హబక్కూకు 3:1-19

హబక్కూకు 3:1-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా, నీ కీర్తి గురించి విన్నాను; యెహోవా, నీ క్రియలకు నేను భయపడుతున్నాను. మా దినాల్లో వాటిని మళ్ళీ చేయండి, మా కాలంలో వాటిని తెలియజేయండి; ఉగ్రతలో కరుణించడం జ్ఞాపకముంచుకోండి. దేవుడు తేమాను నుండి వచ్చాడు, పరిశుద్ధుడు పారాను పర్వతం నుండి వచ్చాడు. సెలా ఆయన మహా వైభవం ఆకాశాలను కప్పివేసింది భూమి ఆయన స్తుతితో నిండింది. ఆయన తేజస్సు సూర్యకాంతిలా ఉంది; ఆయన చేతిలో నుండి కిరణాలు బయలువెళ్తున్నాయి, అక్కడ ఆయన శక్తి దాగి ఉంది. ఆయనకు ముందుగా తెగులు వెళ్లింది; అంటువ్యాధి ఆయన పాదాలను అనుసరించింది. ఆయన నిలబడగా భూమి కంపించింది; ఆయన చూడగా దేశాలు వణికాయి. పురాతన పర్వతాలు కూలిపోయాయి పురాతన కొండలు అణగిపోయాయి కానీ ఆయన మార్గాలు శాశ్వతమైనవి. భయంలో ఉన్న కూషీయుల గుడారాలను, వేదనలో ఉన్న మిద్యానువాసుల నివాసాలను నేను చూశాను. యెహోవా, నీవు నదులపై కోపంగా ఉన్నావా? ప్రవాహాల మీద నీ ఉగ్రత ఉందా? సముద్రంపై కోపం వచ్చిందా? అందుకే నీవు నీ గుర్రాల మీద స్వారీ చేస్తూ నీ విజయ రథాలను ఎక్కి వస్తున్నావా? వరలో నుండి నీ విల్లు తీసావు, నీ వాక్కుతోడని ప్రమాణం చేసి నీ బాణాలను సిద్ధం చేశావు. సెలా నీవు భూమిని చీల్చి నదులను ప్రవహింపజేశావు; పర్వతాలు నిన్ను చూసి వణికాయి. నీళ్లు ప్రవాహాలుగా ప్రవహిస్తాయి; అగాధం ఘోషిస్తూ తన అలలను పైకి లేపుతుంది. ఎగిరే నీ బాణాల కాంతికి నీ ఈటె తళతళ మెరుపుకు సూర్యచంద్రులు తమ ఆకాశంలో స్థానాల్లో నిలిచిపోతాయి. ఉగ్రతతో నీవు భూమిమీద తిరుగుతున్నావు ఆగ్రహంతో దేశాలను అణగద్రొక్కుతున్నావు. నీ ప్రజలను విడిపించడానికి, నీ అభిషిక్తుని రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు. దుర్మార్గపు దేశపు నాయకుడిని నీవు కూలద్రోసి, తల నుండి పాదం ఖండించి నిర్మూలం చేస్తున్నావు. సెలా దాక్కున్న దౌర్భాగ్యులను మ్రింగివేసేందుకు ఉవ్విళ్లూరుతూ, మనల్ని చెదరగొట్టడానికి అతని యోధులు దూసుకుని వచ్చినప్పుడు, అతని తలలో మీరు అతని ఈటెనే గుచ్చారు. నీవు నీ గుర్రాలతో సముద్రాన్ని త్రొక్కించావు, గొప్ప జలాలను చిలుకుతున్నావు. నేను వినగా నా గుండె కొట్టుకుంది, ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి; నా ఎముకలు కుళ్లిపోతున్నాయి, నా కాళ్లు వణికాయి. అయినా మనపై దాడి చేస్తున్న దేశం మీదికి విపత్తు సంభవించే దినం వచ్చేవరకు నేను ఎదురుచూస్తూ ఉంటాను. అంజూరపు చెట్టు పూత పూయకపోయినా ద్రాక్షచెట్టుకు పండ్లు లేకపోయినా, ఒలీవచెట్లు కాపు కాయకపోయినా పొలాలు పంట ఇవ్వకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవాయందు ఆనందిస్తాను, నా రక్షకుడైన దేవునియందు నేను సంతోషిస్తాను. ప్రభువైన యెహోవాయే నా బలం; ఆయన నా కాళ్లను లేడికాళ్లలా చేస్తాడు, ఎత్తైన స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తారు.

హబక్కూకు 3:1-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ప్రవక్త అయిన హబక్కూకు చేసిన ప్రార్థన (వాద్యాలతో పాడదగినది). యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా, ఈ సంవత్సరాల్లో నీ కార్యం నూతన పరచు. ఈ రోజుల్లో నీ పనులు తెలియచెయ్యి. కోపంలో కనికరం మరచిపోవద్దు. దేవుడు తేమానులో నుండి వచ్చాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేస్తున్నాడు (సెలా). ఆయన మహిమ ఆకాశమండలమంతటా కనబడుతున్నది. భూమి ఆయన స్తుతితో నిండి ఉంది. ఆయన హస్తాలనుండి కిరణాలు వెలువడుతున్నాయి. అక్కడ ఆయన తన బలం దాచి ఉంచాడు. ఆయనకు ముందుగా తెగుళ్లు నడుస్తున్నాయి. ఆయన అడుగుజాడల్లో అరిష్టాలు వెళ్తున్నాయి. ఆయన నిలబడి భూమిని కొలిచాడు. రాజ్యాలను కంపింప జేశాడు. నిత్య పర్వతాలు బద్దలైపోయాయి. పురాతన గిరులు అణిగి పోయాయి. ఆయన మార్గాలు శాశ్వత మార్గాలు. కూషీయుల డేరాల్లో ఉపద్రవం కలగడం నేను చూశాను. మిద్యాను దేశస్థుల గుడారాల తెరలు గజగజ వణికాయి. యెహోవా, నదుల మీద నీకు కోపం కలిగిందా? నదుల మీద నీకు ఉగ్రత కలిగిందా? సముద్రం మీద నీకు ఆగ్రహం కలిగిందా? నువ్వు నీ గుర్రాల మీద స్వారీ చేస్తూ నీ రక్షణ రథం ఎక్కి రావడం అందుకేనా? విల్లు వరలోనుండి తీశావు. బాణాలు ఎక్కుపెట్టావు. భూమిని బద్దలు చేసి నదులు ప్రవహింపజేశావు. పర్వతాలు నిన్ను చూసి మెలికలు తిరిగాయి. జలాలు వాటిపై ప్రవాహాలుగా పారుతాయి. సముద్రాగాధం ఘోషిస్తూ తన కెరటాలు పైకెత్తుతుంది. నీ ఈటెలు తళతళలాడగా ఎగిరే నీ బాణాల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ ఉన్నత నివాసాల్లో ఆగిపోతారు. బహు రౌద్రంతో నీవు భూమి మీద సంచరిస్తున్నావు. మహోగ్రుడివై జాతులను అణగదొక్కుతున్నావు. నీ ప్రజలను రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు. నీవు నియమించిన అభిషిక్తుణ్ణి రక్షించడానికి బయలు దేరుతున్నావు. దుష్టుల కుటుంబికుల్లో ప్రధానుడొకడైనా ఉండకుండాా వారి తలను మెడను ఖండించి నిర్మూలం చేస్తున్నావు (సెలా). పేదలను రహస్యంగా మింగివేయాలని ఉప్పొంగుతూ తుఫానులాగా వస్తున్న యోధుల తలల్లో వారి ఈటెలే నాటుతున్నావు. నీవు సముద్రాన్ని తొక్కుతూ సంచరిస్తున్నావు. నీ గుర్రాలు మహాసముద్ర జలరాసులను తొక్కుతాయి. నేను వింటుంటే నా అంతరంగం కలవరపడుతున్నది. ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి. నా ఎముకలు కుళ్లిపోతున్నాయి. నా కాళ్లు వణకుతున్నాయి. జనాలపై దాడి చేసే వారు సమీపించే దాకా నేను ఊరుకుని బాధ దినం కోసం కనిపెట్టవలసి ఉంది. అంజూరపు చెట్లు పూత పట్టకపోయినా, ద్రాక్షచెట్లు ఫలింపక పోయినా, ఒలీవచెట్లు కాపులేక ఉన్నా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, కొట్టంలో పశువులు లేకపోయినా, నేను యెహోవా పట్ల ఆనందిస్తాను. నా రక్షణకర్తయైన నా దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తాను. ప్రభువైన యెహోవాయే నాకు బలం. ఆయన నా కాళ్లను లేడికాళ్లలాగా చేస్తాడు. ఉన్నత స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తాడు.

హబక్కూకు 3:1-19 పవిత్ర బైబిల్ (TERV)

ప్రవక్తయైన హబక్కూకు చేసిన షిగియొనొతు ప్రార్థన. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విన్నాను. యెహోవా, పూర్వం నీవు చేసిన శక్తివంతమైన పనుల విషయంలో నేను విస్మయం చెందాను. అట్టి గొప్ప పనులు మా కాలంలో జరిపించమని నేను నిన్ను వేడుకుంటున్నాను. ఆ పనులు మాకాలంలోనే జరిపించమని నేను ప్రార్థిస్తున్నాను. కాని నీ ఆవేశంలో (ఉద్రేకం) మా పట్ల కరుణ చూపటం గుర్తుపెట్టుకొనుము. దేవుడు తేమానులోనుండి వస్తున్నాడు. పరిశుద్ధుడు పారాను పర్వతం మీది నుండి వస్తున్నాడు. యెహోవా మహిమ ఆకాశాన్ని కప్పి వేసింది! ఆయన ప్రభావంతో భూమి నిండి పోయింది! అది ప్రకాశమానమై మెరుస్తున్న వెలుగు. ఆయన చేతినుండి కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయి. అట్టి మహత్తర శక్తి ఆయన చేతిలో దాగివుంది. వ్యాధి ఆయనకు ముందుగా వెళ్లింది. ఆయన వెనుక వినాశకారి అనుసరించి వెళ్లింది. యెహోవా నిలుచుండి భూమికి తీర్పు తీర్చాడు. ఆయన అన్ని దేశాల ప్రజలవైవు చూశాడు. వారు భయంతో వణికి పోయారు. అనాదిగా పర్వతాలు బలంగా నిలిచి ఉన్నాయి. కాని ఆ పర్వతాలు బద్దలై పోయాయి. చాల పాత కొండలు పడిపోయాయి. దేవుడు ఎల్లప్పుడూ అలానే ఉంటాడు! కుషాను (కూషీయుల) నగరాలలో ఆపద సంభవించటం నేను చూశాను. మిద్యాను దేశీయుల ఇండ్లు భయంతో కంపించాయి. యెహోవా, నీవు నదులపట్ల కోపంగా ఉన్నావా? వాగులపట్ల నీవు కోపంగా ఉన్నావా? సముద్రంపట్ల నీవు కోపంగా ఉన్నావా? నీవు నీ గుర్రాలను, రథాలను విజయానికి నడిపించినప్పుడు నీవు కోపంగా ఉన్నావా? అప్పుడుకూడ నీ రంగుల కాంతిపుంజాన్ని (ఇంద్ర ధనుస్సును) నీవు చూపించావు. భూవాసులతో నీవు చేసుకున్న ఒడంబడికకు అది నిదర్శనం. ఎండు భూమి నదులను విభజించింది. పర్వతాలు నిన్ను చూచి వణికాయి. నీరు నేల విడిచి పారుతున్నది. సముద్రపు నీటికి పట్టు తప్పినందున అది పెద్దగా ధ్వని చేసింది. సూర్యుడు, చంద్రుడు వాటి కాంతిని కోల్పోయాయి. నీ దేదీప్యమానమైన మెరుపు కాంతులు చూడగానే అవి ప్రకాశించటం మానివేశాయి. ఆ మెరుపులు గాలిలో దూసుకుపోయే ఈటెలు, బాణాలవలె ఉన్నాయి. నీవు కోపంతో భూమిపై నడిచి దేశాలను శిక్షించావు. నీ ప్రజలను రక్షించటానికి నీవు వచ్చావు. అభిషేకం చేయబడిన నీ వ్యక్తిని రక్షించటానికి నీవు వచ్చావు. ప్రతి చెడ్డ కుటుంబంలోనూ మొదట పుట్టిన వానిని నీవు చంపివేశావు. ఆ కుటుంబం దేశంలో అతి తక్కువదా, లేక అతి గొప్పదా అనే విభేదం నీవు చూపలేదు. శత్రు సైనికులను ఆపటానికి నీవు మోషే చేతి కర్రను ఉపయోగించావు. ఆ సైనికులు మామీద యుద్ధానికి పెనుతుఫానులా వచ్చారు. రహస్యంగా ఒక పేదవాణ్ణి దోచుకున్నట్టు, వారు మమ్మల్ని తేలికగా ఓడించవచ్చనుకున్నారు. కాని నీవు నీ గుర్రాలతో సముద్రంగుండా నడిచావు. ఆ మహా జలరాశిని దూరంగా దొర్లిపోయేలా చేశావు. నేనీ విషయాలు విన్నప్పుడు, నా శరీరం వణికింది. పెద్ద శబ్దాలు నేను విన్నప్పుడు నా పెదవులు అదిరాయి. నా ఎముకలు బలహీనమయ్యాయి. నా కాళ్లు వణికాయి. కావున ఆ వినాశన దినం వచ్చేవరకు ఓపికగా వేచి ఉంటాను. మామీద దాడి చేసేవారికి ఆ విపత్కర దినం వస్తోంది. అంజూరపు చెట్లు కాయలు కాయకుండా ఉండవచ్చు. ద్రాక్షచెట్లపై కాయలు ఉండక పోవచ్చు. చెట్లకు ఒలీవ పండ్లు కాయక పోవచ్చు. పొలాల్లో ఆహార ధాన్యాలు పండక పోవచ్చు. దొడ్లలో గొర్రెలు ఉండక పోవచ్చు. కొట్టాలలో పాడి పశువులు లేకపోవచ్చు. అయినా, నేను యెహోవాయందు ఆనందిస్తాను. నా రక్షకుడైన దేవునియందు నేను ఉల్లసిస్తాను. నా ప్రభువైన యెహోవా నాకు బలాన్ని ఇస్తాడు. లేడిలా పరుగెత్తగలిగేలా ఆయన నాకు సహాయపడతాడు. పర్వతాలపై ఆయన నన్ను సురక్షితంగా నడిపిస్తాడు.

హబక్కూకు 3:1-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. (వాద్యములతో పాడదగినది) యెహోవా, నిన్నుగూర్చిన వార్త విని నేను భయ పడుచున్నాను యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధదేవుడు పారానులోనుండి వేంచేయు చున్నాడు. (సెలా. ) ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తములనుండి కిరణములు బయలువెళ్లుచున్నవి అచ్చట ఆయన బలము దాగియున్నది. ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరి గించువాడు. కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణ కెను. యెహోవా, నదులమీద నీకు కోపము కలిగినందుననా నదులమీద నీకు ఉగ్రత కలిగినందుననా సముద్రముమీద నీకు ఉగ్రత కలిగినందుననా నీ గుఱ్ఱములను కట్టుకొని రక్షణార్థమైన రథములమీద ఎక్కి వచ్చుచున్నావు? విల్లు వరలోనుండి తీయబడియున్నది నీ వాక్కుతోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచియున్నావు (సెలా.) భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పై కెత్తును. నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు. బహు రౌద్రముకలిగి నీవు భూమిమీద సంచరించు చున్నావు మహోగ్రుడవై జనములను అణగద్రొక్కుచున్నావు నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలు దేరుచున్నావు దుష్టుల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండవారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. (సెలా.) బీదలను రహస్యముగా మ్రింగివేయవలెనని ఉప్పొం గుచు నన్ను పొడిచేయుటకై తుపానువలె వచ్చు యోధుల తలలలో రాజుయొక్క ఈటెలను నాటుచున్నావు. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచు నున్నావు నీ గుఱ్ఱములు మహాసముద్ర జలరాసులను త్రొక్కును. నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినముకొరకు కనిపెట్టవలసి యున్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి నా యెముకలు కుళ్లిపోవుచున్నవి నా కాళ్లు వణకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియం దు నేను సంతో షించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడువజేయును.