల్కీసెదెకు లేవి జాతికి చెందినవాడు కాకపోయినా, అబ్రాహాము నుండి అతని ఆదాయంలో పదవవంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతణ్ణి ఆశీర్వదించాడు. ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు. ఒకవైపు చనిపోయేవాళ్ళు పదవ వంతు సేకరిస్తున్నారు. మరొక వైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రకటించిన మెల్కీసెదెకు పదవ వంతు సేకరిస్తున్నాడు. ఒక విధంగా చూస్తే పదవవంతు సేకరించే లేవి, అబ్రాహాము ద్వారా పదవవంతు చెల్లించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నప్పుడు లేవి యింకా జన్మించ లేదు. అతడు, తన మూల పురుషుడైన అబ్రాహాములోనే ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రంలో లేవి జాతికి చెందిన యాజకుల గురించి వ్రాసాడు. ఒకవేళ, ఆ యాజకుల ద్వారా ప్రజలు పరిపూర్ణత పొంద గలిగి ఉంటే అహరోనులాంటి వాడు కాకుండా మెల్కీసెదెకులాంటి యాజకుడు రావలసిన అవసరమెందుకు కలిగింది? దేవుడు మన కోసం క్రొత్త యాజకుణ్ణి నియమించాడు కాబట్టి ఆయనకు తగ్గట్టుగా యాజక ధర్మాన్ని కూడా మార్చాడు, ఈ విషయాలు ఎవర్ని గురించి చెప్పబడ్డాయో, ఆయన వేరొక గోత్రపువాడు. ఆ గోత్రానికి చెందినవాళ్ళెవ్వరూ ఎన్నడూ బలిపీఠం ముందు నిలబడి యాజకునిగా పనిచేయ లేదు. మన ప్రభువు యూదా వంశానికి చెందినవాడనే విషయం మనకు స్పష్టమే! ఈ గోత్రపువాళ్ళు యాజకులౌతారని మోషే అనలేదు. పైగా మెల్కీసెదెకు లాంటి మన ప్రభువు యాజకుడై ఈ విషయం ఇంకా స్పష్టం చేశాడు. మన ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వంశావళిని అనుసరించి యాజకుడు కాలేదు. ఆయన చిరంజీవి గనుక యాజకుడయ్యాడు. ఎందుకంటే, “నీవు మెల్కీసెదెకు క్రమంలో చిరకాలం యాజకుడవై ఉంటావు” అని లేఖనాలు ప్రకటిస్తున్నాయి. పాత నియమం సత్తువ లేనిది, నిరుపయోగమైనది. కనుక, అది రద్దు చేయబడింది. ఆ ధర్మశాస్త్రం ఎవనిలోనూ పరిపూర్ణత కలిగించలేక పోయింది. అందువల్ల దేవుడు మనలో క్రొత్త నిరీక్షణను ప్రవేశపెట్టాడు. ఈ నిరీక్షణ మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది. దీని విషయంలో దేవుడు ప్రమాణం కూడా చేశాడు. మిగతావాళ్ళు యాజకులైనప్పుడు ఎవ్వరూ ప్రమాణం చెయ్యలేదు. కాని యేసు ప్రమాణం ద్వారా యాజకుడైనాడు. ఈయన విషయంలో దేవుడాయనతో ఇలా అన్నాడు: “ప్రభువు ప్రమాణం చేశాడు. తన మనస్సును మార్చుకోడు. ‘నీవు చిరకాలం యాజకుడుగావుంటావు.’” ఈ ప్రమాణం ద్వారా యేసు శ్రేష్ఠమైన క్రొత్త ఒడంబడికకు బాధ్యుడయ్యాడు. ఎందరో యాజకులయ్యారు కాని, చావు వాళ్ళని యాజకులుగా పనిచేయకుండా అడ్డగించింది. కాని యేసు చిరంజీవి గనుక చిరకాలం యాజకుడుగా ఉంటాడు. అందువలన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళను ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ పక్షాన దేవుణ్ణి వేడుకోటానికి చిరకాలం జీవిస్తూ ఉంటాడు. పవిత్రమైన వాడు, ఏ కళంకం లేనివాడు, పరిశుద్ధమైన వాడు, పాపుల గుంపుకు చెందనివాడు, పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు, ఇలాంటి ప్రధానయాజకుడై అవసరాన్ని తీరుస్తున్నాడు. ఆయన, ఇతర ప్రధానయాజకులవలె తన పాపాల కొరకు గానీ, ప్రజల పాపాల కొరకు గానీ ప్రతి రోజు బలుల్ని అర్పించవలసిన అవసరం లేదు. ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే మొదటి బలి, చివరి బలి ఆయనే! ధర్మశాస్త్రం బలహీనులైనవాళ్ళను యాజకులుగా నియమించింది: కాని, ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధానయాజకునిగా నియమించింది. అంతేకాక, ఆయన చిరకాలం పరిపూర్ణునిగా చేయబడ్డాడు.
హెబ్రీయులకు 7:1-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
రాజులను సంహారముచేసి, తిరిగి వచ్చుచున్న అబ్రా హామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవవంతు ఇచ్చెనో, ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రా హాము అతనికి కొల్లగొన్న శ్రేప్ఠమైన వస్తువులలో పదియవ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమాళ్లలోనుండి యాజ కత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసమునుండి పుట్టినను, ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద, అనగా ప్రజలయొద్ద పదియవవంతును పుచ్చు కొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రా హామునొద్ద పదియవవంతు పుచ్చుకొని వాగ్దానములను పొందినవానిని ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై యున్నది. మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతే కాక ఒక విధమున చెప్పినయెడల పదియవవంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాముద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక ఆయాజకులవలన సంపూర్ణ సిద్ధి కలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడినయెడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవనిగూర్చి యీ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోనివాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్యచేయ లేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించె ననుట స్పష్టమే; ఆ గోత్రవిషయములో యాజకులనుగూర్చి మోషే యేమియు చెప్పలేదు. మరియు శరీరాను సారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింప బడి, మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది. ఏలయనగా –నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్‌ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడియున్నది; అంత కంటె శ్రేప్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేప్ఠమైన నిబంధనకు పూటకాపాయెను. వారైతే ప్రమాణములేకుండ యాజకులగుదురు గాని యీయన –నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను; ఆయన పశ్చా త్తాపపడడు అని యీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను. మరియు ఆయాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్ను తాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను.