హెబ్రీయులకు 5:11-14
హెబ్రీయులకు 5:11-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దీనిని గురించి మేము చెప్పాల్సింది చాలా ఉంది కాని, గ్రహించడానికి మీరు ఏమాత్రం ప్రయత్నించడం లేదు కాబట్టి మీకు వివరించడం కష్టము. నిజానికి, ఈ సమయానికి మీరు బోధకులై ఉండాల్సింది, కాని ఇప్పటికి మీకు మరొకరు దేవుని వాక్యంలోని ప్రాథమిక సత్యాలను బోధించాల్సిన అవసరం ఉంది. బలమైన ఆహారం కాదు, మీకు పాలు అవసరము. పాలు త్రాగుతూ జీవించేవారు ఇంకా శిశువుగానే ఉన్నారు, కాబట్టి నీతిని గురించిన బోధతో పరిచయం లేదు. అయితే బలమైన ఆహారం పరిణతి చెందిన వారికి, అంటే ఎవరైతే నిరంతరం ఉపయోగించడం ద్వారా తమకు తాముగా మంచి చెడులను వేరు చేసే శిక్షణ పొందుకున్నవారికి.
హెబ్రీయులకు 5:11-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దీన్ని గురించి చెప్పాల్సింది ఎంతో ఉంది. అయితే వినడంలో మందకొడిగా ఉంటారు గనక మీకు వివరించడం కష్టం. ఈపాటికల్లా మీరు బోధకులుగా ఉండవలసింది కానీ దేవుని మాటల్లోని ప్రాథమిక సూత్రాలను మరొకడు ఇంకా మీకు బోధించాల్సి వస్తున్నది. మీరింకా పాలు తాగే దశలోనే ఉన్నారు కానీ బలమైన ఆహారం తినే శక్తి మీకు లేదు. కేవలం పాలు మాత్రమే తాగే ప్రతివాడూ పసివాడే కాబట్టి నీతికి సంబంధించిన విషయాల్లో అనుభవం లేని వాడుగా ఉన్నాడు. దీనికి భిన్నంగా, వయస్సు వచ్చిన పెద్దవారు తమ సాధకం చేత మంచి ఏదో, చెడు ఏదో వివేచించ గలిగి, మంచీ చెడూ తేడా తెలుసుకోవడంలో శిక్షణ పొంది ఉంటారు. అలాంటి వారికి పుష్టికరమైన ఆహారం కావాలి.
హెబ్రీయులకు 5:11-14 పవిత్ర బైబిల్ (TERV)
ఈ విషయాన్ని గురించి మేము చెప్పవలసింది ఎంతో ఉంది. కాని మీలో గ్రహించే శక్తి తక్కువగా ఉండటంవల్ల, విడమర్చి చెప్పటానికి చాలా కష్టమౌతుంది. నిజం చెప్పాలంటే, మీకిదివరకే భోధించి ఉండవలసింది. కాని దైవసందేశంలోని ప్రాథమిక సత్యాలను మీకు మళ్ళీ నేర్పించవలసిన అవసరం కలుగుతోంది. అంటే, మీరు పాలు త్రాగగలరు కాని, ఆహారం తినగల శక్తి మీకింకా కలుగలేదు. పాలతో జీవించేవాళ్ళు యింకా పసికందులే కనుక వాళ్ళకు మంచి చెడులను గురించి తెలియదు. కాని, ఆహారం ఎదిగినవాళ్ళు తినగలుగుతారు. అంటే, వాళ్ళు జీవితానికి అలవాటు పడి మంచి చెడులను గుర్తించటంలో నేర్పు సంపాదించారన్న మాట.
హెబ్రీయులకు 5:11-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇందునుగూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతు లున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింప వలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారేగాని బలమైన ఆహారము తినగలవారుకారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు. వయస్సు వచ్చినవారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.